1114- మనిషి పరిస్థితుల్ని ఓడించాలి!
'పరిస్థితులు మనిషిని ఓడించకూడదు. మనిషి పరిస్థితుల్ని ఓడించాలి' అంటాడు వేదాంతి ఎలీనా మాక్స్‌వెల్. మన ఓటమి, వైఫల్యాలకు మనమే బాధ్యులం. నెల్సన్ అనే కవి 'ఇన్ మై సైడ్‌వాక్' అనే కవితలో వ్యక్తుల మనస్తత్వాన్ని చక్కగా వర్ణిస్తాడు. ఒకతను నడుస్తూ నడుస్తూ దారిలో ఉన్న గోతిలో పడతాడు. ఇది తన తప్పు కాదంటాడు. మరుసటిరోజు, మూడోరోజూ అదే గోతిలో పడతాడు. అప్పుడతడు 'ఇదీ నా తప్పు కాదు. నాకు అలవాటైంది' అంటాడు. మనిషి ఏవిధంగా తన తప్పు కప్పిపుచ్చుకుంటాడో చెబుతాడు నెల్సన్.
మన సమస్యకు వేరొకర్ని బాధ్యుల్ని చేయడాన్ని సైకాలజీలో 'ప్రొజెక్షన్' అంటారు. పరీక్షలో విఫలమైన విద్యార్థి 'టీచర్ నాపై కక్ష కట్టింది. నేను బాగా రాసినా కావాలనే ఫెయిల్ చేసింది' అంటాడు. బాధ్యతల నుంచి పారిపోయి ఊహల్లో జీవించడాన్ని 'ఎస్కేపిజం' అంటారు. . ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం, ప్రణాళిక, తెలివితేటలు... అనే టూల్స్ (నైపుణ్యాలు) ఉంటాయి. అవి మనసనే టూల్‌కిట్‌లో భద్రంగా ఉంటాయి. వాటిని ఒక్కసారి తెరవండి. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పలాయన మంత్రం ఆపి, బాధల్ని ఎదిరిస్తూ, పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటే జీవితాన్ని గెలుస్తారు.
డా. నిరంజన్ రెడ్డి, క్లినికల్ సైకాలజిస్ట్
(మనలో మనం , ఈతరం ,ఈనాడు 27:04:2013)
___________________________________
Labels: Life/telugu, Management, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home