1254-సాహితీ మాలతీ.. మనకిక లేరు!
అక్షర చైతన్య శీలి... కన్నుమూశారు. అశేష పాఠక 'హృదయనేత్రి'.. వీడ్కోలంటూ వెళ్లిపోయారు. 'ప్రమదావనం' శీర్షికతో తెలుగు పత్రికా ప్రపంచాన్ని మహిళల దిశగా అడుగులేయించిన కలం.. నిశ్చలమైంది.ఎప్పటికప్పుడు కొంగొత్తగా ఎగసిపడ్డ 'పాత-కొత్త కెరటాల' పాళీ.. ప్రాణధారను కోల్పోయింది. లాలనగా, తార్కికంగా, గద్దింపుగా 'అడగండి చెబుతా!' అన్న పెద్దరికం... మాటయినా అడగకుండా సెలవు తీసుకుంది.
తెలుగు సాహిత్యానికి తనదైన సుగంధాలద్ది బుధవారం నేలరాలిన మాలతీ... సాహితీ, వ్యక్తిగత జీవనం ఆద్యంతం చైతన్యశీలంగానే సాగింది. 'పఠనం ఒక తీరని దాహం. ఆ దాహం ఎప్పటికైనా తీరుతుందో లేదో..!' అంటుండేవారు మాలతీచందూర్. నిజానికి ఆమె తుదిశ్వాస వరకు ఆ దాహం తీరలేదనే చెప్పాలి. ఆమె తన ప్రాణాపాయకర 'కణితి' గుర్తించిన తర్వాత కూడా తన శీర్షిక కోసం పుస్తకాలతో నెచ్చెలిమి నెరపుతూనే ఉన్నారు. మాలతీగారి రచనా ఔన్నత్యానికి పుస్తకపఠనం ఒక ఎత్తయితే.. చందూర్ జీవనభాగస్వామ్యం మరొక ఎత్తు!! ఇవి రెండూ కలిసే తనను మంచి రచయిత్రిగా చేశాయని అంటారు మాలతీ... ఆమెకే సాధ్యమైన నిరాడంబరతతో. కానీ పుస్తకపఠనాలు, పరిచయాలే ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయా? అంటే కాదనే అంటారు ఆమెతో కాస్త పరిచయం ఉన్నవాళ్లెవరైనా. మాలతీచందూర్‌లో సహజంగానే ఉన్న ఓ అన్వేషణా దృక్పథం, ఎన్నడూ ప్రతికూల భావాలు దరిచేరనీయని నిబ్బరం, గొప్పదనం ఎక్కడున్నా వెదికిపట్టి వెంబడించే చైతన్యశీలత.. ఆమె సహజగుణాలు. వాటికి పుస్తకపఠనం, చందూర్ జీవనభాగస్వామ్యం గోడచేర్పుగా అమరాయి.
రవ్వదుద్దులు...
నూజివీడులో ఆమె ఎప్పుడూ మగరాయుడిలాగే అల్లరి చేస్తూనే ఉండేవారట. 80 ఏళ్లు పైబడ్డాక కూడా ఆ చలాకీతనం చెక్కు చెదరలేదు. సున్నితమైన హాస్యం ఆమెను వీడలేదు. నూజివీడులో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాక మేనమామ చందూర్ ఇంటికి వెళ్లారు. మావయ్యతో కలిసి సాహితీసభలకు వెళుతుండేవారు. 1945-46లోనే తొలిసారిగా విశ్వనాథ, కృష్ణశాస్త్రి, గాయకుడు ఎంఎస్ రామారావు, చలం పరిచయమయ్యారు. సాహిత్యమండలి తరపున వేసిన శశాంక నాటకాల్లో అనూరాధ పాత్ర కూడా పోషించారు. అప్పట్లో క్రమం తప్పకుండా చదువుతున్న ఆనందవాణి పత్రికలో తన తొలికథ 'రవ్వల దుద్దులు' రాశారు. అమ్మ జ్ఞానాంబ మాలతీ బాధ్యత పూర్తిగా మామయ్యకే అప్పగించి.. పెళ్ళి చేశారు. పెళ్ళయాక మద్రాసు వచ్చారు. అక్కడే పెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు. మద్రాసు మహానగరంలో స్వాతంత్య్రం వచ్చాక రిజిస్టర్ అయిన తొలి వివాహం ఆ దంపతులదేనంటారు! ఆకాశవాణిద్వారా ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారి ఆకాశవాణిలో టాల్‌స్టాయ్‌పై 15 నిమిషాలు ప్రసంగించారు. ప్రపంచ సాహిత్యంపై ఆమె వేసిన తొలి అడుగు అది. పాతకెరటాలకు ఒకరకంగా అప్పుడే బీజం పడింది. పాతకెరటాలు, కొత్తకెరటాల ద్వారా ఆమె 350 ప్రపంచ పుస్తకాలను పరిచయం చేశారు.
47 ఏళ్లపాటు 'ప్రమదావనం'!
1952లో ఆంధ్రప్రభలో ప్రమదావనం శీర్షిక ప్రారంభించిన కొత్తల్లో దానికి కనీస స్పందన కరవైంది. మాలతీ అందులో 'లేడీస్ హోమ్' కోణం ప్రవేశపెట్టి.. వైవిధ్య పుంతలు తొక్కాక తిరుగులేకుండా పోయింది. 47 ఏళ్లపాటు నిరాఘాటంగా సాగి తెలుగు పత్రికా ప్రపంచంలో రికార్డు సృష్టించిన శీర్షిక అది. ఆ శీర్షికలోని సమాధానాలు చదివి ఐఏఎస్‌లుగా మారినవారున్నారు. 'చంపకం-చెదపురుగులు'తో ఆమె తొలినవల. 'హృదయనేత్రి' కేంద్ర సాహిత్య అకాడమీ అందుకుంది. శతాబ్ది సూరీడు, ఆలోచించు వంటి 30 నవలలు రాశారు. '1970-80ల నాటి న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగినులు.. ఇలా అన్నివృత్తుల మహిళలనూ మానవీయ పాత్రలుగా మలచిన రచయిత్రి అప్పట్లో మరొకరు లేరు. తన జీవితాన్ని అంతే క్రమశిక్షణగా, ప్రణాళికాబద్ధంగా, నిరాడంబరంగా మలచుకున్న నిజకథానాయిక ఆమే'నంటారు ప్రముఖ రచయిత్రి ఓల్గా. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా తమిళం నేర్చుకుని శివశంకరి(ఒక మనిషి కథ), జయకాంతన్(కొన్ని సమయాల్లో కొందరు మనుషులు), సుజాతా రంగరాజన్, పుదుమైపిత్తన్‌లాంటివారిని తెలుగు పాఠకులకు దగ్గర చేశారు. 'మాలతీ అనువాదంతోనే తెలుగుదేశంలో నాకు ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఇక్కడి సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఎంత గొప్ప రచయిత్రో అంత మంచి స్నేహశీలి తను. మాలతీ స్నేహం మరిలేదనంటే ఎలా నమ్మను?!' అని 'ఈనాడు'తో ఆవేదన వ్యక్తంచేశారు తమిళరచయిత్రి శివశంకరి.
(ఈనాడు , 22:08:2013)
_________________________________
Labels: Chennai, Life/telugu, Personality, Telugu language, Telugu literature, Telugu literature/ books, Telugu literature/personality, Telugu literature/Tamil, సాహిత్యం-వాఙ్మయం
0 Comments:
Post a Comment
<< Home