My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, October 20, 2013

1276-ఎలుగెత్తి పిలిచే వెలుగు


ఆశించటం, అది సాధించేందుకు తపించిపోవటం, పోటీపడీ పోరు సాగించీ విజయానందం అందుకోవటం... జీవితం! ఆ ఆరాటంలో, పోరాటంలో ఉన్న సాధనాలన్నీ వినియోగించి, అన్ని సాయుధబలగాల్నీ మోహరించి వడివడిగా ముందుకు సాగే మనిషికి నాళం కృష్ణారావు కవి దర్శించిన 'పట్టుదల బూని చేయుమా పనులనెల్ల/ కాలమే సమకూర్పగలదు ఫలము' అన్నదే అనుభవానికొస్తుంది. పరిశీలన, అనుశీలన కలగలిసిన వ్యూహరచనతో ఇతర గుణగణాలూ జతకడితే, విజయాలు పరంపరగా సిద్ధించి మానవుణ్ని మాననీయుణ్ని చేస్తాయి. ఏనుగు లక్ష్మణకవి విపులీకరించిన 'ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందు దాల్మియున్/ భూ సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ, మాజి బా/హా పటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధి' ప్రకృతిసిద్ధ లక్షణాలే కాక మానవాళి పాలిట ఆయుధాలూ సాధనాలూ. రాజనందనుడైన సిద్ధార్థుడు నాడు శ్రుతులు, స్మృతులు, సంహితలతో పాటు నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని గడించాడు. అఖిల అస్త్రశస్త్ర రహస్యాలు, తంత్రవాదనల సారాంశాలు, యంత్రవాదాల లోలోని మర్మాలూ గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు. 'ఉపాయపూర్వకమగు విపులయత్నము సర్వార్థ సాధకము' అన్నట్లు బాణ ప్రయోగ కళాదక్షుడిగా, ఖడ్గచాలనాది విద్యాపారీణుడిగా వీరాధివీరత్వాన్నీ సొంతంచేసుకున్నాడు. అటుతరవాత భోగభాగ్యాల్ని వదిలి, భార్యాబిడ్డల్నీ వీడి శాశ్వత జ్ఞానసాధన దిశగా తరలివెళ్లిన అతడి మేధోసంబంధ ఆయుధం- తత్వచింతనే!
పూర్వాపరాల ఆలోచన, ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత కృషి కారణంగానే ఫలితం ప్రాప్తిస్తుంది. 'ధనమునకు దానమును, తప/మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు, జీ/వనమునకు యశము, విద్యకు/వినయంబును, నీతులకు వివేకము ఫలముల్' అని పలికిన సుభాషితకర్త అంతరార్థమూ సాధనాల ప్రాధాన్యమే. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేసిన దేవతలు భయాలకు లొంగలేదు, ప్రలోభాలకు దాసులు కాలేదు. అమృతభాండం లభించేవరకూ ప్రయత్నం మానలేదు. కనుకనే కృతనిశ్చయం వదలని నిపుణమతులయ్యారు. నగములు కంపించేలా గగనానికెగసి ప్రత్యర్థుల్ని భయకంపితుల్ని చేసిన గరుత్మంతుడిది రెక్కల బలం. యమధర్మరాజును వెంటాడి, పతి ప్రాణాల్ని తిరిగి దక్కించుకొన్న సావిత్రిది అపార ధైర్యం. 'ధర్మదేవతా, సూర్యచంద్రాదులార/ పంచభూతమ్ములార, దిక్పాలులార/ నన్ను రక్షింపరే నాథునకు వచించి' అంటూ నిండుసభలో సత్యపోరాటం సాగించి గెలిచిన శకుంతలది నిరుపమాన సాహసం. తనయుడు అర్జునుణ్ని ద్వాపరంలో ఆయుధంగా, సాధనంగా మలచింది తల్లి కుంతీదేవి. 'పరమశివుణ్ని ఆరాధించి పాశుపతం సంపాదించు, కదనభూమిలో విజృంభించి విరోధుల్ని నిరోధించు' అని ఆశీర్వదించి పంపింది. 'వెలుగు నిన్ను ఎలుగెత్తి పిలుస్తుంది, చీకటి నీకు దూరంగా నిలుస్తుంది' అంటూ త్రేతాయుగంలో కుమారుడు హనుమను దీవించి జాగృతపరచింది అంజన. 'నీ మాతను వీరమాతను చేయి, నీ జాతికి నవజీవం పోయి' అని కృతయుగంలో ప్రబోధించి బిడ్డను కార్యనిర్వహణ దీక్షాదక్షుణ్ని చేసింది వినత. కర్తవ్యాన్ని విస్మరించి కురుక్షేత్రంలో చేష్టలుడిగి కూర్చున్న ప్రియతముణ్ని 'లెమ్ము ధనుంజయా! విధి బలీయము, న్యాయము గెల్చు, నిల్చు స/త్యమ్ము, నశించు స్వార్థము, సదా యుగధర్మమిదే గదోయి' అని తట్టిలేపిన కృష్ణపరమాత్ముడిదీ కార్యసాధన తత్వమే. 'అంగత్రాణ కృపాణ బాణధరులై యంగమ్ము లుప్పొంగ, దు/స్సంగ స్వార్థ మదేభ కుంభములపై సంగ్రామ రంగమ్మునన్/ సింగమ్ముల్ వలె దూకి' పాండవవీరులు విజృంభించటానికి ఆ చైతన్య సమరభేరే కారణం. సకల శుభాలు, విజయ పరంపరలు ప్రసాదించే దుర్గమ్మ హస్తాలనిండా ఆయుధాలే కనిపిస్తాయి. సదాశయానికి వినియోగించే ప్రతి సాధనమూ ఆయుధమే. అక్షరం, ఆత్మవిశ్వాసం, గుండెబలం, విద్య, వినమ్రత, సమయస్ఫూర్తి... అన్నీ ఆయుధాలే, సాధనాలే. అందుకే 'బలిమి జేయరాని పని యెట్టిదైన/ ఉపాయబలము చేత జేయవచ్చు' అన్నారు 'చిత్రభారతం' కర్త.

సాహసం పథమైనప్పుడు, పట్టుదల ప్రధానమై పౌరుషమే ఆయుధంగా మారుతుంది. 'పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు/ పట్టెనేని బిగియ పట్టవలయు' అని హితవుచెప్పిన వేమన 'పట్టరాని పట్టు పట్టియుండినవాడు/ పుడమిలోన కీర్తి పొందలేడు' అంటూ హెచ్చరికా చేశాడు. ఆయుధ ప్రయోగానికైనా, సాధనాల వినియోగానికైనా పట్టువిడుపులు ఉండాలన్నది మానవ జీవన మంతటా నిండాల్సిన అంతస్సూత్రం. జ్ఞానసాధనమైన మెదడుతో పురోగమిస్తున్న విశ్వం 'శ్రమయేవ జయతే' సిద్ధాంతాన్నీ విశ్వసిస్తోంది. విశ్లేషించి చూస్తే, సంజీవదేవ్ అన్నట్లు 'తెలివిలేని శ్రమ కానీ శ్రమలేని తెలివికానీ అంతగా ఉపయోగపడవు. తెలివి, శ్రమ... రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత'. కార్యసాఫల్యానికి కావాల్సింది సమాచరణ. వెనుక కాచుకుంటూ, ముందు చూసుకుంటూ సజావుగా పని సాగించటంలోనే జీవిత పరమార్థముంది. జగజ్జనని దుర్గను విజయదశమి అరుణోదయ వేళలో ఆరాధించిన జిజియా- బాలశివాజీకి చేసిన ఉద్బోధా అదే. మహాకాళి మృగేంద్ర వాహనమెక్కి కదిలి దనుజ మర్దన జరిపిన మహత్తర దినమే దశమి. 'పంచతంత్రం' కర్త తేల్చిచెప్పినట్లు 'లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదు'. పనినే ఆయుధం, సాధనం చేసుకొని ప్రతివ్యక్తీ కదిలినప్పుడు ఆశాజ్యోతి జ్వలిస్తుంది, సాధన నిలుస్తుంది, తపస్సు ఫలిస్తుంది !

