My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, April 17, 2013

1099- కల్యాణ వైభోగమే...



ఇచ్చిపుచ్చుకొనే రెండు మనసులు మనువుతో ఒక్కటవడం... జీవితం. పువ్వూ తావీ, వాక్కూ అర్థమూ, గీతమూ రాగమూ అన్నట్టు ప్రేమా పెళ్లీ కూడా అవినాభావం. కళల చక్కదనం, కుసుమాల పరిమళం, చందనాల చలవ, తేనెల మాధురి అన్నీ అందులోనే , ఆ పొందులోనే. 'జల్లులై కొల్లకొల్లలై మెల్లమెల్ల/ పెల్లుబికి వెల్లివిరియు మీ యుల్లమెల్ల/ పసుపు పారాణి నూత్న దంపతులు మీరు/ముద్దుగా కాపురము తీర్చిదిద్దుకొనుడు' అని కవి శుభాక్షతలు చల్లారందుకే. ప్రతి మనిషీ ఆస్వాదించి తీరాల్సిన మధుర మనోహర సదానుభూతి ప్రేమ. అంతరంగాన్ని పరిపూర్ణ తరంగితంగా చేసే పరిణయ బంధం అపూర్వ దీప్తి, ఓ అపురూప స్ఫూర్తి. ఆ వలపు తలపుల జడిలో తడిసి ముద్దవని మది ఉండదు, అణువు అణువునా ఆ ప్రణయ మధువును నింపుకోవాలన్న తపనకి అంతూ కనిపించదు. లోలోన నాడుల తీగలపైన సాగే అనురాగాలాపనే ప్రేమంటే. అదే నిండితే పిడికిలంత గుండెలోనూ కడలి హోరు వినిపించి 'మహా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ/ అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ/ నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల' అనిపించకా మానదు. నిధిగా, అనుబంధ వారధిగా నిలిచే ప్రేమభావనతో హృదయానికి కలిగే బాధ్యత, భద్రత, నిబద్ధత, క్రమబద్ధత... చెప్పలేనంత. ఆ కారణంగానే 'ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును/ ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును' అన్న గురజాడ వాణి పరమ రమణీయం, ప్రాతఃకాల స్మరణీయం. ప్రేమానురాగమే సృష్టి రహస్యమని, ఆ ఒక్క వస్తువూ లోపిస్తే లోకమంతా అల్లకల్లోలమేనని అంతా గ్రహించాల్సిందీ అందుకే.

