'జుట్టు పోయిందా... పట్టు గోవిందా...'
'జుట్టు పోయిందా... పట్టు గోవిందా...' అని 'కచ'కచలు పెట్టుకోవలసిన అవసరం లేదు. 'నిగనిగలాడే బోడిగుండు బిజినెస్ దండిగనుండు' అన్నట్టు కేశాల 'రూక'పోకలను లెక్కలు తీస్తే చాలు వెంకటేశుని సాక్షిగా (కల్యాణ)కట్ట తెంచుకున్న ఉత్సాహంతో పాడుకోవచ్చు. అలకలున్నమ్మ ఏ కొప్పయినా పెట్టొచ్చు గాక! అయితే, వాటిని అమ్ముకుంటే ఎన్ని 'గొప్ప'లయినా పోవచ్చునన్నది మాత్రం ఆమెకు అంతగా తెలుసునో, లేదో?
'సిరులు లేవని నీవు
అంతగా దిగులుపడవలదు
ఈ కురులను సిరులుగా
చేసుకొని చూడు'
అన్న నేపథ్య గానమేమైనా వినిపించిందేమో... పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ఈమధ్యే ఓ హెయిర్ సెలూన్‌కు వెళ్లి ఉన్నపళంగా గుండు చేయించేసుకుని చక్కా వెళ్లిపోయింది. అంతవరకూ అది మామూలు వార్తే కావచ్చు. కానీ... సెలబ్రిటీగా ఆమెకున్న పాపులారిటీని సొమ్ము చేసుకోవాలని భావించిందా సెలూన్ యాజమాన్యం. ఇంకేముంది జలజలలాడుతూ రాలిపోయిన ఆమె నీలికురుల్ని వేలానికి పెడుతున్నట్లు ప్రకటించింది. మామూలు వేలమైతే అంతగా ప్రయోజనం ఉండదనుకుందో ఏమో..? ఏకంగా ఇంటర్‌నెట్‌లో ఓ వెబ్‌సైట్‌నే ప్రత్యేకంగా సృష్టించేసింది. ఇంతకీ కురుల ఖరీదెంతో చెప్పలేదు కదూ... కనీస పాట పది లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో నాలుగున్నర కోట్ల రూపాయలన్న మాట.
తలనీలాల సరఫరాలో తిరుమల వెంకన్న నేనే నంబర్ వన్ అంటుంటే, మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల డాలర్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. అంతా ఏడుకొండలు ఎక్కి బాలాజీ దర్శనం చేసుకుంటే వారి తలనీలాలను 'కొండింతలు' చేసి బాలాజీ రెండు సార్లు గిన్నిస్ రికార్డుల పుస్తకానికెక్కేశాడు. ఆయన కుబేరుడికి తీరుస్తున్న అప్పులో తలనీలాల వల్ల వస్తున్న కోట్ల రూపాయల సంపాదన కూడా కలసి ఉంటోంది. పరమశివుడు గంగమ్మను నిలువరించడానికి తన జటాజూటాన్ని ఉపయోగించుకున్నాడు. ఇటీవల ఓ దేవాలయంలో పడ్డ దొంగలు దేవుళ్ల కిరీటాలు, ఆభరణాల గురించి ఆలోచించకుడా లక్ష రూపాయల ఖరీదు చేసే తలనీలాలను ఎత్తుకుపోవడాన్ని బట్టి చూస్తే జుట్టు పీక్కోక తప్పదేమో!
'గుండు గుండే... విగ్గు విగ్గే' అన్నది తాజా నినాదం. ఇందువల్ల తన జుట్టును అమ్ముకోవచ్చు. తరువాత తాపీగా గుండు నిమురుకుంటూ 'విగ్గు'లొలికించవచ్చు; సిగ్గుపడనక్కరలేదు. ఇందువల్ల విగ్గుల పరిశ్రమ ఎందరికో శిరోధార్యమవుతోంది. పైగా విగ్గుల తయారీకి భారత్, చైనా కేశాలు నాణ్యంగా బలంగా ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. 'సోదరులారా! ఏకం కండి... గుండు చేయించుకోండి
గుండు చేయించుకుంటే పోయేవి కేశాలే కాదు క్లేశాలు కూడా' అనే పిలుపు ప్రతిధ్వనిస్తోంది. తల నెరిస్తే రంగు వేసుకోవాలి గానీ విగ్గులకు ఆ బాధ ఉండదు. రంగు ఖర్చు కలిసొస్తుంది. డబ్బు ఆదాతో పాటు వయసును దాయవచ్చు కూడాను. కోరుకున్న ఉంగరాల జుట్టు విగ్గు అలంకరించుకుని మా తలలు రింగుమని బడాయికి పోయి, అందాలను 'విగ్గు'తేల్చుకోవచ్చు. ఇండియాలో ఇంత మంది అభివృద్ధి చెందడానికి కారణం, వారు తమ భక్తి కోసం తలనీలాలను త్యాగం చేయడమే. దేవుడు ఒట్టి అమాయకుడు. 'కొరగాని తల నీలాల కోసం తాపత్రయపడతాడు' అని తెలివితక్కువవాళ్లు అనుకుంటారు. అందులోని విజయ రహస్యం ఆయనకు బాగా తెలుసు. దేవుడికి జీవుడికి అనుసంధానమైనవి తల నీలాలు. దేవుడైనా దీనిని కాదననప్పుడు ఇక దీనికి తిరుగేముంది?
- ఫన్‌కర్
(Eenadu-08:04:2007)
--------------------------------------------------
Labels: pun/telugu
1 Comments:
aa shopku velli eme konna manam Rupees evvali, kaane barber shopku velle matram maa juttu eche malla Rupes kuda esthunamm...!
3:23 pm
Post a Comment
<< Home