(ఈనాడు ,13:10:2013)
____________________

Labels: , , ,

Wednesday, November 16, 2011

గాంధేయమే గాండీవం


హాయిగా బతకమని దేవుడు భూమ్మీదకు పంపిస్తే- మనిషికే మనిషి అరి, నరుడికే నరుడు ఉరిగా మారిన కత్తులమారి కాలం ప్రస్తుతం నడుస్తోంది. 'జరతో, రుజతో ఎలాగూ ముంచుకొచ్చే మరణాన్ని మనిషి హింసావేశపాశాలతో మరింత ముందుకు నెట్టుకొచ్చుకుంటున్నాడే! నరుడే నరకాసురుడుగా మారుతున్నాడే' అని ప్రజాకవి దాశరథి నొచ్చుకున్నప్పటి దారుణ పరిస్థితులే నేడూ ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాదమే- ప్రపంచమంతా ప్రజ్వరిల్లే అగ్నికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోంది. దాయాదులతో యుద్ధమా, సంధా అనే సమాలోచనలు పాండవుల మధ్య రగిల్చింది పెద్ద రాద్ధాంతాన్నే. 'త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తమ్మన్నముం బెట్టి, రే/ చేటున్ వాటిల కున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర/చ్చోటన్ కొంపకు నిప్పుపెట్టి, రడవుల్ చుట్టించిరి' కౌరవులని తొలుత పాండవులు రోషపడ్డారు. చివరికి అయిదూళ్లయినా చాలు అని సరిపెట్టుకోవడమే మేలన్న వారి తీర్మానం వెనకున్న మర్మం అహింసే పరమ ధర్మమన్న సృష్టి సూత్రాన్ని విస్మరించకపోవడమే. హింసామయ జీవనులను ధర్మశాస్త్రజ్ఞులు ప్రశంసించరు. రాయంచపై దేవదత్తుడు చూపించిన క్రౌర్యాన్ని బుద్ధుడు కాకముందే సిద్ధార్థుడు నిరసించాడు! క్రౌంచ జంటను నిష్కారణంగా కిరాతుడు హింసించాడనే గదా బోయదశలోని వాల్మీకి ఎదలో అంత ఆవేదన రగిలింది! హింసకు హింసే సమాధానం కానవసరం లేదు. నవ నందుల దానవ ప్రవృత్తికి ఆచార్య చాణక్యుని ప్రతిస్పందన- మౌర్య సామ్రాజ్య సువర్ణ పాలన. అహింసా లతామతల్లి రక్కసి మూకల వికృత చర్యల సెగ తగిలి వసివాడినప్పుడల్లా పాదులు తీసి దయారసాలు చల్లి తిరిగి చివురులు పూయించిన ప్రేమమూర్తుల జాబితా చిన్నదేమీ కాదు.

ఈ అత్యంత విశాల ప్రపంచ వైద్యాలయంలో హింసాబద్ధులైన రోగులను ఉద్ధరించే వైద్యం సత్యాహింస శాంతి కారుణ్యాలనే చికిత్సా విధానమే- అంటాడు ఖలీల్ జిబ్రాన్. చర్మ చక్షువులతో తేరిపార చూడలేని కర్మసాక్షి ఉనికి కిరణరశ్మి స్పర్శానుభవం ద్వారా తెలివిడికొస్తుంది. విశ్వ వైద్యనారాయణుల చేతిచలువ జీవికి అనుభవంలోకి తెచ్చేది ఆ కారుణ్య చికిత్సలతోనే అని నమ్మి ప్రబోధించిన క్రైస్తవ సాధువు ఫ్రాన్సిస్. మరణశయ్య మీద ఉండీ, జీవితాంతం సేవచేసిన గార్దభానికీ కృతజ్ఞతలు చెప్పటం మరవని కరుణామయుడాయన. తోటి జీవాలపట్ల సద్భావనతో మనిషి మెలగాల్సిన తీరును, అవసరాన్ని లోకానికి చాటిచెప్పిన సాధుపుంగవులు దేశ కాల మతాలకు అతీతంగా ఎందరో ఉన్నారు. 'ప్రపంచానికి నేను కొత్తగా చెప్పే పాఠం ఏముంది... సత్యాహింస శాంతి సూత్రాలు హిమాలయాలంత సనాతనమైనవి. గంగా జలమంత పునీతమైనవి' అని మహాత్మాగాంధీ చెప్పుకోవడంలోని అంతరార్థమూ ఇదే. ఇంటికి నిప్పంటించిన కంటకులకైనా సరే... కంట కన్నీరును కోరుకోరాదు- అనేది అజాత శత్రుతత్వం. దాన్ని ప్రబోధం వరకే పరిమితం చేయకుండా నిజజీవితంలో అనుక్షణం ఆచరించి చూపించినందుకే గాంధీజీని నేటికీ ప్రపంచం గౌరవించేది. 'విష పాత్రమెత్తి త్రావెడి మహాయోగి కన్‌గొనలలో తాండవించిన యహింస/ హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు దయామూర్తి నుదుట పారాడు శాంతి/ శిరసు వంచక స్వేచ్ఛ కొఱకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఏకమై జాతిజనం పూర్వ పుణ్యసంపత్తి ఫలంగా పోరుబందరులో పుత్తలీబాయి పొత్తిళ్లలో ఒత్తిగిలి నేటికి నిండు నూటనలభై రెండేళ్లు.

స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్న సమర రూపాలకు రక్తపాత రహితమనే
కొంగొత్త సహన సిద్ధాంతాన్ని అద్ది గెలుపు మలుపులో సత్యాహింస శాంతియోధులను నిత్యం కాపుగా ఉంచిన సాహసి మోహస్ గాంధీ. అగ్నితో అగ్ని ఆరిపోదు. చల్లబడాలంటే జలం చల్లక తప్పదు. కరుణ లేనినాడు ధరణి లేదు. కరుణలేని నరుడు వట్టి గడ్డిబొమ్మ- ఇది బుద్ధుని అష్టాంగ మార్గం. అదే భూలోక స్వర్గ సృష్టికి దగ్గరి దారన్న సులభ సూత్రం కనిపెట్టిన కర్మయోగి గాంధీజీ. శాస్త్రవేత్త ఐన్‌స్టీనే విస్తుపోయినట్లు 'కంటితో చూసి ఉండకపోతే కల్పనేమోనన్నంత వింత' బాపూజీ సత్యాహింసల జీవిత ప్రస్థానమంతా. పల్లెనుంచి ఢిల్లీదాకా దేశంలో గాంధీజీ పేరుతో ఊరో, నగరమో, రాస్తానో, చౌరస్తానో, వాహ్యాళి స్థలమో, వాహనాల స్థావరమో... కానరాని చోటు లేదు- సంతోషం. జేబులో తప్పనిసరిగా ఉండే కరెన్సీ నోటుమీదా ఆ బోసినవ్వుల బాపూజీ ప్రత్యక్షం- మరీ సంతోషం. మానవ జీవితంలో బాపూజీ రూపం కేవలం ఆరాధ్యభావనకే పరిమితమా?! తాను విడిచివెళ్లిన చేతికర్ర, చెప్పుల జత, గడియారాలకు ఇస్తున్నపాటి విలువ- సిలువలేని ఆ యేసు ప్రవచించిన మానవ విలువలకు మనం ఇస్తున్నామా? బంతివంటి భూగోళాన్ని పంచుకోవడానికి పసిపిల్లలకన్నా మిన్నగా ఎన్ని విధ్వంసాలు? పచ్చ కాగితాల కట్టలకోసం కొట్లాడుకోవడాలు... విషాలు చిమ్ముకోవడాలు... మానవతకే తలవంపులు! బాంబులతో లేచిన గోడలు చివరికి సమాధులుగా చరిత్రలో మారనిదెన్నడు? బాపూజీ శుభ జన్మదిన సందర్భాన్ని ప్రపంచ శాంతి, సహన దినంగా ఐక్యరాజ్య సమితి పరిగణించడం మొదలుపెట్టి ఇది అయిదోఏడు. మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాల పోరాటానికి, సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన మానమర్యాదలు పొందాలనే ఆరాటానికి బాపూజీ చూపించిన శాంతి అహింసలే తిరుగులేని ఆయుధాలని మరింతగా ప్రచారానికి రావాల్సి ఉంది. మరెంతగానో ఆచరణకు నోచుకోవాల్సి ఉంది. కవి కృష్ణశాస్త్రి భావించినట్లు 'తన కంఠమున దాచి హాలాహలం/ తలనుంచి కురిపించి గంగాజలం/ మనిషి శివుడవటమే గాంధీ వరం'. హింసతో శివాలెత్తుతున్న నేటి విశ్వం సర్వం శివమయం కావాలని- ఈ బాపూజీ జన్మదిన పర్వం( అక్టోబర్,౨)  నాడు కోరుకోవాలి మనమందరం! 