కరుణశ్రీ గళం పలికినట్టు వివాహమంటే- 'బృందారకానంద మందార మకరంద బిందు నిష్యందాల విందు/ రంగారు ముంగారు బంగారు సరసాంత/ రంగాల సత్యనర్తనము'. అదే- వధువూ వరుడూ ద్వంద్వమై జీవన మధురిమ లందుకునే బృందావనారామ సీమ. అందరూ ప్రథమంగా ప్రధానంగా స్మరించాల్సింది సత్య సనాతన దంపతులైన పార్వతీ పరమేశ్వరులనే. తపోముద్రలోని ఆయన తన దరిచేరిన ఆమెని చూడనే చూశాడు. 'మేను పులకరింప వలపులు తొలకరింప' పాణితలాన్ని పట్టుకున్న ఆ భవుడిని 'ముద్దులొలికెడి పగడాల మోవిమీద చిరునవ్వు ముత్యాలు జాలువారుతుండ'గా సుతారంగా వారించిందా దేవేరి. పరిణయ బాంధవ్యాన్ని అంత మిన్నగా పండించుకున్నందునే, వారు ఆదిమూర్తులు. సీతారాముల కల్యాణవేళను తలచుకుంటే 'లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయ/లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి' అయింది. 'ప్రాణసఖీ!' అని సతి వూర్మిళను సంబోధించిన లక్ష్మణుడిలో వ్యక్తమైందీ అనురక్తే. రామలక్ష్మణులతో యుద్ధానికి సంసిద్ధమవుతున్న ఇంద్రజిత్తుకి హితవు పలికింది భార్య సులోచన. 'నిండు చంద్రులు మీరు, వెన్నెలను నేను/ దివ్య భానులు మీరు, పద్మినిని నేను/ మీ పదాబ్జ సన్నిధియే స్వామీ, మదీయ/ జీవనమ్ము సమస్త సంభావనమ్ము' అనడంలో ప్రస్ఫుటమైంది- పతితో ఆమెకున్న గాఢానుబంధమే! మాధవ ప్రియ రాధాదేవిది సరాగ భావనారాధన. నవ్యజీవన దివ్యస్థలిలో విహారానికి రావాలన్న కృష్ణ కోరికను తలదాల్చిన ఆమె భాగ్యనౌకకు కాళింది నదిలో మరి ఎదురేముంటుంది? తనయ శకుంతలను సాగనంపుతూ తండ్రి కణ్వుడు చేసిందీ సతీపతులకు హితబోధే. ఆరాధనా సంపన్నులైన జంటకు 'లోకమొక స్వర్గమగు నవాలోకనమున' అన్నాడాయన. యశోధరా గౌతముల పాణిగ్రహణం నయనపర్వం, నవ నవోన్మేషం. ఆ ఇద్దరిదీ సుధాంశు కలం వెలువరించినట్టు 'హృదయ బంధనం'. బుద్ధుడికి స్వాగతమిచ్చిన రాజనర్తకి ఆమ్రపాలిది సైతం ముగ్ధహృదయం. ఆయన రాకతో ఆమె మానసం సరోవరంలా మారింది, అనిర్వచనీయ భావన సహస్ర పత్ర కమలంలా తేలింది. ఆ లలనామణిలో తాదాత్మ్యం సుకుమార సుగంధంలా ప్రసరించింది, ఆహ్లాదం మకరందంలా పొంగి ప్రవహించింది. ఆశల తోరణాలన్నా, కలల మెరుపులన్నా అవే కదా!

ప్రేమలూ పెళ్లిళ్లూ మహా భాగ్యదాయకాలు. అసలీ జగత్తుకు ప్రేమే ఆద్యంతాలుగా మారినప్పుడు- ఆనందం అర్ణవమవుతుంది, అనురాగం అంబరమవుతుంది. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులని మాత్రమేకాదు. అన్నీ మొత్తంగా కలిపి చూస్తే, నూరేళ్లు. నూరేళ్ల పంటే పెళ్లి.ధూవరులతో పాటు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు, బంధుమిత్రులు, హితులు, సన్నిహితులు అందరినీ ఒకటిగా చేర్చే క్రతువు మనువు. కవిశ్రీ అన్నట్టు 'దంపతి తాంబూలంబులు/ చెంపలు దువ్వుటలు, పూలచెండ్లాటలు, క/వ్వింపులు, వదినల ముక్తా/యింపులు, నెచ్చెలుల హెచ్చరింపులవెన్నో'. కల్యాణపు బొట్టు పెట్టడం, మణిబాసికాన్ని నుదుటన కట్టడం, పారాణిని పాదాలకు పూయడం... ఇవన్నీ కాలక్రమంలో కొన్ని మార్పుచేర్పుల్ని సంతరించుకున్నా పెళ్లికళంటే కళే. పెళ్లి చేసుకోవడంలో, చేయడంలో, చేయించడంలో ఉన్న కళకళలే వేరు.'శ్రీరస్తు శుభమస్తు విజయోస్తు' అంటూ 'జయ మంగళం నిత్య శుభమంగళం' అనుకుంటూ ముహూర్తాలు నిర్ణయించుకున్నప్పుడు, వేదికమీద కనిపించే ప్రతి జంటా కన్నుల పంట. 'మాధవీ విలాసంలా మధువసంత హాసంలా/ సుధామధుర సుమసుగంధ సుందర సుస్నేహాంకిత'లా వివాహవేడుకను అభివర్ణించనూ వచ్చు.  ఈ సంతోషకర తరుణంలో 'మీరిద్దరు జంటయై, పులకరించిన పెద్దల నోము పంటయై' కలకాలం వర్థిల్లాలని ఆశీస్సుమాలందిస్తే సరి.



(ఈనాడు , సంపాదకీయం , 10:02:2013) 
__________________________________ 

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home