1108- పుస్తక ప్రపంచం
మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అధికం. మనువు మాట ప్రకారం, ఆ తెలియని వాటిని తెలియజెప్పేవి- శ్రుతి, స్మృతి, సిద్ధుల దివ్యదృష్టి, సజ్జనుల సాంగత్యం. గురువ్యవస్థ, పర్యటన, పరిశీలన, స్వయంచేతన- వాటిని సాధించే మార్గాలు. గురువులు అందరికీ దొరకరు. దేశాటనా, పరిశోధనా అందరికీ అందుబాటులో ఉండేవి కావు. తల బోడి అయిన పిదప కాని దొరకని దువ్వెన- అనుభవం. మిగిలింది స్వయంకృషి. దానికి నెలవైనవే పుస్తకాలు.
'తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం బోధిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే' అనేవారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నిజం- పుస్తకాల నేస్తుడికి ఒంటరితనం అంటు సోకదు. 'అక్షర చెలిమిని మించిన కలిమి సృష్టిలో మరేదీ లే'దని అక్బర్ పాదుషా భావన. స్వయంగా అక్షరాస్యుడు కాకపోయినా విద్వాంసులతో నిత్య సంపర్కమే ఆ పాదుషాలోని సంస్కారానికి సుగంధాలు అద్దింది. 'వాగ్భూషణం భూషణం' అని కదా ధూర్జటికవి పద్యం! 'రాజుకు స్వదేశంలోనే గుర్తింపైతే... విద్వాంసుడికి సర్వే సర్వత్రా సమ్మానమే' అన్నదీ ఆ కవి సుభాషితమే. దొంగల భయం ఎరగని ఈ సొత్తు పదిమందికీ పంచినకొద్దీ పెరిగేదే కాని తరిగేది కాదు. మనిషికి జంతువుకు మధ్యనే కాదు- మనిషికీ మనీషికీ మధ్య తేడా కూడా చదువే! జ్ఞానాన్ని సుగంధంతో పోల్చిన కాళిదాసు పుస్తకాన్ని 'ప్రసూనం' అంటాడు. పూవులాగే పుస్తకమూ ఏ స్వలాభాపేక్షా లేకుండా నలుదిక్కులా పరిమళాలు వెదజల్లే సద్గుణం కలిగినది.
'శ్రావ్యంబై రసవంతమై మధురమై సర్వాంగ సంపన్నమై/ నవ్యంబై పరిణామ రూపగతులన్ రంజిల్లుచున్ భావముల్/ సువ్యక్తం బొనరించున్ జగమునన్ శోభిల్లు వాక్కు' అన్న గిడుగు సీతాపతి 'శారదా శతకం' పద్యంలోని ప్రత్యక్షరమూ పరమ సత్యమే. ఆ వాగ్భూషణం అమరి ఉండే మధుర మంజుల మంజూషం పుస్తకం. పుస్తక ధారిణి అయిన పలుకు తల్లిని సంభావించుకునే సుదినం 'ప్రపంచ పుస్తక దినం'.
చదువు సంధ్యల సంగతులు సృష్టి ప్రారంభం కన్నా ముందున్నవే. విధాత మగతావస్థలో ఉండగా జలరాసి సోమకాసుర రాకాసి చేతిలో జారిపడ్డ వేదవాంగ్మయాన్ని మీనావతారుడు ఉద్ధరించిన కథ భాగవతంలో ఉంది. వేదవిజ్ఞానం సమస్తం గ్రంథరూపంలో నిక్షిప్తమై ఉందనేగా దాని అర్థం! తొలి దేవుడు వినాయకుడు వ్యాసులవారి భారతానికి తొలి రాయసగాడు కూడా. 'చేతికి గంటము వస్తే/ కోతికి శివమెత్తినట్లు కొందరు మంత్రుల్/ నీతి ఎరుంగక బిగుతురు/ సీతారామాభిరామ సింగయరామా' అన్న చమత్కార చాటువే చెబుతుంది రాత ప్రాముఖ్యాన్ని. దశరథుడి పాలనలో నిరక్షరాస్యులనేవారు అసలు లేనేలేరని రామాయణం ఉవాచ. ఓ బౌద్ధగ్రంథంలో చర్మాలపై రాయడాన్ని గురించిన ప్రస్తావన ఉంది. 