My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, November 16, 2011

గాంధేయమే గాండీవం


హాయిగా బతకమని దేవుడు భూమ్మీదకు పంపిస్తే- మనిషికే మనిషి అరి, నరుడికే నరుడు ఉరిగా మారిన కత్తులమారి కాలం ప్రస్తుతం నడుస్తోంది. 'జరతో, రుజతో ఎలాగూ ముంచుకొచ్చే మరణాన్ని మనిషి హింసావేశపాశాలతో మరింత ముందుకు నెట్టుకొచ్చుకుంటున్నాడే! నరుడే నరకాసురుడుగా మారుతున్నాడే' అని ప్రజాకవి దాశరథి నొచ్చుకున్నప్పటి దారుణ పరిస్థితులే నేడూ ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాదమే- ప్రపంచమంతా ప్రజ్వరిల్లే అగ్నికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోంది. దాయాదులతో యుద్ధమా, సంధా అనే సమాలోచనలు పాండవుల మధ్య రగిల్చింది పెద్ద రాద్ధాంతాన్నే. 'త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తమ్మన్నముం బెట్టి, రే/ చేటున్ వాటిల కున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర/చ్చోటన్ కొంపకు నిప్పుపెట్టి, రడవుల్ చుట్టించిరి' కౌరవులని తొలుత పాండవులు రోషపడ్డారు. చివరికి అయిదూళ్లయినా చాలు అని సరిపెట్టుకోవడమే మేలన్న వారి తీర్మానం వెనకున్న మర్మం అహింసే పరమ ధర్మమన్న సృష్టి సూత్రాన్ని విస్మరించకపోవడమే. హింసామయ జీవనులను ధర్మశాస్త్రజ్ఞులు ప్రశంసించరు. రాయంచపై దేవదత్తుడు చూపించిన క్రౌర్యాన్ని బుద్ధుడు కాకముందే సిద్ధార్థుడు నిరసించాడు! క్రౌంచ జంటను నిష్కారణంగా కిరాతుడు హింసించాడనే గదా బోయదశలోని వాల్మీకి ఎదలో అంత ఆవేదన రగిలింది! హింసకు హింసే సమాధానం కానవసరం లేదు. నవ నందుల దానవ ప్రవృత్తికి ఆచార్య చాణక్యుని ప్రతిస్పందన- మౌర్య సామ్రాజ్య సువర్ణ పాలన. అహింసా లతామతల్లి రక్కసి మూకల వికృత చర్యల సెగ తగిలి వసివాడినప్పుడల్లా పాదులు తీసి దయారసాలు చల్లి తిరిగి చివురులు పూయించిన ప్రేమమూర్తుల జాబితా చిన్నదేమీ కాదు.

ఈ అత్యంత విశాల ప్రపంచ వైద్యాలయంలో హింసాబద్ధులైన రోగులను ఉద్ధరించే వైద్యం సత్యాహింస శాంతి కారుణ్యాలనే చికిత్సా విధానమే- అంటాడు ఖలీల్ జిబ్రాన్. చర్మ చక్షువులతో తేరిపార చూడలేని కర్మసాక్షి ఉనికి కిరణరశ్మి స్పర్శానుభవం ద్వారా తెలివిడికొస్తుంది. విశ్వ వైద్యనారాయణుల చేతిచలువ జీవికి అనుభవంలోకి తెచ్చేది ఆ కారుణ్య చికిత్సలతోనే అని నమ్మి ప్రబోధించిన క్రైస్తవ సాధువు ఫ్రాన్సిస్. మరణశయ్య మీద ఉండీ, జీవితాంతం సేవచేసిన గార్దభానికీ కృతజ్ఞతలు చెప్పటం మరవని కరుణామయుడాయన. తోటి జీవాలపట్ల సద్భావనతో మనిషి మెలగాల్సిన తీరును, అవసరాన్ని లోకానికి చాటిచెప్పిన సాధుపుంగవులు దేశ కాల మతాలకు అతీతంగా ఎందరో ఉన్నారు. 'ప్రపంచానికి నేను కొత్తగా చెప్పే పాఠం ఏముంది... సత్యాహింస శాంతి సూత్రాలు హిమాలయాలంత సనాతనమైనవి. గంగా జలమంత పునీతమైనవి' అని మహాత్మాగాంధీ చెప్పుకోవడంలోని అంతరార్థమూ ఇదే. ఇంటికి నిప్పంటించిన కంటకులకైనా సరే... కంట కన్నీరును కోరుకోరాదు- అనేది అజాత శత్రుతత్వం. దాన్ని ప్రబోధం వరకే పరిమితం చేయకుండా నిజజీవితంలో అనుక్షణం ఆచరించి చూపించినందుకే గాంధీజీని నేటికీ ప్రపంచం గౌరవించేది. 'విష పాత్రమెత్తి త్రావెడి మహాయోగి కన్‌గొనలలో తాండవించిన యహింస/ హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు దయామూర్తి నుదుట పారాడు శాంతి/ శిరసు వంచక స్వేచ్ఛ కొఱకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఏకమై జాతిజనం పూర్వ పుణ్యసంపత్తి ఫలంగా పోరుబందరులో పుత్తలీబాయి పొత్తిళ్లలో ఒత్తిగిలి నేటికి నిండు నూటనలభై రెండేళ్లు.

