My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, April 20, 2013

1103- ఆత్మీయ ఆలింగనం


మనిషి మనసు పలు రాగభావాల విపంచి. సరసంగా మీటినకొద్దీ సురాగాలు కొనసాగి 'మధువనిలా రసధునిలా' అనురాగ ప్రకంపనలొస్తాయి. వాటి సుతారపు తాకిడితో ఎదుటి వ్యక్తికి అవ్యక్త అనుభూతి, బిగి కౌగిలిలోకి చేరి ఆసాంతమూ కరిగిపోవాలన్నంత ఉల్లాస స్థితి! అసలీ ప్రపంచమే ప్రేమానందమయం అనుకుంటే- ప్రతి మాటా మధురాక్షరి, ప్రతి కదలికా రసరమ్య సుధా ఝరి. అంతమాత్రాన అది కేవలం ఆలూమగల ప్రేమో, ప్రేయసీప్రియుల ప్రణయమో కానక్కర్లేదు. తల్లీ తండ్రీ గురువూ బంధువూ మిత్రుడూ- వారూ వీరని కాదు, పెద్దలూ పిన్నలూ అందరినీ సర్వకాలాల్లోనూ కట్టిపడేసేది ప్రేమపాశమే. ప్రేమే మూలమన్న సూత్రానికి అంతా కట్టుబడి ఉండాలే కానీ, కవి కరుణశ్రీ భావించినట్టు 'యుగయుగాల మానవజాతికి ఉజ్జీవనం/ జగజగాల చైతన్యజ్యోతికి సంభావనం' ప్రేమైక భావనే. అదో హృదయ సంబంధీ, బాంధవ్యమే పరమావధిగా కలదీ. వరమై అలరించినా, గానమై మధురిమలు అందించినా బాధ్యత, భద్రత, ధీమా, ఉపశమనం... సమస్తమూ ప్రేమానుభవ సారాంశమే. అంతరంగాల లోతుల్లో వూరే సంతోషాల జల అదే. స్పర్శతోనో పరామర్శతోనో ధారలా పెల్లుబుకడం కూడా దాని పనే! అందుకే రాధకు మాధవుడు 'సరస సంగీత శృంగార చక్రవర్తి/ సకల భువనైక మోహన చారుమూర్తి' అయ్యాడు. అరణ్యవాస తరుణాన, భార్యామణి వూర్మిళ ఉన్న గదిలోకి వెళ్లిన లక్ష్మణుడు ఆమె దరిచేరి లేవనెత్తి అందించిందీ హృదయపూర్వక పరిష్వంగ మాధురినే! 'ఏల ఈ లీల శంక వహింపవలయు/ భయాందోళనమ్ము నీకేల బాల' అంటూ సమర సమయాన సతీ సులోచనను హత్తుకుని ధీరవచనాలు పలికిన ఇంద్రజిత్తుదీ రాగరంజిత తత్వమే!

మృదువుగా దగ్గరకు తీసుకుని, గాఢంగా గుండెలకు హత్తుకోవడమే కౌగిలింత ప్రత్యేకత. దేవి సరస్వతిని చుంబించిన చతుర్ముఖుడు అటు తరవాత ఆమెను బాహుబంధితురాల్ని చెయ్యడంలోనే ప్రణయ సృష్టి చాతుర్యం దాగుంది. మెట్టినింటికి సాగుతున్న ప్రియ తనయ శకుంతలను చేరదీసి తలమీద కరముంచి 'చిరాయువ'ని దీవించిన కణ్వమునిదీ ప్రేమపూరిత చింతన. మహర్షి గౌతముడు ఒక యువకుడి సత్యసంధతను మెచ్చుకుని కౌగిలించుకోవడంలోనూ వెల్లడైంది ప్రేమాభినందనే. పాపపు సొత్తు తీరు తెలిసిన చోరుడు అపరాధభావంతో తన పాదాలమీద వాలితే, అక్కున చేర్చుకుని స్వస్థత అందించాడో మునీంద్రుడు. కార్యసిద్ధి కోరుతూ ప్రణమిల్లిన కుమారుడు గరుడుడికి తల్లి వినత దీవెనా కౌగిలింతతోనే. బలరామకృష్ణుల్ని చూసినప్పటి ఆనందాన్ని, చేతులారా ఆలింగనం చేసుకుని మరీ ప్రకటించాడు నందుడు. 'గక్కున కౌగిలించి కరుణ నీపై నుంచి/ ఇక్కువగూడె శ్రీ వేంకటేశుడు నిన్ను' అని అలివేలుమంగను అన్నమయ్య ప్రస్తుతించడం భక్తి ప్రేమతత్వమే. సింహాచలేశ్వరుడి చందనోత్సవ సందర్భాన, భక్తులు కప్ప స్తంభాన్ని కావలించుకోవడమూ కోరికలు నెరవేర్చుకునే కృషే! మాటల్లో చెప్పలేని దయ, ఆప్యాయత, స్నేహం, వాత్సల్యం, ఆదరణ, మరెన్నో గుణగణాలు కౌగిలితో బహిర్గతమవుతాయి. పర్వదినాల్లో అభివాదాలు, ఆకాంక్షలు ప్రత్యక్షమయ్యేది ఒకరినొకరు దరిచేరడం వల్లనే. మురిపాలూ సరసాలూ అలరింపులూ గిలిగింతలూ, వీటితోపాటే అలకలూ కలతలూ ఉలికిపాట్లూ నిట్టూర్పులూ కలవరాలూ కల్లోలాలూ- కౌగిళ్లకు సమయ సందర్భాలు. ఎవరో బోధిస్తే ఎక్కడో నేర్పిస్తే వచ్చేవి కావివి. ప్రకృతి నేర్పే అతి సహజసిద్ధ జీవిత పాఠాలే ఇవన్నీ! ఎంతటి వేదననైనా మటుమాయం చేసే ప్రగాఢ శక్తి, నిగూఢ యుక్తి ఉన్నాయిందులో. సినారె ఉదాహరించినట్టు 'చేతులంటూ ఉంటే గభాలున పైకి లేచి/ ఎదిగిన నా మొక్క పుత్రికను గాఢంగా కౌగిలించుకునేదాన్ని- అనుకుంటుంది ధరిత్రి!'

అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు మానాలంటే? ఆ పసికందును గుండెలకు అదుముకుంటుంది తల్లి. పరీక్షలో కృతార్థులైన పిల్లకో పిల్లవాడికో అమ్మానాన్నల కౌగిలింతే మరింత స్ఫూర్తి. క్రీడాకారులకీ అదే విజయాభివాద దర్శిని. అరమరికలు లేని, అనవసర బిడియాలకు తావివ్వని 'దగ్గరితనం' ఎప్పుడూ ఆరోగ్యకరమే. పడుచుజంట కౌగిలి అందచందాల లోగిలి. అందుకే 'కులుకు బింకాలు పొంకాలు దాచి/ కోటి బాహువుల బంధించనీవే' అని జవ్వనితో అంటాడు ఆరుద్ర కథానాయకుడు. ప్రకృతితో గ్రామీణులది 'ఎన్నడూ వీడని కౌగిలి'. రాజస్థాన్‌లోని ఓ పల్లెలో రెండున్నర శతాబ్దాల కిందట చెట్ల కొట్టివేత విచ్చలవిడిగా సాగింది. ప్రాణసమానంగా పెంచుకుంటున్నవాటి ఉసురు తీయొద్దంటూ సిబ్బందిని ఓ తల్లి, ఆమె ముగ్గురు కూతుళ్లు విభిన్నంగా అడ్డుకున్నారు. గొడ్డళ్లు మీద పడకుండా ఆ చెట్లను వాటేసుకున్నారు వాళ్లు! ఫలితంగా అక్కడ ఆ కొట్టివేత ఆగిపోయింది. అనంతరం, పర్యావరణ సంరక్షకుడు సుందర్‌లాల్ బహుగుణ చేపట్టిన ఉద్యమం 'చిప్కో'కి అర్థం 'చెట్లను కౌగిలించుకో' అనే! యువజనుల తొలి కౌగిలి వెచ్చదనం, తొలి ముద్దు తీయదనం అనంతం. 'చెలి చేరే దారులు వెదకాలి/ చలి తీరగా కౌగిలి చేరాలి' అన్నదందుకే ఓ ప్రేమిక గళం. కౌగిలిదో గిలిగింత, అందులో వ్యక్తమయ్యేది నమ్మకమే... అంటున్నారు అమెరికాలోని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రకారులు. ఆత్మీయుల్ని హత్తుకుంటే పెరిగే విశ్వాసం- మన రక్తపోటును అదుపుచేయడంతో పాటు జ్ఞాపక పటిమను పెంచుతుందంటున్నారు. నమ్మకస్తుల్ని వాటేసుకుంటే వూరే హార్మోన్ వారితో అనుబంధాన్ని తప్పక పెంచుతుందని చాటిచెప్పడమూ శుభ సమాచారమే మరి!

(ఈనాడు ,సంపాదకీయం , 03:02:2013)
_________________________________

Labels: , ,

0 Comments:

Post a Comment

<< Home