My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, November 16, 2006

'పెద్దబాలశిక్ష '

.....వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకొని పోవడం వాళ్ళకు తప్పుగా కనపడలేదు. వారి కొలువులో వున్న దేశీయులు బతుకు తెరువు కోసం చేతనైన ఆర్జనలు చేయడం తప్పు కాదనిపించింది. రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న నేటివులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని తెల్లదొరలు గుర్తించారు.నేటివులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు.నేటివుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :
‘రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా
సర్వేలు చేయించాము .దేశంలో పండే పంటల ఆరాలు
తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము.జనాభా
లెక్కలు గుణించాము.అంతేగాని నేటివుల విద్యావిధానం
గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.'

నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు.
1832 లో మేస్తర్ కుళులో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రిగారి చేత ‘బాలశిక్ష ‘అనే గ్రంథాన్ని రచింపచేశాడు. వీరి రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.

1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు.
1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని 'బాలవివేకకల్ప తరువు 'గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం 'పెద్దబాలశిక్ష 'గా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్దబాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.

ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు 'పెద్దబాలశిక్ష 'ను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో 'గుజిలీ ' ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి.పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ
1916లో వావిళ్ళ వారిది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు.భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు: “భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు.... విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి ('పెద్దబాలశిక్ష ') గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.” ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ 'పెద్దబాలశిక్ష 'కు ఉంది.1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు 'పెద్దబాలశిక్ష 'ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
________________________________________
(
సంకలనం: బుడ్డిగ సుబ్బరాయన్ గారి "సురభి-పెద్ద బాలశిక్ష"1997, లోని ఆరుద్ర గారి 'ఆనంద వాక్యాలు ', బుడ్డిగ సుబ్బరాయన్ గారి 'నా మాట ' ల నుండి)
________________________________________
ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలపైనే 'పెద్దబాలశిక్ష 'లు లభిస్తున్నాయి. పైచెప్పిన బుడ్డిగ సుబ్బరాయన్ గారి
"సురభి-పెద్ద బాలశిక్ష"-1997(398 పుటలు)రూ.119.99 మరియు గాజుల సత్యనారాయణ గారి "తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష"-2005 (1022 పుటలు)రూ.116- రెండూ కూడా మంచి సంప్రదింపు గ్రంథాలు.
____________________________________________

Labels: ,

1 Comments:

Anonymous Anonymous said...

రావు గారు, ఇది వికిపీడియాలో పెట్టండి. చాలా విజ్ఞానదాయకముగా ఉంది

7:42 pm

 

Post a Comment

<< Home