My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, August 28, 2010

అందచందాలు

సౌందర్యం ఎప్పుడూ సమ్మోహనకరమైనదే. అంతరంగాన్ని సంతోషతరంగితం చేసేదే. ప్రాగ్దిశాసుందరి నుదుట దిద్దుకున్న సిందూర తిలకంలా- వేకువనే ఉదయించే భానుబింబపు అరుణిమలోని అందం నిత్యనూతనం. కడలి కన్నె చీరకుచ్చిళ్లు జీరాడుతున్నట్లుగా పరుగులిడుతున్న కెరటాలపై ఉషోదయాన ప్రసరించే నారింజరంగు కాంతిపుంజాల మిలమిలల్లోని సొగసు అనుపమానం. అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా- పసిపాపడి లేత పెదవుల చివరల తళుక్కుమని మెరిసే మందస్మితం సొబగు అసమానం. లాల పోసి, ముస్తాబు చేసి, ఉయ్యాల్లో బజ్జోపెట్టిన అమ్మ అటువైపు తిరిగేలోగానే- కలువ రేకులవంటి కళ్లను అరచేతులతో నులుముకొని, పాలబుగ్గల నిండా కాటుక గంధాన్ని పులుముకొన్న చిట్టితల్లి వదన తేజస్సు అద్వితీయం. ఆ సౌందర్యం ముందు- నీలిమబ్బుల చాటునుంచి తొంగిచూసే చంద్రబింబం అందం ఏపాటిదనిపిస్తుంది. 'వాళ్లమ్మ ఆలాగు వెళ్లొచ్చేసరికి/ కళ్ల, చెక్కిళ్లా కాటుకలు పాకె/... చిలిపి కళ్లమీద, చెక్కిళ్లమీద/ ముంజేత కాటుకలు ఎవరు పూసేరో' అన్న కృష్ణశాస్త్రి కవిత గుండె తలుపులు తట్టి మురిపిస్తుంది. ఆడపిల్లల అరచేతుల్లో గోరింటాకు వికసింపజేసే ఎర్రని వెన్నెలది అనిర్వచనీయమైన అందం. అరుణకాంతులు వెదజల్లే అరచేతులు- ముఖ్యంగా స్త్రీమూర్తులవి- అనాదిగా కవులు తనివితీరా వర్ణించినవే. 'తరుణాంగుళీచ్ఛాయ దంతపు సరికట్టులింగలీకపు వింత రంగులీన'- వీణ మీటుతున్న చదువులతల్లిని తన అక్షరాల్లో మన కళ్లకు కట్టాడు ఆంధ్ర కవితా పితామహుడు పెద్దన. అది- కెంజాయ వన్నెకు దీటైన తన వేళ్లతో మాణిక్యవీణపై శారదాంబ సరిగమలు పలికిస్తున్న అద్భుత దృశ్యం. ఆ వీణ మెట్లు తెల్లని దంతంతో చేసినవి. వాటిమీదుగా సాగిన తీగెలపై సరస్వతమ్మ వేళ్లకొసలు నాట్యమాడుతున్నప్పుడు- ఆమె వేళ్ల ఎర్రదనం, వీణ మెట్ల స్వచ్ఛ ధవళవర్ణం రెండూ కలగలిసి తెలుపు, ఎరుపు రంగులు వింత వింత కాంతులు ప్రసరించాయన్నది అల్లసానివారి మనోజ్ఞమైన అల్లిక!

