కొన్ని “వెన్న ముద్దలు ”
మా అమ్మ,
మా ఆవిడ
నా రెండు కళ్ళు
.........
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు.
______________
కడుపులో బిడ్డ
తిరగబడ్డాడు.
పెద్దాపరేషన్.
కోలుకోవడానికి
రెండేళ్ళు పట్టింది.
...........
ఇరవైరెండేళ్ళ తర్వాత
మళీ తిరగబడ్డాడు.
ఇంకేం కోలుకొంటుంది!
______________________
చిన్నప్పుడు రోగం వస్తే
నాన్నారు 'ఆ మెడకి '
తాయెత్తు కట్టాడు.
స్కూల్లో ర్యాంక్ వస్తే
మాష్టారు 'ఆ మెడకి '
గోల్డు మెడలు వేశాడు.
కావల్సిన కట్నం ఇచ్చాక ఆ
మొగుడు 'ఆ మెడకి '
తాళి కట్టాడు.
ఇంత మందికి నచ్చిన
ఆ మెడకే అత్తగారు
ఉరేసింది.
____________________________
ప్రేయసిగా ఉన్నప్పుడు,
గంట గడపడానికి గగనమయ్యేది
పెళ్ళాం అయ్యాక,
గంట భరించడం భారంగా ఉంది.
_________________________________
నాలోని బొక్కలు
వెతక్కండి
అదే వెదురుని
'వేణువు 'ని చేసింది.
___________________
ఎన్ని చేపల
ఏడుపో.....
.....
సముద్రం ఉప్పు.
________________
ఎందుకా ఏడుపు,
ఎవడు పోయాడట.
పక్కింటోడు
ఎదిగిపోయాడట.
_________________________
ఎలా చచ్చావన్నది కాదు
ఎలా బతికావన్నదే ముఖ్యం.
చస్తే, ఖచ్చితంగా
నలుగురే మోస్తారు.
బతకడంలో తేడా వస్తే,
ఊరంతా మోసేస్తారు.
_________________________
గాజులు దొరికే దక్కడే
గాజులు పగిలే దక్కడే
నెత్తురికీ,
అత్తరుకీ,
.......చార్మినార్
_________________________
పెళ్ళికి ముందు
చాలామందిని
'ఐ లవ్ యూ' అన్నాడు
పెళ్ళయ్యాక
పెళ్ళాంతో
ఒక్కసారి అనలేదు.
____________________
జీవితాన్ని ఇంత
తేలికగా తీసుకొంటేనే
ఎంతో బరువుగా ఉంది......
_____________________
నీవు కప్పయితే
నీ మెదడు 'బావి '
నీవు చేపయితే
అది 'చెరువు '
నువ్వు తిమింగలమైతే
అది 'సముద్రం '.
నువ్వెంత ఎదిగితే
అదంత ఒదుగుతుంది.
_____________________
ఏక 'లవ్యు 'డు
బొటనవేలు ఇచ్చాడు.
ఏక-'లవ్వు '-డు
చిటికెన వేలు ఇచ్చాడు
రెంటికి పెద్ద తేడా లేదు
............
ఇద్దరూ బలయ్యారు.
_______________________
కొంతమంది
యాక్సిడెంట్ లో చస్తారు.
చాలామంది యాక్సిడెంటల్ గా
బతుకు తుంటారు.
___________________________
కుడిచేతి పని
ఎడమ చేయి చేయదు
ఎడమ చేతి పని
కుడి చేయి చేయదు.
రెండు చేతులు కలిసి
చేసే రెండు పనులు
పెద్దలకి దణ్ణం
పేదలకి దానం.
__________________________________
వీడియోలు తీయాల్సింది
పెళ్ళిళ్ళకి… పుట్టినరోజులకే కాదు
సిజేరియన్లకి.
ఆది చూసైనా కన్నతల్లి కడుపుకోత
తిరగబడే బిడ్డలకి తెలియాలి.