(ఈనాడు సంపాదకీయం, ౦౨:౧౦:౨౦౧౧)
_____________________________

Labels:

Thursday, September 09, 2010

విశ్వజననికి వందనం


'మామూలు వూహలతో మహత్వాన్ని కొలవలేము' అన్నాడు శ్రీశ్రీ. అవును... మిన్ను అంచుల్ని ముట్టిన ఒక మానవీయ విరాణ్మూర్తిని మూరలతో కొలవలేము, చేతులు ముడుచుకుపోతాయి! పదచిత్రాలతో రూపుకట్టలేం, మాటలు అశక్తమవుతాయి. విశేషణాలు మౌనాన్ని ఆశ్రయిస్తాయి. ఉపమానాలు తెల్లమొహం వేస్తాయి. కృతజ్ఞత నిండిన హృదయంతో తప్ప, ముకుళిత హస్తాలతో ఆరాధనాపూర్వకంగా నమస్కరించడం తప్ప- అటువంటి మహానుభావుల్ని మెదడుతో కొలవలేం. పడికట్టు కొలమానాలు వేటికీ అందనంత ఎత్తున నిలిచిన అలాంటి మహనీయుల సరసన మదర్‌ థెరెసాది విశిష్ట స్థానం. భగవంతుని గుండె కంపనను- విచ్చి మ్రోసిన తన గొంతుకతో లోకానికి చాటిన మానవతా మహాశిఖరం థెరెసా. ఏగ్నెస్‌ గొంజా బొజాక్సియుగా కన్ను తెరచిన తనకు యుగొస్లావియాలో పొత్తిళ్లు పరచిన స్కోపెజ్‌ గ్రామం ఎక్కడ... పద్దెనిమిదో ఏటనే మత సన్యాసినీ దీక్ష స్వీకరించిన తాను కర్తవ్య నిర్వహణకు కాలుమోపిన ఇండియాలోని కలకత్తా నగరమెక్కడ?! ఇంతటి సుదూర ప్రస్థానానికి థెరెసాకు దారిచూపిన దీపమైనది ఏ రాగబంధం, ఏ ప్రేమపాశం?! ప్రాంతం వేరు... భాషలు వేరు... సంస్కృతులు భిన్నం... అయితేనేం, ఆపద్బాంధవులకోసం ఎదురుచూసే మనుషులు ఎక్కడైనా ఒక్కటే. పేదరికానికి ప్రాంతం లేదు. అనాథలపట్ల ప్రేమ వ్యక్తీకరణకు భాషతో పని ఉండదు. సేవానిరతికి సంస్కృతులు అడ్డుకట్ట వేయలేవు. దీనజనోద్ధరణకు కలకత్తాలోని మిషనరీలు అప్పటికే సాగిస్తున్న కృషి తనను ఆకర్షించడం థెరెసా ఇంతదూరం రావడానికి కారణం. ఆమె- దైన్యంతో, వేదనతో అలమటిస్తున్నవారి కన్నీళ్లు తుడిచింది. వారిని అక్కున చేర్చుకొంది. 'చేయినందించి గుండెకు చేర్చి/ సేదతీర్చు తల్లి కడుపులోని తీపి నీవు' అనిపించేంత కరుణార్ద్ర హృదయంతో తమను ఆదరించిన ఆమెలో వారికి- దైవమిచ్చిన అమ్మ సాక్షాత్కరించింది.

తల్లులు ప్రత్యక్ష దైవాలు. ప్రతి స్త్రీమూర్తిదీ మాతృహృదయమే. తాను కొలిచే వేలుపు సాక్షాత్తు శివయ్యకు తల్లి లేదని భక్తురాలు బెజ్జ మహాదేవి ఎంతగానో బెంగటిల్లింది. పరమేశ్వరుడికే 'తల్లియున్న విషంబు ద్రావనేలిచ్చు/... తల్లి పాములనేల ధరియింపనిచ్చు/ తల్లి బుచ్చునె భువి వల్లకాటికిని' అంటూ పరిపరివిధాల వాపోయింది. తాను పూజించే దైవం- ఆలనాపాలనా ఎరుగని బిడ్డడిలా అగుపించి ఆ భక్తురాలు అంతగా తల్లడిల్లడం స్వ, పరభేదాలకు, పేగుబంధాలకు అతీతమైన తల్లి మనసుకు తార్కాణం. ఈ లోకాన ఎవరికీ పట్టని వ్యథార్తుల్లో; సమాజం వెలివేసిన వ్యాధిగ్రస్తుల్లో; ఎవ్వరూ పట్టించుకోని బాధాసర్పదష్టుల్లో; ఆఖరి ఘడియల్లో సైతం ఆదరణకు నోచుకోని అభాగ్యులూ అనాథల్లో; బతుకూ భవిష్యత్తూ శూన్యమై దిక్కులు చూస్తున్న దీనుల్లో- జ్వరమొచ్చిన దేవుణ్ని దర్శించిన మాతృహృదయం మదర్‌ థెరిసాది! ఆమె జాతిపరంగా అల్బేనియన్‌... మత విశ్వాసాల రీత్యా క్యాథలిక్‌ నన్‌... త్రికరణశుద్ధిగా నిర్వర్తించిన మనోధర్మం దరిద్రనారాయణుల సేవ... అందుకు తన కర్మక్షేత్రంగా ఎంచుకున్న నేల ఇండియా... ఈ దేశ పౌరురాలిగా- ఈ లోకంలోని అభాగ్య మానవాళికి ఆపన్నహస్తమందించేందుకు యావత్‌ ప్రపంచాన్ని తన కార్యరంగంగా మార్చుకున్న విశ్వ మానిసి ఆమె. మదర్‌ థెరెసా జగజ్జననిగా జోతలందుకుంటున్నది అందుకే. ఆమె శతజయంతి సందర్భమిది.

