వైవిధ్య మోహనం
పక్షుల కలిసికట్టుతనాన్ని విపులీకరించిన 'నల దమయంత చరిత' ప్రకారం, హంసల సొగసు నడకల్ని తిలకించి పరవశించాడు నాయకుడు. ఆ గుంపులో ఒకదాన్ని ఎగిరిపోకుండా పట్టుకోవడంతో, మిగిలినవన్నీ సహచరి విముక్తి కోరి అక్కడే ఆకాశంలోనే ఇటూ అటూ తిరిగాయి. శరత్కాలపు మేఘాల తెల్లదనానికి హంసల తెలుపూ తోడవడం వాటి లోలోపలి నిర్మలతను సూచించిందనడం మరింత విశేషాంశం. మరిక అంతా తెలిసిన, ఎంతో చూస్తున్న మనుషుల ద్వారా పశుపక్ష్యాదులకూ క్రిమికీటకాలకూ కలుగుతున్న మేలెంత? 'జప తపంబులకన్న చదువుసాములకన్న ఉపకారమే మిన్న' అన్న 'కూనలమ్మ' కర్త పిలుపునీ, 'చక్కని చిలకల పంజరములనిడి రెక్కలు దాస్తావెందుకూ? 'కో'యని నిద్దుర లేపే కోళ్లను గొంతులు కోస్తావెందుకూ?' అనే కరుణశ్రీ నిరసననీ గ్రహించి వ్యవహరించాల్సింది మనిషి మాత్రమే. ఉపకరించకపోగా బంధించీ వధించీ దానవత చూపుతోందీ మానవుడే! రూప నిర్మాణాల్లో ఎంతెంతో చిన్నవైన రెక్కల పురుగులు సైతం ఇతర సూక్ష్మజీవాల్ని పరిహరించి మానవ జాతికి ఎంతో కొంత ఉపయోగపడుతుంటే, తన మానాన తాను పోతున్న చిరుచీమను సైతం కాలరాచి వేలితో చిదిమేసి వదిలించుకుంటున్నాడు మానవుడు! పురుగు పుట్రల నుంచి పంటపొలాల్ని సంరక్షించే కప్ప, జనావళికి హాని కారకాల్ని నిర్మూలించే బల్లి, పుష్కలమైన స్థితిస్థాపకత్వంతో తన గూడును పటుతరం చేసుకుని ఇవాల్టి రక్షక కవచాల రూపకల్పనకు కీలకాధారంగా నిలిచిన సాలీడు... వీటన్నింటితో- భూమి పోషణ, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ సాధ్యపడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 'పరుల కుపకరింప పరలోక హితమగు'నన్న వేమన వాణి గుర్తురావడం లేదూ! పంచే గుణమంటూ లేకుంటే, సిరివెన్నెల అన్నట్లు 'చివరికీ ప్రపంచంలో మిగిలేదల్లా శూన్యమే!'
ప్రకృతి భాగాలైన పూలూ పక్షులూ జంతువులూ చూపే త్యాగబుద్ధి... వాటన్నింటి కంటే ఉన్నతుడనుకునే వ్యక్తికి ఎందుకుండదో? స్వార్థమే అంతటికీ కారణమన్న వేంకట పార్వతీశ కవుల దృక్పథంలో నుంచి చూస్తే 'తాను తన పండు దినబోదు తేనె యరటి/ తాను దన పాల గ్రోలదు ధన్య సురభి/ తాను దన తావి గ్రోలదు తమ్మిపూవు/ జగతిలో నరుడొక్కడె స్వార్థపరుడు'. ప్రకృతి ఎంతమాత్రం మనిషిమీద ఆధారపడి లేదు. ఆ రీత్యా పాఠాలు నేర్చుకోవాల్సిందీ నేర్చుకున్నవాటిని ఆచరించాల్సిందీ మానవుడే! ఎందుకూ కొరగాదని ఎందరో అనుకునే పేడపురుగు నేలమీద ఉన్నవాటిని తిని వ్యర్థాల నిర్మూలనకు దోహదపడుతోంది. పండ్లను తిని రెట్టలు వేసి, ఆ ప్రాంతమంతా విత్తనాల్ని విస్తరించి వృక్షకోటిని పెంచుతోంది కలివికోడి పక్షి. మేధావి చెహోవ్ చెప్పినట్లు ప్రకృతే మనిషికి సృజనశక్తినిచ్చి, తానుగా కొంతన్నా జోడిస్తాడన్న నమ్మకంతో ఉంది. కాలక్రమాన జోడించిందంటూ ఏదీ లేకపోగా ఉన్నదంతా మటుమాయం అవుతుండటమే వైచిత్రి. నర్తన రీతిలో సాగుతూ వందలాది సహచరాలకు దోహదమయ్యేలా తేనెను గూడునిండా నింపుతుంది తేనెటీగ. అది చూపే ఆ సంవిధాన నైపుణ్యమే ఇప్పుడు మన వేలికొసల తాకిడితోనే అపారంగా మన ముందు నిలిచే సమాచార ప్రవాహానికి స్ఫూర్తి! విదేశీ శాస్త్రవేత్తల ఈ తాజా పరిశోధన ఫలితం జీవ వైవిధ్య ప్రక్రియకో మేలి మలుపు. 'నీకున్నది నలుగురికీ పంచు, ఆ గుణంలో అందర్నీ మించు' అన్నది జన నాదమూ జీవన విధానమూ అయిననాడు- హితమూ సుఖమూ అదే!
(21:10:2012, ఈనాడు )
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home