స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్న సమర రూపాలకు రక్తపాత రహితమనే
కొంగొత్త సహన సిద్ధాంతాన్ని అద్ది గెలుపు మలుపులో సత్యాహింస శాంతియోధులను నిత్యం కాపుగా ఉంచిన సాహసి మోహస్ గాంధీ. అగ్నితో అగ్ని ఆరిపోదు. చల్లబడాలంటే జలం చల్లక తప్పదు. కరుణ లేనినాడు ధరణి లేదు. కరుణలేని నరుడు వట్టి గడ్డిబొమ్మ- ఇది బుద్ధుని అష్టాంగ మార్గం. అదే భూలోక స్వర్గ సృష్టికి దగ్గరి దారన్న సులభ సూత్రం కనిపెట్టిన కర్మయోగి గాంధీజీ. శాస్త్రవేత్త ఐన్‌స్టీనే విస్తుపోయినట్లు 'కంటితో చూసి ఉండకపోతే కల్పనేమోనన్నంత వింత' బాపూజీ సత్యాహింసల జీవిత ప్రస్థానమంతా. పల్లెనుంచి ఢిల్లీదాకా దేశంలో గాంధీజీ పేరుతో ఊరో, నగరమో, రాస్తానో, చౌరస్తానో, వాహ్యాళి స్థలమో, వాహనాల స్థావరమో... కానరాని చోటు లేదు- సంతోషం. జేబులో తప్పనిసరిగా ఉండే కరెన్సీ నోటుమీదా ఆ బోసినవ్వుల బాపూజీ ప్రత్యక్షం- మరీ సంతోషం. మానవ జీవితంలో బాపూజీ రూపం కేవలం ఆరాధ్యభావనకే పరిమితమా?! తాను విడిచివెళ్లిన చేతికర్ర, చెప్పుల జత, గడియారాలకు ఇస్తున్నపాటి విలువ- సిలువలేని ఆ యేసు ప్రవచించిన మానవ విలువలకు మనం ఇస్తున్నామా? బంతివంటి భూగోళాన్ని పంచుకోవడానికి పసిపిల్లలకన్నా మిన్నగా ఎన్ని విధ్వంసాలు? పచ్చ కాగితాల కట్టలకోసం కొట్లాడుకోవడాలు... విషాలు చిమ్ముకోవడాలు... మానవతకే తలవంపులు! బాంబులతో లేచిన గోడలు చివరికి సమాధులుగా చరిత్రలో మారనిదెన్నడు? బాపూజీ శుభ జన్మదిన సందర్భాన్ని ప్రపంచ శాంతి, సహన దినంగా ఐక్యరాజ్య సమితి పరిగణించడం మొదలుపెట్టి ఇది అయిదోఏడు. మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాల పోరాటానికి, సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన మానమర్యాదలు పొందాలనే ఆరాటానికి బాపూజీ చూపించిన శాంతి అహింసలే తిరుగులేని ఆయుధాలని మరింతగా ప్రచారానికి రావాల్సి ఉంది. మరెంతగానో ఆచరణకు నోచుకోవాల్సి ఉంది. కవి కృష్ణశాస్త్రి భావించినట్లు 'తన కంఠమున దాచి హాలాహలం/ తలనుంచి కురిపించి గంగాజలం/ మనిషి శివుడవటమే గాంధీ వరం'. హింసతో శివాలెత్తుతున్న నేటి విశ్వం సర్వం శివమయం కావాలని- ఈ బాపూజీ జన్మదిన పర్వం( అక్టోబర్,౨)  నాడు కోరుకోవాలి మనమందరం! 

(ఈనాడు సంపాదకీయం, ౦౨:౧౦:౨౦౧౧)
_____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home