'దేవుడెచటో దాగెనంటూ/ కొండకోనల వెతుకులాడేవేలా?/ కన్ను తెరిచిన కానబడడో/ మనిషిమాత్రుడి యందు లేడో!' అన్నాడు వైతాళికుడు గురజాడ. దీనజనావళి సేవే దేవుని సేవ అని మనసా వాచా కర్మణా విశ్వసించిన థెరెసా- ఆ భగవంతుణ్ని సందర్శించింది అటువంటి మానవమాత్రుల్లోనే. సమాజం చీదరించుకునే కుష్ఠురోగుల్లో, అయినవారు సైతం దూరంగా ఉంచే కలరా వ్యాధిగ్రస్తుల్లో, అవసానదశలో ఉన్న అనాథల్లో- తనకు జీసస్‌ దర్శనమవుతోందని, వారిని సేవించడమే తన విధ్యుక్తధర్మమన్న దైవప్రబోధం వినపడుతోందన్నది ఆమె వినమ్రవాణి. 'గుండెపైని సిలువ, తలపైని నెలవంక/ మనసులోన ప్రణవమంత్ర దీప్తి' అన్నట్లుగా- వివిధ మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలకు చెందినవారి సహజీవన వని భారత్‌. కులమతాలకు, జాతివర్గాలకు అతీతంగా మదర్‌ అందించిన సేవలనూ మతం రంగుటద్దాల్లోనుంచి చూస్తూ- మతమార్పిడులను ఆమె ప్రోత్సహిస్తున్నారన్న అభాండాలు వేసినవారూ లేకపోలేదు. 'అవును, మారుస్తున్నాను. ఒక హిందువు మరింత మంచి హిందువుగా, ఒక ముస్లిం మరింత మంచి ముస్లిముగా, ఒక సిక్కు మరింత మంచి సిక్కుగా నడుచుకొనేలా మారుస్తున్నాను' అన్నది ఆమె జవాబు! జాతులకు, మతాలకు అతీతంగా రాజ్యాధినేతలు మదర్‌ ఎదుట ప్రణమిల్లారు. జాతులు, మతాలు, వర్ణాలకు అతీతంగా వివిధ దేశాలు అక్కడి అత్యున్నత అవార్డులతో ఆమెను సత్కరించి తమను తాము గౌరవించుకున్నాయి. అంతర్జాతీయంగా సమున్నత పురస్కారమైన నోబెల్‌ శాంతి బహుమతిని పేదల తరఫున తాను స్వీకరిస్తున్నట్లు థెరెసా ప్రకటించడం- సమస్త నిరుపేదలపట్ల ఆమె వాత్సల్యానికి నిలువుటద్దం. మనదేశ అత్యున్నత అవార్డు భారతరత్న పురస్కారాన్ని 'సకల మతాల ప్రతినిధి'గా స్వీకరించడం- లౌకికతత్వానికి ఆమె పట్టిన నీరాజనం. మదర్‌ థెరెసా అంటే- మానవ రూపాన కదలివచ్చిన కరుణ, చల్లని వీవనలాంటి ఓ సాంత్వన వచనం, ఓ ఆత్మీయతా సుగంధం. సేవా పథగాములకు ఆమె నిత్యస్ఫూర్తి. విశ్వమానవాళికి ఆమె మాతృమూర్తి. శతజయంతి వేళ ఆ అమ్మకు నమోవాకాలు!

(ఈనాడు, సంపాదకీయం, ౨౯:౦౮:౨౦౧౦)
__________________________

Labels: ,

Wednesday, November 04, 2009

కార్పొరేట్‌ కాలానికీ, ధర్మం సూక్ష్మమే!


మహాభారతమే మనకు అద్దం!
నైతిక సంస్కరణలూ అవసరం
దేశం ఆర్థికంగా అనూహ్య విజయాలు సాధిస్తోందిగానీ.. నైతికంగా మాత్రం మన పయనం ఏమంత తృప్తిగా లేదు. కార్పొరేట్శకంలో ధర్మం విలవిల్లాడుతున్న సందర్భాలుఅనేకం! ఈర్ష్యతో రగులుతూ యుద్ధాలకు దిగుతున్నదుర్యోధనులు నిత్యం మనకు కనబడుతూనే ఉన్నారు. కొడుకులకు పట్టం కోసం ఆరాటపడే ధ్రుతరాష్ట్రులు కళ్లకు గంతలు కట్టుకుంటూనే ఉన్నారు. అందుకే మహాభారతాన్నిసమకాలీన దృక్కోణం నుంచి మళ్లీ చదవటం అవసరమంటున్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్గురుచరణ్దాస్‌!
నాడూనేడూ కూడా మన సమాజంలో ఒక వ్యక్తి 'మంచి మనిషి'గా నిలబడం అంత తేలికేం కాదంటూ... దీనికి ధర్మాధర్మవిచేచన ఒక్కటే సరైన మార్గమని నొక్కి చెబుతున్నారాయన తాజా పుస్తకం - డిఫికల్టీ ఆఫ్బీయింగ్గుడ్లో.
గురుచరణ్దాస్హార్వర్డ్విశ్వవిద్యాలయంలో ఒకవైపు తత్వశాస్త్రం, మరోవైపు బిజినెస్మేనేజ్మెంట్‌.. రెండూఅధ్యయనం చేశారు. మేనేజ్మెంట్రంగ నిపుణుడిగా లబ్ధప్రతిష్ఠులు. తొలి రచన 'ఇండియా అన్బౌండ్‌'తో యావత్ప్రపంచం దృష్టినీ ఆకర్షించారు. కొంతకాలంగా 'ఈనాడు'తో సహా పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో సమకాలీనఅంశాలపై లోతైన వ్యాసాలు రాస్తున్న ఆయన తాజా పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. సందర్భంగా ఆయనతో ముఖాముఖీ!

* మీ పుస్తకానికి 'డిఫికల్టీ ఆఫ్బీయింగ్గుడ్‌' అని పేరు పెట్టారు.. ఈరోజుల్లో 'మంచి మనిషి'గా ఉండటం నిజంగానే 'కష్టం' అంటారా?

అవునవును.. అదెంత కష్టమో.. మన చుట్టూనే.. మన జీవితాల్నేచూడండి.. మనం 'మంచివాళ్లం' అనుకుంటూ (అది పూర్తి నిజంకాకపోయినా).. నిరంతరం మనల్ని మనమే మోసగించుకుంటూఉంటాం. పరిస్థితుల్లో అసలు 'మనం మంచిగా ఎందుకుండాలి?' అన్నది మౌలికమైన ప్రశ్న! ప్రశ్ననే నేను 'మహాభారతం' వెలుగులో తరచిచూసే ప్రయత్నం చేశానీ పుస్తకంలో!

* మనకెన్నో పురాణాలున్నాయి కదా.. మహాభారత దృక్కోణం నుంచే ఎందుకీ విశ్లేషణ?

ఎందుకంటే మహాభారతం మన జీవితాలకు చాలా సన్నిహితంగా ఉంటుంది! రామాయణాన్నే తీసుకోండి.. అది మరీ ఆదర్శవంతమైనది. దానిలో హీరో ఉత్తముడు, భార్య ఉత్తమురాలు, తమ్ముడు ఉత్తముడు.. చివరికి అందులో విలన్కూడా ఉత్తముడే! కానీ మహాభారతం అలా కాదు.. అందులో.. మనలాగానే.. అందరికీ ఏవో ఒక లోపాలుంటాయి, వాళ్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు.. అందుకే భారతం మనకు మరింత దగ్గరగా ఉంటుంది. రెండోది- మహాభారతం రాజకీయ ప్రపంచంతోగాఢంగా పెనవేసుకుంది. రాజు అనుసరించాల్సిన ధర్మం ఏమిటి? మంచి మనిషిగా ఉండాలంటే ఏది ధర్మం? ఇవన్నీచర్చిస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో ఒక్కరూ కూడా సమాధానం కోసం 'దేవుడా నీదే భారం' అనరు. ప్రతి పాత్రా కూడా తనకు తానుగా నిలబడాల్సిందే. తన మీద తాను ఆధారపడాల్సిందే. ఎప్పటికప్పుడు పరిస్థితిని ధర్మాధర్మ విచక్షణతో బేరీజు వేసుకుంటూ.. తర్కించుకుంటూ ముందుకు సాగాల్సిందే. అందుకే భారతం మన నైతిక విచక్షణా శక్తికి పదునుపెడుతూనే ఉంటుంది. అంతిమంగా మహాభారతం చెప్పేది- ధర్మమనేది 'సూక్ష్మ'ంలో ఉంటుందని!

* సమకాలీన జీవితానికి మహాభారతం ఎలా స్ఫూర్తినిస్తుందంటారు?

