మారిన దృక్పథం

కల్యాణమయి కాపురానికొచ్చి నెలతప్పటం నెలతలకు ఓ మధురానుభూతి. ''రుచులపై వేడ్కలేదు, సిగ్గుచే వసియింపనలవిగాదు, మేలయిన వదనమునను ధవళిమ లీలగా కనుపించెను, వనజాక్షి ఉనికి జూచి చూలాలని'' ఇంట్లోవాళ్ళే ముందుగా కనిపెడతారు. ఆపై అమ్మాయి అడిగినవన్నీ చేసిపెడతారు. కోరికలన్నీ నెరవేరుస్తారు. ''బడలిక జనించె నూర్పు సందడి రహించె, నడుముగనిపించె మిగుల నెన్నడలు గాంచె, జడిమ ప్రాప్తించె జట్టుముల్ సంభవించె దౌహృదము జానకీదేవి దాల్చునప్పుడు'' అంటూ సీతాదేవి గర్భిణి అయిన వైనాన్ని వర్ణించాడు కవి ఉత్తర రామాయణ కావ్యంలో. ఆ సమయంలో నీకేం కావాలో కోరుకొమ్మని రామచంద్రుడు అడిగితే ఆ తల్లి అమాయకంగా ''భాగీరథీ తీరారణ్యమునన్ వసించు మునీ పత్నీశ్రేణి తోడన్ ఫలహారంబుల్ గొని యొక్కనాడు మెలగన్ బ్రాణేశ వాంఛించెదన్'' అని కోరుకుంటుంది. అదే అదనుగా లోకోపవాదానికి వెరచిన రామభద్రుడు సీతమ్మను అడవుల్లో విడిచిపెట్టి రమ్మని తమ్ముణ్ని ఆదేశిస్తాడు. సీతాదేవిని రథంలో అడవిలోకి తీసుకెళ్ళిన లక్ష్మణుడు గంగానది దాటి వాల్మీకి ఆశ్రమ సమీపంలోకి వెళ్ళాక అసలు సంగతి చెబుతాడు. అంత జరిగినా సీతాసాధ్వి రామచంద్రుణ్నికాని లక్ష్మణుడినికాని పల్లెత్తి పరుషంగా ఒక్కమాట మాట్లాడదు. నిండుగర్భిణి అని కూడా చూడకుండా ప్రజావాక్య పరిపాలనకోసం శ్రీరాముడానాడు సీతమ్మను అడవులపాలు చేశాడు. నేటి మగవారు అలాకాకుండా గర్భవతులైన భార్యలకు అండదండగా తోడునీడగా తామే ఉంటూ అన్ని విధాలా ఆదుకోవాలనుకుంటున్నారు.
''అబ్బాయే పుడతాడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటాడు'' అని కాబోయే తల్లులు, ''అమ్మాయే పుడుతుంది అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటుంది'' అని కాబోయే తండ్రులు మురిసిపోవటం సహజమే. అలా ముచ్చటపడటమేకాని గర్భవతులైన భార్యలపట్ల వెనకటి తరాల మగవారు మరే విధమైన ప్రత్యేక శ్రద్ధా తీసుకొనేవారు కాదు. అదంతా ఆడవాళ్ళ వ్యవహారమని, ఇంట్లోని పెద్దవారే ఆ సంగతి చూసుకుంటారని భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భార్య గర్భం ధరించిన దగ్గరనుంచీ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లోను శ్రద్ధ తీసుకోవాలని ఆధునిక యువకులు భావిస్తున్నారు. పిల్లల పెంపకంలోను భార్యతో సమానంగా పాలుపంచుకుంటూ ఆమెకు తోడ్పడాలనీ ఉత్సాహపడుతున్నారు. ఇది మగవారి ఆలోచన సరళిలో వచ్చిన పెద్ద మార్పే. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అవసరమైతే ఉద్యోగాలకు సెలవు పెట్టయినా సరే ఇంటిపట్టునే ఉండాలని 75 శాతం భర్తలు అభిలషిస్తున్నారు. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గతకాలపు ముచ్చటైపోయిన ఈ రోజుల్లో మగవారి వైఖరిలో ఇటువంటి మార్పు కలగటం హర్షణీయం, వాంఛనీయం. ఉద్యోగినులైన మహిళలు గర్భవతులయినప్పుడు ప్రసూతి సెలవును ప్రత్యేకంగా మంజూరు చేస్తుంటారు. అదే విధంగా పురుషులకూ పితృత్వ సెలవు ఇచ్చే ఆచారం పాశ్చాత్య దేశాల్లో లోగడనుంచీ ఉంది. మనదేశంలోనూ మగవారికి 15 రోజులపాటు పితృత్వ సెలవు మంజూరు చేయటం ఇప్పుడు ప్రారంభించారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడూ తరవాత శిశుపోషణలోను భర్తలు శ్రద్ధ తీసుకుంటూ మాతాశిశువులకు సన్నిహితంగా ఉండటంవల్ల అనేక ప్రయోజనాలున్నాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటున్నారు. తండ్రులకూ పిల్లలతో అనుబంధం పెరుగుతుంది. పిల్లలను ఎత్తుకోవటం, ఆడించటం, నిద్ర పుచ్చటం వంటి పనులు చేస్తుండటంవల్ల తండ్రులకు, పిల్లలకు మధ్య పటిష్ఠ ఆత్మీయతానుబంధం ఏర్పడుతుంది. బాలెంతలకు తగిన విశ్రాంతి లభించి వారు త్వరగా కోలుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇన్ని లాభాలున్నప్పుడు భర్త అనే మాటకు పరిపూర్ణమైన న్యాయం చేయటం మంచిదే కదా!
(Eenadu,27:05:2007)
______________________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home