My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 16, 2010

అలౌకికం

వేయి రేకలుగా విప్పారిన మానవ మేధ- సృష్టికే మారాకు తొడగడంలో ముందంజ వేస్తూనే ఉంది. జనన మరణ రహస్యాలపై నిరంతరం కొత్తకొత్త ఆవిష్కరణలకు కర్తృత్వం వహిస్తూనే ఉంది. అది- పరీక్ష నాళికల్లో శిశూదయాలకు పురుడు పోసింది. మనిషిని పోలిన మనిషిని పునఃప్రతిష్ఠించేందుకు నాందిగా క్లోనింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. కృత్రిమశ్వాస అమరికతో ప్రాణచలనంలో చేతనత్వానికి ఊపిరులూదుతోంది. జీవాధారమైన రక్తజలధారను కృత్రిమంగా రూపొందించే మార్గాలను వెదుకుతోంది. వ్యాధులు, వార్ధక్యం, మృత్యువు- ఈ మూడూ మనిషిని నిత్యం భయపెడుతూనే ఉంటాయి. వాటి బారినుంచి తప్పించుకోలేరెవరూ. అలాగని- తెలిసితెలిసీ చేతులారా వాటిని కొని తెచ్చుకోవాలనీ ఎవరూ అనుకోరు. 'తగిలి జరయు రుజయు/ దైవవశంబున నయ్యెనేని అనుభవింత్రుగాక/ యెరిగి కడగి యా రెంటిని జేకొందురయ్య యెట్టి కుమతులైన?' అంటూ తండ్రి యయాతికి తమ యౌవనాన్ని ఇచ్చేందుకు ఆయన నలుగురు కుమారులు నిరాకరించడం- 'మహాభారతం'లోని కథ. మనిషిపై ముసిరే మొండివ్యాధుల్ని ఔషధాస్త్రంతో లొంగదీసుకుంటున్న మానవ మేధస్సు ఇప్పుడు- మనిషికి శతాధిక సంవత్సరాల ఆయుష్షునిచ్చే అమృతగుళిక తయారీలో నిమగ్నమైంది. భావి తరాలకు భవ్యమైన కానుకగా అది- ఏనాటికైనా మరణానికి మరణశాసనం రాసే రోజూ రావచ్చు. అంతవరకు మృత్యువు ముందు మానవాళి తలొంచక తప్పదు. కాలానికి బాకీలాంటి జీవిత రుణం చెల్లుబడకపోతే 'జాలిలేని మృత్యువెపుడొ జప్తు చేయు'నన్న ఆత్రేయ- 'చావంటే నాకు భయంలేదు. నేనుండగా అదిరాదు. అది వచ్చినప్పుడు నేనుండను' అని చమత్కరించడంలో అంతరార్థం అదే.

కొసరు పిసరంతైనా వేయని పిసినారి దేవుడు- అసలు తూకంలోనే మోసం చేసి ఆనందాన్ని, ఆయుఃప్రమాణాన్ని తగ్గిస్తాడట! ఆ మాటే చెబుతూ 'అందమైన ఉదయాలూ స్పందించే హృదయాలూ/చందనం, చంద్రకళా, సరదాలూ స్వప్నాలూ/ ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడీ/ చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెరిబుల్‌ ట్రాజెడీ-' అని తేల్చిచెప్పాడు కవి తిలక్‌. జీవిత నాటకానికి తెరదించే ఆ విషాదయానంలో- ప్రతిప్రాణీ చివరికి చేరుకోవలసిన తుది మజిలీ మృత్యువే. అది- మనిషిని అదృశ్యరూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏ క్షణాన, ఏ విధంగా విరుచుకుపడేదీ ఏ మాత్రం తెలియనీయకుండా మనిషి చుట్టూ తారట్లాడుతూనే ఉంటుంది. అదను చూసి మెరుపుదాడికి దిగుతుంది. గుండె స్పందనపై అది విసిరిన నిశ్శబ్దపు పంజా ధాటికి తెగిన నాడుల తీగలు- చర్మం కింద ప్రవహిస్తున్న పాటకు ఉరి పేనుతాయి. హంసగీతాలాపన హఠాత్తుగా ఆగిపోతుంది! అజంతా అన్నట్లు 'భయ విభ్రమాల మధ్య విషాద వాక్యంవలె సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం' అని అందరికీ ఎరుకే. అయినా, మానవుడికి జీవితేచ్ఛ వాడదు. మృత్యుభీతీ వీడదు. బతుకు భ్రమల్లో విహరిస్తున్నాడనో, ప్రాణభయంతో వణికిపోతున్నాడనో మనిషిపై మృత్యువు దయచూపదు. అతణ్ని తరలించుకుపోకుండాను ఆగదు. మనిషితో ఆడే దాగుడుమూతల్లో దానిదే పైచేయి. ఎక్కడినుంచో వచ్చే విద్యుత్తు తళుక్కున వెలిగించే గాజుబుడ్డీ లాంటిదే దేహదీపమని వర్ణిస్తూ- 'వృద్ధాప్యంలోనో, బాల్యంలోనో, యౌవనంలోంచో/ ఎప్పుడో మన దేహం ఫిలమెంట్‌ రాలిపోతుంది' అన్నాడు 'చితి-చింత' కావ్యకర్త మోహన్‌ప్రసాద్‌.

