మనకీర్తి మంచుకొండరా...
( - జి.వి.డి.కృష్ణమోహన్ )
''బ్లడీ ఇండియన్స్!''
-ఈ మాటలు వందేళ్ళ క్రితం గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించిన దక్షిణాఫ్రికాలో అప్పటి జాత్యహంకారులన్నవి కావు...
ఇది అరవయ్యేళ్ళ క్రితంవరకు మనల్ని పాలించిన బ్రిటిషర్ల దుర్భాషకాదు...
బతుకు తెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన మన జనాన్ని అక్కడి 'ప్రథమశ్రేణి పౌరులు' పిలిచే పిలుపూ కాదిది...
ఘనత వహించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'కు చెందిన ఓ కుర్ర నటిచుట్టూ దడికట్టి ఆమె మడిబట్టకు తగిలినవారిని తన్ని తగలేసేందుకు అరుదైన ఆ స్త్రీతోపాటు ఇండియా వేంచేసిన అంగరక్షక పంచకంలో మన ఘన చరిత్రా చేతగాని చవటాయిత్వాలను ఔపోసన పట్టిన అమెరికా జాతి దేహరక్షకుడి నోట జాలువారిన ముత్యాల సరాలు- ''బ్లడీ ఇండియన్స్!''
మనదేశంలో, మనజనం మధ్య మనవాళ్ళని అంత చీదరించుకునే, దూషించే, చివరికి చేయిచేసుకునే ధైర్యం ఓ విదేశీ నటి దేహరక్షకులకు ఎక్కడినుంచి వచ్చింది? నోరుపారేసుకున్న దేహవీరులు స్థాయిలేని అమెరికన్లనో, మన పోలీసులు కేసులు పెట్టారుకాబట్టి కథను కంచికి నడిపించేద్దామనో మనకుమనమే సర్దిచెప్పుకోవటానికి ఏమాత్రం వీలులేని ప్రశ్న ఇది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది... సుదీర్ఘ నాగరికత ఉన్న దేశం మనది... జనాభాలో చైనాను మించుతున్న రాజ్యం మనది... ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నదీ మనమే... ఐ.టి.లో మనమే మేటి... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడగల స్థాయికి ఎదిగిపోయిన దేశం కూడా మనదే... మనల్ని మనం(మాత్రమే) పొగడుకోవడానికి కావాల్సిన ఈ తరహా పనికిమాలిన సరంజామాను పోగేస్తే హిమాలయాల ఎత్తుకు మించిపోతుంది. విదేశాల్లో ఇండియన్లకు దక్కుతున్న 'మర్యాదల' గత, సమకాలీన చరిత్రల్ని తిరగేస్తే... ఓ జాతిగా మనకి లభిస్తున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది.
మొదటి తరగతి రైలుపెట్టెలో ఎక్కిన నల్లబాబును బోగీనుంచి లాగి బయటపడేస్తే... మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే (అప్పటికి) అర్భకుడు దాన్ని మన హోం కమ్ ఉపప్రధాని పదవి వెలగబెట్టిన అద్వానీ మాదిరి సర్దుకుపోయి ఉంటే, ఆగ్రహమూ లేదు... సత్యాగ్రహమనే భావనే పుట్టేది కాదు. ఉపప్రధానిగా ఉన్నరోజుల్లో అధికారిక హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడానికి వెళ్ళిన అద్వానీ మహాశయుడిని అమెరికా ఉద్యోగులు బూట్లూ సాక్సు విప్పించి చూడటం మన జాతికి అవమానమని ఇక్కడి ప్రసార సాధనాల్లో అభిప్రాయాలు, వ్యాసాలు, వాదనలూ హోరెత్తుతున్న సమయంలో సదరు విప్పిన నేత సమాధానమేమిటంటే... ''దీన్ని గుడ్డలిప్పడంగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కాలేద''ని. అర్థమైతే మహాత్ముడు- అర్థం కాకపోతే అద్వాని!
మనం అవతలిదేశంతో ఎలా వ్యవహరిస్తున్నాం, అవతలి దేశం మనతో ఎలా ఉంటోందన్నది దౌత్యంలో ప్రాథమికం, ప్రధానం. ఏకపక్ష గౌరవాలు, మర్యాదలు ఇచ్చేది సామంత రాజ్యమవుతుందే తప్ప సార్వభౌమ రాజ్యం కాలేదు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో రెండుమార్లు తన గుడ్డలూడదీసిన వైనాన్ని ఫెర్నాండెజ్ ఏనాడో పూసగుచ్చారు. విప్రో నిర్మాత అజీమ్ ప్రేమ్‌జీ, నటుడు కమల్‌హాసన్ సైతం ఇలా ఏదోరకంగా అవమానాలకు గురైనవారే. కాబట్టి ముంబాయిలో సినిమా షూటింగ్‌కోసం వచ్చిన ఏంజెలినా జోలి దేహరక్షకులే మనల్ని, మన జాతీయతను అవమానించారని బాధపడటం వ్యర్థం! ఉప ప్రధాని, రక్షణమంత్రి పదవుల్లోని వ్యక్తులనే పట్టించుకోని దేశంలోని వ్యక్తులు... ఆఫ్టరాల్, ముంబాయిలో ఓ స్కూలు పిల్లల్ని, వాళ్ళ అమ్మాబాబుల్ని సహేతుకంగా, సవినయంగా గౌరవిస్తారన్నదే వేరూ మొదలూ లేని ఆలోచన. అగ్రరాజ్యం నాయకత్వం తన పౌరులకు శాంతిసౌభ్రాత్రాలు, మానవతా విలువలు, సమానత్వ సూత్రాల స్ఫూర్తిని ఉగ్గుపాలలోనో సీసాపాలలోనో కలిపి పట్టిందనే వెర్రి నమ్మకాలెవరికీ లేవు. మిగతా ప్రపంచంలో అర్భకులు, అంగుష్ఠమాత్రులు మాత్రమే ఉంటారన్న భావన అక్కడి మనుషుల్ని కనిపించనివ్వనంత ఎత్తున అమెరికా నాయకత్వంలో మేటవేసి ఉన్నప్పుడు... ఆ దేశంలోని పౌరులందరిలో ప్రజాస్వామిక, మానవతా విలువలు హిమనదాల్లా ప్రవహించాలన్నదే దుస్వప్నం. ఇరాక్‌లో ఇరాకీలు, ఆఫ్ఘనిస్థాన్‌లో ఆఫ్ఘనీలు మాదిరే ఇండియాలో ఇండియన్లూ తమకన్నా తక్కువ జాతివారనే భావం కలగబట్టే మనదేశంలోనే మనం 'బ్లడీ ఇండియన్స్!'
