ఆనందం మనసు లోనే!
ఆనందం! మూడక్షరాల ఈ పదానికి మనిషిని మూడులోకాలకూ అధిపతిని చేయగల సామర్థ్యమున్నది. అంత గొప్ప అనుభూతి ఇది.
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్... ఆనందం పరబ్రహ్మ స్వరూపం. దానివల్లనే జీవులన్నీ జన్మిస్తున్నాయి, వృద్ధి పొందుతున్నాయి, అందులోనే లయం చెందుతున్నాయని అంటున్నది తైత్తిరీయోపనిషత్తులోని భృగు వల్లి, (6వ అనువాకం). ఎవరో ఒక సాధారణ వ్యక్తి చెప్పిన మాట కాదిది. వరుణుడి కుమారుడైన భృగువుకు తపస్సు వలన కలిగిన స్వీయానుభూతి; వేదవాక్కు.
ఆనందమనేది అంత గొప్పది కదా! అదెక్కడ ఉన్నదని ప్రశ్న. దీనికి సరైన సమాధానం దొరకక, దొరికినా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అంగీకరించక సమాజం గజిబిజి పాలవుతున్నది. ఆనందమనేది బయట ఎక్కడనో లేదు. ఏ వస్తువులోనో లేదు. మన మనస్సులోనే ఉన్నది. మనస్ స్థితిని బట్టే ఆనందంగానీ, విషాదంగానీ! తిరుగులేని సత్యమిది.
'నీకు ఏ పదార్థం తింటే ఆనందంగా ఉంటుంది?' అని ఒకాయనను అడిగాం. 'పరమాన్నం తాగితే!' అన్నాడాయన. 'పరమాన్నంలో ఏమున్నది? గారెలైతే స్వర్గానికి బెత్తెడు దూరమే!' అన్నాడు మరొకాయన. చూశారా? ఒకరికి ఆనందాన్ని కలిగించిన పదార్థం మరొకరికి కలిగించటం లేదు.
ఒక ఇంట్లో అన్నగారు తీరని సమస్యతో సతమతమవుతున్నాడు. తమ్ముడు వ్యాపారంలో మంచిలాభం వచ్చి హుషారుగా ఉన్నాడు. ఆ సమయంలో పిల్లవాడు వచ్చి రేడియో పెట్టాడు. పాట వస్తున్నది- మంచి పాటే! ఆ పాట మొదటివాడికి ఎక్కడా లేని కోపాన్ని తెప్పించింది; రెండోవాడికి ఆనందాన్ని రెట్టింపు చేసింది. తేడా ఎక్కడ ఉన్నది? రేడియో పాటలో లేదు. మనుషుల మనస్సులలోనే!
ఇద్దరి దాకా ఎందుకు? మనం ఒక్కళ్లమే ఉన్నాం. ప్రశాంతంగా టీవీ చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ డబ్బులడిగింది. జేబులో చెయ్యిపెట్టాం. నిన్న రాత్రి అందులో పెట్టిన వెయ్యి రూపాయలు లేవు. జేబులన్నీ వెతికాం; ఇంకా కొన్నిచోట్ల వెతికాం. డబ్బు లేదు. ఆనందమంతా మాయం; కంగారు; దిగులు. టీవీలో కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. ''అరే! టీవీ ఆపండిరా!'' కోపంగా కేక వేస్తాం; అరుస్తాం. ఇందాక ఆనందాన్ని కలిగించిన టీవీ ఇప్పుడు కోపాన్ని ఎందుకు తెప్పించింది? మనస్‌స్థితి మారటం వల్లనే!
ఆనందం కోపంలో లేదు; శాంతంలో ఉన్నది. వైరంలో లేదు, స్నేహితంలో ఉన్నది. మితిమీరిన కోరికలో లేదు; తృప్తిలో ఉన్నది. ముందుగా మనమందరమూ ఆనందమనేది మన మనస్సులోనే ఉన్నది అని గుర్తించాలి. అనవసరంగా కోపాన్ని, చికాకును తెప్పించుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరితోనూ తగాదాలు పెట్టుకోకుండా నలుగురితోనూ మంచిగా ఉండాలి. వచ్చినదానితో తృప్తిపడాలి; మరొక మెట్టు పైకి ఎదగటానికి ప్రయత్నించాలి. అప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది. ఆనందానికి అసలైన రహస్యమిది. దానిని సొంతం చేసుకోవటానికి ఏకైక మార్గమిదే!
- డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
(Eenadu, 26:06:2007)
_________________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home