My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, November 19, 2006

రుతు ప్రభావం

ఆగదు ఈ కాలం క్షణాల ఇంద్రజాలం- అన్నట్లుగా కాలం ఎవరి కోసమూ ఆగదు. కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ''కాలానికొక్కటే పని. అది రావడం వచ్చి వెళ్ళిపోవడం. నిజానికి రెండూ ఒకటే'' అన్నారు శ్రీపాదవారు. పగలు గడిచి రాత్రి దగ్గరపడుతున్నకొద్దీ వాతావరణం సహజంగానే మారిపోతూ ఉంటుంది. గోధూళివేళ గడిచి, పక్షులు గూళ్ళకు మళ్ళే తరుణం దాటి చీకటి ముసిరి రాత్రి చిక్కబడుతుంది. ఆ తరవాత మామూలుగానే తెల్లవారుతుంది. ఈ వైనాన్ని- ''అంధకారము దిక్కులనంతరించె, మెల్లమెల్లన తెల్లన వెల్లువయ్యె, అంతలోపల జగమంత హ్లాదపరత నలర బ్రకృతి స్మితస్మేర లలితమయ్యె'' అంటూ మనోహరంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారో కవి. రేయింబవళ్లు, మారే రుతువులు- అన్నీ ప్రకృతి లీలావిలాస కావ్యంలోని మధురాధ్యాయాలే. ''ఏతమెత్తేకాడ ఎదురుగా కూకుండి సూరియుణ్ని తిట్టు నా ఎంకి, మల్లీ ఎప్పటల్లె తెల్లారిపోతుంటె సెందురుణ్ని తిట్టు నా ఎంకి'' అంటాడు నాయుడుబావ. ఇంకా పొద్దుపోవటంలేదే అని సణుక్కునే యువజంటలే ఆ తరవాత అప్పుడే తెల్లారిపోతోందే అని విసుక్కోవటమూ పరిపాటి. ఎవరెలా అన్నా, అనుకున్నా కాలం మాత్రం దాని మానాన అది గడిచిపోతూనే ఉంటుంది. ''ఇద్దరు ఇంగ్లిష్ పెద్దమనుషులు కలిస్తే వాతావరణంతోనే వారి ప్రసంగం ప్రారంభమవుతుంది'' అంటాడు శామ్యూల్ జాన్సన్ అనే రచయిత. ఇంగ్లిష్‌వారనే కాదు అసలు ఏ ఇద్దరు కలిసినా సంభాషణ మొదలుపెట్టడానికి వాతావరణమే తగిన వీలు కల్పిస్తుంది. ''అబ్బ ఏం ఎండ కాసిందండీ ఈ వేళ. రోహిణీకార్తెలో రోళ్ళు పగిలిపోతాయంటారు. రోహిణీ ప్రతాపం ముందే కనిపిస్తున్నట్లుంది'', ''పొద్దుట్నించీ ఒకటే వాన మా ఆవిడ సణుగుళ్ళా. ఇల్లు కదలటానికే వీలులేకపోయింది'', ''ఈ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉన్నట్లుందండీ''- ఇలాంటి సంభాషణలే ఏ ఇద్దరు కలుసుకున్నా!
ఒక రుతువును వెన్నంటి మరో రుతువు ప్రవేశిస్తూ తన విలాసాలు, హొయలు ఒలకబోసి మనుషులను ఆహ్లాదపరచడం, ఒక్కొక్కసారి విసుగునూ కలిగించడం సహజం. ''కుహుకుహుయంచు కోకిల కూసినపుడు, భమ్మటంచు దుమ్మెద పాడినపుడు నల్లపవనుడు మెల్లగా నానినపుడు-'' వసంతకాలం వచ్చేసిందని ఒకరు చెప్పకుండానే తెలిసిపోతుంది. మావిచిగురు తిని కోకిలలు గొంతులు సవరించుకొని గానాలాపనలకు దిగే కాలం వసంతకాలం. ఆపై పగటివేళలు పొడుగై ఎండలు మెండై వేసవికాలం ప్రవేశిస్తుంది. బొండుమల్లెలు వికసించినా, పండువెన్నెలలు కాసినా ఉస్సురుస్సురంటూ వేసవి తాపానికి తట్టుకోకతప్పదు. ఈ కాలంలో- దివసాంత రమ్యాణి- అన్నాడు కాళిదాస మహాకవి. పగలు ఎంత ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి మలయమారుతం సాగి మనసూ శరీరమూ సేద తీరతాయి. వర్షరుతువు ఎవరినైనా సంతోషపరచేదే. ''రసిక హృదయములోలలాడే మసుపు దినములు మరలివచ్చెను. మిసిమి మబ్బులు వ్రేలు మేలిమి ముసుగుతో నాకసము విచ్చెను...'' అంటూ జనమంతా ఆనందించేది వర్షకాలం. వాన చినుకుల్లో తడుస్తూ పిల్లల సంబరాల ఆటలకు అడ్డూ ఆపూ ఉండనిది, రైతు జనాలకు పండుగదినాల కాలం. పొలం పనులు ముమ్మరంగా సాగేది ఆ రుతువులోనే. ''ఇంత లేమబ్బు చిరు తున్కయేని లేదు విప్పిరేమొ నిశారాజి వెల్లగొడుగు'' అని అబ్బురపడే విధంగా పుచ్చపువ్వులా వెన్నెలలు విరిసేదే శరదృతువు. కాలానుగుణమైన వైభవంతో విరిసిపోయే ప్రకృతి సౌందర్యం ఎంత వర్ణించినా తనివి తీరనిదే. అందుకే ''ప్రకృతి మధురంబులకు వేషరచనలేల, ప్రకృతి సుందరతకు వేరు వేషమేల'' అన్నారో కవి.

