అమ్మలకు వందనం
విస్తరించేది సంతానం. కశ్య ప్రజాపతి ఎలాంటి సంతానం కావాలో కోరుకోమ్మన్నప్పుడు అనలతేజులు, దీర్ఘదేహులు వేలమంది కావాలని కద్రువ కోరుకుంటుంది. 'భుజవీర్యవంతులు, సుపుత్రులు ఇద్దరు చాలు' అనుకుంటుంది వినత. తల్లులు రకరకాలుగా ఉండవచ్చు. తల్లి మనసు మాత్రం సృష్టి మొత్తంలో ఒకటే. కుంతికాని, గాంధారిగాని; సునీతకాని, సురుచిగాని మనసారా కోరుకునేది- కన్నబిడ్డలు లోకవంద్యులు కావాలనే. కాయలు కాస్తేనే చెట్టుకు విలువ. కడుపు పండితేనే స్త్రీ జన్మకు సార్ధకత. గర్భాన్నుంచి బిడ్డ రావడం, 'అమ్మా' అని పిలవడం తల్లికి ఎంత అసమానమైన ఆనందాన్నిస్తుందో నోరి నరసింహశాస్త్రి 'తల్లి' ఖండికలో గుండెలు హత్తుకునేలా చెబుతారు. కుటుంబం ఒక వృక్షంలా ఎదిగి అనుబంధాలు కొమ్మలుగా సాగి ఇల్లు రంగురంగుల పూలు పూసే నందనంగా మారాలంటే తల్లివేళ్లు నిరంతరం భూగర్భంతో పోరాడాల్సిందే. అమ్మ కావడం ఒక అనిర్వచనీయ అనుభవం. 'ఈ సృష్టి ఎంతమంది తల్లుల అనంతానంద అనుభవాల సంచికో!' అంటారు చలం. బిడ్డ నోట్లో నానే ప్రతి అన్నం మెతుకులోను వూరే రసం అమ్మ వాత్సల్యమే. పత్రమో, ఫలమో, పుష్పమో భక్తితో సమర్పిస్తేనే భగవంతుడైనా అభయమిచ్చేది. ఏ పూజాదికాలు లేకుండానే బిడ్డకు అయాచితంగా లభించే వరం తల్లి. 'ఉపవసించి యుపాసించు యోగిజనుల/ కనులబడునేమొ దేవుండు కాని తాన/ ఉపవసించి యుపాసించినెపుడు మనల/ కరుణ, నిండారగాంచును కన్నతల్లి' అంటారో కవి. కన్నతల్లి త్యాగానికి అంతకన్నా గొప్ప నిర్వచనం ఉంటుందా?
లోపలి పేగుబంధం ఎదలో మెదిలే మమతానుబంధాన్ని చూపించే పాంచభౌతిక సుందర రూపానికి సృష్టికర్త కావాలని కోరుకోని తల్లి లోకంలో ఉండదు. జనన మరణాలకు పూర్వం/ చల్లని పరమానంద జలధిలో చిరుచేపగా తిరిగే జీవిని వలవేసి తన గర్భసంచిలో దాచుకునే జాలరి- తల్లి. పున్నమి వెన్నెలలాంటి తెలినవ్వుల తేనెసోనల్ని అవిరళంగా కురిపించి బిడ్డకు అమృతస్నానం చేయించాలని ఉవ్విళ్లూరకపోతే తల్లి తల్లేకాదు. రాత్రినుంచి నిద్రను, పగటినుంచి మెలకువను, గూళ్లల్లో తలెత్తుతున్న పక్షిపిల్లల లేత నోళ్లనుంచి ఇంత ఆకలిని తెచ్చి లోలోపల కదిలే ప్రాణిని తీర్చిదిద్దాలన్న తపన- పెళ్ళి అయిన క్షణంనుంచే కాబోయే తల్లిని కుదురుగా ఉండనీయదు. తల్లీబిడ్డల బంధం ఆగర్భ సంబంధం. ఒక కవయిత్రి 'మాతృ హృదయం'లో ఆవిష్కరించినట్లు 'కానరాని శిల్పి లోన జేరి/ రాత్రి పవళులయందు విశ్రాంతి లేక/ ఎట్లు సృష్టించుచుండెనో యేమొ!' అన్న అనుమానం పెనుభూతంలా వేధిస్తుంది. అయినా ఆ ప్రసవ వేదనను సృష్టిప్రసాదంగా ఇష్టపడి భరిస్తుంది భూమాత అంత సహనంతో ప్రేమమూర్తి తల్లి. బిడ్డ భూమ్మీద పడగానే ఆ కష్టాల పర్వం తల్లి గర్వంగా మారిపోతుంది. ఆధునిక కవి మాటల్లో 'చనుబాలు ఇవ్వడం వేరు, తన'పాలు' పంచీయడం వేరు. గర్భాన్ని ఇవ్వడం వేరు. కడుపు చీల్చి ఇవ్వడం వేరు'. మాతృత్వం వరమో శాపమో తేల్చి చెప్పటమంటే- కత్తి అంచుమీదనుంచి సుతారంగా గాయపడకుండా నడవటమే అంటారు స్త్రీవాది ఓల్గా. అమ్మకావడం స్త్రీకి మాత్రమే దక్కే వరం. అమ్మగా పిలిపించుకోలేకపోవడం స్త్రీత్వానికి పెద్ద శాపం. ఒకరికి పుట్టుకతో గర్భసంచి లేదు. మరొకరికి క్యాన్సర్ కారణంగా గర్భసంచి తొలగించారు. అమ్మతనంలోని కమ్మదనాన్ని అనుభవించాలని తపనపడుతున్న ఆ బిడ్డలకు తల్లులే తమ గర్భసంచిని దానం చేశారు. స్వీడన్‌లో తల్లినుంచి కుమార్తెకు ప్రపంచంలోనే తొలిసారిగా జరిగిన ఈ గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడం తల్లులు కావాలనుకునే బంగారు తల్లులకు శుభవార్తే. గోతెన్‌బర్గ్‌కి చెందిన ఓ విశ్వవిద్యాలయ వైద్యులు 13ఏళ్లుగా చేస్తున్న గర్భసంచి మార్పిడి పరిశోధనలు సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిద్దాం.
(30:09:2012, ఈనాడు)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home