My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, June 25, 2007

ఇదం జగత్‌

'ధనమూలమిదం జగత్‌' అన్నారు. సూర్యుని చుట్టూ భూభ్రమణం సంగతి ఏమోకాని, ప్రపంచం మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం. ''డబ్బున్నవాడికి లోకమంతా చుట్టాలే... డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు'' అన్నట్లుగానే ఉన్నాయి పరిస్థితులు. మిగతా విద్యలు, ప్రజ్ఞలు అన్నీ డబ్బుకు దాసోహమంటున్నాయి. ''ద్రవ్యం దాచిన వాడికి తెలుసు... లెక్కరాసిన వాడికి తెలుసు'' అన్నట్లుగా కాస్త లోకజ్ఞానం గలవారెవరికైనా ఈ విషయాలు అవగతమవుతూనే ఉన్నాయి. లోకరీతిని క్షుణ్నంగా ఆకళింపు చేసుకున్న వేమన కవీంద్రులు, ''కులము గల్గువారు గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కల్గువాని బానిస కొడుకులు'' అని ఏనాడో కుండబద్దలు కొట్టారు. ''కాసులు కలవాడె రాజు కదరా సుమతీ'' అని సుమతీ శతకకారుడూ అన్నాడు. ఎవరెన్ని అన్నా మనుషుల మనసులలో డబ్బుకున్న విలువ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కాలం ఎంత గడిచినా, మనుషుల దృక్పథాల్లో ఎన్ని మార్పులు వచ్చినా డబ్బు దగ్గరకొచ్చేసరికి మాత్రం అత్యధికులు దానికే ప్రాధాన్యమిస్తున్నారు. ''డబ్బు లేని బతుకు మబ్బుపట్టిన రాత్రి, డబ్బు తోడవచ్చు నిబ్బరమ్ము'' అన్నారు నార్లవారు. ''ధనముండుట పరిపాటియె ధనమే సర్వంబు కాదు'' అన్నారు మరోకవి. ఆ విషయమే అమ్మాయికి నచ్చజెప్పబోయారు తల్లిదండ్రులు. ఓ అమ్మడు తనకు కాబోయే వరుడు బాగా డబ్బున్నవాడే అయుండాలని, అలాంటివాణ్ని తప్పితే మరొకర్ని తను పెళ్ళాడనని పట్టుబట్టి కూర్చుంది. ఆమె తల్లిదండ్రులు, ''మనిషికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదమ్మా... అంతకంటే విలువైనవి చాలా ఉన్నాయి'' అన్నారు. ''ఆ సంగతి నే కాదన్నానా? ఇల్లూ వాకిళ్ళూ పొలాలు పుట్రలూ బాండ్లు డ్రాఫ్టులు కంపెనీల్లో షేర్లు క్రెడిట్‌ కార్డులూ వగైరాలెన్ని లేవు, అలాంటివి బాగా ఉన్న వాణ్ణి చూడండి... చాలు... ఎలాగో సర్దుకుపోతాను. డబ్బే అక్కర్లేదు'' అంది తెలివిగా.