________________________________
నానా చావు
చచ్చి బతుకుతున్నాం
ఇంత బతుకు బతికేది
చివరికి చావటానికి…
_____________________
ఆవిడ రెండు కొంది
ఖరీదైంది…
వెల తక్కువది
లక్షలు పెట్టి కొన్న
‘కట్టుకొన్న మిషన్ ’
పనిచేయడం లేదు
తక్కువలో కొన్న
‘కుట్టుకున్న మిషన్ ’
జీవనాధారం అయ్యింది.
______________________
శుభకార్యానికి
మనిషికి
పిల్లి అడ్డొస్తే
అపశకునం
ప్రతికార్యానికి
మనిషికి
మనిషే అడ్డొస్తే……
_______________________
అమ్మో ముద్దా?
తన పెదాలతో
నా పెదాల్ని మూసేసింది
పాతికేళ్ళయింది
నేను నోరు విప్పితే ఒట్టు…
_______________________
నిలబడు
కూర్చో
లేదా పడుకో
…
గెంతకు…
ఫుల్లో
ఆఫో
రాత్రో
పగలో
తాగు
….
కక్కకు.
________________________
కోట్లు ఖర్చుపెడితే
అక్కడ… రాకెట్ లేస్తుంది.
రూపాయి ఉంటే
ఇక్కడ…. విస్తరి లేస్తుంది.
_______________________
మా ఆవిడ
పురుటి నొప్పులు చూశాక
ఇక ఆమెను
ఇబ్బంది పెట్టదల్చుకోలేదు
…………
రెండో పెళ్ళి చేసుకున్నా………
____________________________
ఎత్తులో ఎగురుతున్నాప్పుడు
కింద వాళ్ళని
పలకరించు….కనికరించు
కింద పడుతున్నప్పుడు
ఎదురు పడేది వాళ్ళే…
_________________________
ఇంటి ఒంటికి
మగాడు తల
ఆడది మెడ
మెడను బట్టే
తల తిరుగుతుంది
ఆ తల ఆకట్టుకున్నా
తాకట్టుకున్నా
ఆ ‘మెడ’ని బట్టే……..
_____________________
అతనేంటి?
నేనది
నేనిది
నా దగ్గర అదుంది
ఇదుంది
అంటాదు.
తెల్లారితే
‘ఇతనుండాలిగా…”
________________________________
అతను ఓ చిన్న వ్రుత్తం గీసుకున్నాడు
అదెంత చిన్నదంటే…….
సరిగ్గా తనే సరిపోడు
ఎన్నాళ్ళని అందులో ఉంటాడు
ఎవరినైనా కావాలనుకొంటే
చంకనెత్తుకోవాలి………
అందుకే.
‘వ్రుత్తాన్ని’ పెంచులోవాలి
‘ప్రవ్రుత్తాన్ని’ మార్చుకోవాలి…….
_______________________________
వాడి చిన్నతనంలో
‘ఊరికే’ ఆడుతుంటే
తండ్రిగా తెగ ఫీలయ్యేవాడ్ని.
నా ముసలితనంలో ఇంకా
‘ఊపిరి’ ఆడుతుంటే
బిడ్డగా వాడు ఫీలవుతున్నాడు……
_________________________________
కా పక్కకి కి
ఖా పక్కన ఖి
ఒకటి చచ్చింది తింటుంది
ఇంకొకటి చంపుకు తింటుంది.
__________________________
ఒక మగాడి హత్యకి
వంద కారణాలు
వంద ఆడాళ్ళ హత్యలకి
‘కట్నం ’ ఒకటే కారణం…..
____________________________
వేయి పడగల కాళీయుడిపై
న్రుత్యం చేసిన క్రుష్ణుడికంటే
కష్టాల కాలసర్పమ్మీద గెంతే
మధ్యతరగతోడు…గొప్ప.
______________________________
( జనార్ధన మహర్షి గారి “వెన్నముద్దలు” [మూడవ ముద్రణ మే,2003] నుండి, వెల రూ.50/-, పంపిణీదారులు: ఎమెస్కో బుక్స్)
____________________________________________________________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home