1207 - అత్యాశకు పోతే అంతే సంగతులు.. పెరుగుతున్న 'నైజీరియా మోసాలు'
- సంక్షిప్త సమాచారాలతో తస్మాత్ జాగ్రత్త !
- రూ.2.95 కోట్లు వస్తుందని బ్యాంకు సొమ్ముకు టోకరా
- కటకటాల పాలైన బ్యాంకు మేనేజర్
దురాశ దుఃఖానికి చేటు... అన్న నీతిని జీవితంలో ఆచరించకపోతే అనర్థాలు తప్పవు అని చెప్పడానికి ఈ ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్‌లకు బహుమతుల సంక్షిప్త సమాచారాలు (ఎస్ఎంఎస్) వెల్లువెత్తుతున్నాయి. ఇది కచ్చితంగా మోసమే. ఇలాంటివాటిని పోలీసు భాషలో నైజీరియన్ మోసాలుగా పిలుస్తారు. విజయనగరం జిల్లా రామభద్రపురం ఎస్‌బీఐ మేనేజర్ కూడా ఈ వూబిలో చిక్కుకున్నారు.
మేనేజర్ వారణాశి బాలకృష్ణ సెల్‌ఫోన్‌కు నెల రోజుల క్రితం 'నోకియా మొబైల్ ప్రమోషన్ అవార్డు-2013 ఈ ఏడాది ప్రకటించారు. అందులో మీకు రూ.2.95 కోట్లు బహుమతి వచ్చింది. ఈ మొత్తం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ ఉన్న నోకియా ప్రతినిధి డిప్లమేట్ జేమ్స్ విలియమ్స్‌ను కలవండి.' అని ఎస్.ఎం.ఎస్. వచ్చింది. ఈ వివరాలు చూసిన బాలకృష్ణ వెంటనే జవాబు మెసేజి ఇచ్చారు. దీంతో... ముందుగా రూ.2.96 కోట్ల డబ్బు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ విభాగం నుంచి విడుదల చేసేందుకు రూ.25,000 కట్టాల్సి ఉందని ఓ బ్యాంకు ఖాతా నెంబరు 32744551193 కూడా ఇచ్చారు. ఈ ఖాతాకు 2013 మే 6న రూ.25,000 తొలిసారిగా జమ చేశారు. బాలకృష్ణ వ్యక్తిగత ఖాతా నెంబరు, మెయిల్ ఐడీ వగైరా సమాచారం కూడా వారు తెలుసుకున్నారు.
- తరువాత మరికొన్ని ఖర్చులు ఉన్నాయంటూ 7.5.2013న 32888104626 ఖాతాలో రూ.98,000 జమ చేయాల్సిందిగా సూచించారు.
- ఐఎంఎఫ్ క్లియరెన్స్ ఛార్జీలుగా రూ.3,31,000 కట్టాలంటూ శైలేంద్ర ఓటా పేరిట ఉన్న ఖాతా నెంబరు పంపారు.
- రూ.2.95 కోట్లకు 12 శాతం ఆదాయపు పన్నుగా రూ.35,40,000 కట్టాలని కోరగా... తాను కట్టలేనని బాలకృష్ణ తెగేసి చెప్పారు. దీంతో బేరసారాలు చేసిన నోకియా మొబైల్ ప్రొమోటర్స్ చివరకు రూ.5,13,000 కట్టాల్సిందిగా సూచిస్తూ 3273960186 ఖాతా నెంబరు ఇచ్చారు. కృష్ణా పింక్ ఇన్‌ఫో పేరిట ఆ ఖాతా ఉంది.
- ఫైనాన్స్ మినిస్టర్ కార్యదర్శులు ఒక్కొక్కరికి పది లక్షలు ఇవ్వాలని కోరగా.. ఆ మొత్తం చెల్లించారు. అలా రూ.1.83 కోట్ల మేర నోకియా మొబైల్ ప్రమోటర్స్ పేరిట చెల్లించారు.
ఈ మొత్తం చెల్లించడానికి అమ్మ, అక్క, గతంలో తన వద్ద పనిచేసిన అనిల్‌రాజ్ దివల అనే వ్యక్తి పేరిట తన బ్యాంకు నుంచే రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ముంబై స్టేట్ బ్యాంకు బ్రాంచి నుంచి మేనేజర్.. బాలకృష్ణకు ఫోన్ చేసి... 'మీ బ్రాంచి నుంచి అనిల్‌రాజ్ దివల పేరు మీద లోన్ చూపుతూ... వేరెవరికో క్రెడిట్ అవుతోంది చూసుకోండి' అని చెప్పారు. అదే విషయాన్ని విశాఖపట్నం రీజియన్ కార్యాలయానికి వివరించారు. దీంతో విశాఖపట్నం బ్యాంకు అధికారులు రంగంలోకి దిగితే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో సెల్‌ఫోన్ మెసేజీ ..ఆయన చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను బాలకృష్ణ బయటపెట్టారు. చివరికి కటాకటాల వెనక్కి వెళ్లారు.
(ఈనాడు ,07:06:2013)
______________________________________
Labels: Finance, India/Telugu, Life/telugu, scams, Work
0 Comments:
Post a Comment
<< Home