My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, May 08, 2010

కార్యసాధన

- డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి
ప్రతికూల పరిస్థితులనేవేవీ మనిషి చుట్టూ వచ్చి చేరవు. మనిషే వాటిని సృష్టించుకుంటాడు. క్రియాశూన్యతతో వాటిని అధిగమించలేక ఎవరినో నిందిస్తాడు. మనం ఎప్పుడూ చేసే పనినే మాటిమాటికి చేస్తూ పోతుంటే ప్రతిసారి వచ్చే ఫలితమే ఎప్పుడూ ఎదురవుతుంది. భిన్నమైన ఫలితాన్ని పొందాలంటే చేసే పనినీ భిన్నంగా చేయాలి. ఇప్పటిదాకా పొందనిదేదో పొందాలంటే ఇప్పటిదాకా చెయ్యనిదేదో చేయాలి.

విజయం అనేది అనుకోని సంఘటన కాదు. ఓ అద్భుతం అసలే కాదు. ఏ పనికైనా ఈ ప్రపంచంలో ఓ ప్రయత్నం, ఓ ఫలితం అనే రెండే అంశాలుంటాయి. ఎక్కువ ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ఫలితం పొందుతాడు. తక్కువ ప్రయత్నం చేసేవాడు తక్కువ ఫలితం పొందుతాడు. గాలిలో దీపంపెట్టి 'దేవుడా, నీవే దిక్కు' అనుకునేవాడు కర్మ, పాప ఫలం అనుకుంటూ కాలయాపన చేస్తూ జీవిత ప్రయాణాన్ని ముందుకు నెట్టే యత్నంలో ఉంటాడు.

ఆమధ్య బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చైనా నూరు పతకాలు కైవసం చేసుకుంది. భారతదేశం కేవలం మూడు పతకాలు సాధించింది. మరో దేశానికి చెందిన మైఖేల్‌ ఫెల్ప్స్‌ అనే ఈతగాడు ఒక్కడే ఎనిమిది బంగారు పతకాలు సాధించి అజేయుడై నిలిచాడు. ఈ ఫలితాలను యాదృచ్ఛికాలుగా భావించలేం. ఒకరిది అదృష్టం, మరొకరిది దురదృష్టం అనీ సరిపెట్టుకోలేం.

అనుకోకుండానో, అదృష్టవశాత్తో అద్భుతాలు జరుగవు. శ్రమిస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. విజయం సాధించడానికి- చెయ్యగలిగిందల్లా చేస్తే లాభంలేదు. చెయ్యవలసిందల్లా చేయాలి.

ఓ మతపెద్ద ఓ పట్టణ శివార్ల గుండా కారులో ప్రయాణిస్తూ వెళుతున్నాడు. రోడ్డు పక్కన గుబురుగా, దట్టంగా పెరిగిన అటవీ ప్రాంతం పక్కన నందనవనం లాంటి శోభాయమానమైన తోటనొకటి చూశాడు. వెంటనే కారు ఆపి ఆ తోట అందాలను ఆస్వాదిస్తూ కొంత సమయం గడిపాడు. ఆ తోటలో కేవలం గోచీ గుడ్డ కట్టుకుని చెమటలు కక్కుతున్న శరీరంతో ఎండలో చెట్లకు పాదులు సరిజేస్తూ కలుపు మొక్కలు తీస్తున్న రైతును గమనించాడు ఆ మతపెద్ద.

ఆ రైతును పిలిచి 'నీవు ఎంత అదృష్టవంతుడివయ్యా! భగవంతుడు నీకు ఎంత మేలు చేశాడో చూడు. ఈ నిస్సారమైన గుట్టల మధ్య, ముళ్లపొదల మధ్య ఎంతో ఫలపద్రమైన తోటను నీకు బహూకరించాడు. దేవుడికి నీవు ఎంతో రుణపడి ఉండాలి. కృతజ్ఞుడివై ఉండాలి' అన్నాడు. అందుకు సమాధానంగా ఆ రైతు 'ఓ మహానుభావా! మీరు చెప్పినట్లు నేను దేవుడికి కృతజ్ఞుడినై ఉండాల్సిందే! నిజంగా నేను అదృష్టవంతుడినే. ఇరవై సంవత్సరాల క్రితం ఇదంతా అటవీమయంగా రాళ్లతో, ముళ్లపొదలతో నిండి, దుర్భేద్యంగా ఉండి, ఏ కూలినీ ఎంత ప్రాధేయపడ్డా నాకు సహాయపడేందుకు రానప్పుడు, నేనెంత పని చేశానో మీరు చూసి ఉంటే- దేవుడు నాకు ఎంత మేలు చేశాడో మీరు గ్రహించి ఉండేవారు. అయినా మీ మాటలు నేను కాదనడం లేదు. దేవుడు నాకెంతో మేలు చేశాడు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను' అన్నాడు. రైతు సమాధానంలో 'శ్రమయేవ జయతే' అన్న అంతస్సూత్రం దాగి ఉంది. మనిషి కర్తవ్యం కేవలం కార్యాచరణ మాత్రమే. ఫలితం పనిని బట్టి ఉంటుంది.

సముద్రం పైపైన ఈదుతూ వెతికితే నాచు తగులుతుంది. అదే శ్రమకు వెరవకుండా లోతుల్లోకి వెళ్లి సాగరాన్ని మధిస్తేనే ముత్యాలు దొరుకుతాయి. ఇదే ప్రకృతిలో దాగి ఉన్న కార్యాచరణ రహస్యం. దైవాన్ని నమ్మినా, దైవంపై ఆధారపడకుండా పనిని నమ్మే కార్యసాధకుడే ఎప్పుడూ గెలుస్తాడు!



(ఈనాడు , సర్వాంతర్యామి,౦౮:౦౫:౨౦౧౦)
________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home