My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, December 29, 2011

పుస్తకమే రెక్కల గుర్రం


తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టి బాలలచేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పజెప్పించే పద్యం, 'తల్లీ! నిన్ను దలంచి'. బుద్ధి, మనసు కలిసి ఉండే హృదయపీఠంమీద కొలువై ఉన్న చదువులమ్మను- దోషరహితమైన సుస్పష్ట శబ్ద సౌందర్యాన్ని, సుదూర కాలతీరాల వరకు జగన్మోహనంగా వ్యాప్తిచేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం. 'తలవాకిటను మెలగు ఆ చెలువ'ను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. పుస్తకం, విత్తం, కన్య- వరసగా ధర్మార్థ కామ ప్రతీకలు మనకు. కన్యావిత్తాలు కొందరికే సొంతం. పుస్తక విజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మ చక్షువులతో చూడ సాధ్యంకాని మహితాత్ముల మనోభావాలను, జీవితానుభవాలను ముందుతరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాసపీఠంమీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి ఆత్మ మనముందు కూర్చుని ధర్మప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతాపఠనం కొనసాగిస్తున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితం మీది మన విశ్వాసాలను పెంచుతున్నట్లే. కరుణశ్రీ భావించినట్లు 'కలువలు పూచినట్లు/ చిరుగాలులు వీచినట్లు/ తీవలు తలలూచినట్లు/ పసిపాపలు చేతులూచినట్లు/ ఆత్మలు పెనవేసినట్లు' కవితలు సృజిస్తుంటారు కదా కాళిదాసునుంచి కృష్ణశాస్త్రులదాకా! 'గ్రంథాలు ఆత్మబంధువులు' అంటారు గుంటూరు శేషేంద్రశర్మ. పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క- గ్రంథం. 'గ్రంథ నిలయంబు శారద కనకపీఠి/ గ్రంథ నిలయంబు కవుల శృంగారవీటి/ గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తి నూటికి నూరుపాళ్లు నిజం.

విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా, పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృజించాలన్నా అక్షరానికే సాధ్యం. అది త్రేతాయుగంనాటి రాముణ్ని కలియుగ దేవుడిగా మారుస్తుంది. తెలుగు త్యాగయ్యను తమిళుల ఆరాధ్యుడిగా తీరుస్తుంది. కంచెర్ల గోపన్న చెరసాల చీకటి శోకాన్ని రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథాసప్తశతి ఘనతను కథలుగా మనకు ఇప్పుడు వినిపించినా ఆ గొప్పతనమంతా అచ్చక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌన్ దొరదాకా పాకేదా! అన్నమయ్య పద సంపద ఈ మాత్రమైనా జాతికి దక్కేదా! పరదార కామన, అధికార లాలస, సాధుజన పీడన సర్వనాశనానికి కారణభూతాలన్న ధర్మసూక్ష్మం- రామాయణ, భారత, భాగవతాదులుగా రాయబట్టేగదా నీతులుగా నిలబడింది! హరిశ్చంద్రుని చరిత్రే గాంధీజీని సత్యాగ్రహిగా మార్చింది. గాంధీజీ సత్యప్రయోగాలే మార్టిన్ లూథర్ కింగ్ పోరుకు ప్రేరణ. చదువు ప్రాముఖ్యమేమిటో హిరణ్యకశిపుని నోటే చెప్పించాడు మహాకవి పోతన. విద్యాగంధం లేక జనుషాంధుల్లాగా ఉన్న కొడుకులను విష్ణుశర్మ అనే పండితుడికి అప్పగిస్తాడు 'నీతిచంద్రిక'లోని సుదర్శన మహారాజు. పరవస్తు చిన్నయసూరి భావించినట్లు మంచిపుస్తకం- 'పలు సందియముల దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో/కులకు అక్షి'. సందేహం లేదు. ఒకప్పుడు విద్యావంతుల ఇంట ఓ పుస్తకాల గదీ తప్పనిసరి. వివాహాది శుభకార్యాల్లో పుస్తకాలు చదివించడం సదాచారంగా ఉండేది. ఇలా- గతంలో గ్రంథపఠనమంటే ఒక సంస్కార చిహ్నం.

కొన్నేళ్లక్రితందాకా పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలే బహుమానాలుగా దక్కేవి. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా 'ఎలక్ట్రానిక్ నోట్‌బుక్' ల్లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికత ఎంత పురోభివృద్ధి చెందుతున్నా, పుస్తకం స్థానం ఏ ఈ-పరికరం పూడ్చలేనిది. టీవీ, చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తిమంతమైనా- పుస్తకంలా 'వ్యక్తిగతం' కాలేవు. అమ్మలా బిడ్డకు మంచిమాటలు నేర్పించగలిగేది, బొమ్మల పుస్తకమే! తండ్రినుంచి దండన భయం ఉండొచ్చు. ఏ దండనా లేకుండా మంచిదారి చూపించగలిగేదీ పుస్తకమే! రోమన్ సేనాపతి మార్కస్ అరీలియస్ యుద్ధ ఆందోళనల మధ్య సాంత్వన కోసం శిబిరంలో పుస్తకం పట్టుకుని కూర్చునేవాడు. ఎన్ని రాచకార్యాలున్నా రాయలవారు విధిగా విద్వద్గోష్ఠులు నిర్వహించేవారు. తాళపత్ర గ్రంథాలను తులసిదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. ఇప్పుడా 'పుస్తకాల పిచ్చి' పిచ్చిపుస్తకాల స్థాయికి దిగజారుతుండటమే దిగులు చెందాల్సిన అంశం. అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ శ్లాఘించినట్లు, పుస్తకం- 'మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం'. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లలనుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంవారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధోపరిజ్ఞాన రంగంలో బాగా వెనకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనంమీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ- అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభాపాటవాలకన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధకబృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజెన్ నిర్ధారించారు. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతినుంచి అచ్చక్షరాల సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కన్యాశుల్కం గిరీశంలాగా 'బయింగ్ బుక్స్... బార్బేరియస్!' అని ఈసడించుకుంటే- మనిషి కథ అడ్డం తిరగడం ఖాయం!

(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, ౧౮:౧౨:౨౦౧౧ )
______________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home