My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, October 17, 2011

సర్వేజీవా సుఖినోభవంతు


జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.

జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!

మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

(ఈనాడు సంపాదకీయం, ౨౪:౦౭:౨౦౧౧)
______________________________

Labels:

Monday, September 24, 2007

పక్షులు

[1]చక్రవాకము=the ruddy goose or Brahmany duck, [Anas casarca],కోకము, జక్కన పక్షి.The poetical swan, always described as being in pairs(క్షణ విరహంకూడ సహించలేనవి).


______________________________________

[2]క్రౌంచము=a kind of heron or curlew, [Ardea jaculator ]కొంచపిట్ట, ఒకవిధమగు కొంగ

[కీ.శే.బూదరాజు రాధాకృష్ణగారి "మాటల మూటలు" లోని 'పక్షి సంతతి ' అధ్యాయంనుండి ఈ క్రింది అంశం, ఆసక్తిదాయకంగా ఉందని, ఎత్తి రాయబడింది:-
"మన పరిసరాల్లో కనిపించే మరో పక్షి
కొంగ. ఈ తెలుగు మాటకు 'కొక్కెర, కొక్కెరాయి, పుల్లగొరక, గుండగి ' మొదలైన పేర్లున్నాయి. 'పెద్ద కొక్కెర, తెల్లకొక్కెర,గుడ్డికొంగ, చీకుకొక్కెర, పక్కు కొంగ, గుడి కొంగ, దోసికొంగ, సినిగలకొంగ, సంకుబుడ్డి కొంగ ' వంటి భేదాలున్నాయి.

'
కొంచ ' అనే తద్భవనామముంది. అది క్రౌంచ/క్రుంచ శబ్దభవం- అంటే వంగిన, మెలికలు తిరిగిన (మెడగలది) అనే అర్థంలోనన్నమాట.

'బకం,
సారసం, క్రౌంచం, లోహపృష్థం ' అనే సంస్కృత పదాలు పర్యాయ పదాలు.వీటిలో మొదటిదే సాధారణ పదం.సరస్సుల్లో ఉంటుంది కాబట్టి సారసమన్నారు.వంపు మెడగలది కాబట్టి క్రౌంచం.కట్టెల్లాంటి కాళ్ళున్నది కాబట్టి లోహపృష్ఠం.ష్థం బకమంటే మోసకారి, దొంగ అని విశేషార్థం.'కొంగజపం ' వల్ల ఈమాట పుట్టింది.పెద్ద కొక్కెరను బిసకంఠిక, బలాకం అంటారు. కొక్కెరను కృకణం, క్రకరం అంటారు.గుడ్డి కొంగను కోయష్టికం అంటారు.పక్కు కొంగను కహ్వ మంటారు, సంస్కృతంలో. " ]
________________________________________



[3]చకోరకము/చకోరము
=వెన్నెలపులు(గు, the bartavelle or Greek parridge: a bird much referred to in poems:corresponding to the nightingale, or turtle dove (చంద్రకిరణములకు చకోరపక్షులు ఏ విధముగా నిరీక్షించుకొనియుండునో)
____________________________________

(చాతక పక్షులు= తలకిందులుగా ఎగురుతూ వెన్నెలనో మంచు బిందువుల్నో మాత్రమే తాగి బతికే పక్షులు,వాన కోయిల )
_____________________________________

Labels:

Monday, July 09, 2007

శునకభోగం


''జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి'' అని ఓ తత్వం బోధిస్తుంది. మనుషులు మిగతా ప్రాణికోటికన్నా అధికులన్న మాట ఎంత వాస్తవమో, ఇతర ప్రాణుల సహాయ సహకారాలు లేకుండా మానవుడు మనుగడ సాగించలేడన్నదీ అంతే యథార్థం. నాగరికత ఇంతగా ప్రబలని రోజుల్లో మనుషులకు ఇతర ప్రాణులతో సన్నిహితత్వం ఎక్కువగా ఉండేది. కోడికూతతో కాని పల్లెసీమల్లో తెల్లవారేది కాదు. కవ్వపు చప్పుళ్ల నేపథ్యంలో కుక్కలు, పిల్లుల షికార్లు మొదలయ్యేవి. మెడలో చిరుగంటలు గణగణమని మోగుతుంటే బసవన్నలు పొలాలకు బయలుదేరేవి. బసవలకు, పాడిపశువులకు రకరకాల పేర్లుపెట్టి రైతు యువకులు ముద్దుముద్దుగా పిలుచుకునేవారు. అటు చుక్కపొడిచి ఇటు తెల్లవారగానే ఇల్లాళ్లు పాలు పితకటానికి తయారై- ''సురభి ధేనువరావె, సుందరిరావె, పాలవెల్లిరావె పాంచాలిరావె, త్రిపురసుందరి రావె తియ్యమామిడిరావె'' అంటూ గోమాతలను ఆప్యాయంగా పిలిచేవారని ఓ జానపద గీతంలో వర్ణించారు. గతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు తలపెట్టినప్పుడు కాబోయే వియ్యాలవారింట్లో ఎలుకల, పిల్లుల సంచారం అధికంగా ఉందా లేదా అని పరీక్షించేవారు. అలా ఉంటే వారింట్లో పాడిపంటలకు లోటులేదని గ్రహించి సంబంధం ఖాయం చేసుకొనేవారు. పూర్వం రాజకుమార్తెలు చిలుకలను, గోరువంకలను పెంచుకుంటే ఇప్పటివారు కుక్కపిల్లలను పెంచుకోవడంపై ఎక్కువ మోజు చూపుతున్నారు.

