1101- శ్రీరామ నామాలు శతకోటి
' రామ' రెండే అక్షరాలు... కానీ ఎంత సాహిత్యం! 'రామ' అనే శబ్దాన్ని తిరగేసి పలికినా అక్షర జ్ఞానం లేని ఆటవికుడు ఆదికవిగా మారాడు! విశ్వానికి తొలి కావ్యాన్ని ప్రసాదించాడు. అది మొదలు ఎన్నో భాషల్లో ఎన్నో కావ్యాలు. పద్యాలుగా, పదాలుగా, పాటలుగా పల్లవించాయి. రామనామ గానామృతభాండాన్ని తరతరాలకూ తరగని సంపదగా అందిస్తున్నాయి. తెలుగు చలన చిత్రాల్లో సైతం రాముడి పాటలకు రత్నాల సింహాసనం మీద పట్టాభిషేకం జరిగింది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా 'పాలు మీగడల కన్న పంచదార చిలకల కన్న' ఎంతో రుచికరమైన కొన్ని పాటల్ని తీర్థప్రసాదాల్లా కళ్లకద్దుకొందాం...
రాముడి పాటలు అనగానే ఒక తరంవారికి వెంటనే గుర్తుకొచ్చే కవి సీనియర్ సముద్రాల. వాహిని వారి 'దేవత'లో 'రామ భజనే మోదజనకమురా' అని శ్రీరాముడిపై తొలిసారిగా రాసిన సముద్రాల... ఆ తరవాత 'భక్త పోతన'లో 'సర్వమంగళ నామా రామా...' లాంటి పాటలతో భజన గీతాల సంప్రదాయానికి సరికొత్త ఒరవడిని సృష్టించారు. 'భూకైలాస్'లో శ్రీరామచంద్రుడి అవతార భవిష్యద్దర్శనం చేస్తూ ఆయన రాసిన 'రాముని అవతారం...' పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. 'లవకుశ', 'వాల్మీకి' చిత్రాల్లో సముద్రాల వారి రామకథా గీతాలు ఆపాత మధురాలు. వారి చిట్టచివరి సినిమా పాట సైతం రామాయణ గీతమే కావడం విశేషం. అది... 'శ్రీరామకథ'లోని 'రామకథా... శ్రీరామ కథా...' గీతం.
సీనియర్ సముద్రాల కలం వారసుడు జూనియర్ సముద్రాల కూడా తన రామభక్తిని అక్షరాల్లో చూపించారు. ఆయన 'శాంతినివాసం' చిత్రం కోసం 'శ్రీరఘురాం జయ రఘురాం...', 'జయసింహ'లో 'జయ జయ శ్రీరామా రఘువరా...' గీతాలు రాశారు.
పదములే చాలు:
నీలమేఘ శ్యాముడిపై రాయడంలో దేవులపల్లి కృష్ణశాస్త్రిది మరో శైలి. భక్తీ, కరుణ, పరిపూర్ణ శరణాగతి, భావుకత రంగరించి దేవులపల్లి హృదయాల్ని తాకేలా రాశారు. 'ఏమి రామ కథ శబరీ...' (భక్త శబరి), 'వూరికే కొలను నీరు...' (సంపూర్ణ రామాయణం), 'పదములే చాలు రామా' (బంగారు పంజరం), 'ఈ గంగకెంత గుబులో' (శ్రీరామ పట్టాభిషేకం) లాంటి ఆణిముత్యాలతో ఆయన గీతార్చన చేశారు. రాముడి పాటల అల్లికలో ఆరుద్రది విశిష్ట ముద్ర అని చెప్పాలి. తిలక్, బాపు-రమణల చిత్రాల్లో ఆయన కలం నుంచి జాలువారిన రాముడి పాటలు సాహితీ విలువలతో వాసికెక్కాయి. 'అశోక వనమున సీతా...' (అత్తా ఒకింటి కోడలే), 'అందాలా రాముడు... ఇందీవర శ్యాముడు' (ఉయ్యాల జంపాల), 'పలుకే బంగారమాయెరా..' (అందాల రాముడు), 'శ్రీరామ జయరామ సీతారామ' (ముత్యాల ముగ్గు), 'రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా' (గోరంత దీపం), 'శ్రీకరమౌ శ్రీరామ నామం' (శ్రీరామాంజనేయ యుద్ధం) లాంటి పాటలు ఆయనవే. ఇక ఆరుద్ర రాసిన మరో ఆణిముత్యంలాంటి రామ గీతం 'మీనా' చిత్రంలో ఉంది. అదే... 'శ్రీరామ నామాలు శతకోటి'. ఈ గీతం నేటికీ జనాదరణ పొందుతూనే ఉంది.
మా వూరి దేవుడు:
మన దేశంలో రాములవారి గుడి లేని వూరు ఉండదంటారు. కాబట్టే మన దర్శకులు అవకాశం వచ్చినప్పుడల్లా రామాలయాన్నీ, స్వామి విగ్రహాల్నీ తమ కథలో భాగం చేసుకొంటారు. అందుకు తగ్గ విధంగానే సాహిత్య విలువలున్న గీతాలూ రాయించుకొంటారు. ఆ పాట రాసే అవకాశం వచ్చినప్పుడల్లా మన కవులు భక్తి పారవశ్యంతో కలాన్ని పరుగులు తీయించారు. దాశరథి - 'రాముని రూపమే' (పెళ్లికూతురు), 'జగదభిరామా రఘుకులసోమా' (రామాలయం); సి.నారాయణరెడ్డి - 'మముబ్రోవమని చెప్పవే..' (అందాల రాముడు), శ్రీశ్రీ - 'శ్రీనగజాతనయం' (వాగ్ధానంలో హరికథ), కొసరాజు - 'శ్రీరామ నీ నామమెంతో రుచిరా' (ఇద్దరుమిత్రులు), 'రామయ తండ్రి...' (సంపూర్ణ రామాయణం); వేటూరి - 'మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు' (పంతులమ్మ), 'మా వూరి దేవుడు అందాల రాముడు' (అల్లుడా మజాకా); కులశేఖర్ - 'కోదండ రాముణ్ని చూడు...' (శీను వాసంతి లక్ష్మి) ఆ భక్తి గీతాల జాబితాలోనివే. ఇటీవల వచ్చిన 'శ్రీరామరాజ్యం'లో జొన్నవిత్తుల రాసిన గీతాలు, 'శ్రీరామదాసు'లో కీరవాణి స్వరపరచిన రామదాసు గీతాలను నవతరం శ్రోతలు విని తన్మయులయ్యారు.
- ఓలేటి శోభ
(ఈనాడు , సినిమా ,19:04:2013)
______________________________________
Labels: Cinima/ Telugu, Religion/telugu, Telugu literature, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home