'చీకటి సిరా పూసిన ఆకాశమనే చర్యంపైని చంద్రమ అనే సుద్దముక్కతో విధాత చేస్తున్న గణితంలో చివరికి సర్వం తారా రూపాలైన సున్నాలే ఫలితాలవుతున్నాయ'ని సుబంధ కవి 'వాసవదత్త'లో బహు చక్కని రాత సామ్యాన్ని చెప్పుకొస్తాడు. తాటాకును, భూర్జ పత్రాన్ని జ్ఞానచిహ్నంగా భావించారు మన పూర్వీకులు. జ్ఞానదాత బ్రహ్మ హస్తాన తాళపత్ర గ్రంథాలున్నట్లు చెక్కివున్న బాదామి, బహొళె శిల్పాలు ఎన్నో తవ్వకాల్లో బయటపడ్డాయి. బుద్ధుడి జాతక కథలో కర్ర పుస్తకాల ప్రస్తావన కనిపిస్తుంది. పాటీలనే ఒక రకమైన పత్రాలపై రాయడాన్ని శ్రీనాథుడూ శృంగార నైషధంలో బహు విశదంగా వర్ణిస్తాడు. శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడనే కవి పండితుడు తన విశ్వకథా సంపుటి 'బృహత్కథ'కు తగిన ఆదరణ కరవైందన్న వేదనతో అగ్గిపాలు చేసిన కథ అందరికీ తెలిసిందే. ప్రతి పుస్తకానికీ భాగ్యా భాగ్యాలుంటాయని ఓ లాటిన్ నానుడి. 'పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె/ యందు నిరుపేద కాపునై యుందు గాని/ పుస్తకములు లేనట్టి భూరిసౌధ/ మందు చక్రవర్తిగ నుండ నభిలషింప' అన్న విశ్వాసం ప్రస్తుతం తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. ఇది ఎంతైనా ఆనందించదగ్గ సంగతే.
నిప్పు తరవాత మానవుడు ఆవిష్కరించిన అత్యంత సమర్థమైన సాంకేతిక వింత- పుస్తకమే. మార్క్ ట్వైన్ మహాశయుడు అన్నట్లు- మంచి మిత్రులు, మంచి పుస్తకాలు, మంచి నిద్ర... వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది? పుస్తకమంటే లక్ష అక్షరాలు, కిలో కాయితాలు, చిటికెడు సిరా మాత్రమేనా? నవరస తరంగాల నురగలపై తేలియాడే కాగితపు పడవ. అది జేబులో పట్టేసే పూలతోట- కొందరు సౌందర్యారాధకులకు. తెలియని లోకాలకు ఎగరేసుకుపోయే మాయా తివాచీ- మరికొందరు వూహా ప్రేమికులకు. తులసి దళమంత పవిత్రం మరికొంతమంది గ్రంథప్రియులకు. కలతలను తొలగించేది, పాపాలను పారదోలేది, మాంద్యానికి మందులా పనిచేసేది, దుఃఖాలను మరిపించేది పుస్తకమే.
'కల్పతరువు, గురువు, పురాతన, ప్రస్తుత, భవిష్యత్కాల సంపద, కరదీపిక, ఆశారేఖా పుస్తకమే' అంటారు మహాత్మాగాంధీ. అది అక్షరసత్యం. సెర్వాంటిస్, షేక్‌స్పియర్, గార్సిలాసో డి లావేగా లాంటి విశ్వవిఖ్యాత సాహిత్యవేత్తల జన్మదినం ఏప్రిల్ 23.
ఈ సుదినాన్ని యునెస్కో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగం 'ప్రపంచ పుస్తక దినం'గా సంస్మరించుకొమ్మని కోరడం అన్నివిధాలా సముచితం.
కేవలం అక్షరవేత్తలను సన్మానించుకునే ఉత్తమ సంప్రదాయం మాత్రమే కాదు... కాపీ హక్కుల రక్షణ చట్టాలనూ ప్రపంచవ్యాప్తంగా పునస్సమీక్షించుకునే సుదినం కూడా ఈ సుముహూర్తానే. పుస్తకాభిమానులు అందరూ ఆనందించదగ్గ సందర్భమిది. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అక్షర ప్రియులు ఎందరో... అందరికీ అభివందనాలు!
(ఈనాడు ,సంపాదకీయం , 21:04:2013)
________________________________________
Labels: Books, Events, Liesure/Telugu, Life/telugu, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home