స్థూలంగా చూసినప్పుడు.. మహాభారతం మనకు సమాధానాలు చెప్పదు, మన మీద మనం ఆధారపడటంముఖ్యమన్నది నేర్పుతుంది. సాక్షాత్తూ దైవం వాళ్ల మధ్యనే ఉన్నా కూడా భారతంలో ఎవరూ పూర్తిగా దైవం మీదే భారమేసి ఉండిపోరు. ఇది చాలా సానుకూలమైన అంశం, నేను భారతాన్ని ఎంచుకోవటానికి ఇదీ ఒక కారణం. ధర్మమంటే మతం కాదు. ధర్మాన్ని మతంగా చూడటమన్నది 19 శతాబ్దంలో క్రైస్తవం వచ్చిన తర్వాతే ఆరంభమైంది. లేకుంటే ధర్మమంటే- మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అనే.

అందుకే మహాభారత కథ చెబుతూనే.. మధ్యలో ఆపేసి.. ఇప్పుడేం జరుగుతోందన్న చర్చ చేశాను. ఉదాహరణకుదుర్యోధనుడ్ని విశ్లేషించేటప్పుడు నేను 'ఈర్ష్య' గురించి చర్చించా. దుర్యోధనుడికి ఎన్నో దుర్గుణాలుండి ఉండొచ్చు, కానీఇది అన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది. పాండవుల విజయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు.చివరికి అదేయుద్ధానికి కారణమైంది. మరిప్పుడు అంబానీ సోదరుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కాదా? నాకు రిలయెన్స్లోషేర్స్ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు.. ముఖేష్విజయం పట్ల అనిల్కున్న ఈర్ష్య.. చివరికి దేనికి దారి తీస్తుందోననిఆలోచిస్తుంటాను.. అందుకే క్రీ.పూ.5 శతాబ్దంలోనే గ్రీకులు ఈర్ష్య గురించి ఆందోళన చెందేవారు. ఏథెన్స్లో ఎవరైనా అధికప్రాచుర్యం పొందుతుంటే.. ఈర్ష్య తగ్గే వరకూ వారిని ప్రవాసంలోకి పంపేసేవారు. 1930లలో బెర్లిన్‌, వియన్నాల్లో 65% డాక్టర్లు, 50 శాతం వృత్తి నిపుణులు యూదులే. అందుకే యూదులకు వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టటంహిట్లర్కు చాలా తేలిక అయ్యింది. ఈర్ష్య అన్నది అంత ప్రమాదకరమైనది. దురాశనే తీసుకుందాం... చాలామంది 'సత్యం' అధినేత రామలింగరాజు విషయంలో.. అన్నీ ఉండి కూడా ఆయన ఎందుకిలా చేసిఉంటారని అనుకుంటూ ఉంటారు. ఓపక్క మనకు మహాభారతం చెబుతూనే ఉంది.. అతనేమీ దుర్యోధనుడి వంటివాడు కాదు.. చాలా వరకూ ధ్రుతరాష్ట్రుడివంటివాడు! ఎందుకంటే తన కొడుకులు ఒక్కొక్కరికీ కంపెనీలు ఇవ్వాలనుకోవటమే సమస్య అయ్యుండొచ్చు. కాబట్టిమనం మహాభారత కాలంలో లేమనుకోవటానికేం లేదు.

* ఏది ధర్మం, ఏది అధర్మం తేల్చటం తేలిక కాదుకదా..

ప్రపంచం
ఉంటే మంచిగా, లేకుంటే చెడ్డగా ఉంటుందనేం లేదు. చాలాసార్లు 'మధ్య'లో ఉంటుంది. మనందరిలోనూ లోపాలుంటాయి. అయినా మనందరం మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మనంనీతిమంతంగా ఉంటే సంతోషంగా ఉంటామన్నది ప్రాథమిక విశ్వాసం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు- కటికి నేల మీద పడుకున్న ధర్మరాజును చూసి ద్రౌపది అనుకుంటుంది.. 'మంచి మనిషివైన మీరేమో ఇక్కడ కష్టాలుపడుతుంటే.. చెడ్డవాడు దుర్యోధనుడు అక్కడ హంసతూలికా తల్పాల్లో శయనిస్తున్నాడు, ఇదేం న్యాయమని!.' కౌరవులుఅన్యాయంగా చేజిక్కించుకున్న రాజ్యం కోసం యుద్ధం చేద్దామంటుంది, క్షత్రియులుగా అది 'మన ధర్మమనీ' అంటుంది. కానీ ధర్మరాజు తన ధర్మం యుధిష్టురుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటాడు! ఇద్దరూ మాట్లాడేది ధర్మం గురించే. కానీ ఇద్దరూ వేర్వేరు ధర్మ సూక్ష్మాలను బయటకు తెస్తున్నారు. ధర్మ వివేచనే కథనాన్ని, జీవన గమనాన్నిముందుకు తీసుకువెళ్తుంటుంది.

* మీ తొలి పుస్తకం 'ఇండియా అన్బౌండ్‌'లో భారతదేశ ఆర్థిక పురోగమనం గురించి చర్చించారు.. దీనిలోకి వచ్చేసరికి దృష్టిని ధర్మం మీదకు మళ్లించారెందుకు?

పుస్తకం రాసిన తర్వాత పరిణామాలు చూసి మానసికంగా చాలా చింతలోకి వెళ్లాను. ఎందుకంటే దేశం ఆర్థికంగాసంపన్నవంతమవుతోందిగానీ.. ఇక్కడి నైతిక జీవనం మెరుగవ్వటం లేదు. ఇందుకు ప్రధానంగా మన ప్రభుత్వ వ్యవస్థనీ కారణంగా చెప్పుకోవాలి. ప్రతిచోటా లంచాలు. స్కూళ్లలో టీచర్లుండరు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులుండరు. ఆటోడ్రైవర్ల ఆదాయంలో 20% పోలీసులు గుంజుకుంటున్నారు. దైనందిన జీవితంలో ప్రతిచోటా అవినీతి. దేశం అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమేగానీ మరోవైపు మన నైతికత ఘోరంగా విఫలమవుతోంది. పేదరికం ఎలాగైనా పోతుంది... నైతిక పేదరికాన్ని వదిలించుకోవటం ముఖ్యం! అందుకే ఇప్పుడు నేను మనకు ఆర్థిక సంస్కరణల కంటే కంటే రాజ్య/ప్రభుత్వ సంస్కరణలు ముఖ్యమని భావిస్తున్నాను. పోలీసులు, కోర్టులు, ముఖ్యంగా రాజకీయాలు, పరిపాలన.. అన్నీ సంస్కరించుకోవాల్సిందే. ఇది అసాధ్యమేం కాదు! ఒకప్పుడు స్కాండినేవియా, బ్రిటన్వంటి దేశాలన్నీ అవినీతిలో కూరుకున్నవే. ఇప్పుడు వాళ్లెంతగాసంస్కరించుకున్నారు? అందుకే పుస్తకంలో ధర్మం గురించి చర్చించాను. ఇదే అన్నింటికీ సమాధానం అనటం లేదు. మనలో ప్రతి ఒక్కరికీ ఇదొక అద్దంలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీనిలో మనల్ని మనం చూసుకుని.. మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. దిశగా ఇది మనకొక దివిటీలా దారి చూపుతుందని భావిస్తున్నా!
- న్యూస్టుడే ప్రత్యేక విభాగం

(ఈనాడు, ౦౪:౧౧:౨౦౦౯)
___________________________________
‌‌ ‌‌‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌

Labels: ,

Tuesday, September 15, 2009

తొలి వేలుపు


తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు... దగ్గరికి వచ్చేసరికి శిష్యుడు ఆగిపోయాడు. పద్యం మరిచిపోయాడనుకుని '...మందహాసమున్‌...' అంటూ గురువు అందించబోతే, శిష్యుడు పట్టించుకోలేదు. 'అయ్యా వినాయకుడిది ఏనుగు తల... ఆపైన ఏకదంతుడు! మందహాసం ఎలా సాధ్యం?' అని అడిగాడు. వినాయకుడి పేరుచెబితే చాలామందికి హాస్యం తోస్తుంది. పత్రికల తీరులోనూ ధోరణి కనపడుతుంది. వినాయక చవితి ప్రత్యేక సంచికలు రకరకాల బొమ్మలతోను ఆయనపై వ్యంగ్య చిత్రాలతోను కిక్కిరిసి ఉంటాయి. హాస్యకథల పోటీకి, ప్రత్యేక హాస్య సంచికలకు వినాయక చవితి సరైన అదను. చవితిరోజున పొట్ట పట్టనంతగా ఉండ్రాళ్లు సేవించిన లంబోదరుణ్ని చూసి చంద్రుడు నవ్వడం, దానికి పార్వతి కోపించి చంద్రుణ్ని శపించడం కథ అందరికీ తెలిసిందే! వినాయక చవితి పేరుచెప్పి చందాలు దండుకునేవారి ఆగడాలు భరించలేక 'చందమామను అదరగొట్టిన గణేశుడు 'చందా'మామలను ఏం చెయ్యలేకపోయాడు' అని ఒక హాస్యరచయిత చమత్కరించాడు. 'అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ...' అంటూ మొదలుపెట్టి అల్లసాని పెద్దన- వినాయకుడు పప్పులో కాలేసిన సంగతి చెప్పాడు. అమ్మ ఒళ్లోచేరి పాలుతాగుతూ బాల గణపతి రెండోవైపు తడిమాడు. శివుడు అర్ధనారీశ్వరుడు కదా! రెండోవైపు ల్లి స్తనానికి బదులు, తండ్రి మెడలో పాము చేతికి తగిలింది. అభం సుభం ఎరుగని పసివాడు అది అహివల్లభ హారమని తెలియక తామరతూడుగా పొరబడ్డాడని వర్ణించాడు పెద్దన. ఏనుగులకు తామారతూడులంటే పరమప్రీతి. అదీ అందులో చమత్కారం. మనుచరిత్రకు కేంద్రబిందువైన 'భ్రమ'ను స్ఫురింపజేసే ప్రయత్నమది. గంధర్వుణ్ని చూసి వరూధిని నిజమైన ప్రవరుడని భ్రమపడటం దాని ఇతివృత్తం. అందుకూ పెద్దనగారి ఎత్తుగడ.

'సకల జీవరాశులు సమస్త విశ్వం- ఆయన కుక్షిలోంచే ప్రభవించా'యని గణేశోపనిషత్తు స్పష్టంచేసింది. గణపతిని దేవగణాలకు అధిపతిగాను, వేదాలకు నాయకుడిగాను రుగ్వేదం వర్ణించింది. తంత్రశాస్త్రాలు 'త్రికోణ మధ్యగతుడు' అన్నాయి. ముత్తుస్వామి దీక్షితుల ప్రసిద్ధ కీర్తన 'వాతాపి గణపతిం' లోనూ దాని ప్రస్తావన ఉంది. మూలాధారక్షేత్ర స్థితుడిగానూ ఇదే కృతి నుతించింది. ఈ సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది- జలం! జలానికి అధిష్ఠాన దేవత వినాయకుడు. కనుక ముందుగా పూజందుకునే అర్హత ఆయనకు దక్కింది. 'తొలి పూజలందే ఇలవేలుపు' (ఇలువేలుపు అనేది సరైన పదం) అని కవుల వర్ణన. ప్రమథ గణాధిపత్యం కోరి కుమారస్వామితో పోటీపడి గెలిచి 'గణాధిపతి' అయ్యాడు. విఘ్నాలకు అధిపతిగా- మన పనులను నిర్విఘ్నంగా దీవించాలని విఘ్నేశ్వరుణ్ని ఆరాధిస్తాం. బాల గణపతి, తరుణ గణపతి, విజయ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, క్షిప్ర గణపతి, ధ్వజ గణపతి, పింగళ గణపతి, ఉద్ధిష్ట గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, ఊర్ధ్వ గణపతి, విఘ్నరాజ గణపతి, భువనేక గణపతి, నృత్య గణపతి, మహా గణపతి- అనే పదహారూ గణేశుడి షోడశ తత్వాలు. ఒక్కో తత్వారాధనకు ఒక్కో రకం లక్ష్యం, ఒక్కో రకం ఫలితం అని శాస్త్రాలు చెబుతాయి.

యోగశాస్త్రరీత్యా గణపతి- మూలాధార చక్రానికి అధిపతి. మూలాధారం సృష్టితత్వానికి చెందినది. వినాయకుడి విగ్రహానికి ఊరి చెరువులోంచి తెచ్చిన మట్టిని ఉపయోగించడం సంప్రదాయం. చెరువులో మట్టిని వినాయకుడి ప్రతిమగా రూపొందించి, తొమ్మిది రోజులపాటు ఆరాధించి, మళ్లీ ఆ చెరువులోనే నిమజ్జనం చెయ్యడం ఆనవాయితీ. మట్టిలోంచి వచ్చిన మనిషి తిరిగి మట్టిలోనే కలవక తప్పదనే నిత్యసత్యానికి ఆధ్యాత్మిక ప్రతీక- ఆ ఆచారం. భక్తులు తమ అవసరాలనుబట్టి ఒక్కో రూపంలో ఉన్న వినాయక తత్వాలను ఆరాధిస్తారు. పంచభూత తత్వానికి ప్రతీకగా అయిదు తలలతో సింహవాహనంపై దర్శనమిచ్చే గణపతి- హేరంబ గణపతి. ఆయన అత్యంత శక్తిమంతుడని ప్రసిద్ధి. శరీరానికి, మనస్సుకు రక్షణ కల్పించి, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునే దైవంగా హేరంబ గణపతికి పేరు. కోపావేశాలను, మానసిక ఆందోళనలను దూరం చేసుకునేందుకు హేరంబ దేవతా రూపంలో గణపతిని పూజిస్తారు. లంబోదర గణపతి- ఉదర సంబంధిత వ్యాధుల నివారణ విషయంలో అపర ధన్వంతరి! ఆయన విద్యాధిదేవత. అక్షర సముదాయమంతా ఆయన కుక్షిలో దాచిపెట్టాడు. బొజ్జ విద్యల భోషాణం! 'పెద్దది పొట్ట విద్దియల పెట్టె యనంగ' అని ఒక సహస్రావధాని చమత్కారం! సిద్ధి, బుద్ధి అనే వినాయకుడి భార్యల పేర్లు సైతం ప్రతీకలే అన్నారు పెద్దలు. మనసుకు అధిదేవత అయిన చంద్రుడు- భాద్రపద శుద్ధ చవితి రోజున 'హస్తా' నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు 'హస్త'గతుడయ్యాడంటే- మనసు స్వాధీనంలోకి వచ్చి 'సిద్ధి'ంచిందని అర్థం. హస్తానక్షత్రం బుధగ్రహానికి లేదా బుద్ధికి సంబంధించింది. కనుక బుద్ధి స్వాధీనం అయిందని లెక్క. మనసునూ బుద్ధినీ ఒకే మార్గంలో నడిపించమని కోరుతూ క్షిప్ర గణపతిని ఆరాధిస్తారు. తక్షణమే అనుగ్రహించే ఆయన స్వభావాన్నిబట్టి 'క్షిప్ర ప్రసాది' అనడం ఆనవాయితీ. తత్వాలను గ్రహించి ఆరాధించడం శ్రేష్ఠమైన పూజా విధానం.

(
ఈనాడు, సంపాదకీయం, ౨౩:౦౮:౨౦౦౯)
__________________________________

Labels: ,

Sunday, January 18, 2009

ఏకలవ్యు డెవరో తెలుసా?


ఏకలవ్యుడు, కృష్ణుడికి సాక్షాత్తు మేనత్త కుమారుడు.