ఆ అమ్మడు బోలెడంత డబ్బుపోసి కొత్తగా ఓ బొచ్చుకుక్కను కొని తీసుకొచ్చింది. దాన్ని చూడటానికి రమ్మని తన బాయ్‌ ఫ్రెండును ఆహ్వానించింది. ''చూశావా మోహన్‌- ఎంత బాగుందో.. దగ్గరకెళ్లి పలకరించు'' అంది. ''కుక్క బాగానే ఉంది. దగ్గరకెళ్లమంటున్నావు. కొంపతీసి కొత్తవాళ్లను చూసి కరవదు కదా...'' అన్నాడు మోహన్‌. ''అది తెలుసుకుందామనేగా నిన్ను వెళ్లమంటున్నది'' అంది అమ్మడు చల్లగా.

తోటి ప్రాణులను పెంచుకుంటూ ముద్దుచేస్తున్నా, వాటిని చిన్నబుచ్చుతూ వ్యాఖ్యానాలు చేయటమూ మనుషులకు అలవాటే. ఆ అలవాటువల్లే- ''గాడిదకెందుకురా గంధంబు వాసన, కుక్కకెందుకు కుచ్చుల జీను...'' వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ''అందువల్ల ఆ జీవాలకు పోయిన పరువేం లేదు. ఆ సామెతలు సృష్టించినవారి బుద్ధే బయటపడింది'' అని జంతుప్రేమికులు వాదిస్తుంటారు. ''ఎవ్వరి గుణములు ఏమన్న మానవు... చక్క చేయరాదు కుక్కతోక...'' అన్నాడో శతకకారుడు. మా తోకల సంగతి మీకెందుకు, ముందు మీ బుద్ధులు సరి చేసుకోండి చాలు- అంటూ శునకాలు భౌభౌమంటూ కయ్యానికి దిగితే ఆయనేమంటాడో తెలియదు. సుమతీ శతకకారుడైతే ఏకంగా శునకాలను కనకపు సింహాసనాలపై కూర్చోపెట్టినా వాటి వెనుకటి గుణాలు మానుకోవని ఎద్దేవా చేశాడు. ''మనుషులు మాత్రం మానుకుంటున్నారా? అధికార సింహాసనాలపై కూర్చుంటున్నా గడ్డి తినటం మానుకుంటున్నారా, చెప్పులు కొరకటం మానేస్తున్నారా...'' అని కుక్కలు కొక్కిరిస్తే ఆయనేం సమాధానమివ్వగలడు? నేరాలను పసిగట్టడంలో శిక్షణ పొందిన శునకాల సహాయం పోలీసులు తీసుకోవడం పరిపాటి. పరమ శివుడంతటివాడు చెంచువేషంలో వేటకు బయలుదేరినప్పుడు నాలుగు వేదాలను నాలుగు జాగిలాలుగా మార్చి తీసుకువెళ్ళాడంటారు.

