1096- జలాభివందనం
సకల భువన పావని మన భరతావని. గంగా తరంగాలు పొంగి పొరలే ఈ నేల జన హృదయాంతరంగ తరంగిణి. గరికిపాటివారన్నట్టు ఇక్కడ 'నీటిబొట్టున కేదియు సాటిరాదు'. సిరులు నిండించుకుంటూ, కలలు పండించుకుంటూ సాగే గంగానదీ జలప్రవాహంలోని ఒక్కో నీటిచుక్కా భారతీయత పాలిట ఆశాదీపిక. ఈ నదీమతల్లితో పాటు యమునా సరస్వతుల సంగమ స్థలమైన త్రివేణికి చేరి 'ఒక్క చుక్కను తలమీద చల్లుకున్నా చాలు' అనుకునేవారు ఎందరెందరో. వీరంతా అనేకానేక ప్రాంతాలనుంచి వందల్లో వేలల్లో లక్షల్లో... అన్నీ కలిపి కోట్ల సంఖ్యలో ఫిబ్రవరి నెలలో అలహాబాద్‌కి బారులు తీరడమే మహా కుంభమేళా. ఏటా ఎన్ని పర్వదినోత్సవాలున్నా, ప్రతీ పన్నెండేళ్లకీ పుష్కరాలొస్తున్నా, నూట నలభైనాలుగేళ్ల బహు సుదీర్ఘకాలం తరవాత సాగిన భక్తజన ప్రభంజన విశ్వవిఖ్యాత మేళా ఇదే. 'అడుగులో అడుగులో అకలంక మంకమై/ అడుగు వేసినదయ్య అలల రాణి/ నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్ల తరగ/ పరుగులో పరుగులో పరమార్ద్ర భావమై పరుగెత్తి వచ్చెనా నురుగు నవ్వు' అనుకున్నప్పుడు సంగమ స్థలిలో పుణ్యస్నానం అపూర్వమూ అపురూపమే కాదు, మహా విశేషం మహా విశిష్టం కూడా. కుంభరాశిలోకి దినకరుడు అడుగిడిన సందర్భంలో రోజుల పర్యంతం కొనసాగిన ఈ స్నాన పరంపర భిన్న విధానాల విభిన్న సంప్రదాయాల ఏకైక సమ్మేళనం. నాగరికత, ధార్మికత, సంస్కృతుల మేలు కలయికగా భాసించిన ఇది అన్ని వయసులవారికీ ఉమ్మడి వేడుక.
'అఖిలాండకోటి బ్రహ్మాండనాథు డంతరంగమున/ నెలకొనియుండగ నిక గావలసినదేమి?' అన్న త్యాగయ్యకు సమాధానమా అన్నట్టు సాగుతుంటాయి మేళా స్నానాదికాలు. పోయిన నెల పదో తేదీన మహాశివరాత్రి తరుణంలోనూ ఎటుచూసినా ఎక్కడ విన్నా ఇక శివానంద లహరులే. ఎక్కడైనా ఎప్పుడైనా నదులే జాతి సజీవతకు సూచికలు, సుగతికీ త్వరితగతి ప్రగతికీ వీచికలు. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే పండేవి ఒక్క బంగారు పంటలేనా? ప్రజలందరి కలలూ కోరికలూ పండి... కవి అద్దేపల్లి అనుభవానికి వచ్చినట్టు 'నీళ్లు దోసిట్లోకి తీసుకుంటే అందులో సంస్కృతీ నిలబడుతుంది, గొంతులో పోసుకున్న నీళ్లతోపాటే చరిత్రా లోనికి ప్రవహిస్తుంది'. అదే రీతిన గంగమ్మను తలచుకున్నా 'తీర్థగమన ఫలంబెల్ల పుణ్యంబులకు విశేష'మన్న నన్నయకవి మాటా స్మృతిపథాన మెరవాలి. ఆ జలాల శుచి, శుభ్రత, రంగు, రుచి, వాసనలన్నీ ఇంపుగా ఉన్నప్పుడే- అక్కడి స్థితి సజావుగా ఉన్నట్టు. ఉత్తుంగ తరంగాల గంగకు ముకుళిత హస్తాలతో భక్తి నమస్కారాలు చేయాలే కానీ, వాటి స్థానే భయం కమ్ముకోకూడదు. 'అయ్యయొ! ముక్కు మూసుకొనుమయ్య!' అనేంతగా వాతావరణం ఉందంటే, అది కాలుష్య హారిణి కాదు- అక్షరాలా కాలుష్యకారిణే. వేదాలూ ఇతిహాసాల్లో చోటుచేసుకున్న నదీసంపదకు వర్తమానంలో ఎదురవుతున్న విపత్కర స్థితి అతి దుర్భరం. మన ఆశల ప్రశ్నలకు జవాబు కావాల్సిన కాలం మన ఆశయాలకే పెద్ద సవాలుగా మారుతుండటం- ఆరుద్ర చెప్పినట్టు 'కష్టాల కడగండ్ల నడుమ మొత్తంగా ఇరుక్కుపోవడం!' మామూలు రోజుల్లో పవిత్రత నిలపాల్సిన నదీస్నానాలు, ఘట్టాలు మహామేళా వంటి కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఉండితీరాలి.
