ఏకాంత చింతన
అనంతానంద సందోహానికే కాదు... హృదిని కరిగించి మరిగించే విషాద భరిత స్థితికీ ఏకాంతమే కూడలి స్థలి. తనను వీడి వెళ్లిన మోహనమూర్తిని తలచి తలచి వగచి వగచి అశ్రుధారలో సొమ్మసిల్లిన యశోధరది ఏకాంతమే. ప్రాణనాధుని నిష్క్రమణతో అంతఃపుర మందిరానికేపరిమితమైన నిద్రాముద్రిత రాకుమారి వూర్మిళాదేవిదీ అదే పరిస్థితి. కావ్యరచనకు అనువూ నెలవూ ఏకాంతమేనన్నది నాటి అల్లసానివారి భావమైతే, 'ఏకాంతంగా కూర్చుని ఆకాశంలోకి వీక్షించాను, నక్షత్రఖచిత నభోమండలం పరీక్షించాన'న్నది నేటి కవివర్యుల ఘన భావన. 'దేహాలు ఒక్కచోటే నివసిస్తాయి, ఆశలే వేరే లోకాల్లో సంచరిస్తాయ'ని చెప్పిన చలందీ ఏకాంతత్వమే. అందులోనే అనేకానేక మాటలూ ధ్వనులూ భాషలూ! ఇక ఇప్పటి ఏకాంతమంటే ఏమిటి? నలుగురిలోనూ చేరకుండా ఒంటరిగా ఉండటమా? నలుగురిలో ఉన్నా ఒంటరితనాన్ని వీడకపోవడమా? మోదమంటే లభించేది, ప్రమోదమంటే అనుభవించేది. వీటి సిద్ధితో వెల్లివిరిసే ఆనందోత్సాహాల్ని నలుగురితోనూ పంచుకోవాలనుకుంటాడు మనిషి. అప్పటి అనుభూతిని మాత్రం ఒక్కడిగానే స్మరించుకుంటాడు. గదిలో ఒక్కరిగా ఉండి అనుభవించే ఏకాంతానికి కాస్తంత భంగం కలిగినా భరించలేరెవ్వరూ. ఒకరికొకరుగా ఒకరిలో ఒకరిగా ఒదిగిపోయే దంపతుల్లోనూ ఏకాంత కాంక్షలుండవూ? ఆత్మావలోకనకో ఆనందానుభవానికో నిర్దేశించిన కొద్ది సమయమది. 'గదిలో ఉన్నప్పుడే నా చుట్టూ ఆవరిస్తుంది ఏకాంతం/ గడప దాటితే నా వ్యక్తిత్వం జనాక్రాంతమ'ని సినారె అనడంలో సైతం ధ్వనించేది నిజ హృదయ భావనే! పెద్దా చిన్నా కలసి ఉన్న అప్పటి ఉమ్మడి కుటుంబాలకే కాదు 'మనమిద్దరం... మనకొక్కరు' అనుకుంటున్న ఇప్పటి చిన్నపాటి సంసారాల వరకూ పలువురిది ఏకాంత చింతన. ఈ యాంత్రిక యుగంలో కాలప్రవాహ గమనంలో కాస్తంత శాంతీ విశ్రాంతీ అందించేది అదొక్కటే కదా!
'ఏకాంతాన్ని ఇష్టపడదామ'ంటాడు రచయిత డక్స్‌బరీ. ఆ విధంగా మనం ఉండకపోతే, ఎంతోమంది ఇష్టపడే ఏకాంతాన్ని మనమే భగ్నం చేసినవాళ్లమవుతామనీ ఆయన హెచ్చరిక. 'శ్రుతులభ్యాసము చేసి, శాస్త్ర గరిమల్ శోధించి, తత్త్వంబులన్ మది నూహించి' వాసి పొందినవారూ 'చిత్తస్థిర సౌఖ్యముల్ తెలియరెందు'కన్నది ధూర్జటిలో రేకెత్తిన సందేహం. 'ఆత్మబోధను మించిన అభ్యుదయం లేద'న్న వివేక చూడామణిని స్మరించుకున్నా కూడా ఏకాంత ప్రాముఖ్యత ఇట్టే అవగతమవుతుంది. ఏకాంతానికీ మౌనానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుసుకోవడమూ ముఖ్యమే. మౌనమంటే మాటలతో కానీ సంజ్ఞలతో కానీ ఏ విధంగానూ భావవ్యక్తీకరణ చేయకపోవడం. నిత్య పరిభ్రమణంలో అనేకానేక అనుభవాల్ని పొందే ఎవ్వరైనా ఎక్కడో ఒక దగ్గర ఎంతోకొంత సమయం ఏకాంత చిత్తులు కాగలిగితే సరికొత్త జవమూ జీవమూ ప్రాప్తిస్తుందని సారాంశం. పరిశీలించి చూడాలే కానీ సోమసుందర్ కలం పలికినట్టు 'పరమాణువుకన్న యెడద/ నిజం సుమా బహు స్వల్పం/ బ్రహ్మాండంకన్న హృదయ/మనవరతం మహత్తరం'. లేడికి లేచిందే పరుగన్నట్టు క్షణం తీరిక లేకుండా గడిపే యువతకీ ఏకాంతత్వమే ఉత్తమ ఫలదాయకమని సామాజిక పరిశీలకుల విశ్లేషణలు ఇప్పుడే వెల్లడించాయి. ఆ రీత్యా చూసినపుడు ఎవరికైనా ఎన్నడైనా ఏకాంతమే ఆత్మబంధువు అంటే కాదనేదెవరు?
(07:10:2012, ఈనాడు)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home