My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, August 11, 2011

వృథా అరికడదాం!

'పెళ్ళిచేసి చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా గృహస్థుకైనా రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు 'ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే'! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్నప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభకార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే. బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు! 'అన్నింటికి సైచి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి అంతరిక్షనౌక ప్రయోగంతో సరిగ్గానే పోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్యమన్న అతగాడి చమత్కారం- అణాపైసల్లో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణ మండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదుపులో ఉండొచ్చు గానీ, అతిథుల పూట ఆకలి దప్పికలను సూపర్కంప్యూటర్అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు.

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగేది! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజనాదికాల కోసమేనని సంస్కృత శ్లోక చమత్కారం. 'జలసేవన గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడిలేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు భోజనప్రియుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మరి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరసపెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డు పెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవితానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని?! కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్‌'! పరగడుపున రాజులాగా, అపరాహ్ణం మంత్రిలాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికీ మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో అది శిరోధార్యం.

కల్యాణమంటే ఇద్దరు ఒకటయ్యే అర్థవంతమైన ముచ్చట. ఆత్మీయులు, బంధుమిత్రుల ముందు వేడుక ఎంత ప్రశాంతంగా జరుపుకొంటే అంత ముద్దు. అప్పు చేసి గొప్పగా పప్పన్నం పెట్టాలనుకోవడం తప్పు, అంతకుమించి ముప్పు. 'జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి/ పుట్టెడు కూటికి బతిమాలే' అభాగ్యులు కోట్ల సంఖ్యలో పోగుపడిన దేశంలో విందు పేరిట అనవసర భేషజాలు, ఎడాపెడా వృథా చేయడాలు దారుణ నేరాల పద్దులోకే చేరతాయి. ఎంత భీమ బకాసురులైనా త్రిషష్టిత(63) సంవర్గ రస భేదాలను ఆస్వాదించడం కుదిరే పని కాదు. గొప్పకోసం చేసి చివరకు చెత్తకుప్పలమీదకు పారేసే విస్తరాకుల్లోని ప్రాణశక్తి ఎందరెందరినో ఆకలిచావుల పాలబడకుండా కాపాడగలదు. అటుకులు పిడికెడేనని కృష్ణయ్య కుచేలుడిని కాదు పొమ్మన్నాడా? బంధుమిత్రత్వాలకు విందుభోజనాలు కొలమానాలు, ప్రాతిపదికలు కానేకాదు. దేహమనే దేవాలయంలో ఆత్మారాముడి సంతృప్తికి ఫలం తోయం పరిమాణంతో కాక... ప్రేమతోనే నిమిత్తం. తినగ తినగ గారెలు వెగటు. ఆకలి సూచికలో అరవై మూడో స్థానంలోని మనదేశంలో అంత వెగటు పుట్టేదాకా తినాలనుకోవడమే అపచారం. వండి వృథా చేయడం క్షమించరాని నేరం. విందు వినోదాల్లో సాధారణంగా పదిహేనునుంచి ఇరవైశాతం దాకా ఆహార పదార్థాలు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు- 'హంగర్ఎలిమినేషన్అండ్యూ' వ్యవస్థాపకులు వి.రాజగోపాల్‌. ఆవేదనలో కచ్చితంగా అర్థముంది. చెత్తకుండీలవద్ద ఎంగిలి విస్తళ్ల కోసం కుక్కలమధ్య కొట్లాడే కోట్లాది అన్నార్తులున్న అన్నగర్భ మనది. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి వైభోగంగా వివాహం చేసుకున్నా ఒకే వంటకానికి పరిమితం కావాలనే చట్టం తెచ్చే ఆలోచన మన పాలకులకు కలగటం ముదావహం. పొరుగున పాకిస్థాన్లో ఉన్నట్లు ఏకపాక శాసనం ఇక్కడా వచ్చేదాకా ఎందుకు... మనమందరం ముందుగానే మేలుకుందాం. స్వచ్ఛందంగా ఆహారవృథాను అరికడదాం. ఇంటికీ ఒంటికీ దేశానికీ అంతకంటే చేసే మేలు, సేవ ఏముంటుంది?
(సంపాదకీయం, ఈనాడు, ౧౫:౦౫:౨౦౧౧)
_________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home