మృత్యువంటే భయంతో పాటు, మనుషుల్లో మరణేచ్ఛా అంతర్భూతంగా ఉంటుందని, మరణాన్ని ఔదలదాల్చితే అనంతానుభూతి కలుగుతుందని ఓ ప్రముఖ రచయిత ఉవాచ. జీవిత ప్రస్థానాన తాను అంతిమంగా తిరగక తప్పని ఆఖరి మలుపు... మృత్యువంటే మనిషిలో వెరపు సహజమే. అలా భయపడినంత మాత్రాన, వేళ ముగిసిన జీవనపత్రం నేలరాలకుండా ఉండదు. మృత్యుప్రహారాన్ని మౌనంగా అతడు అనుభూతించకా తప్పదు. శ్రీశ్రీ అన్నట్లు 'మృత్యు నిశ్శబ్దాన మృదు జీవరవళి' ఆ సమయంలో అతనికి వినవస్తుందో, లేదో తెలియదుకానీ... మరణం అంచులదాకా వెళ్లి బయటపడినవారిలో కొందరు- ఆ అపస్మారక స్థితిలో తమకు కొన్ని వింత అనుభూతులు కలిగినట్లు చెప్పడం కద్దు. ఆఖరి ఘడియలకు చేరుకున్న సంధి సమయంలో- ఇష్టదైవాలు కట్టెదుట నిలిచినట్లు; శరీరం తేలిపోయినట్లు; మంచంపైనే శరీరాన్ని వదిలేసి- ఏదో వెలుగు దారి చూపుతుంటే చుక్కలలోకంలోకి వెళ్లిపోయినట్లు- ఇటువంటి అనుభూతులేవో తమను ఆవరించినట్లు వారు చెబుతుంటారు. అవన్నీ వారి భావనలు మాత్రమేనని అంటున్నారు శాస్త్రజ్ఞులు. చనిపోయేముందు మనిషి శరీరం, మెదడు తీరు ఎలా ఉంటుందన్న అంశంపై- జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లఖ్మీర్‌ చావ్లా ఓ అధ్యయనం నిర్వహించారు. 'మరణానికి ముందు మనిషి మెదడుకు రక్తం ప్రసరించడం క్రమేణా తగ్గిపోతుంది. ప్రాణవాయువు స్థాయి పడిపోతుంది. మెదడులోని విద్యుత్‌ తరంగాలు చివరిసారిగా కంపిస్తాయి. వాటి ప్రకంపనలు అలలు అలలుగా మనిషి ఆలోచనల్ని కదిలిస్తాయి. చనిపోయేముందు తాము ఆస్వాదిస్తున్నట్లుగా- మృత్యుశయ్యపై ఉన్నవారు పలవరించే అనుభూతులన్నీ ఆ ఆలోచనల ప్రభావమే' అని చావ్లా చెబుతున్నారు. మెదడులో ముప్ఫై సెకన్లనుంచి మూడు నిమిషాలవరకు కనిపించిన ఆ విద్యుత్‌ తరంగాల అలజడి పూర్తిగా సద్దుమణగడం మృత్యువుకు సంకేతం అని ఆయన అంటున్నారు. అవసాన సమయాన మగత నిద్రలో దృశ్యాదృశ్యంగా కదలాడే భావనాచిత్రాలను అనుభూతించడం ఒక్కటేనేమో- మరో లోకంలోకి మరలిపోయే మనిషి కడకు తన వెంట తీసుకువెళ్లగలిగేది!
(ఈనాడు, సంపాదకీయం, ౧౩:౦౬:౨౦౧౦)

Labels:

0 Comments:

Post a Comment

<< Home