ఇదం జగత్
ఎంతయినా, ఎలా చెప్పినా మనిషి ఆలోచనలు డబ్బు చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయని ఇటువంటి ఉదంతాలే రుజువు చేస్తుంటాయి. మనుషులనే కాదు, దేశాలను ప్రాంతాలను కూడా డబ్బుగల దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు అని విభజించి చూడటం జరుగుతోంది. ''వీధి తలుపు వేసుకొని సంగీత సాధన చేసుకో. విద్య వంటి వస్తువు లేదు'' అని రామప్పపంతులు అంటే- ''విద్య వంటి వస్తువు లేదు. నిజమే- ఒక్కటి తప్ప- అదేవిటి? విత్తం. డబ్బు తాని విద్య దారిద్య్ర హేతువు. ఈ వూళ్ళో నారదుడొచ్చి పాడినా నాలుగు దమ్మిడీలు యివ్వరు. గనక యీ వీణ యిటుపెడదాం'' అనుకొని వాయిస్తున్న వీణను పక్కనపెట్టి డబ్బు సంపాదించే ఉపాయాలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది మధురవాణి 'కన్యాశుల్కం' నాటకంలో. డబ్బు మహిమ అంతటిది. వివాహాల్లో డబ్బే ముఖ్యపాత్ర వహిస్తోంది. చదువు సంధ్యలు, చక్కదనం, సంప్రదాయం వీటన్నిటి కంటే సిరిసంపదలే ప్రధానం కావటం చాలా సందర్భాల్లో జరుగుతోంది. ''అల్ల ఊరివారు పిల్లనడిగేరు, కుర్రవానికి మంచి సేద్యమున్నాది, ఏటేట పండేటి భూములున్నాయి. ఊరి పొలిమేరలో తోటలున్నాయి, చుట్టు కొల్లారికింపు మిద్దెలున్నాయి, కన్నెనిస్తామని కబురంపుదాము'' అని ఆడపిల్లవారు అబ్బాయి ఆస్తి వివరాలు సేకరించి పెళ్ళికి సిద్ధపడితే, అబ్బాయి తరుఫువారు ''కన్నియ పెళ్ళిలో కట్నమే ముఖ్యమ్ము'' అనుకుంటూ వరకట్న రూపేణా ఎంత డబ్బు గుంజుదామా అనే ఆలోచిస్తుంటారు. మొత్తం మీద పెళ్ళిళ్లలో కాసుల గలగలలే ముఖ్యమై పోయాయి. ఆధునిక యువత అభిప్రాయాలూ అలాగే ఉన్నాయి.
ఆడది మెచ్చిందే అందం అన్నారు. అమ్మాయిలు ఎటువంటి వారిని అందగాళ్ళుగా భావిస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తే, డబ్బున్నవాళ్లని అని ఠక్కున జవాబు చెప్పేస్తున్నారు ఇంగ్లాండులో ఈ విషయమై వినూత్నమైన సర్వే నిర్వహించిన ఓ టి.వి. బృందంవారు. కోరుకున్న కోమలాంగిని పెళ్ళి చేసుకోవాలంటే ముందుగా అబ్బాయి దగ్గర దండిగా డబ్బుండాలి. తమను పెళ్ళాడబోయేవారికి డబ్బు బాగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. మిగతా గుణాలన్నీ తరవాతే పరిగణనలోకి వస్తాయి. ఇంగ్లాండులో ఓ వ్యక్తి సగటు ఆదాయం ఇరవైరెండువేల పౌండ్లు. అంతకుమించి పదివేలపౌండ్లు అధికంగా ఆర్జించేవారినే తాము పెళ్ళాడటానికి ఇష్టపడతామని ఎక్కువమంది అమ్మాయిలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టి.వి. బృందం నిర్వహించిన సర్వేలో 66 శాతం అమ్మాయిల మాట అది. వస్త్రధారణ, మాట తీరు, స్త్టెల్ వంటి వాటివల్ల సంపన్న యువకులను గుర్తుపట్టవచ్చని చాలామంది అమ్మాయిలు భావిస్తున్నారు. ఖరీదైన అధునాతన వస్త్రధారణ ఆర్థిక అంతస్తును తెలియజెబుతుందని ఎక్కువమంది అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. సూటు ధరించటం సంపదకు చిహ్నమని మరికొందరు తలపోస్తున్నారు. ''ప్రేమకన్నను యెక్కువేమున్నది యెల్ల కామ్య పదవులకన్న ప్రేమే ఎక్కువ...'' అన్న భావజాలం యువతీ యువకుల హృదయాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, మారిన కాలంలో భావావేశాలకంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ దృక్పథం ఎంతవరకు సమంజసం అన్న సంగతి ఎవరికివారు ఆలోచించి తేల్చుకోవాల్సిన విషయం అంటున్నారు సర్వే బృందసారథి అలెక్స్ మెంజిస్. మొత్తమ్మీద ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతోందనే విషయం మరోసారి రుజువైంది. అందుకేగా ఓ సినీకవి- ''ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం'' అన్నారు!
(Eenadu,17:06:2007)
____________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home