ఆహారం జీవులకు ప్రాణావసరం. దాన్ని ఒక భోగకళగా మలచుకోవడం మనిషి ప్రత్యేకత. ఆత్మకు ఇంపైన భోజనాన్ని సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. దేవదారు వనంలో యాయవారానికని బయలుదేరిన శివబైరాగి భిక్షాపాత్రలో రంభ, ఊర్వశి లాంటి అందగత్తెల చేతులమీదుగా నేతి వంటకాలు వడ్డించిన భోజన ప్రియుడు శ్రీనాధ కవిసార్వభౌముడు! విందుభోజనాదులకు సందర్భశుద్ధి కూడా చూసుకోడన్న విమర్శా ఉంది. హర విలాసంలో ముక్కంటి మూడోకంటి మంటకు ఎర అయిన మన్మథునితోపాటు రతీదేవి సతీ సహగమనం చేసే సందర్భం ఒకటుంది. తామరపూల తేనెలతో ధర్మోదకాలు, తియ్యమామిడి పండ్లతో పిండప్రదానాలు చేయాల్సిందిగా అంత పతీవియోగ దుఃఖంలోనూ పరివారానికి రతీదేవి పురమాయించడం, ఆ మహాకవి ఆహార ప్రియత్వానికి నిదర్శనం. ప్రజాబాహుళ్యం అభిలాషలు, ఆరాటాలు, విలువలకు సంస్కృతి ఒక ప్రతిబింబమైతే- ముందు తరాలకు దాన్ని అందించే బాధ్యత సాహిత్యానిదే. ఏనాటి సమాజ స్వరూప స్వభావమైనా సమ్యక్ దర్శనా భాగ్యానికి నోచుకోవాలంటే... ఆనాటి వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలతోపాటు ఆహార పద్ధతులూ తెలిసి ఉండటం తప్పనిసరి- అంటారు మల్లంపల్లివారు. మన ప్రాచీన కవులు ఈ బాధ్యత గుర్తెరిగారు కనుకనే సందర్భం ఉన్నా లేకపోయినా సందుచూసుకుని మరీ విందు భోజనాలందించారు!
శిష్యసమేతంగా వ్యాస మహామునికి కాశీవిశాలాక్షి చేసిన విందులో వడ్డించిన చాలా పదార్థాలకు శబ్దరత్నాకరంలోనే అర్థాలు దొరకవు- అంటారు కాశీఖండానికి మణికర్ణికా వ్యాఖ్యానాన్ని కూర్చిన శరభేశ్వర శర్మ. పాండురంగ మాహాత్మ్యంలో కపట బ్రహ్మచారై వచ్చిన పరంధామునికి సుశీల అనే పతివ్రతా శిరోమణి ఆతిథ్య మిస్తుంది. ఆ సందర్భంలో తెనాలి రామకృష్ణకవి వర్ణించిన ఖాద్య విశేషాలతో ఒక పరిశోధనా గ్రంథాన్నే వెలువరించదగినంత సమాచారం ఉంది. ఎన్నో వ్యంజనాలు పిండివంటలతో భరద్వాజుడు భరతుడికి, పరివారానికి ఇచ్చిన విందు జగత్ప్రసిద్ధం. భారతీయుల అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రమూ ఒకటి. నలభీములు ఆ శాస్త్రంలో అసమాన ప్రతిభాశాలురు. ఆహార పదార్థాలు, వాటి తీరుతెన్నులు, ప్రత్యేక లక్షణాలు, ఇమిడి ఉన్న ఆరోగ్య సిద్ధాంతాలు, వంటశాలలు, వడ్డన విధానాలు... రుగ్వేద కాలంనుంచీ భరతఖండంలో అధ్యయన విశేషాలే! వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే తప్పుగా భావించే శుద్ధ శాకాహారి శ్రీనాథుడు. సిరియాలును తరిగి తిరువెంగనాంచి నానావిధ పాకాలు చేయించిన వైనాన్ని అంత తీరుగా ఆ కవి వర్ణించడానికి కారణం- వాటి ఆహారపు తీరుతెన్నులను అక్షరబద్ధం చేయాలన్నతపనే. కాశీఖండం- కుమారాగస్త్య సంవాదంలో సదాచార విధి చర్చ సందర్భంగా భోజనాలవేళ విధిగా పాటించాల్సిన నియమాల వివరణ ఉంది. తరతరాల తెలుగువారి ఆహార రుచులమీద పరిశోధనలు సాగించి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గ్రంథమే రూపొందించారు. చిత్రవిచిత్రమైన చిత్రాన్నాల నుంచి, రెండు భోజనాల నడుమ నమిలే అటుకులు అరిసెలవంటి వాటిదాకా- వట్టి వివరాలే కాదు... వాటి వైద్య విలువల్నీ ఆ గ్రంథం విపులీకరించింది.
ఆహారం కేవలం జిహ్వ సంతృప్తి కోసమే కాదు, ఒంటికి పట్టి ఆరోగ్య వృద్ధికి దోహదపడాలి. శుచి, రుచితోపాటు తుష్టి, పుష్టి కారకాలు పుష్కలంగా కలిగిన పోషకాహారమే సంపూర్ణాహారం. అది లభించడమే మహాభాగ్యం. షడ్రుచులు, అష్టాదశ రసాలు, చతుర్విధాలుగా త్రికాలాల్లోనూ సేవించి హరాయించుకోగల జీర్ణశక్తి కలిగి ఉండటమే ఆరోగ్యం- అని వస్తుగుణ ప్రకాశిక వాదం. ఆహారాన్నిబట్టి స్వభావం అంటుంది తైత్తరీయం. అందుబాటులో ఉన్న భోగమేదైనా ధర్మబద్ధంగా ఆరోగ్యభంగం కానంతవరకూ అనుభవించడం దోషంకాదు. నాగరికత మోజులో స్థానిక వాతావరణానికి అననుకూలమైన విదేశీ ఆహారపు అలవాట్లకు బానిసలమైతే నష్టపోయేది మన ఆయుష్షే. వింధ్య పర్వత గర్వభంగానికని బయలుదేరాల్సిన అగస్త్యుడు కాశీని వదిలిపోవడానికి బాధపడింది నిత్యం తాను పరమ ప్రీతిగా సేవించే 'శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష'కు దూరమవ్వాల్సి వస్తుందనే! కాశీఖండంలో గుణనిధి, శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుడు- తిండికి మొహం వాచిపోయి ఉన్న దీనదశలో కన్నతల్లి తమకు ఆరగింపులకు పెట్టిన 'గిన్నెలోని పెరుగును, వంటకంబు వడపిందియలను' పదేపదే తలచుకొని కుమిలిపోతారు. కరవులు ముంచుకొచ్చీ, వరదలతో పంటలు ముంపుకొచ్చీ, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు కొంతకాలంగా అనుకూలించని సాగు- రైతన్న మెడమీద పుండుచేసే కాడిగా మారిపోయింది. ఫలితంగా, 2010-11 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఏడుకోట్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. కూటిలోకి కూరాకు కూడా దొరకని దారుణ ఆహార సంక్షోభం మున్ముందు ముంచుకు రానుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మనిషి జీవితానికి, తిండి ప్రధాన అవసరం. అది మనిషి ప్రాథమిక హక్కు కూడా! నిరుపేదలకు నిజమైన భోజనోత్సవం ఇంకెంత దూరంలో ఉందో కదా!
(ఈనాడు సంపాదకీయం, ౧౬:౧౦:౨౦౧౧)
_________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home