My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, April 09, 2010

విశాఖపట్నం, న్యూస్‌టుడే: 'భరాగో'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం బుధవారం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో గత మూడేళ్లుగా బాధ పడుతున్న ఆయన ఆరోగ్య గత ఫిబ్రవరి నుంచి క్షీణిస్తూ వచ్చింది. విజయనగరం జిల్లా అలమండ మండలం అన్నమరాజుపేటలో 1932 ఫిబ్రవరి 6న భరాగో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సునిశిత హాస్య రచనలకు పెట్టింది పేరైన ఆయన ఎన్నో తెలుగు కథలు, నవలలతో పాటు సినిమా పాటలపై సమీక్షలు రాశారు. 160కి పైగా కథలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు రచించారు
_____________________________________________
మానవీయ హాస్య కదంబం
- ఎర్రాప్రగడ రామకృష్ణ
వెనకటికి ఒకాయన 'ఈ ప్రపంచంలో స్త్రీలందరిలోనూ మా ఆవిడే సుప్రీం అందగత్తె' అన్నాడట.
ఇది విన్నవాడు మొహం పక్కకు తిప్పేసి నవ్వుకుని 'ఆహా అలాగా!' అన్నాడట.
'నువ్వేదో వేళాకోళంగా తీసుకుంటున్నట్టుంది. నేనన్నది నా ఒక్కడి అభిప్రాయం అనుకుంటున్నావేమో! మా ఆవిడ అభిప్రాయం కూడా అదే- తెలుసా!'

బాలనాగమ్మ సినిమాలో 'ఆహా నా సొగసే కని మరుడే దాసుడు కాడా' పాట గురించి తన వ్యాఖ్యానాన్ని పై చమత్కారంతో ప్రారంభించే మనిషిని హాస్యప్రియుడనో, రచయిత అయితే హాస్యరచయిత అనో ముద్ర వేయడం లోకానికి రివాజు.

భరాగోను ప్రపంచం ఆ రకంగానే భావించింది. గుర్తించింది. ఒక్కోసారి చిన్న పువ్వు ఆధారంగా ఒకానొక మహారణ్యాన్ని గుర్తు పట్టవలసిన సందర్భాల్లో- లోకం పొరబడే అవకాశాలూ ఎక్కువే ఉంటాయి. అలాంటి పొరబాటే భరాగో విషయంలోనూ జరిగింది. భరాగో తెలుగునాట హాస్యరచయితగా ముద్రపడ్డారు. పడ్డాకా- దాన్ని నిలబెట్టుకోవాలనో, చెరిపేసుకోవాలనో ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా 'కాబోసు' అనుకుని నవ్వేసుకున్నాడాయన.

ఏభై ఎనభై దశకాల మధ్య తెలుగు సాహిత్యపు స్వర్ణయుగ కాలంలో గొప్ప కథకుడిగా పేరు తెచ్చుకున్న భరాగోను హాస్యరచయితగా లోకం ముద్రవేయడంలో భరాగో సహకారం కూడా ఉండటం విశేషం. స్వరాజ్య సమరం ముగిశాక తెలుగువారి సామాజిక జీవనంలోకి స్వార్థ చింతన, సంకుచితత్వమూ చాలా వేగంగా చొరబడ్డాయి. దానికి కారణాలు ఏమిటో, మూలాలు ఎక్కడివో నిశితంగా గమనించి కథల్లో గొప్పగా చిత్రించిన రచయితల్లో భరాగో ముఖ్యుడు. తెలుగువాడి పట్ల ఆపేక్ష, అభిమానం పెంచుకున్న మనిషి కాబట్టే- మనిషిని ద్వేషించడం ఆయనకు వీలుకాలేదు.

'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' కథలో రజక వృత్తి చేసుకునే యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం లభించి, జీవనస్థాయి పెరుగుతుంది. అయినా తన పై అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతికే పని తప్పలేదు. 'పోనీ ఒకలా చెయ్యి. బట్టలు ఉతికేటప్పుడు కొంచెం మోటతనం ఉపయోగించీ, కాస్త బ్లీచింగ్‌ పౌడరు తగిలించీ, ఇస్త్రీ చేసేటప్పుడు మరికొంచె హీటు పెంచీ నీ నైపుణ్యం చూపిస్తే ఏమన్నా మార్పుకి అవకాశం ఉండొచ్చేమో' అన్న సలహా ఎదురవుతుంది. నిజానికి అది అతని అహాన్ని చల్లార్చే సలహాయే! కానీ, ఆ యువకుడు దాన్ని తిరస్కరిస్తాడు. 'సారీ సర్‌ నా స్వభావంలో ఉన్న బేసిక్‌ మోరల్‌ నన్ను అలా చెయ్యనివ్వదండి!'అని బదులిస్తాడు. భరాగోను గుర్తించవలసింది- ఆ జవాబులోనే! బేసిక్‌ మోరల్‌ అని- దేని గురించైతే రచయితగా భరాగో అభిప్రాయపడుతున్నారో అది రచయిత స్వభావంలోనే ఉంటే తప్ప అలాంటి వాక్యం అతని నుంచి ప్రవహించడం కష్టం.

