భక్తి ప్రపత్తులు
- కాలిపు వీరభద్రుడు
మనసులో ఉన్నదొకటి, చెప్పేదింకొకటి, చేసేది వేరొకటి కాకుండా త్రికరణశుద్ధిగా (మనసా వాచా కర్మణా) సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి ఆరాధించిన సజ్జనుడు భగవంతునికి చేరువవుతాడు. ఈ ఆరాధనలో తొమ్మిది విధాలైన భక్తిపద్ధతులున్నాయి- అని భక్తశిఖామణి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో చెప్పినట్లు భాగవత కథనం. ఆ భక్తిమార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం (చింతనం), పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి. శ్రీహరి భక్తుల్లో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు చెప్పిన ఈ నవవిధ భక్తి పద్ధతులు రామభద్రుని అనుజుడైన భరతునిలోనూ ఉన్నట్లు రామాయణం చెబుతున్నది. భరతునికి రాముడే తల్లి, తండ్రి, గురువు, దైవం.
శ్రవణం: శ్రీమన్నారాయణుని నామరూప గుణాదులకు సంబంధించిన మహిమాన్విత దివ్యగాథల్ని ప్రేమపారవశ్యంతో వినడాన్ని శ్రవణభక్తి అంటారు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదమహర్షి చెప్పగా శ్రీహరి మహిమను తెలుసుకున్నాడు. అందుకే విష్ణునాకర్ణించు వీనులే వీనులంటూ పులకించే శరీరంతో శ్రీహరి నామాన్ని పలుమార్లు అంటాడు. అంటూ వింటూ ఉంటాడు. రామచంద్రుడు అయోధ్యకు వస్తున్న శుభసందేశాన్ని నందిగ్రామంలో ఉన్న భరతునికి నివేదిస్తాడు హనుమంతుడు. ఈ మాటలు వినగానే దాహంతో ఉన్నవాడు అమృతాన్ని తాగినంతగా ఆనందిస్తాడు భరతుడు.
కీర్తనం: ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉంటాడు. శ్రీహరిని తన మనస్సులో ప్రతిష్ఠించుకొని ఉన్మత్తుడై పాడుతూ ఉంటాడని భాగవతంలో ఉంది. రామచంద్రునిపైగల ప్రేమలో లీనమై రామనామాన్ని జపిస్తున్న భరతుని హనుమంతుడు దర్శించినట్లు రామాయణం చెబుతోంది.
స్మరణం: ఈ భక్తిపద్ధతిని చింతనమనీ అంటారు. శ్రీహరిగాథల్ని, సదా స్మరణకు తెచ్చుకొంటూ మననం చేసుకోవడాన్ని చింతన భక్తి మార్గమంటారు. అంబుజోదరుడైన శ్రీహరి పాదారవిందాలను ధ్యానిస్తూ ఆ చింతనామృతాన్ని పానంచేస్తూ మైమరచిన చిత్తం ప్రహ్లాదుడిది. భరతుడు సైతం నందిగ్రామంలో ఉంటూ శ్రీరాముని చింతనతోనే కాలం వెళ్లదీస్తాడు.
పాదసేవనం: భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.
అర్చనం: పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. కమలాక్షునర్చించు చేతులే చేతులని భావిస్తూ ప్రహ్లాదుడు శ్రీహరి పాదపద్మాలను అర్చిస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.
వందనం: భగవంతుని పాదాలముందు మోకరిల్లి భక్తిశ్రద్ధలతో రెండు చేతులూ జోడించి నమస్కరించడాన్ని వందన భక్తి అంటారు. శ్రీహరిని పూజించి వందనం చేయని చేతులను, కూరల్ని కలియబెట్టే కర్రతెడ్డులతో పోలుస్తాడు ప్రహ్లాదుడు. పుష్పకవిమానం నుంచి కిందికి దిగుతున్న రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు.
దాస్యం: మనల్ని మనం భగవంతుని సేవకులుగా భావించుకొని ఆ స్వామిని భక్తితో సేవించడాన్ని దాస్యభక్తి అంటారు. ప్రహ్లాదుడు చరాచర ప్రపంచాన్నంతటినీ విష్ణుమయంగా భావిస్తాడు. ఎల్లవేళలా శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు. భరతుడు కూడా 'నేను రామచంద్రుడి దాసుడిని'అంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞానుసారం అతని సేవచేస్తానని అంటాడు.
సఖ్యభక్తి: భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడాన్ని సఖ్యభావభక్తి అంటారు. ప్రహ్లాదుడు తన తోటి బాలురిలో శ్రీహరినే చూస్తాడు. భరతుడాడిన భ్రాత, బంధు అనే మాటల్లో సఖ్యభావం ఇమిడిఉందని పెద్దలంటారు.
ఆత్మనివేదనం: మనం చేసే పనులు, పూజాదికర్మలు మొదలైనవాటి ఫలితాన్ని భగవంతునికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన భక్తి. కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో శ్రీహరిని భజించాలనీ, భక్తికి చిక్కినట్టుగా ఇతరాలైన క్రతు, వ్రత, దానాదులకు చక్రి (శ్రీహరి) చిక్కడని ప్రహ్లాదుడంటాడు. 'తమ రాజ్యాన్ని తమకు అప్పగించేస్తున్నాను. నా జన్మ ధన్యమైంది' అని- రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాక అతని పాదాలకు పాదుకలు తొడుగుతూ భరతుడంటాడు.
ఈ తొమ్మిది విధాలైన భక్తి పద్ధతుల్లో శ్రవణ కీర్తన స్మరణాలనే వాటిని భగవంతుడు మనకు ఎదురుగా లేనప్పుడూ ఆచరించవచ్చు. వందనం, పాదసేవనం, అర్చనలను భగవంతుని సన్నిధానంలో చేస్తాం. దాస్య, సఖ్య, ఆత్మనివేదన పద్ధతులను భావప్రధానాలుగా భావిస్తారు. ఈ నవవిధ భక్తి పద్ధతుల్లో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా మన జన్మ ధన్యమవుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౩:౦౬:౨౦౧౦)
________________________
Labels: Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home