శీతకాలం అడుగు పెడుతూనే చలి విజృంభిస్తుంది. పగటి వేళలు తరగి రాత్రి సమయం పెరుగుతుంది. తెల్లవారినా దుప్పటి ముసుగులోనే కాలక్షేపం చేయటానికి మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఎండ రావటమే పండుగగా భావిస్తూ ఉంటారు. శీతకాలంలో బద్దకం పెరుగుతుంది. సూర్యరశ్మి తక్కువ కావటాన వాతావరణ రీత్యా ఏర్పడే ఆరోగ్య సమస్యలు కొన్ని ఈ కాలంలోనే పీడిస్తాయి. వైద్య పరిభాషలో 'శాడ్' అని వ్యవహరించే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్' ఈ కాలంలోనే ఎక్కువవుతాయంటారు వైద్య శిఖామణులు. పగటి పొద్దు తక్కువ కావటంతో మనుషులకు నిద్రమత్తు అంత తేలికగా వదలదు. ఎంత పొద్దెక్కినా మనుషుల్లో ఉత్సాహం ఉరకలేయదు. కొంచెం మూడీగా ఉంటారు. ''అదివరకే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు తిరగబెట్టే అవకాశం శీతకాలంలోనే ఎక్కువ...'' అంటున్నారు ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ రాజేశ్ సాగర్. సూర్యరశ్మి తక్కువగా ఉండటంవల్ల మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో తేడా కనిపిస్తుంది. మెదడు అడుగుభాగంలో ఉండే ఓ గ్రంథి ఉత్పత్తిచేసే ఈ హార్మోనే నిద్రను ప్రభావితం చేస్తుంటుంది. వెలుతురు మందంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువై నిద్రమత్తును కలగజేస్తుంది. అతి నిద్ర, విసుగు, బరువు ఎక్కువ కావటం లేదా బాగా తగ్గిపోవటం వంటి అవలక్షణాలన్నీ ఈ రుతుప్రభావం వల్ల సంప్రాప్తించవచ్చు. వీటిని తట్టుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం వేళల కొంతసేపు బయట గడపటం, వీలైతే ఒక గంటసేపు బయట విహరించటం మంచిదంటున్నారు డాక్టర్లు. ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు సైతం శీతకాలంలోనే తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ బెడద ప్రతి సంవత్సరం ఉండేదే అయినా ఈ సంవత్సరం చలి కాస్త ఎక్కువగా ఉండే సూచనలున్నాయంటున్నారు డాక్టర్లు. ముందుజాగ్రత్తగా రగ్గులు, శాలువాలు పైకి తీసి దుమ్ముదులిపి సిద్ధంగా ఉంచుకోవటం మంచిది! వస్తోంది శీతకాలం బహుపరాక్...
(Editorial, Eenadu,19:11:2006)
_________________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home