ంతయినా, ఎలా చెప్పినా మనిషి ఆలోచనలు డబ్బు చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయని ఇటువంటి ఉదంతాలే రుజువు చేస్తుంటాయి. మనుషులనే కాదు, దేశాలను ప్రాంతాలను కూడా డబ్బుగల దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు అని విభజించి చూడటం జరుగుతోంది. ''వీధి తలుపు వేసుకొని సంగీత సాధన చేసుకో. విద్య వంటి వస్తువు లేదు'' అని రామప్పపంతులు అంటే- ''విద్య వంటి వస్తువు లేదు. నిజమే- ఒక్కటి తప్ప- అదేవిటి? విత్తం. డబ్బు తాని విద్య దారిద్య్ర హేతువు. ఈ వూళ్ళో నారదుడొచ్చి పాడినా నాలుగు దమ్మిడీలు యివ్వరు. గనక యీ వీణ యిటుపెడదాం'' అనుకొని వాయిస్తున్న వీణను పక్కనపెట్టి డబ్బు సంపాదించే ఉపాయాలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది మధురవాణి 'కన్యాశుల్కం' నాటకంలో. డబ్బు మహిమ అంతటిది. వివాహాల్లో డబ్బే ముఖ్యపాత్ర వహిస్తోంది. చదువు సంధ్యలు, చక్కదనం, సంప్రదాయం వీటన్నిటి కంటే సిరిసంపదలే ప్రధానం కావటం చాలా సందర్భాల్లో జరుగుతోంది. ''అల్ల ఊరివారు పిల్లనడిగేరు, కుర్రవానికి మంచి సేద్యమున్నాది, ఏటేట పండేటి భూములున్నాయి. ఊరి పొలిమేరలో తోటలున్నాయి, చుట్టు కొల్లారికింపు మిద్దెలున్నాయి, కన్నెనిస్తామని కబురంపుదాము'' అని ఆడపిల్లవారు అబ్బాయి ఆస్తి వివరాలు సేకరించి పెళ్ళికి సిద్ధపడితే, అబ్బాయి తరుఫువారు ''కన్నియ పెళ్ళిలో కట్నమే ముఖ్యమ్ము'' అనుకుంటూ వరకట్న రూపేణా ఎంత డబ్బు గుంజుదామా అనే ఆలోచిస్తుంటారు. మొత్తం మీద పెళ్ళిళ్లలో కాసుల గలగలలే ముఖ్యమై పోయాయి. ఆధునిక యువత అభిప్రాయాలూ అలాగే ఉన్నాయి.

ఆడది మెచ్చిందే అందం అన్నారు. అమ్మాయిలు ఎటువంటి వారిని అందగాళ్ళుగా భావిస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తే, డబ్బున్నవాళ్లని అని ఠక్కున జవాబు చెప్పేస్తున్నారు ఇంగ్లాండులో ఈ విషయమై వినూత్నమైన సర్వే నిర్వహించిన ఓ టి.వి. బృందంవారు. కోరుకున్న కోమలాంగిని పెళ్ళి చేసుకోవాలంటే ముందుగా అబ్బాయి దగ్గర దండిగా డబ్బుండాలి. తమను పెళ్ళాడబోయేవారికి డబ్బు బాగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. మిగతా గుణాలన్నీ తరవాతే పరిగణనలోకి వస్తాయి. ఇంగ్లాండులో ఓ వ్యక్తి సగటు ఆదాయం ఇరవైరెండువేల పౌండ్లు. అంతకుమించి పదివేలపౌండ్లు అధికంగా ఆర్జించేవారినే తాము పెళ్ళాడటానికి ఇష్టపడతామని ఎక్కువమంది అమ్మాయిలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టి.వి. బృందం నిర్వహించిన సర్వేలో 66 శాతం అమ్మాయిల మాట అది. వస్త్రధారణ, మాట తీరు, స్త్టెల్‌ వంటి వాటివల్ల సంపన్న యువకులను గుర్తుపట్టవచ్చని చాలామంది అమ్మాయిలు భావిస్తున్నారు. ఖరీదైన అధునాతన వస్త్రధారణ ఆర్థిక అంతస్తును తెలియజెబుతుందని ఎక్కువమంది అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. సూటు ధరించటం సంపదకు చిహ్నమని మరికొందరు తలపోస్తున్నారు. ''ప్రేమకన్నను యెక్కువేమున్నది యెల్ల కామ్య పదవులకన్న ప్రేమే ఎక్కువ...'' అన్న భావజాలం యువతీ యువకుల హృదయాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, మారిన కాలంలో భావావేశాలకంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ దృక్పథం ఎంతవరకు సమంజసం అన్న సంగతి ఎవరికివారు ఆలోచించి తేల్చుకోవాల్సిన విషయం అంటున్నారు సర్వే బృందసారథి అలెక్స్‌ మెంజిస్‌. మొత్తమ్మీద ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతోందనే విషయం మరోసారి రుజువైంది. అందుకేగా ఓ సినీకవి- ''ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం'' అన్నారు!
(Eenadu,17:06:2007)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home