బిడ్డలూ బహుపరాక్!
''సకలైశ్వర్య సమృద్ధులు నొకతల సంతానలాభ మొక తల'' అన్నాడు శ్రీనాథమహాకవి. సంతానాపేక్ష ప్రతిజీవికీ ఉంటుంది. వివాహం పరమోద్దేశం సంతానాన్ని పొందటమే అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. అపుత్రస్య గతిర్నాస్తి అని సూక్తి. అందుకే మనవారు పుత్ర సంతానంకోసం పరితపిస్తుంటారు. ''పిడికెడు విత్తనాలు మడికెల్ల చాలు ఒక్కడే కొడుకైన వంశాన చాలు...'' అనుకుంటూ కొడుకుల కోసం కలవరిస్తుంటారు. కాలక్రమంలో మనుషుల భావాల్లో మార్పులొస్తున్నాయి. కొడుకైతేనేమిటి కూతురైతేనేమిటి అంతా తమ పిల్లలు కారా అన్న ఆలోచనా సరళీ ఎక్కువవుతోంది. ''కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై, కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునికనేకుల్ వారిచే నేగతుల్ వడెసెన్'' అంటూ ఓ కవి సూటిగా ప్రశ్నించాడు. కందుకూరి రుద్రకవి రచించిన 'నిరంకుశోపాఖ్యానం'లోని నాయకుడు సకలశాస్త్ర పారంగతుడైనా వ్యసనాలకులోనై తల్లిదండ్రులను లెక్క చేయకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా, ఎన్ని హితోక్తులు చెప్పినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో- ''చాలునింక నా పాలికి జచ్చినాడు, కొడుకు గుణనిధి యనువాడు కులవిషంబు'' అని తీర్మానించి- ''తిలలు దర్భయు నుదకంబుదెత్తుగాక యేనివాపాంజలులు వానికిత్తు నిపుడు'' అంటాడు. తెనాలి రామకృష్ణకవి సృష్టించిన నిగమశర్మ కూడా నిరంకుశునికి తోడైనవాడే. కూతురైనా నిగమశర్మ అక్కే కుటుంబాన్ని ఆదుకొని తమ్ముణ్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తుంది. సంతానంవల్ల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కోవటం అనాదిగా జరుగుతున్నదే.
''తల్లిదండ్రులయందు దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి?'' అన్న వేమనకవి ''పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా...'' అని నిష్కర్షగా చెప్పేశాడు. సంతానమే మహాభాగ్యం అనుకుంటూ తమ పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచి పెద్దచేసినా, స్వసుఖాలను సైతం పట్టించుకోకుండా పిల్లల క్షేమమే ధ్యేయంగా కృషి చేసినా, వృద్ధులైన తల్లిదండ్రులపట్ల తమ కర్తవ్యాన్ని ఎంతమంది పిల్లలు నిర్వర్తిస్తున్నారు? తమ తల్లిదండ్రులను ఎంతమంది జాగ్రత్తగా చూసుకుంటున్నారు? వృద్ధులైన తల్లిదండ్రులను అదనపు భారంగా భావిస్తూ వారిని నిర్లక్ష్యంగా చూసే కొడుకులు, కూతుళ్ళ సంఖ్యే ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులను ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చి చేతులు దులుపుకొనేవారు కొందరు. ఆమాత్రం బాధ్యతా తీసుకోకుండా రోడ్లమీదే వదిలేసే పుణ్యాత్ములూ ఇంకొందరు. మారుతున్న సమాజ పోకడలవల్లా, పెరుగుతున్న స్వార్థంవల్లా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే- తల్లిదండ్రుల పట్ల సంతానం అవాంఛనీయ ప్రవర్తనకు కళ్ళాలు బిగించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది.
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని బిడ్డల ఆట కట్టించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే జైలుకు పంపాలనీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఓ బిల్లును పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారంటున్నారు. ఇటీవలి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బిల్లు ప్రకారం వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన పిల్లలు ఆ బాధ్యతను విస్మరిస్తే మూడు నెలల జైలుశిక్ష లేదా ఐదువేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సొంతబిడ్డలు, బంధుగణానికే కాదు- పెంపుడు కొడుకులు కూతుళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రుల హక్కులకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందంటున్నారు. అవసరమైతే తల్లిదండ్రులు అదివరకు తాము రాసిన వీలునామాను రద్దుచేసుకోగల అవకాశాన్నీ ఈ బిల్లు కల్పిస్తుంది. ఇటువంటి కేసులను విచారించటానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక ట్రిబ్యునళ్ళను ఏర్పాటుచేసి విశేష అధికారాలు కల్పిస్తారు. తల్లిదండ్రులకు ఖర్చు లేకుండా వేగంగా న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాలు నెలకొల్పాలని, వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలనీ సంకల్పించారు. సమాజపరంగాను, ఆధునిక పోకడల కారణంగాను వ్యక్తుల మనస్తత్వాల్లో విపరీత మార్పులు వస్తున్నాయి. స్వసుఖమే ప్రధానమైపోయి కుటుంబ బాధ్యతలను, పెద్దవారి సంరక్షణను పట్టించుకోని లక్షణం ముమ్మరిస్తోంది. తాజా బిల్లువల్ల వృద్ధులైన తల్లిదండ్రులకు రక్షణ కలగటమే కాక కొడుకులు కూతుళ్ళకు తమ బాధ్యతను గుర్తుకు తెచ్చినట్లూ అవుతుంది. మమతానుబంధాలతో మానవతా దృక్పథంతో సహజంగానే నెరవేర్చవలసిన బాధ్యతలను ఓ బిల్లు ద్వారా జరిగేటట్లు చూడవలసి రావటమే విచారించవలసిన విషయం!
(Eenadu-04:03:2007)
--------------------------------------------------------------------------------
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home