సినిమా పాట మీద శ్రీశ్రీ సంతకం
ఆయన - ఆకలి వాకిట కేకలు వేసిన సిరిసిరి పాపడు. శబ్దాన్ని శాసించి, శతాబ్దం తనదేనని ఘోషించిన యుగపురుషుడు. ఆయన అరిస్తే పద్యమైంది... స్మరిస్తే వాద్యమైంది. ఆ కలం ఖడ్డసృష్టిలో అక్షరాక్షరం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యమైంది. 'సినిమాల చిట్టడవిలో చిక్కుకొన్న మహాకవి' అని కొందరు వాపోయినా ఆ చిట్టడవిలో దట్టమైన గీత వసంతాల్ని పూయించడం శ్రీశ్రీకి హక్కుభుక్తమైంది. మహాకవి శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలో ఓ విహంగ వీక్షణ...
________________________________
దృశ్య కావ్యాల మీద శ్రీశ్రీకి ఉన్న మక్కువ సినీ రంగంలో స్థిరపడేలా చేసింది. అంత వరకూ జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తూ వచ్చిన శ్రీశ్రీ చివరి వరకూ సినిమాల్లోనే కొనసాగడానికి ఇదే కారణం. 1950లో 'నీర్ ఔర్ నందా' చిత్రాన్ని 'ఆహుతి' పేరుతో అనువదించిన శ్రీశ్రీ డబ్బింగ్ ప్రక్రియకు అంకురార్పణ చేశారు. అందులో 'ప్రేమయే జనన మరణ లీల' పాట శ్రీశ్రీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం టాకీపులి హెచ్.ఎమ్.రెడ్డి, మునాఫ్ లాంటి వారి దగ్గర శ్రీశ్రీ నెల జీతానికి కుదురుకున్నారు. అనువాద చిత్రాల ద్వారా స్థిరపడ్డ తనకు డబ్బింగ్ రైటరు అనే ముద్రపడినా పట్టించుకోలేదు. అవకాశం వస్తే విజృంభించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అన్నపూర్ణా వారి 'తోడికోడళ్లు', 'మాంగల్యబలం', 'వెలుగునీడలు', 'ఇద్దరు మిత్రులు', 'డాక్టర్ చక్రవర్తి' లాంటి చిత్రాలు - శ్రీశ్రీలోని విశ్వరూపాన్ని చూపెట్టాయి.పి.ఎ.పి.వారి 'భార్యాభర్తలు', 'కులగోత్రాలు', 'పునర్జన్మ', ఆత్రేయ 'వాగ్దానం', రాజ్యంవారి 'నర్తనశాల', రేఖా అండ్ మురళీ 'దేవత', జగపతివారి 'ఆరాధన', సురేష్ ప్రొడక్షన్స్ 'రాముడుభీముడు' చిత్రాల్లో శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతాలు ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలిచాయి.
హీనంగా చూడకుదేన్నీ:
నిజానికి డబ్బింగ్ గీతాల్లో సైతం శ్రీశ్రీ ప్రయోగాలు చేశారు. 'హీనంగా చూడకు దేన్నీ... కవితామయమేనోయి అన్నీ' అని పరోక్షంగా స్పష్టం చేశారు. తొలి చిత్రం 'ఆహుతి'లో సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు సందర్భోచితంగా తాళం బిట్లు తీసుకొని, వేరే ట్యూన్స్ సమకూరిస్తే వాటికి తగ్గట్టుగా శ్రీశ్రీ రాసిన పాటల్ని ప్రయోగంగానే భావించాలి.
అలాగే 'గాంధారి గర్వభంగం' (డబ్బింగ్) చిత్రంలోని 'పదునాలుగు లోకముల ఎదురేలేదు' అనే పాట నేపథ్యగీతం కావడంతో, లిప్‌సింక్ ఇబ్బంది లేకపోవడంతో దాన్ని శ్రీశ్రీ స్వతంత్ర రచనలాగే రూపొందించారు. ఈ పాట తాలూకు స్ఫూర్తి 'బాలభారతం' చిత్రంలో ఆరుద్ర రాసిన 'మానవుడే మహనీయుడు' మీద స్పష్టంగా కనిపిస్తుంది.అనువాద ప్రక్రియకు మెలకువలు చెప్పిన ఘనత కూడా ఈయనదే. పరాయి పలుకులు తెలుగు మాటలుగా వినిపించాలంటే ఏం చెయ్యాలీ, ఎలా చెయ్యాలనే విషయానికో మార్గం వేశారాయన. ప, ఫ, బ, భ, మ అనే ఓష్ట్యాల విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించింది శ్రీశ్రీయే.
వైవిధ్యం ఆయన సొంతం:
రాశిలో తక్కువే అయినా వాసిగల సినిమా పాటల్ని శ్రీశ్రీ రాశారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలకో, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలకో, జాతిని జాగృతపరచే ప్రబోధాత్మక రచనలకో ఆయన పేటెంట్ కావచ్చుగాక. స్వేచ్ఛ లభించిన సందర్భాల్లో ఆయన్నించి చిలిపి సినీగీతాలు వెలువడ్డాయి. గిలిగింతలు పెట్టే సాహిత్యం శ్రీశ్రీ కలం నుంచి వెలువడింది.
మీసాల మీద సీసం రాయడం శ్రీశ్రీకే చెల్లింది. 'సదమల మదగజ గమనము'తో తెలుగు సినిమాలో హరికథను చెప్పించడం ఆయన హక్కుభుక్తమైంది. వీణపాటలకు ప్రాచుర్యం శ్రీశ్రీతోనే మొదలైంది. పాడవోయి భారతీయుడా అని ప్రతి పౌరుడితోనూ పాడించినా, బతుకును కన్నీటిధారలకు బలిచేయవద్దని ప్రబోధించినా, బొమ్మను చేసి ప్రాణము పోసిన వాడిలోని ఆడుకొనే వేడుకను ప్రశ్నించినా, మనసున మనసైన తోడు కోసం సితార మీటినా, తెలుగువాడి పౌరుషాగ్నితో మన్యంలో మంటలు పుట్టించి తెలుగు సినిమా పాటను తొలిసారిగా జాతీయ పురస్కారంతో అలంకరించినా అది మహాకవి శ్రీశ్రీకే సాధ్యమైంది.
ఆశావహ దృక్పథం:
'చెవిలో రహస్యం' పేరుతో ఓ డబ్బింగ్ చిత్రాన్ని తీసి ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత సమస్యల్ని సినిమా రచనపై ప్రసరించకుండా 'ప్రొఫెషనల్' స్థాయిని కనబరిచారు. ముందున్న మంచి కాలాన్ని తన గీతాల్లో ఉజ్వలంగా ప్రదర్శించారు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురుచూడకుండా నిజం తెలుసుకొని నడుంబిగించమని ఉద్బోధించారు.
శ్రీశ్రీ పాటలకే పరిమితం కాలేదు. ఎన్నో చిత్రాలకు చిత్ర సంవిధానాన్ని సమకూర్చి పదునైన సంభాషణలు కూడా రాశారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో తెలుగు సినిమాలు రావాలని, సొంతంగా తీయాలని శ్రీశ్రీ కన్న కలలు అలాగే మిగిలిపోయాయి. అలాంటి చిత్రాలు మనవాళ్లు తీయాలి.. అదే శ్రీశ్రీకి అసలైన నివాళి.
(ఈనాడు, సినిమా, ౩౦:౦౪:౨౦౧౦)
____________________________
0 Comments:
Post a Comment
<< Home