సెకండ్‌హ్యాండ్... ఫస్ట్ క్లాస్!
వినబోతే
'హ్యాండు మారిన నష్టమేమోయ్
బ్రాండు మంచిది చూసుకోవోయ్''
అన్న మాటలు వినియోగదారులకు తెగ నచ్చేసినట్టున్నాయి. సెకండ్‌హ్యాండ్ మాల్ కొను'గోల్' చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఆ వస్తువుల్ని తడిమి ఎంత హేండ్‌సమ్‌గా ఉందో అనుకుంటూ మందహాసంతో మందగమనం చేస్తున్నారు. వాళ్లకి షేక్‌హ్యాండ్‌లు ఇచ్చేవారు బోలెడు మంది. మైండ్‌సెట్ మార్చుకుంటే నష్టమేమీ లేదన్నమాట.
పూర్వ కాలంలో సెకండ్‌హ్యాండ్ వస్తువులు అనగానే సెంటిమెంట్ దెబ్బతో 'కారు'మబ్బులు కమ్ముకునేవి. 'కారు'చిచ్చు పుట్టేది. ఇప్పుడలా కాదు. 'కారు'వాక సాగుతోంది. వాడేసిన 'బెంట్లీ' కార్లు మార్కెట్‌లో దర్శనమిచ్చి 'కారు చూడు కారందం చూడు నే మునుపటి వలెనే లేనా' అని హొయలు పోనున్నాయ్. వాటిపైన 'ఇష్ట'మర్లు మరులుకొంటూ కోట్లు ఖర్చు చేయడానికి ఎదురుతెన్నులు చూస్తున్నారు. ప్రీ-యూజ్డ్ కార్ల వైపు మొగ్గుచూపేవాళ్లకు కొదువ లేదు. 'ఏమి బ్రాండ్‌లే హలా! సెకండ్‌హ్యాండ్ భేష్‌లే భళా!!' అనే పల్లవి ఎత్తుకొంటున్నారు. వాడేసిన కార్ల విక్రయాలు సాలీనా 8-10 లక్షల యూనిట్లకు చేరాయి. కొత్త కార్లవిపణికీ, దీనికీ తేడా కాస్తే.
పెద్ద షాపుల సెకండ్స్ సేల్స్‌కూ గిరాకీ ఎక్కువే. పాత దుస్తులను అమ్మే వారపు సంతలు ఎటూ ఉండనే ఉన్నాయిగా. ఇంటర్‌నెట్‌లో ఎభయ్, తదితర సైట్లు సినిమా తారలు కొన్ని హిట్ సినిమాల్లో ధరించిన కాస్ట్యూమ్స్ వేలం వేస్తుంటాయి. వేలంవెర్రి అనేది 'వర్డు'పోసుకుంది సెకండ్స్ వ్యాపారంలోనే. సెకండ్‌హ్యాండ్ భవనాల్ని బ్యాంకులూ, ప్రభుత్వమూ వేలం వేస్తుంటాయి.
కాదేదీ సెకండ్‌హ్యాండ్ కనర్హం అనుకోవడానికి లేదు. అండర్‌వేర్లను ఈ పద్ధతిన విక్రయించడానికి వీల్లేదు. ఇటువంటివి చెప్పుడు మాటలు కావు, చెప్పుల మాటలు. సెకండ్‌హ్యాండ్ చెప్పులకు గుళ్ల దగ్గర తిరిగే దొంగ దగ్గర తప్ప ఎక్కడా డిమాండ్ ఉండదు. ఒకాయన పాపం చెప్పులను కొందామని చెప్పుల దుకాణానికి వెళ్లాడు. కొనదల్చుకున్న చెప్పులు కాళ్లకు తొడుక్కుని వాటి మన్నిక ఎన్నాళ్లు ఉంటుందో అనుమానిస్తూ కూర్చున్నాడు. అదే సంగతిని షాప్ యజమానితోనూ ప్రస్తావించాడు. దానికి యజమాని 'సందేహించనక్కర్లేదు... ఆ చెప్పులు ఇంకో ఏడాది పనిచేస్తాయి' అన్నాడు. అంత గట్టిగా ఎలా చెప్పగలరు? అని కస్టమర్ అడిగాడు. 'మీరు వేసుకున్న చెప్పులను నేను ఏడాది నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు' అన్నాడు. దాంతో షాక్ తిన్న పెద్దమనిషి 'చెప్పు'పెట్టకుండా వెనుదిరిగి వెళ్లిపోయాడు. సెకండ్‌హ్యాండ్ పుస్తకాల మార్కెట్ ఆ'షో'మాషీ వ్యవహారమనుకుంటే పొరపాటు. పెద్ద పెద్ద మేధావులకే అది జ్ఞాన జన్మభూమి. ముందుకాలమంతా సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌దే అన్న ప్రచారం ఉంది. ఏడేడు జన్మాల బంధం అంటుంటారు... మన జన్మకే సెకండ్‌హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అని సిరీస్ ఉన్నప్పుడు వస్తువులు ఫస్ట్ హ్యాండ్ కావాలని సీరియస్‌గా పట్టుబట్టడం ఎందుకు చెప్పండి?
- ఫన్‌కర
(Eenadu,15:04:2007)
_________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home