దేశవిదేశాలవారు సందర్శించిన కుంభమేళా స్థలి ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 17,ఆదివారం రథసప్తమి, 18 సోమవారం భీష్మాష్టమి కూడా ప్రధాన పుణ్యస్నానాల రోజులే. జనసందోహం పోటెత్తుండటంతో అసలు రూపురేఖలే మారిపోయే ఆ సంగమ ప్రదేశాన్ని పరిపూర్ణ అధ్యయనం చేసింది హార్వర్డ్ బృందం. 'చెదరిపోవునో శేషుని శిరములు/ బెదరిపోవునో దిక్కుంజరములు/ అదరిపోవునో అవనీతలమే' అన్నంతగా అలహాబాద్ నగర జీవనాన్ని చట్రంలో బందించిన వైనాన్ని పరిశీలించారా సభ్యులు. జలమయం, జనమయం... రెండింటినీ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండటం 'ఏయే తీరము లూరడిల్లినవి తల్లీ! నీదు పొత్తిళ్లలో?/ ఏయే సారము లంతరించినవి మల్లీ! నీవు సాక్ష్యమ్ముగా?' అన్న ప్రశ్నల్ని వారిముందు ఉండడమూ సహజమే. పర్యావరణాన్నే కాక ప్రజారోగ్యం, సాంకేతిక సమాచార రంగాలనూ విశేషంగా ప్రభావితం చేసిన ఈ మేళా తదుపరి ఏర్పాటు 'కుంభమేళా' పేరిట ఉజ్జయిని కేంద్రంగా ఇక మళ్ళీ రెండేళ్లకే. అటు తరవాత క్రమంలో పూర్ణ కుంభమేళా నిర్వహణ ఉంటుంది. పేర్లు ఏవైనా, నిర్వహణ స్థలాలు ఎక్కడున్నా- అడివి బాపిరాజు ఆనాడే దర్శించినట్టు 'వడులలో గర్వాన/ నడలలో సుడులలో/ పరవళ్లు తొక్కుతూ ప్రవహించి' వస్తుంటుంది నదీమ తల్లి. ఆ జలదేవత ఒడిలో స్నానం ఎప్పుడైనా ఎక్కడైనా పరమ పవిత్రం, బహు ఆహ్లాదభరితం. ఇప్పుడు గంగమ్మతల్లినీ 'రసమయివై సదా హృదయ రంజనివై/ యనురాగ స్వర్ణ కుసుమిత వల్లివై, మధుర కోమల హాస విలాస రేఖవై' రమ్మని ఆహ్వానిస్తూనే ఎదురెళ్లడం చలచల్లని పాలవెల్లిలో జాబిల్లిని చూసినంత మధురం. మల్లెమొగ్గలను మెలమెల్లగా చల్లినంత మనోహరం కూడా. భక్తిశ్రద్ధలతో ఆ జననికి చేసే అభివందనం జనజీవితాల్లో విరిచందనం. 'జననీ! నీ అర్చనలు సర్వోదయశ్రీలు/ తల్లీ! నీ దీవనలు ధర్మవిజయశ్రీలు' అంటూ ముందుకు సాగడమే అందరి కర్తవ్యం.
(ఈనాడు ,సంపాదకీయం , 17:02:2013)
____________________________________
Labels: Amazing, Events, India/Telugu, Life/telugu, Management, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home