ఈ రకమైన మనస్తత్వంతో తెలుగువాడి ఆత్మలోకపు దివాలాకోరుతనాన్ని చిత్రీకరించేటప్పుడు- ద్వేషానికి బదులుగా సానుభూతి, మనిషి పట్ల వాత్సల్యం, రచయిత శైలిలో హాస్య ధోరణిని ప్రవేశపెడతాయి. మెత్తగా కొట్టిస్తాయి. దానికి వ్యంగ్యమో, హాస్యమో ముసుగేసి మరీ కొట్టిస్తాయి. పైపైకి అవి హాస్యోక్తులుగా భ్రమపెట్టి నవ్విస్తాయి. వాటి పదును నిజానికి చాలా తీవ్రమైనది. హాస్య కథలుగా చలామణీ అవుతున్న ఒక ముళ్లపూడివీ, ఒక భరాగోవి నిజానికి హాస్యకథలు కావు. చాలా గడుసు కథలు. జాణ కథలు. ఈ జాతి పట్ల అపారమైన బెంగలోంచి పుట్టుకొచ్చిన బాపతువి.

అలాగే రాజకీయ క్రీనీడలపై వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథలూనూ. ఉదాహరణకు 'చేతికర్ర'. గవర్నరుగారు పర్యటనకు వస్తున్నారని అధికార యంత్రాంగం అగ్గగ్గలాడుతూ ఎన్నో ఏర్పాట్లు చేసింది. జనాన్ని తెగ కంగారు పెట్టేసింది. ఆ గవర్నరుగారి బాల్యమిత్రుడైన ఒక స్వరాజ్య సమరయోధుడు నానా అగచాట్లు పడి ఎలాగో ఆయన్ను కలుసుకోగలుగుతాడు. అయితే, పోతూ పోతూ దొరగారి చేతికర్రను పొరబాటున పట్టుకుపోతాడు. ఇక దాంతో అధికార గణం హడావుడి చూడాలి. దాన్ని స్వరాజ్య సమరయోధుడి మాటల్లోనే చెప్పాలంటే- 'ఊళ్లోకి ఫలానా వారొస్తున్నారు, కావలసిన వాళ్లు కలుసుకోవచ్చు' అని ప్రకటించినవారు... నేను కలుసుకోవాలని భోగట్టా అడిగితే దరఖాస్తు పెట్టమన్నారు. రెండు రూపాయల కోర్టు స్టాంపు అంటించమన్నారు. నేను పొరబాటున ఆయన కర్ర తెస్తే అది తీసుకోవడానికి అర్ధరాత్రి ఊళ్లో సహం మందిని నిద్రలేపారు. మీ పద్ధతులు మంచివి కావు. మార్చుకోండి. లేకపోతే దేశం పాడైపోతుంది'

ఈ కథను, ముఖ్యంగా ఈ వాక్యాన్ని మన చట్టసభల్లోని పెద్దలకు వినిపించాలనిపిస్తుంది. అంతటి పదునైన చెణుకు భరాగో సొంతం.

ఆయన కథలు చదివాకా 'హాస్య రచయిత' మాత్రమే అని ముద్రవేయడం సాహిత్య ద్రోహం. ఆయన గొప్ప కథకుడు. గుండెలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకున్న మనిషి. జబ్‌దిల్‌హీ టూట్‌గయా... అంటూ జీవితపు ఆధారషడ్జమానికి బలంగా ఆనుకుని కథాగానాన్ని దిగంతాలు దాటించిన ఘనుడు. 'సుఖకష్టాలు' అనే పదబంధాన్ని ప్రేమించిన స్వాప్నికుడు. కష్టాలనూ, కన్నీళ్లనూ ప్రేమించి, వాటిలోని కరెంటును కథల్లోకి అనువదించి వాటిని సుఖమైన కష్టాలుగా మార్చుకున్న కష్టజీవి. ఆ క్రమంలోనే కష్టాలకు జీవితాన్ని ముడుపుకట్టి వాటి ఘాటుకు తట్టుకోలేకనూ, అలసట మరిచిపోయేందుకని-

నడిచినంత మేరా నవ్వులు విరజిమ్ముతూ నడిచాడు...
గడిపినంత సేపూ సంగీతంతో సావాసం చేస్తూ గడిపాడు...
కథలు వినిపిస్తూ తిరిగాడు...
సంకలనాలన్నాడు... చాకిరీలు నెత్తికెత్తుకున్నాడు..
'ఏమని పాడెదనో...' అని పాడుకుంటూ అనారోగ్యాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించాడు.

- చివరికి ఓడిపోయాడు. మృత్యు దేవతను పిల్చి 'ఇట్లు తమ విధేయుడు' అంటూ లొంగిపోయాడు.

మనకు మాత్రం నవ్వుకోవడానికి బోలెడు కథలు మిగిల్చిపోయాడు. ఆ రకంగా మన మధ్యనే ఉండిపోయాడు.
(eenaaDu, 08:04:2010)
______________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home