చాక్లెట్లే ముద్దు
లౌకిక జీవనంలో ముద్దుల ప్రాముఖ్యం ఎక్కువే. ఆదరం కలిగినప్పుడు, అభిమానం ముంచుకొచ్చినప్పుడు, వాత్సల్యం పొంగుకొచ్చినప్పుడు అవతలివారిని ముద్దాడటం సాధారణంగా జరిగేదే. తల్లి తన బిడ్డను వాత్సల్యంతో ముద్దాడుతుంది. ప్రేయసీ ప్రియులు పరస్పరం ప్రేమతో ముద్దులు పెట్టుకుంటారు. శృంగార శాస్త్రంలో ముద్దుల ప్రకరణే ముఖ్యమైంది. వాత్సాయనుడేకాక ఆ తరవాత అనేక మంది శృంగారశాస్త్ర ప్రవీణులూ చుంబన విశేషాలను వైన వైనాలుగా విశదీకరిస్తూ అనేక గ్రంథాలు రాశారు. హావలెక్ ఎల్లీస్ అనే ఆంగ్ల విద్వాంసుడు ముద్దులకు సంబంధించి వాటి గుట్టుమట్లను బయటపెడుతూ ఎన్నో పుస్తకాలు రాశాడు. వేమనయోగి ''పనసతొనలకన్న పంచదారకన్న, జుంటి తేనెకన్న జున్నుకన్న, చెరకు రసముకన్న చెలిముద్దు తీపిరా'' అన్నాడు. గంగానది ఒడ్డున నిష్ఠగా జపం చేసుకుంటున్న అర్జునుణ్ని చూసి ఉలూచి అనే నాగకన్య ముగ్ధురాలైపోతుంది. ఆ అందగాడి అంగాంగ వర్ణన చేస్తూ ''ముద్దాడవలదె యీ మోహనాంగుని మోము గండ చక్కెర మోవిగల ఫలంబు...'' అని ఉవ్విళ్లూరుతుంది. ఆ కోరిక తీర్చుకోవటానికే మంత్రబలంతో అర్జునుణ్ని పాతాళ లోకంలోని తన మందిరానికి తీసుకెళుతుంది. ఆపై ఉలూచి, అర్జునుల శృంగార లీలా విశేషాలే విజయ విలాస కావ్యంలో మధుర ఘట్టాలుగా రూపుదిద్దుకొన్నాయి. సృష్టిలో చుంబన ప్రక్రియను మొదటగా సర్పజాతే కనుక్కొందని స్కాట్‌ఫిజ్‌గెరాల్డ్ అనే ఫ్రెంచి రచయిత రాశాడు. యౌవన బింకంలో మిడిసి పడిపోతున్న ఓ నాగరాజు సుష్టుగా చిన్న చిన్న పాముల్నీ కప్పల్నీ భోంచేసి కదలలేని స్థితిలో ఉండగా తనకు ఈడుజోడయిన ఓ ఆడపాము కనపడింది. అంత పెద్దపామును గుటుక్కున మింగలేక కనీసం రుచన్నా చూద్దామనుకొని తన రెండు నాలుకలతోటీ ఆ నాగరాజు ఆడపాము శరీరాన్ని చుంబించినట్లు స్పృశించాడు. అదే సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య చుంబనక్రియ ప్రారంభం కావటానికి నాందీవాచకం పలికిందని ఆ రచయిత వెల్లడించాడు. నిజానిజాలు ఆయనకు, ఆ పాములకే తెలియాలి!
ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ''పంటనొక్కనపించు బాసచేసినగాని తేనెలూరెడి మోవియాననీయ'' అంటూ శృంగారానికీ హద్దులు నిర్ణయిస్తుందో నెరజాణ. ముద్దుల్లో కూడా ఎన్నో రకాలున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ముద్దుపెట్టుకోవటం గురించి అంతగా పట్టించుకోరు. ఏ కార్యక్రమంలోనో సభల్లోనో కలుసుకున్నప్పుడు, విడిపోయేటప్పుడు ముద్దుపెట్టుకుంటారు. అది వారికి అలవాటు. భారత్ వంటి సంప్రదాయ దేశాల్లో అలాకాదు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దుపెట్టుకోవటాన్ని ఇక్కడి వారు హర్షించరు. వివాహమయ్యేదాకా అటువంటి సరసాలకు దూరంగా ఉండాలనే భావిస్తారు. ''నన్ను మొదటిసారి ముద్దుపెట్టుకున్న సుబ్బారావునే నేను పెళ్ళి చేసుకున్నాను'' అంది సుబ్బరత్నం గొప్పగా. ''ఆ మాట నిజమే. చేసిన నేరానికి తగిన శిక్ష పడటమంటే అదే'' అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు. సృష్టికర్త బ్రహ్మ అంతటివాడే ఓసారి నిగ్రహించుకోలేక తన నాలుగు ముఖాలతోటి ఒకేసారి సరస్వతిని ముద్దాడాడంటారు. అందుకా చదువులతల్లి కోపించి, ''మేలు మేలెంతయు నీవింత- లన్యాయమింతగలదె, మీమొగంబులు నాల్గు నీమాడ్కి నువ్విళులూరిన నేకాస్య నొకతె నేను జాలుదునె'' అంటూ విసుక్కొంటుంది. ఆ సమయంలో తన్మయత్వంతో ఒక మధురశబ్దం ఆమె కంఠసీమలో నుంచి వెలువడుతుంది. ఆ మధుర నాదమే కళాపూర్ణుని జన్మకు కారణమై కళాపూర్ణోదయ కావ్యం రసవంతమైన మలుపులు తిరగటానికి దోహదపడుతుంది.
చాక్లెట్ గొంతులో కరుగుతుంటే ముద్దుకన్నా నాలుగురెట్లు ఆనందాన్ని కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. వారు ముద్దులు పెట్టుకుంటూనో, చాక్లెట్లు తింటూనో ఈ ప్రయోగాలు నిర్వహించారేమో తెలియదు! యౌవన ప్రాదుర్భావ సమయంలో యువత ఎక్కువగా ముద్దుముచ్చట్లలోనే కాలం గడుపుతారనీ అందులోనే వారెక్కువ ఆనందాన్ని పొందుతారనీ అందరికీ తెలిసిందే. యువజనం చాక్లెట్లు అంటే కూడా అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. చాక్లెట్లు ఎక్కువగా తినడంవల్ల పళ్ళు పాడవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. ఫలితాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పిల్లలేకాక యువజనం సైతం చాక్లెట్లు అంటే ఎంతో మక్కువ చూపుతుంటారు. అందువల్లే వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మనసుకు నచ్చిన భాగస్వామిని ముద్దుపెట్టుకోవటం కంటె చాక్లెట్లను చప్పరించటంలోనే ఎక్కువ ఆనందం కలుగుతుందా అన్న సందేహం కొందరు శాస్త్రవేత్తలకు కలిగింది. ఆ విషయాన్ని తేల్చుకోటానికే కొన్ని పరిశోధనలు నిర్వహించారు. చాక్లెట్లు తినటంవల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందనీ అందువల్ల మెదడులోని రసాయనాలు ప్రేరేపితమై మనసుకు ఎంతో సంతోషం కలుగుతుందనీ తేలింది. ఇందుకోసంగాను శాస్త్రజ్ఞులు 20 సంవత్సరాల వయసులోని 12మంది యువతీ యువకులకు హార్ట్‌మానిటర్లు తగిలించి మరీ పరీక్షలు నిర్వహించారు. నిమిషానికి 60 సార్లు కొట్టుకొనే పల్స్ రేటు కూడా చాక్లెట్ తింటున్నప్పుడు 140కి పెరిగింది. దాంతో ముద్దులకంటె చాక్లెట్లే మనిషిపై ఎక్కువ ప్రభావాన్ని చూపగలవని తేలిపోయింది. అంతమాత్రం చేత ముద్దులను తేలికచేసి చూడవలసిన అవసరమేమీలేదు. దేని మాధుర్యం దానిదే దేని ప్రత్యేకత దానిదే అని వాదించే ముద్దుల ప్రియులూ లేకపోలేదు. చక్కిలాలు తింటావా చద్దన్నం తింటావా అంటే చక్కిలాలు తింటాను చల్ది అన్నమూ తింటాను ఆనక అయ్యతో వేడన్నమూ తింటాను అన్నాడో పిడుగు. అలాగే- ముద్దులూ పెట్టుకుంటాం చాక్లెట్లూ ఆరగిస్తాం దేనిదోవ దానిదే అనే ఉభయ కళాప్రపూర్ణులకూ లోటేముంటుంది?
(Eenadu,20:05:2007)
________________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home