పాశ్చాత్య దేశాల్లో పెంపుడు కుక్కలేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. వాటిని ఖరీదైన దుస్తులతో, నగలతో అలంకరించటం కుక్కలకు ఫ్యాషన్‌షోలు నిర్వహించటం వంటి కార్యక్రమాలూ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సువంటి దేశాల్లో షరా మామూలు. జపాన్‌ వారికీ కుక్కలంటే మక్కువ ఎక్కువే. ఇప్పుడు కొత్తగా సరాది కార్పొరేషన్‌ అనే సంస్థ జపాన్‌లో కుక్కలకోసం ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పింది. ప్రపంచంలోకెల్లా జపాన్‌లోనే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. రోజురోజుకు వీరిసంఖ్య పెరిగిపోతోంది. 2055 నాటికి జపాన్‌ జనాభాలో 40 శాతానికిపైగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఉంటారని అంచనా. పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూసుకోవడం వృద్ధులైన యజమానులకు కష్టతరమైన కార్యంగా పరిణమిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ వ్యాపకాల్లో తలమునకలై పోతుండటంతో ఇళ్లదగ్గర కుక్కల సంరక్షణను చూసేవారు లేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనుషులకు వృద్ధాశ్రమాలు కొత్తేమీ కాదు. అటువంటి సౌకర్యమే కుక్కలకు ఎందుకు కలిగించకూడదు అనే ఆలోచన సరాది కార్పొరేషన్‌కు చెందిన నానా ఉచిడా బుర్రలో మెరిసింది. దాన్ని వెంటనే కార్యరూపంలోకి తెచ్చి, ఉత్తర టోక్యోలోని నాసు ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలో కుక్కలకు సకల సౌకర్యాలు కలిగిస్తూ తమ యజమానులకు దూరంగా ఉంటున్నామనే బెంగ వాటికి కలగకుండా చేస్తున్నాడు. యజమానులు అప్పుడప్పుడూ వచ్చి తమ కుక్కలను చూసి పలకరించి ముద్దుచేసి పోవచ్చు. నిర్వహణ ఖర్చులకింద ఒక్కో కుక్కకు నెలకు లక్ష యెన్‌లను వసూలు చేస్తున్నా యజమానులు లెక్కచేయటంలేదు. వృద్ధాప్యంలోను తమ కుక్కలు కులాసాగా ఉండాలనే కాంక్ష ఈ ఆశ్రమంవల్ల తీరుతోందని వారు సంతోషిస్తున్నారు. పెంపుడు జీవాలకో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జపాన్‌లో ఇదే మొదటిసారి అయినప్పటికీ మనదేశంలో అటువంటి కేంద్రాన్ని చెన్నైకి చెందిన అశోక్‌ చాలాకాలం క్రితమే ప్రారంభించాడు. ఆయన నడుపుతున్న కేంద్రంలో కుక్కలే కాక కొన్ని పిల్లులూ ఆశ్రయం పొందుతున్నాయి. కేరళ ప్రభుత్వమూ వయసు మళ్లిన ఏనుగుల సంరక్షణకోసం ఓ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవన్నీ వింటుంటే మూగజీవాలకూ దశతిరిగే రోజులొచ్చాయనిపించడంలేదూ...
(Eenadu,08:07:2007)
__________________________________

Labels:

Sunday, May 13, 2007

సారంగ నియంత్రణ

మానవుడు సంఘజీవి. తోటి మనుషులతోనేకాక ఇతర జీవాలతో కూడా సన్నిహితంగా ఉండటం పరిపాటి. ఒకప్పటి రాణివాస స్త్రీలు తమ అంతఃపురాల్లో చిలుకలు, గోరువంకలు, హంసలు తదితరాల్ని శ్రద్ధగా పెంచుతుండేవారు. వాటిని ఆడిస్తూ, వాటితో ఆడుకుంటూ పొద్దుపుచ్చుతుండేవారు. పక్షుల కిలకిలారావాలతో వారి మందిరాలు నిత్యం సందడిగా ఉండేవి. అటువంటిది పారిజాత పుష్పం తనకు ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చాడని అలిగిన సత్యభామ పెంపుడు పక్షుల జోలీ పట్టించుకోలేదు. దాంతో అంతఃపురం నిశ్శబ్దమైపోతుంది. ఆ సమయంలో సత్యభామ మందిరంలోకి అడుగుపెట్టిన కృష్ణుడు అక్కడి గంభీర వాతావరణం చూసి ఆశ్చర్యపోతాడు. ''కనక పంజర శారికలకు జక్కెరవెట్టి చదివింపరేలొకో సకియలిపుడు, కరతాళగతుల మందిర మయూరంబుల నాడింపరేలొకో యతివలిపుడు, కలికిరాయంచబోదల నల్లనెలయించి నడిపింపరేలొకో పడతులిపుడు'' అంటూ సందేహపడతాడు. ''ఇన్ని దినములవలె నుండదేమి నేడు, చిన్నవోయినదీమేడ చెన్నుతరిగి'' అనుకుంటాడు. ఆపై అసలు కారణం తెలుసుకొని ఏకంగా పారిజాత వృక్షాన్నే అమరపురినుంచి పెకిలించుకొని రావటమే పారిజాతాపహరణ కావ్య ఇతివృత్తం. మాటలు నేర్చిన హంసలు, చిలుకలు ప్రేమికుల మధ్య రాయబారాలు నడిపి వారికి కల్యాణం జరిపించటమే తెలుగులో కొన్ని కావ్యాలకు కథావస్తువైంది. జానపద కవులూ తమ పాటల్లో పక్షుల పాత్రకే ప్రాధాన్యమిచ్చి కథ నడిపించిన సందర్భాలున్నాయి. సాధుచరిత సీతా ఒకసారి రామచంద్రునిపై అలిగింది. అప్పుడు శ్రీరాముడు తన ముంజేతి రామచిలుకనే రాయబారం పంపుతాడు. ''చిలకరో ఓ చిలుక మా రామచిలుక ఎర్రని ముక్కుకు వెండి పొదిగిస్త, పచ్చని రెక్కలకు పయిడిపూయిస్త, నీవు పోయెడ త్రోవ సెలగవేయింతు, సెలగతిని చెయికడగ చెలమతీయింతు'' అంటూ ఇన్ని ఆశలుపెట్టి రామచిలుకను రాయబారం పంపుతాడు. చిలుక రాయబారం సఫలమైందని వేరే చెప్పనక్కర్లేదు.
ఉబుసుపోకకు చెప్పే కథలను పిట్టకథలంటారు. పిట్టలే ఎన్నో పెద్దకథలు నడిపిన ఉదంతాలు ప్రపంచంలోని అన్ని భాషల సాహిత్యాల్లో కొల్లలుగా ఉన్నాయి. శుకసప్తతి, హంసవింశతి వంటి తెలుగు గ్రంథాలు ఆ కోవకు చెందినవే. కొంగజపం ప్రసిద్ధిచెందిందే. ''కొంగ ఒంటికాలిమీదే నిలబడి ఎందుకు జపం చేస్తుందో తెలుసా?'' అని అడిగాడు అయ్యవారు. ''తెలియకేం సారూ రెండో కాలు కూడా పైకెత్తితే పడిపోదు మరీ'' అని జవాబు చెప్పాడు పిడుగులాంటి శిష్యుడు. పావురాలను పెంచుకోవటం వాటితో పందాలు కాయటం పూర్వంనుంచీ ఉన్నదే. సారంగధర నాటకానికి కేంద్రబిందువు ఓ పావురం. తాను అల్లారుముద్దుగా చూసుకుంటున్న పావురాన్ని పరికించి సారంగధరుడు, ''ఖగముగాదిది బంగారు నగముగాని, పక్షిగాదిది శృంగార కుక్షిగాని, పులుగుగాదిది నిండు రేవెలుగుగాని, పిట్టగాదిది సొగసుల పుట్టగాని'' అంటూ ముచ్చటపడిపోతాడు. అటువంటి సొగసుల పుట్టే చిత్రాంగి మేడమీద వాలి గొప్ప కథ నడిపిస్తుంది. శిక్షణ పొందిన పావురాలు వార్తలను మోసుకుపోవటం పూర్వంనుంచీ జరుగుతున్నదే. ఎంతదూరం ఎన్ని మైళ్లు వెళ్లినా దోవ గుర్తుపెట్టుకొని తిరిగి బయలుదేరిన చోటుకే రావటం వాటి ప్రత్యేకత. యుద్ధ సమయంలో పావురాల సేవలను ఉపయోగించుకునేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ సైనికులు పావురాల ద్వారానే సందేశాలు పంపుకొనేవారు. అటువంటి పావురాల వైపు ఇప్పుడు చైనా శాస్త్రజ్ఞుల దృష్టి మళ్లింది.