వసుదేవునికి ఐదుగురు చెల్లెళ్ళున్నారు. వారిలో పెద్దది కుంతి. పెద్ద మేనత్త కిచ్చిన వాగ్దానం కోసం కృష్ణుడు మిగతా నలుగురు మేనత్తల కొడుకులనూ పని కట్టుకుని చంపాడు.


శృతదేవ
అనే మేనత్త కొడుకు దంతవక్తృడు.
శృతకీర్తి కుమారులు కేకయరాజపుత్రులు.
శృతశ్రవన కుమారుడే శిశుపాలుడు.
రాజాధిదేవి కుమారుడు ఏకలవ్యుడు........ ...........................

సంస్కృత భారత, హరివంశాలలో, పై చెప్పిన ప్రతి అంశం దొరుకుతుంది.
(తెలుగులో ఎర్రాప్రగడగారు అనువదించిన హరివంశంలో కొన్ని కొన్ని వివరాలే ఉన్నాయి.)

[పుట:52, "ఆరుద్ర సినీ మిని కబుర్లు", క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్44]
__________________________________________

Labels: , ,

Tuesday, September 02, 2008

హనుమంతుడి విశ్వరూపం


భారతీయులకు హనుమంతుణ్ని వివరంగా పరిచయం చేసిన కావ్యం- వాల్మీకి రామాయణం! ఒక భీష్ముడు, ఒక దశరథుడు, ఒక విశ్వామిత్రుడు తెలిసినంత బాగా మనకు- మన సొంత తాత ముత్తాతల గురించి తెలియదు. అందుకు కారణం- వ్యాసవాల్మీకులు. వారి పాత్ర చిత్రణా చాతుర్యం కారణంగా- ఆయా పాత్రలతో మనకు గట్టి పరిచయం, చనువు ఏర్పడ్డాయి. పరిచయం పెరిగిన ఫలితంగా క్రమంగా వారంతా పురాణ పురుషులే తప్ప, కల్పిత పాత్రలు కారనే ఒకానొక ప్రగాఢ విశ్వాసం బలంగా వేళ్లూనింది. విశ్వాసం బలపడిన కొద్దీ, మూలానికి అతీతంగా కూడా ఆయా పాత్రల గురించి ఊహించడం మొదలైంది. క్రమేపీ వాళ్లలో కొందరు దైవాలుగా దర్శనం ఇచ్చారు. హనుమంతుడు దేవుడైంది ఆ విధంగానే. భక్తుడి విశ్వాసానికి ప్రతిరూపమే- భగవంతుడు! భక్తుడి భావనలు ఎన్ని విధాలో, భగవంతుడికి అన్ని రూపాలు. భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో, భగవంతుడు అంత బలమైనవాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప, భగవంతుడు కాడు. శ్రీరామచంద్రుణ్ని సైతం భగవంతునిగా వాల్మీకి పేర్కొనలేదు. 'పురుషోత్తముడు' అన్నాడంతే! 'అంజనానందనం వీరం- జానకీ శోకనాశనం' అన్నంత వరకే వాల్మీకి చిత్రణ. దాన్ని అందిపుచ్చుకున్న అన్నమయ్య 'బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి సేతల హనుమంత!' అన్నాడు. భక్తి, వినయం, వివేకం, బలం, ధైర్యం, వాక్పటిమ, సమయజ్ఞత వంటి ఉన్నతోన్నత గుణాల మేలు కలయికగా వాల్మీకి హనుమను పరిచయం చేశాడు. ఆ చిత్రణ భక్తుల గుండెల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందంటే- యత్రయత్ర రఘునాథకీర్తనం, తత్రతత్ర కృత మస్తకాంజలి... ఎక్కడెక్కడ శ్రీరామనామం వినవస్తున్నా- అక్కడక్కడల్లా వినయంగా తలవంచి, చేతులు మోడ్చి, ఆనంద బాష్పాలు చిందించే హనుమంతుడు సాక్షాత్కరించడం మొదలైంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన పిల్లవాణ్ని 'ఆంజనేయ దండకం చదువుకుని పడుకో నాన్నా... భయం లేదు' అంటూ వీపుమీద జోకొట్టిన అమ్మ చేతిస్పర్శలా, ఓదార్పు వచనంలా- హనుమ అనే భావన ధైర్యం చెబుతూ వచ్చింది. చెలిమి చేసిన వానర సహచరులకీ, చేరదీసిన ప్రభువు సుగ్రీవుడికీ, ఆరాధ్యదైవమైన శ్రీరాముడికీ సైతం సహాయపడిన 'అభయ' ఆంజనేయుడు తమ పాలిట సర్వభద్రంకరుడన్న గట్టి విశ్వాసం భక్తుల్లో వ్యాప్తిచెందింది.

ఉదాత్తమైన వ్యక్తిత్వంతో విశేషంగా ఆకర్షించి, భక్తుల హృదయాల్లో దేవునిలా ఎదిగిపోయిన హనుమకు ఎంతో ప్రాచుర్యం లభించింది. లక్ష్మణుడికీ, భరతుడికీ ఎక్కడా విడిగా గుడులు లేవు. హనుమ శ్రీరాముడికన్నా అధిక సంఖ్యలో తన పేరిట మందిరాలు వెలసిన చరిత్రను సొంతం చేసుకున్నాడు. దివ్య దేవాలయ ప్రాంగణం వంటి రామాయణంలో సుందరకాండను గర్భగుడిగా స్థిరపరచి, దాన్ని నిత్య పారాయణకాండగా మలిచాడు. వానరుడై జన్మించి, భక్తునిగా పరిచయమై, దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. సముద్రాన్ని లంఘించే ఘట్టంలో ఆయన నందీశ్వరుడిలా ఉన్నాడని (గవాంపతి రివాబభౌ), చారణాచరితేపథి... చారణా మార్గంలో పయనిస్తున్నాడని వాల్మీకి చేసిన వర్ణనల్లో రహస్య సంకేతాలను ఆకళించుకున్న భక్తుల గుండెల్లో ఆయన త్రివిక్రముడిలా ఎదిగాడు. భక్తుల సంగతి అలా ఉంచి, ఇటీవల ఆయన పిల్లలకు బాగా చేరువ అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో మొట్టమొదటి పూర్తి నిడివి యానిమేషన్‌ చిత్రంగా రూపొందిన 'హనుమాన్‌' చిత్ర విజయం పెను సంచలనం సృష్టించింది. యానిమేషన్‌ ప్రక్రియకు జవసత్వాలు అందించింది. పిల్లలను విశేషంగా ఆకర్షించగల పురాణశ్రేష్ఠుడిగా హనుమ గొప్ప గుర్తింపు పొందాడు. పెద్ద హీరో అయ్యాడు. యానిమేషన్‌ రంగ ప్రముఖుడు శంభూఫాల్కే మాటల్లో- హనుమ 'ట్రెండ్‌ సెట్టర్‌' అయ్యాడు. ఎందరో ప్రముఖులు ఆ చిత్ర హక్కులకు పోటీపడ్డారు. ముందుగా తాను లంకలోకి పోయి, అమ్మవారిని దర్శించి వచ్చి ఆ పిదప తనవారందరినీ లంకకు తీసుకువెళ్ళినట్లే- ఇప్పుడు విదేశాల్లోకి అడుగుపెట్టిన హనుమ తనతోటి పురాణ పాత్రలకు సైతం విదేశీ ప్రయాణానుభూతి కలిగించబోతున్నాడు. రావణ, అర్జున, గణేశ, భీమ, లవకుశులు వంటివారు ప్రయాణికుల జాబితాలో ఉన్నారు.