'మీ దేశంలో భద్రత, రక్షణ వ్యవస్థలమీద మాకు నమ్మకం లేదు ఫొ'మ్మంటే క్లింటన్, బుష్‌ల పర్యటన సమయాల్లో మన సర్కార్లు తలూపాయి. వారి అధ్యక్షుడు పర్యటించే మన కార్యాలయాలు, ప్రదేశాలు అమెరికన్ల అధీనంలోకి వెళ్ళిపోయాయి. మన ప్రధాని, రాష్ట్రపతి ఎవరైనా, ఎప్పుడన్నా న్యూయార్కో వాషింగ్టనో సందర్శిస్తున్నప్పుడు... అదేతరహాలో వారి కార్యాలయాల్ని 'భద్రతా కారణాల దృష్ట్యా' మన దేశం అధీనంలో ఉంచాలని అడిగే సాహసమైనా మన నాయకత్వానికి ఉందా? ఇక్కడైనా అక్కడైనా మన భద్రతకన్నా వారి భద్రతే మెరుగని ఒప్పేసుకోగల చవటాయిత్వం మాత్రమే ఉంది. 'క్లింటన్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన చేతిని' నెలరోజులపాటు కడుక్కోనని చెప్పగల బులపాటమే మన ఎంపీల్లో సైతం బయటపడింది. పౌరుడి ప్రాణానికి విలువలేని ఇండియాలో పుట్టినా మనం ఎలా బతగ్గలుగుతున్నామన్నదే వారికి అర్థంకాని ప్రశ్న. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించారంటే సరే... ఓ నటికి కూడా అక్కడి దేహరక్షకులతోనే భద్రత కల్పించేందుకు మన ప్రభుత్వాలు ఎలా అనుమతించాయన్నది మనకు అర్థంకాని ప్రశ్న. ఈ దేశంలో కూడా సర్కారున్నది అమెరికన్ల రక్షణపట్ల శ్రద్ధ చూపడానికి మాత్రమేనా అన్నది సమాధానం లభిస్తున్న సందేహం.
ఏంజెలినా జోలి దేహరక్షకుల్లో ముగ్గురిమీద మన పోలీసులు కేసులు పెట్టేసినమీదట... ఇండియాలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని విదేశాల్లో ఎవరైనా భ్రమపడితే వాళ్ళ ఖర్మ. ఏకంగా ఓ విమానం వేసుకొచ్చి మన దేశంలో ఆయుధాల బోషాణాలు జారవిడిచి అదృష్టం బాగోక దొరికిపోయిన విదేశీయుల్ని మన ఘన జన సర్కారు ఏం చేసింది? మొహమాటపడి వదిలేసింది. ఏదో రష్యా, లాత్వియా, బ్రిటన్ లాంటి దేశాల నాయకులు మాటవరసకు అడగ్గానే శత్రువుల్ని, కుట్రదారుల్ని కూడా వదిలేసిన మన ప్రభుత్వాలు... అందచందాల అమెరికన్ తార దేహరక్షకుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టిస్తారా? ఉపప్రధాని, రక్షణమంత్రి వస్త్రాపహరణకు గురైతేనే పొడుచుకురాని రోషం... మన బడిపిల్లల్ని, వాళ్ళమ్మానాన్నల్ని అన్నంతనే ఎగదన్నుకు వస్తుందా? ఆ ముగ్గుర్నీ వదిలేయండని అగ్రరాజ్యం అధ్యక్షులవారు అడక్కపోయినా బేఫరవా! అమెరికానుంచి ఎవరు ఫోన్ చేసినా క్షణమాలస్యం చేయకుండా ఆపని కానివ్వాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకోలేదని ఎవరు చెప్పగలరు? గాంధీపుట్టిన దేశంలో మహోన్నత జాతిని నిర్మించలేని మన నాయకుల్ని ఈ దేశంలో ప్రజలు అనగలిగిందేమిటి..?
(Eenadu,19:11:2006
http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2)
________________________________________________________
Labels: Indians/ Telugu
0 Comments:
Post a Comment
<< Home