పెద్దనామాత్యుని అక్షరాల అల్లికలోని జిగిబిగి- ఆడపిల్లల చిన్నెలకు మరింత మెరుగులు దిద్దే జడ అల్లికలోనూ ప్రత్యక్షమవుతుంది. అందానికే అందం అనిపించే వాల్జడను మాటిమాటికీ ఇరు భుజాల మీదుగా ముందుకు వేసుకుంటూ నిలువుటద్దం ఎదుట నిలబడిన పడుచుపిల్ల సోయగం ఎంత చూడముచ్చట! 'అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ!/ అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి' అంటూ చెలికాడు కవ్విస్తే- ఆ కన్నెపిల్ల బుంగమూతిలోని ఉడుకుమోత్తనంలో ఎంత అందం! మనసు నవనవోన్మేషంగా ఉండాలేగాని, అటువంటి చిలిపి సరసాలకు వయసుతోనూ పనిలేదు. 'మొకం చూసుకొందుకి ఒక అద్దం చాలు/ కొప్పు చూసుకొందుకి రెండుంటేనే మేలు' అంటూ ఆటపట్టిస్తున్న తాతగారివైపు 'తమరి ఎకసెక్కాలకేమొచ్చెలే' అన్నట్లుగా చురచుర చూసే బామ్మ చిరుకినుక మనోహరమనిపించదూ! గోడపై వేలాడుతున్న అద్దంలోనుంచి కనబడుతున్న మరో అద్దంలో చూసుకుంటూ- తల కొప్పును సవరించుకునే వేళ, ఆ పెద్ద ముత్తయిదువ చేతి కదలికలు ఎంత కళాత్మకమో! అందానికి రంగుల భేదం లేదు. ఏడువర్ణాలూ కలిస్తేనే కదా ఇంద్రధనుసైనా వన్నెలీనేది? ఆస్వాదించగల రసజ్ఞతగల మనుషులకు అన్ని రంగుల్లోనూ సౌందర్య ఝంఝ కనిపిస్తుంది. వరసైనవారిని సరదాగా ఆటపట్టించడానికి వారి ఒంటి చాయను అడ్డం పెట్టుకోవడం కొందరికి రివాజు. మనం కొలిచే దైవాలు శివకేశవులిద్దరూ నీలవర్ణులే. 'గౌరిదేవి నీ శంభుని గళమున నలుపేమిటి ఓయమ్మా' అంటూ లక్ష్మీదేవి ఓసారి పార్వతిని ఉడికిస్తే- 'నారీమణి నీ విష్ణుదేవుడు నలుపుగాడటే కొమ్మా' అని గౌరమ్మ దీటుగా జవాబు చెప్పడం- అందమైన నీలివర్ణంలోని దైవత్వానికి పట్టిన నీరాజనం.

స్పందించే మనసుంటే చాలు, సృష్టి యావత్తు నేత్రపర్వమే. హృదయోల్లాసకారకమే. బాహ్యసౌందర్యాన్ని ఆరాధించడమే కాదు, అంతస్సౌందర్యాన్నీ ఆస్వాదించగల రసహృదయం ఉండాలి. 'వదనంలో లేదు అందం/ అది హృదిలోని కాంతిపుంజం' అన్నాడు ఖలీల్‌ జిబ్రాన్‌. హృదయనేత్రం కాంతిమంతమైతే- అన్ని అందాలకూ అతీతమైన శ్రమజీవన సౌందర్యశోభ మిరుమిట్లుగొల్పుతూ సాక్షాత్కరిస్తుంది. వదన సౌందర్యంకన్నా మిన్నగా వర్తన సౌందర్యానికి ఆ కాంతినేత్రం జోతలర్పిస్తుంది. చెమట బొట్టులో రవళించే జీవననాదానికి మౌనంగానే జేజేలు పలుకుతుంది. చైనాలో చెత్త ఏరుకునే ఓ సామాన్య బాలికకు 'అత్యంత అందమైన అమ్మాయి'గా అక్కడి నెటిజన్లు పట్టం కట్టడం ఇందుకు దృష్టాంతం. జానెడు పొట్టకోసం ఆ పాప ఎవరినీ దేబిరించలేదు. ఎటువంటి అవకతవక పనులకూ పాల్పడలేదు. దేహీ అని ఎవరి ఎదుటా చేతులు చాచలేదు. టిబెట్‌కు చెందిన ఆ పదిహేనేళ్ల బాలిక భుక్తికోసం నమ్ముకున్నది శరీర కష్టాన్నే. షాంఘైలోని ఎగుమతి కేంద్రంవద్ద- పారేసిన చెత్తను, ఖాళీ శీతల పానీయాల సీసాలను, డబ్బాలను ఏరుకుని జీవిక గడుపుకొంటున్న ఆ చిన్నారిని అందరికంటే అందమైన అమ్మాయిగా అంతర్జాలం అందలమెక్కించింది- ఆమె శారీరక అందం కాదు, శ్రమించే తత్వం! ఎవరినీ యాచించకుండా ఆటుపోట్లనెదుర్కోగల మానసిక దృఢత్వం!! షాంఘై నగరాన్ని అందంగా మార్చిందని అభినందిస్తూ నెటిజన్లు ఆ బాలికకు అత్యంత సౌందర్యరాశిగా పట్టం కట్టింది అందుకే. కష్టజీవికి ఇరువైపులా నిలిచి- 'త్రిలోకాలలో, త్రికాలాలలో/ శ్రమైక జీవన సౌందర్యానికి/ సమానమైనది లేనే లే'దని నినదించిన మహాకవి వాక్కూ ఆ బాలికను ఆశీర్వదిస్తూనే ఉంటుంది!

(ఈనాడు, సంపాదకీయం, ౧౫:౦౮:౨౦౧౦)
__________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home