కాయకాని కాయ ఏది అని పొడుపుకథ పొడిస్తే తలకాయ అని టక్కున జవాబు చెబుతారు పిల్లలు. అలాగే పావురం కాని పావురం ఏది అంటే రోబో పావురం అని చటుక్కున జవాబు చెప్పేస్తున్నారు చైనాలోని శాస్త్రజ్ఞులు. మెదడు ఆ పక్షిదైనా దాన్ని నియంత్రించి తమ ఆదేశాల ప్రకారం నడిపించే అధునాతన శాస్త్ర పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. ఒక మామూలు పావురం మెదడులోకి ఎలక్ట్రోడ్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తమ ఆదేశాల ప్రకారం అది నడుచుకునేలా చేయగలిగారు. ఇటువంటి పావురాలను రోబో పావురాలు అంటున్నారు. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో ఇది మరో ముందడుగుగా చెబుతున్నారు. చైనాలోని కింగ్‌డావో నగరానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనకార్యాన్ని సాధించారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా శాస్త్రవేత్తలు ఇచ్చే సంకేతాలను పావురం మెదడులోని ఎలక్ట్రోడ్స్ గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తాయి. రోబో పావురాలు శాస్త్రవేత్తలు ఎగరమంటే ఎగిరి దిగమంటే కిందికి దిగి ఏవైపు తిరగమంటే ఆ వైపు తిరిగి ప్రయాణం చేస్తాయి. ''ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో ఇదో కొత్తమలుపు'' అంటున్నారు షాండాంగ్‌లోని శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ సూఝయెచెంగ్. దేశరక్షణ సహా అనేక కార్యక్రమాలకు రోబో పావురాలను ఉపయోగించుకోవచ్చని ఆయన అభిప్రాయం. ఇప్పటివరకు సరైన రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాలకు ఉత్తరాలను బట్వాడా చేయడంలో శిక్షణ పొందిన పావురాలు తమ సేవలందిస్తూ తంతి తపాలా శాఖకు తోడ్పడుతున్నాయి. వాటి మెదడును తమ అధీనంలోకి తెచ్చుకోవటం ద్వారా పావురాలను మరిన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలకు వినియోగించుకోగలిగే వీలు ఏర్పడింది. ఈ సారంగ నియంత్రణ- పిట్టకథల్ని మేలుమలుపు తిప్పుతున్న శాస్త్రప్రగతే మరి!
(Eenaadu-01:04:2007)
--------------------------------------------------------

Labels:

Friday, February 09, 2007

మూగజీవాల వృద్ధాశ్రమం


సృష్టిలో ఏ ప్రాణినీ చులకనగా చూడకూడదు. ప్రకృతిలో సమతుల్యత నిలకడగా ఉండటానికి ప్రాణులన్నిటి అవసరమూ ఉంది. నాగరికత ఇంతగా లేని రోజుల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో మనుషులకు ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులువంటి జంతువులతోనే కాక పిచికలు, పిట్టలువంటి పక్షులతో కూడా సన్నిహితత్వం ఎక్కువగానే ఉండేది. అప్పట్లో కోడికూతతో కాని మనుషులకు మెలకువ వచ్చేది కాదు. కోయిలలు గొంతులు సవరించుకోవటం మొదలుపెట్టగానే వసంతకాలం వచ్చేసిందని సంతోషపడేవారు. కుక్క అరుపు ఊళ్ళోకి, నక్క అరుపు శ్మశానానికి దారి తీస్తుందని సామెత. ప్రతి విషయాన్నీ ఏదో ఒక ప్రాణితో లంకెపెట్టి గుర్తించటం పూర్వం రివాజుగా ఉండేది. దొడ్లో కాకి అరిస్తే చుట్టాలు వస్తారని ఆశించేవారు. కాకమ్మ కూతలూ కల్లలూ కావు అన్నలూ వచ్చేటి సూచనలు ఏమొ- అని అత్తింటి కోడళ్ళు ఆశగా చూసేవారు. ''ఈగతల్లి నీళ్ళాడి వీధివీధి నిండాలి, దోమతల్లి నీళ్ళాడి దొడ్డెల్ల నిండాలి, పాముతల్లి నీళ్ళాడి పంటచేలో తిరగాలి, కప్పతల్లి నీళ్ళాడి కడవపంచల కుయ్యాలి...'' అని రైతులు కోరుకొనేవారు. అలా జరిగితే అదనుకు వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్మేవారు. కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవటం మనుషులకు మొదటినుంచీ ఉన్న అలవాటే. పూర్వం భరతుడు అనే ముని తల్లిలేని ఓ జింకపిల్లను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకొచ్చి ముద్దుగా పెంచుకుంటాడు. క్రమంగా ఆ జింకపిల్లే అతనికి ఆరో ప్రాణం అయిపోతుంది. అటువంటి జింకపిల్ల ఓ రోజు ఆశ్రమంలోనుంచి పారిపోతుంది. అపుడా మునీశ్వరుడు పడిన బాధ అంతా ఇంతా కాదు. పెంపుడు జంతువులపై మనుషులు ఎంతగా మమకారాన్ని పెంచుకుంటారో ఇటువంటి ఉదంతాలన్నీ రుజువు చేస్తుంటాయి.