రాముడికి బదులుగా ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు రాజ్యపాలనా బాధ్యతలను వహించిన విషయం మనం రామాయణంలో చదివాం. కేంద్ర సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన లక్నోలోని సర్దార్‌ భగత్‌సింగ్‌ కళాశాల సరిగ్గా ఆ విధానాన్నే అమలుచేస్తోంది. ఆ కళాశాల పాలకమండలి తమ ఛైర్మన్‌గా ఆంజనేయ'స్వామి'ని ఎన్నుకుని తీర్మానం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ స్వామిపేరు మీద జరుగుతాయి. పాలకమండలి సమావేశాల్లో స్వామికి ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు. స్వామి ప్రతినిధిగా ఉప ప్రధాన అధికారి వివేక్‌ కాంగ్రి అధికారిక నిత్యవిధులు నిర్వహిస్తారు. రామలక్ష్మణులకు లక్ష్యసాధనలో దారి చూపించిన ఆంజనేయుడు తమ సంస్థ విజయాలకు తప్పక దారి చూపిస్తాడని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారి నమ్మకం సరే, అమెరికా అధ్యక్ష పదవికి తన దారి సుగమం కావడానికి కూడా సాక్షాత్తు ఆంజనేయుడే కారణం కాగలడని డెమొక్రాట్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా బలంగా విశ్వసిస్తున్నారు. హనుమంతుడి బొమ్మతోగల బ్రాస్లెట్‌ను ఆయన నిత్యం చేతికి ధరిస్తున్నారు. 'నమ్మినవాడు చెడిపోడు' అని సామెత. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే- హనుమ అనుగ్రహంతో ఒబామా గట్టెక్కేలాగే ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుణ్ని మోసంచేసే ప్రజలున్నారు గాని, ప్రజల్ని మోసంచేసే దేవుడు లేడన్న భక్తుల విశ్వాసం మరోసారి రుజువయ్యేలా ఉంది. దేవుడు దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడన్న ప్రశ్నకు వేదం గొప్ప జవాబు చెప్పింది. స భగవః కస్మిన్‌ ప్రతిష్ఠితః- ఇతి స్వే మహిమ్ని!- ఆయన తన మహిమలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంది. విశ్వాసం గలవారికి ఆ మహిమ నిజం; లేనివారికి కట్టుకథ!
(ఈనాదు, సంపాదకీయం, 22:06:2008)
_____________________________

Labels: , ,

Friday, July 27, 2007

రామానంద తీర్థ స్వామి(1903-1972)

స్వామి రామానంద తీర్థ, హైదరాబాదు స్వాతంత్ర సమర నాయకుడు; ప్రముఖ కాంగ్రసు వాది; కార్మిక నాయకుడు; విద్యావేత్త.

అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భావూ రావు, తల్లి యసు బాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు.

ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని "బ్రహ్మచారిగా నాజీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను" అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన.

కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపఠ్ లో మూడేళ్ళు అధ్యయనం చేసి, "ప్రజాస్వామ్యము, దాని క్రమాభివృద్ధి" అనే అంశముపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టం పొందారు.

తొలుత కార్మిక రంగంలో పనిచేసి, కారాగార శిక్ష అనుభవించి ఆరోగ్యం అనుకూలించక, మరాఠ్వాడాలో ఉస్మానాబాదు జిల్లాలోని హిప్పర్గిలో నెలకొల్పబడిన జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులై, ఆరు సంవత్సరాలపాటు ఆ విద్యా సంస్థను గురుకుల పద్ధతిపై చక్కగా ఆయన నిర్వహించారు.

1932 లో స్వామి నారాయణ అనే గురువు వీరికి 'విద్వత్ సన్న్యాసం ' అనే పద్ధతి ప్రకారం సన్న్యాస దీక్ష ఇచ్చి, ఈయనకు 'స్వామీ రామానంద తీర్థ ' అని నామకరణం చేశారు.

1938 లో రాజకీయరంగంలోకి ప్రవేశించి ఆయన మహారాష్త్ర పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసి, ఆ సంవత్సరమే తన నివాసాన్ని మోమినాబాదు నుంచి హైదరాబాదు ఆయన మార్చారు. స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీజి ప్రయత్నం చేస్తుండగా, స్టేట్ కాంగ్రెస్ సంస్థను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్లో నిషేధించింది. ఆ నిషేధాజ్ఞలకు నిరశనగా స్వామి రామానంద తీర్థ హైదరాబాదులో 1938 అక్టోబరు 27 వ తేదేఏన సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, 18 నెలలు కఠిన శిక్షనమలుచేశారు. స్టేట్ కాంగ్రెస్ సంస్థపై నిషేధం తొలగించని కారణంగా, తాను వ్యక్తిగత సత్యాగ్రహం చేస్తానని స్వామీజి నిజాము ప్రభుత్వానికి తెలియచేయగా, 1940 సెప్టెంబర్ 11 వ తేదీన ఆయనను బంధించి, ప్రజారక్షణ నిభందనల క్రింద నిజామాబాదు కారాగారంలో నిర్భందంలో ఉంచారు.1942-1950 సంవత్సరాల మధ్య హైదరాబాదు
స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.దేశీయ సంస్థానాల మహాసభ కార్యనిర్వాహక వర్గ సభులుగా ఉన్నారు. 1942 ఆగస్ట్ లో క్విట్టిండియా ఉద్యమ తీర్మానం ఆమోదింపబడ్డ బొంబాయి కాంగ్రెస్ సభలో పాల్గొని షోలాపూర్ నుంచి వీరు తిరిగిరాగానే ఆయనను నిజాం ప్రభుత్వం బంధించి1943 డిసెంబరు లో విడుదల చేసింది.1947 ఆగష్టు 15 వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవం జరపడానికై ప్రభుత్వాజ్ఞలను ఉల్లంఘించి భారత యూనియన్ పతాకాన్ని ఎగరవేసినందుకు ఆయనను మళ్ళీ బంధించి, హైదరాబాదు సెంట్రల్ జైలులో నిర్భందించారు.హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావాలని ఉధ్యమాన్ని ప్రారంభించినందుకు ఆయనను 1948 జనవరిలో బంధించి, అనేక జైళ్ళల్లో ఉంచారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వ సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17 వ తేదీన రామానంద తీర్థ స్వామి నిర్భంధం నుండి విడుదల పొందారు.

స్వామి రామానంద తీర్థ నాందేడ్ లోని పీపుల్స్ కాలేజి వ్యవస్థాపకులు;హైదరాబాదు ఖాదీసమితి వ్యవస్థాపక అధ్యక్షు
లు. హైదరాబాదు హిందీ ప్రచార సంఘానికి అధ్యక్షులుగాను, 1952 లో హైదరాబాదు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగాను ఆయన పనిచేశారు. 1952 నుండి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953 లో హైదరాబాదు నగరం లొ ప్రప్రథమంగా జరిగిన అఖిల భారత కాంగ్రస్ మహాసభకు స్వామీజి ఆహ్వానసంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953 లోనె గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుండి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతం లో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటన చేశారు.అంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరుచుకొన్నారు.1957 నుండి ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్ లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు.వినోభాజి ప్రారంభించిన భూదాన్, గ్రామదాన్, గ్రామ స్వరాజ్య ఉద్యమాలకు ఆయన చేయూతనిచ్చారు.భూసంస్కరణల విషయం లొ స్వామీజీ మొదటినుంచి ప్రగతిశీల దృక్పధం కలవారు.

1962 లో క్రియాశీల రాజకీయాలనుండి ఆయన స్వచ్ఛందంగా విరమించుకొన్నారు.అప్పటి తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గిర తోటపల్లి కొండలలో శాంతి ఆశ్రమం నెలకొల్పి అక్కడ ఆధ్యాత్మిక, విజ్ఞాన శాస్త్ర విషయాలను గూర్చిన అధ్యయానలను జరిపించారు. శిక్షణ తరగతులను నిర్వహించారు.

స్వామీజి 1972 జనవరి 22 వ తేదీన హైదరాబాదులో నిర్యాణం చెందారు.

(pages538 & 539 Vijnana Sarwasvamu, Telugu Samskriti, II Volume,Vijnaana sarvasva Kendram, Telugu University, March-1988)
------------------------------------------------------

Labels: , ,