సారంగ నియంత్రణ

ఉబుసుపోకకు చెప్పే కథలను పిట్టకథలంటారు. పిట్టలే ఎన్నో పెద్దకథలు నడిపిన ఉదంతాలు ప్రపంచంలోని అన్ని భాషల సాహిత్యాల్లో కొల్లలుగా ఉన్నాయి. శుకసప్తతి, హంసవింశతి వంటి తెలుగు గ్రంథాలు ఆ కోవకు చెందినవే. కొంగజపం ప్రసిద్ధిచెందిందే. ''కొంగ ఒంటికాలిమీదే నిలబడి ఎందుకు జపం చేస్తుందో తెలుసా?'' అని అడిగాడు అయ్యవారు. ''తెలియకేం సారూ రెండో కాలు కూడా పైకెత్తితే పడిపోదు మరీ'' అని జవాబు చెప్పాడు పిడుగులాంటి శిష్యుడు. పావురాలను పెంచుకోవటం వాటితో పందాలు కాయటం పూర్వంనుంచీ ఉన్నదే. సారంగధర నాటకానికి కేంద్రబిందువు ఓ పావురం. తాను అల్లారుముద్దుగా చూసుకుంటున్న పావురాన్ని పరికించి సారంగధరుడు, ''ఖగముగాదిది బంగారు నగముగాని, పక్షిగాదిది శృంగార కుక్షిగాని, పులుగుగాదిది నిండు రేవెలుగుగాని, పిట్టగాదిది సొగసుల పుట్టగాని'' అంటూ ముచ్చటపడిపోతాడు. అటువంటి సొగసుల పుట్టే చిత్రాంగి మేడమీద వాలి గొప్ప కథ నడిపిస్తుంది. శిక్షణ పొందిన పావురాలు వార్తలను మోసుకుపోవటం పూర్వంనుంచీ జరుగుతున్నదే. ఎంతదూరం ఎన్ని మైళ్లు వెళ్లినా దోవ గుర్తుపెట్టుకొని తిరిగి బయలుదేరిన చోటుకే రావటం వాటి ప్రత్యేకత. యుద్ధ సమయంలో పావురాల సేవలను ఉపయోగించుకునేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ సైనికులు పావురాల ద్వారానే సందేశాలు పంపుకొనేవారు. అటువంటి పావురాల వైపు ఇప్పుడు చైనా శాస్త్రజ్ఞుల దృష్టి మళ్లింది.
కాయకాని కాయ ఏది అని పొడుపుకథ పొడిస్తే తలకాయ అని టక్కున జవాబు చెబుతారు పిల్లలు. అలాగే పావురం కాని పావురం ఏది అంటే రోబో పావురం అని చటుక్కున జవాబు చెప్పేస్తున్నారు చైనాలోని శాస్త్రజ్ఞులు. మెదడు ఆ పక్షిదైనా దాన్ని నియంత్రించి తమ ఆదేశాల ప్రకారం నడిపించే అధునాతన శాస్త్ర పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. ఒక మామూలు పావురం మెదడులోకి ఎలక్ట్రోడ్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తమ ఆదేశాల ప్రకారం అది నడుచుకునేలా చేయగలిగారు. ఇటువంటి పావురాలను రోబో పావురాలు అంటున్నారు. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో ఇది మరో ముందడుగుగా చెబుతున్నారు. చైనాలోని కింగ్‌డావో నగరానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనకార్యాన్ని సాధించారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా శాస్త్రవేత్తలు ఇచ్చే సంకేతాలను పావురం మెదడులోని ఎలక్ట్రోడ్స్ గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తాయి. రోబో పావురాలు శాస్త్రవేత్తలు ఎగరమంటే ఎగిరి దిగమంటే కిందికి దిగి ఏవైపు తిరగమంటే ఆ వైపు తిరిగి ప్రయాణం చేస్తాయి. ''ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో ఇదో కొత్తమలుపు'' అంటున్నారు షాండాంగ్‌లోని శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ సూఝయెచెంగ్. దేశరక్షణ సహా అనేక కార్యక్రమాలకు రోబో పావురాలను ఉపయోగించుకోవచ్చని ఆయన అభిప్రాయం. ఇప్పటివరకు సరైన రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాలకు ఉత్తరాలను బట్వాడా చేయడంలో శిక్షణ పొందిన పావురాలు తమ సేవలందిస్తూ తంతి తపాలా శాఖకు తోడ్పడుతున్నాయి. వాటి మెదడును తమ అధీనంలోకి తెచ్చుకోవటం ద్వారా పావురాలను మరిన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలకు వినియోగించుకోగలిగే వీలు ఏర్పడింది. ఈ సారంగ నియంత్రణ- పిట్టకథల్ని మేలుమలుపు తిప్పుతున్న శాస్త్రప్రగతే మరి!
(Eenaadu-01:04:2007)
--------------------------------------------------------
Labels: Animals/ telugu
0 Comments:
Post a Comment
<< Home