కాపలా కోసమే కాకుండా ముద్దుకీ కుక్కల్ని పెంచుకోవటం మనుషులకు కొత్తకాదు. వేటగాళ్ళు తమకు సాయపడేటందుకు జాగిలాలను పెంచుకొనేవారు. ''గుణవంతుడనే జాగిలము గొడుగు నీడను వచ్చు, హనుమంతుడనే జాగిలము అందలములో వచ్చు, ప్రతాపుడనే జాగిలము పల్లకీలో వచ్చు...'' అంటూ ఓ యాదవరాజు తన జాగిలాలకు ఎటువంటి భోగాలు కల్పించాడో రసవత్తరంగా చెప్పారో వీరగాథలో. ముద్దుచేసిన కుక్క మూతి నాకును అన్న విషయం తెలిసినా ముద్దుచెయ్యటమే కాదు, వాటిని దింపకుండా ఎత్తుకొని మరీ తిప్పే శునకప్రియులెందరో ఉన్నారు. ఆ పెద్దింటమ్మ తన ముద్దుల కుక్కకోసం ప్రత్యేకంగా తయారయ్యే మినరల్‌ వాటర్‌ కొనటానికి ఓ దుకాణానికి వెళ్ళింది. ఆ సీసామీద 'కుక్కలకు మాత్రమే' అని రాసున్న చీటీ లేదు. ''ఆ చీటీ అతికించి ఇమ్మంటారా'' అని అడిగాడు షాపాయన. ''ఎందుకూ అక్కర్లేదు. మా ఆయన మందు తప్ప మంచినీళ్ళు ముట్టడు. మా కుక్కకేమో చదువురాదు. ఇంకా చీటీ ఎందుకు, అలాగే ఇచ్చేయండి'' అంది. పెంపుడు జీవాలనే కాదు, ప్రతి ప్రాణినీ అందరూ భూతదయతో ఆదరించాలి. కొంతమంది చీమలపుట్టల దగ్గర పంచదార పోస్తుంటారు. కొందరు వాకిట్లో ధాన్యపు గుత్తులు వేలాడదీస్తారు. పావురాలకు గింజలు చల్లి ఆనందించేవారు మరెందరో!

మనుషులకు వృద్ధాశ్రమాలు ఉండటం మామూలే. యజమానులు వదిలేసిన లేదా ఏ నీడా లేక నిరాశ్రయంగా తిరిగే కుక్కలు, పిల్లులువంటి వాటిని పట్టించుకొనేవారే కనిపించరు. అటువంటి మూగజీవాలను చేరదీసి వాటి సంరక్షణా బాధ్యతలు చేపట్టాడు చెన్నైకి చెందిన నలభైరెండేళ్ల అశోక్‌. ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇంజంబాకమ్‌లో 'బెంజీస్‌ డాగ్‌ అకాడమీ' అనే పేరుతో ఓ శునక సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి నడుపుతున్నాడాయన. ఇప్పుడు కొత్తగా తలపెట్టిన మూగజీవాల వృద్ధాశ్రమం దానికి కొత్త చేర్పు. అశోక్‌ నడుపుతున్న కేంద్రాల్లో ప్రస్తుతం 80 కుక్కలు, తొమ్మిది పిల్లులు ఆశ్రయం పొందుతున్నాయి. ''నాకు చిన్నప్పటినుంచీ కుక్కలన్నా, పిల్లులన్నా మహా ఇష్టం...'' అంటున్న అశోక్‌- ఆ ఇష్టం వల్లే మూగజీవాల సంరక్షణ కేంద్రాలను ప్రారంభించి నడుపుతున్నానంటున్నాడు. కొంతమంది తమ పెంపుడు కుక్కల సంరక్షణ బాధ్యతలను కొంతకాలంపాటు చూడమని అశోక్‌కు అప్పగిస్తుంటారు. అందుకోసంగాను నిర్ణీత రుసుము పుచ్చుకొని వాటినీ జాగ్రత్తగా చూస్తుంటాడు. వాటికి తగిన ఆహారం సమకూర్చటమే కాక అవసరమైనప్పుడు వైద్య సదుపాయం కల్పిస్తాడు. ఈ కేంద్రానికి అనుసంధానించి ఓ శ్మశానవాటికా ఉంది. మృతిచెందిన మూగజీవాలకు ఆ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అశోక్‌ సంరక్షణ కేంద్రంలో ఉన్న కుక్కలు కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో నటించాయి. వ్యాపార ప్రకటనలకు చెందిన చిత్రాల్లోనూ ఇవి దర్శనమిస్తుంటాయి. కేంద్రానికి చెన్నైలో స్థలం సరిపోకపోవటంతో మహాబలిపురంలో ఓ అర ఎకరం కొని మూగజీవాలకోసం విశాలమైన మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుచేయాలని సంకల్పించాడు. అందుకోసం నిధులు సేకరించే ప్రయత్నంలోపడ్డాడు. అశోక్‌ నిర్వహిస్తున్న రక్షణ కేంద్రంలో కుక్కలు, పిల్లుల సంరక్షణ చూసేందుకు ముగ్గురు పనివారున్నారు. అశోక్‌ భార్య అత్తగారూ మిగతా కుటుంబ సభ్యులూ తోడ్పడుతుంటారు. వీరందరి సహకారంతో ఆ కేంద్రంలో శునకాలు, పిల్లులు మహా కులాసాగా కాలం గడిపేస్తున్నాయి!

