1141- అలకలూ కలయికలూ
రెండు మనసుల్నీ ఒకటిగా ముడివేస్తుంది దాంపత్యబంధం. ఉల్లాసం కలిగించే జీవన గీతాలైనా, కలవరపరచే మరే స్మృతులైనా ఆ అనుభూతులు ఇద్దరివీ. ప్రేమానురాగాలు పల్లవించిన ప్రతిసారీ విరివానల ధార, ఏదైనా అలజడి కదిలించి వెళితే మాత్రం పరితాపాల పరంపర. ధర్మమూర్తి రఘురాముడితో సమరం తగదని పతి మేఘనాథుడికి హితవు పలికింది సులోచన. వీరావేశంతో కదనభూమికి చేరి అసువులుబాసిన అతణ్ని వెదుకుతూ వెళ్లిందా సతీమణి. 'ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా?' అన్న రామచంద్రుడితో 'పతి పదప్రాప్తి భాగ్య వైభవమ్ము నాకు/ భర్తృ సన్నిధి జీవన ఫలము నాకు' అన్నదే ఆమె సమాధానం. 'రణాంగణంలో నా అస్త్రాలకు నేలకొరిగిన ఆ వ్యక్తికోసమా నీ అన్వేషణ?' అని తిరుగుప్రశ్న వేసిన రామసోదరుడు సౌమిత్రికీ దీటైన బదులిచ్చింది. యుద్ధభూమిలోని భర్త తుది దర్శనానికి వచ్చానన్న ఆ సాధ్విని 'నీ ధర్మానురక్తి ప్రశంసార్హం తల్లీ!' అని ప్రస్తుతించిన శ్రీరాముడు 'నీ న్యాయచింతనకు నిఖిల ప్రపంచం కర్పూర నీరాజనమిస్తుంది' అనీ ఆశీర్వదించాడు. నిష్కారక రణయాత్ర నుంచి తన జీవన సహచరుడి మనసు మళ్లించేందుకు నాడు ఆ లలామ సాగించిన అవిశ్రాంత యత్నమే దాంపత్య బాధ్యతకో ఉదాహరణ. ఉభయుల్లోనూ ఒకరితో మరొకరికి వచ్చే అంతరాల్ని కానీ, ఇతరులతో ఎదురయ్యే వాదవివాదాల్ని కానీ ఓర్పూనేర్పులతో నివారించడంలోనే ఇమిడి ఉంది గృహస్థశక్తి. పోరు ఎప్పుడూ నష్టమే, పొందుతో అంతా లాభమే. కల్యాణబంధమనే మధుర సుధాకలశాన్ని అసందర్భ ఆవేశాలతో బద్దలు చేసుకోవడమెందుకు? కోపాలూ తాపాలతో పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకోవడం అర్థంలేని పని! ఉక్రోషాలతో వెలికివచ్చే వారి వెచ్చని నిట్టూర్పుల్ని అరికట్టేవారు ఎవరైనా పరిణయ న్యాయదాతలే; నిండైన ఆ సంసారాల్ని పదిలంగా నిలబెట్టాలనుకునే ప్రతిఒక్కరూ ప్రణయ దూతలే.
భార్యాభర్తలు ఒకరినొకరు తెలుసుకుని ఒకటిగా నడుచుకుంటే, 'పగలే వెన్నెల- జగమే వూయల'. ఎప్పుడో ఒకప్పుడు తేడాలేవైనా చోటుచేసుకుంటే మటుకు అప్పటికది శ్రుతంటూ కలవని వింత పాట, గతుకులలో కాలుసాగని ఓ చిక్కు బాట. కాలం గీసిన విభజన రేఖను ఇరువురి చేతులూ కలిసి తుడిచేయలేని స్థితి- వారినీ చూసేవారినీ మరింతగా బాధించి 'జరిగిన పొరపాట్లు తిరిగి/ జరగకుండ చూచుకోండి/ చేసిన తప్పులు మళ్లీ/ చేయకుండ కాచుకోండి' అనేట్లు చేస్తుంది సర్వసహజంగా. వైవాహిక జీవితాల్లో వివాదాల కేసులు పెరిగిపోతున్న పరిస్థితి ఇప్పుడుంది. వాటిలోని న్యాయబద్ధమైన కేసులన్నీ ఇక న్యాయస్థానాల వెలుపల పరిష్కారమయ్యేలా న్యాయస్థానాలే ప్రోత్సహించాలంది సుప్రీంకోర్టు. అటువంటి కేసుల్లో ఇరుపక్షాలూ న్యాయాలయాల చుట్టూ తిరగకుండా, పరస్పర అంగీకారంతో వివాదాలకు చరమగీతి పాడాలనుకుంటే చాలు. వారిమధ్య గొడవలు సమసిపోయేలా, రాజీకిక న్యాయమూర్తులే దారిచూపే కాలం వస్తోందన్నమాట. ఆ మధ్యేమార్గంలో, విజేతలూ పరాజితులంటూ ఉండరు. 'గృహస్థాశ్రమంబు కాదె యుత్తమంబు?' అని ప్రశ్నించారు నన్నయ. ఆ సూటి ప్రశ్నకు చక్కటి సమాధానంగా దంపతులు నిలిచిన వేళ, కరుణ కవి గళం పలికినట్టు జగాన ఇక 'సభ్యత మోసులెత్తె, గుణసంపద తీగలు సాగె, రాగవా/ల్లభ్యము పల్లవించె, సరళత్వము పువ్వులు పూచె, భావసౌ/రభ్యము నిండె, స్వీకృత పురాకృత పుణ్యఫలంబు పండె'. అదే కదా అందరూ కోరేదీ, అందరికీ కావలసిందీ!
(ఈనాడు , సంపాదకీయం , 24:03:2013)
_____________________________________
Labels: Family, Life/telugu, Self development/Telugu, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home