My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, May 03, 2010

మహాకవి... మన దారిదీపం

'నా యింటిపేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్దిగంతం
అభ్యుదయ సుగంధం
అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం'
- అని నినదించిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంపాటు జరిగాయి. అయినా శ్రీశ్రీ కవిత్వాభిమానులకు ఇంకా తనివితీరలేదు. ఈ నిరంతర కవితా చైతన్యోత్సవం ఆగామి కాలమంతటా జయభేరి మోగించాలని ఉవ్విళ్లూరేవారి సంఖ్య అనంతంగా ఉంది. తెలుగు సాహిత్యంలో వేగుచుక్కగా ఉద్యమించిన గురజాడ అడుగుజాడలో పయనించి, అభ్యుదయ భువన భవనపు బావుటాగా పైకి లేచిన శ్రీశ్రీపై తెలుగు ప్రజలు ప్రకటించిన గౌరవాభిమానాలకు చిహ్నాలు ఈ శతజయంతి వేడుకలు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ వేడుకలు శతజయంతుల చరిత్రలో నూతన స్థాయిని చేరుకున్నాయి. కవిత్వం చదవడం, రాయడం, అనుభవించడం జీవిత లక్ష్యాలుగా ఎంచుకున్న శ్రీశ్రీకి ఇంతటి గౌరవం దక్కడం సమంజసమే. ప్రతిభాగుణం, ప్రయోగశీలం, ప్రాపంచిక చైతన్యం, చమత్కార ప్రియత్వం, అధ్యయన వైశాల్యం- శ్రీశ్రీ కవిత్వానికి పంచప్రాణాలు. ఆయన నమ్మిన సామాజిక సిద్ధాంతం ప్రపంచాన్ని లొంగదీసుకుంది. ఆయన సాహిత్య ప్రపంచాన్ని లొంగదీసుకున్నాడు.'అరిస్తే పద్యం- స్మరిస్తే వాద్యం' అని ప్రకటించుకోగలిగాడు. అధోజగత్‌సహోదరుల కోసం ఆకాశ రథాలను నేలకు దింపాడు. తన కవిత్వాకాశాలను లోకానికి చేరువ చేశాడు. మన చుట్టూ మరో ప్రపంచాన్ని నిర్మించి మనలోకి మనం ఒక మహాప్రస్థానాన్ని కొనసాగించేలా చేయగలిగిన మాంత్రికుడు శ్రీశ్రీ.

సామాజిక ఉద్యమకారులు ఆదర్శస్వప్నంలోంచి వాస్తవ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటారు. కవులు వాస్తవిక ప్రపంచాన్ని స్వాప్నిక జగత్తుగా పరివర్తన చేయాలనుకుంటారు. శ్రీశ్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడంలో అద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శించి అనర్గళం, అనితరసాధ్యం అయిన కవితామార్గం పట్టాడు. జయభేరి, అవతారం, మరోప్రపంచం, కవితా! ఓ కవితా! వంటి ప్రసిద్ధ మహాప్రస్థాన గీతాల రచనతో 1940 నాటికే ఆయన గొప్ప కవుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు, ఆయనకు అనుకూల- విరుద్ధ వర్గాలకు చెందిన సంప్రదాయ- భావకవిత- అభ్యుదయ మార్గాలకు చెందిన కవులందరూ ఆయనను మూర్ధన్యుడిగా అంగీకరించక తప్పని స్థితి ఏర్పడింది. మహాప్రస్థానం తప్ప శ్రీశ్రీ రాసిన ఇతర రచనల గురించి చాలామందికి తెలియదు. ఆయన స్వతంత్రంగా కథలు రాశాడు. గొప్ప కథలను అనువదించాడు. అద్భుతమైన వచనరచన చేశాడు. నాటికలు రాశాడు. పదబంధ ప్రహేళికలు సృష్టించాడు. చమత్కార రచనలెన్నో చేశాడు. మహాప్రస్థానం ముందు ఇవన్నీ దివిటీముందు దీపాలయ్యాయి. శ్రీశ్రీ శతజయంతిని ఘనంగా జరుపుకొన్నా- మనం ఆయనను వాల్ట్‌ విట్‌మన్‌లాగా అంతర్జాతీయకవిగానో; ఠాగూర్‌, సుబ్రహ్మణ్య భారతి, వళ్లత్తోళ్‌, కువెంపుల తరహాలో జాతీయస్థాయి కవిగానో పేరుపడేలా చేయలేకపోయాం. ఇది తెలుగువారి అశక్తత, అలసత. శ్రీశ్రీ తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి; ప్రపంచ కవులను, రచయితలను తెలుగువారికి పరిచయం చేయడానికి నిజాయతీగా ప్రయోజనాపేక్ష లేకుండా గట్టి ప్రయత్నం చేశాడు. శ్రీశ్రీతో తులతూగగల అనువాద సామర్థ్యం ప్రకటించగల తెలుగువారు అరుదుగా కనిపిస్తారు. తెలుగు యువకులు ఆయన అనువాదాలను అధ్యయనం చేసి ఆ ఒడుపు తెలుసుకొని జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు అందించే కృషి కొనసాగిస్తే- శ్రీశ్రీ లక్ష్యం నెరవేరుతుంది, తెలుగు యువకుల సాహిత్యావగాహన విస్తరిస్తుంది.

మంచి కవిత్వానికి శ్రీశ్రీ అన్నదే గొప్ప బిరుదైతే ఎంతో బాగుండును- అని ఎన్నో దశాబ్దాల కిందట పలికిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మంగళాశాసనం ఈ శతజయంతి వేడుకల రూపంలో సమగ్రంగా సాక్షాత్కరించిందనాలి. శ్రీశ్రీ అస్తమించినా ఆయన కవిత్వం ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది. శ్రీశ్రీ తనువు చాలించినా ఆయన చమత్కారాలు నిత్యం మన జీవితాల్లో పూలబాటలు పరుస్తూనే ఉన్నాయి. తాను విశ్వసించిన సామాజిక సిద్ధాంతాలకు సైతం తలవంచని గాంభీర్యాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని తన గుండెలోనే దాచుకొని బైటకు ఏమీ తెలియని అమాయకుడిలా, అల్లరి పిల్లాడిలా, విదూషకుడిలా ప్రవర్తించి వెళ్లిపోయాడు శ్రీశ్రీ. ఎన్నడూ తనను తాను అధికుడననీ అనుకోలేదు, అధముడననీ అనుకోలేదు. నువ్వు అధ్యక్షుడివి అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు కార్యకర్తవు అన్నప్పుడు కుంగిపోలేదు. జీవితమే వైరుధ్యమైనప్పుడు- వైరుధ్యాల కూడలిలోంచి నడవక తప్పదనుకున్నాడు. ఏ నడక నడిచినా తన లక్ష్యం ఒకటేనని చాటుకున్నాడు. ఒక మాటను ఎడం లేకుండా రెండోమాట పలకడంలో మజా ఉంటుందంటాడు శ్రీశ్రీ. 'శ్రీ' అనే అక్షరాన్ని ఎడం లేకుండా రెండోసారి ఉచ్చరించడంలో ఉన్న మజా ఏమిటో మనందరికీ తెలిసిందే. ఆ మజా ఈ శతజయంతితో ఆగదు. సహస్ర జయంతి పర్యంతం నిలిచిపోతుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౫:౨౦౧౦)
___________________________________

Labels:

1 Comments:

Blogger RAMBABU said...

excellent article
thanks for sharing
ram

2:16 am

 

Post a Comment

<< Home