(Eenadu,Editorial,14:01:2007)
------------------------------------------------------------------

Labels:

Sunday, January 07, 2007

సర్పసాయం



''ప్రతి మనిషిలోను ఓ లేడి, పులి, నక్క, గాడిద దాగి ఉంటాయి. వాటి ప్రభావంవల్లే మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు'' అని చమత్కరించాడో ఆంగ్ల రచయిత. మనుషుల స్వభావాలను కాచి వడబోసి అలా అన్నాడో లేదో తెలియదు కాని, ఆయనన్న మాటల్లో నిజం లేకపోలేదు.

మనుషులతో సన్నిహితంగా ఉండేవి, మనుషులకు అనేక విధాలుగా తోడ్పడేవి జంతువులు, పక్షులు వంటివే. సేద్యం చేయాలంటే గతంలో బసవన్నలు కాడి కదిపితేనే పని జరిగి పంటలు చేతికొచ్చేవి. దూర ప్రయాణాలు చేయాలంటే గుర్రానికి కళ్ళెం బిగించాల్సి వచ్చేది. విశ్వాసానికి, తోడుకు మారుపేరు శునక రాజులు, రాణులే. ఇన్ని రకాలుగా సేవచేస్తున్నా మానవుడు మాత్రం వాటిని చిన్నచూపు చూస్తూనే ఉన్నాడు.

''నిజానికి మనకంటే అవే నయం. మనిషి క్రూరజంతువని పాపం వాటికి భయం. నడిచే కాళ్ల సంఖ్యలోనే తప్ప నడకలో ప్రవర్తనలో పెద్ద తేడా లేదు కదా, ఆకలి పేరుతో అవీ అవినీతి పేరుతో మనమూ గడ్డితినే సామాన్య ధర్మం ఉభయులకూ ఉంది కదా'' అంటూ మానవ నైజాన్ని విమర్శించాడు కుందుర్తి ఓ వచన కవితలో.

''కొత్తగా కుక్కను కొన్నావట... కొంపదీసి అది కొత్తవాళ్ళను చూస్తే కరవదు కదా?'' అని అడిగాడు అయోమయం. ''అది తెలుసుకుందామనేగా నిన్ను మా ఇంటికి తీసుకువెళుతున్నది'' అన్నాడు స్నేహితుడు.

వాన రాకడా ప్రాణం పోకడా తెలియవని సామెత. మనుషుల సంగతేమో కాని- జంతువులు, పక్షులు వాన రాకడను ముందే పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు లోగడే నిర్ధారించేశారు. ''జంతువులు నీళ్ళల్లో దిగి నిలిచినప్పుడు, మెట్ట కప్పలు కూసినప్పుడు, చిన్నచిన్న చేపలు ఎగిరి పడుతున్నప్పుడు, తామరల పుప్పొడిలో తొండ పొర్లాడినప్పుడు, అన్ని పంటలూ బాగా పండేటట్లు వాన పడుతుంది'' అని పద్నాలుగో శతాబ్దానికి చెందిన దోనయామాత్యుడు రాశాడు. ఇటువంటి భావాన్నే శ్రీనాథ మహాకవి తన హరవిలాస కావ్యంలో వెల్లడించాడు. ''తూనిగలాడజొచ్చె, దివి ధూళి భ్రమింపగ జొచ్చె బిచ్చుకల్‌, మానక యుబ్బి గబ్బులుగు మాటికి మాటికి గ్రోల్చె గొమ్మపై'' అంటూ కనపడుతున్న సూచనలను బట్టి, ''వానయవశ్యమింక బహు వాసరముల్‌ జడివట్టు'' అనే నిశ్చయానికొచ్చారట కాంచీపుర వాసులు. వారనుకున్నట్లే కంచిలో ఇరవైఒక్క రోజులు జడివాన ఎడతెరిపి లేకుండా కురిసినట్లు శ్రీనాథ కవి తన కావ్యంలో రాశాడు. రాబోయే వాననే కాదు... పడబోయే పిడుగుల్నీ, ముంచుకొస్తున్న తుపాన్లను కొన్ని జంతువులు, పక్షులు, సరీసృపాలు ముందే పసిగడతాయని, అటువంటి సమయంలో వాటి ప్రవర్తన వింతగా ఉంటుందని శాస్త్ర పరిజ్ఞానం కలిగిన పండితులు శలవిచ్చారు.

పాములను చూసి మనుషులు సహజంగానే భయపడతారు. కొందరు పాములను దేవతలుగా భావించి పూజలు చేయటమూ కద్దు. నాగులచవితి పండుగ రోజున సర్పాలకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టే ఆచారం మనదేశంలో ఉంది. ''నాగుల్ల చవితికి నాగేంద్ర నీకు, పొట్టనిండా పాలు పోసేము తండ్రీ'' అని విన్నవించుకొని, ''చీకటిలోన నీ శిరసు తొక్కేము, కసిదీర మమ్మల్ని కాటెయ్యబోకు'' అంటూ నాగదేవతలను వేడుకోవటం తెలిసిందే. సర్పాలు మనకు చేసే మేళ్ళు ఇంకా ఉన్నాయని, అవి భూకంపాలను ముందే కనిపెట్టగలవని ఇప్పుడు చైనా శాస్త్రజ్ఞులు అంటున్నారు.

కొన్ని ప్రకృతి వైపరీత్యాలను మనుషులకంటే జంతుజాలమే ముందుగా పసిగట్టగలదని శాస్త్రజ్ఞులు చాలాకాలంగా అంటూనే ఉన్నారు. భూకంపాలు వచ్చే సూచనలను పాములు ముందుగానే కనిపెట్టగలవని చైనాలోని శాస్త్రజ్ఞులు ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు. 120 కిలోమీటర్ల దూరంలో సంభవించే భూ ప్రకంపనలను మూడు నుంచి ఐదు రోజుల ముందుగానే పాములు పసిగట్టగలవని చైనాలోని నానింగ్‌లో భూకంప కేంద్ర డైరెక్టర్‌ జియాంగ్‌ వెసాంగ్‌ అంటున్నారు. ఆ సమయంలో పాముల ప్రవర్తన వింతగా ఉంటుందంటున్నారు. భూకంపం వచ్చే సూచనలు తెలియగానే పాములు ఆందోళనతో అటూఇటూ పరిగెడతాయి. అలా ముందూ వెనకా చూసుకోకుండా పాకడంలో తలకు రాళ్ళవంటివి తగిలినా పట్టించుకోవు. కాబట్టి పాములపై నిఘా వేసి వాటి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తున్నట్లయితే భూకంపం వచ్చే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని తగు ముందు జాగ్రత్త చర్యలతో భూకంప నష్టాలను చాలావరకు తగ్గించుకోవచ్చని శాస్త్రజ్ఞుల భావన. సర్పాల వ్యవహార శైలిని పసిగట్టే యంత్రాలను పాముల పెంపక కేంద్రంలో ఏర్పాటుచేశారు. ఆధునిక పరిజ్ఞానం అందించిన అవగాహననూ జోడించి భూకంపం రాబోయే ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చని నానింగ్‌లోని భూకంప కేంద్ర శాస్త్రజ్ఞులు అంటున్నారు. మన దేశంలో కోళ్ళ పెంపక కేంద్రాలున్నట్లే దక్షిణ చైనాలో పాములను పెంచే కేంద్రాలుంటాయి. వందలాది పాములను అక్కడి రైతులు పెంచుతుంటారు. అటువంటి కేంద్రాల్లో శాస్త్రజ్ఞులు వీడియో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చారు. ''ప్రకృతిలోని జీవులన్నిటికంటె పాములకే భూకంపాన్ని పసిగట్టే సామర్థ్యం ఎక్కువ. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని భూకంపం వచ్చే సూచనలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్తపడవచ్చు. పాములను చూసి వూరికే భయపడటం కాక కొన్ని మంచి పనులకూ వాటిని ఉపయోగించుకోవచ్చని గ్రహించాలి'' అంటున్నారు చైనాలోని నానింగ్‌ భూకంప కేంద్ర శాస్త్రజ్ఞులు!
(Eenaadu, editorial, 07:01:2007)
---------------------------------------------------------------

Labels: