My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, June 24, 2007

విడాకుల వేదన

''చిట్టిబొమ్మల పెళ్ళి చేయవలెననగా శృంగార వాకిళ్ళు సిరితోరణాలు, గాజుపాలికలతో గాజు కుండలతో అరటి స్తంభాలతో అమరే పెండ్లరుగు'' అని పాడుకుంటూ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ పిల్లలు ఆడుకోవటం లోగడ తెలుగువారి లోగిళ్ళలో నిత్యం కనపడే దృశ్యమే. కాలం మారి మనుషుల స్వభావాల్లో మార్పువచ్చినట్లే పిల్లల ఆటల్లోను మార్పులొచ్చాయి. ఇప్పటి పిల్లలు వీడియోగేమ్స్‌లాంటి హైటెక్‌ ఆటలు ఆడుకుంటున్నారు తప్ప బొమ్మల పెళ్ళిళ్ళ జోలికి పోవటం లేదు. అంతమాత్రం చేత వివాహాల ప్రాముఖ్యం తగ్గిందనుకోవటానికి వీలులేదు. ముహూర్తపు రోజుల్లో ఒక్క కల్యాణ మంటపమూ ఖాళీలేకుండా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. పద్ధతుల్లోనే తేడాలొచ్చాయి. వెనకటి రోజుల్లో పెళ్ళి అనగానే ఎంతో ముందునుంచీ హడావుడిగా ప్రయత్నాలు ప్రారంభించేవారు. ''పెళ్ళంటే మాటలా పాకలూ పందిళ్ళూ వేయాలి. నలుగుర్నీ పిలుచుకోవాలి. వంటలూ పిండివంటలూ చేయించాలి. ఒకటా రెండా ఎన్ని చేస్తే అవుతాయి పెళ్ళిపనులు...'' అంటూ వివాహం జరగబోయే ఇంట్లోని పెద్దవారు హడావుడి పడిపోయేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రెడీమేడ్‌ కల్యాణమంటపాలు సిద్ధంగా ఉంటున్నాయి. వంటలూ పిండివంటలూ చేసి వడ్డించటానికి కేటరింగ్‌ల వాళ్ళూ ఎంతోమంది ఉన్నారు. అటు ఆడపెళ్ళివారికి కాని ఇటు మగ పెళ్ళివారికి కాని బట్టలు నలగకుండా లక్షణంగా పెళ్ళిళ్ళు జరిగిపోయే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇంత తేలికగా జరిగినా పెళ్ళిళ్ళన్నీ విజయవంతమవుతున్నాయా అంటే చెప్పటం కష్టమే. ఆనందం వెనకే విషాదం ఉన్నట్లు వివాహాల క్రీనీడలోనే విడాకులూ పొంచి ఉంటాయి. సంసారంలో ఎన్ని ఒడుదొడుకులున్నా మునుపు సర్దుకుపోయేవారు. ఆధునిక యువతీయువకులు అలా సర్దుకుపోవటంలేదు. తప్పనిసరి అనుకున్నప్పుడు విడాకులకోసం కోర్టులకు పరుగులు పెడుతున్నారు. ''వైవాహిక జీవితములు దావాలకు దారితీసి తగులడిపోతే కేవలము పెళ్ళిమాని ఖుషీవాలాలగుట మేలు సిరిసిరి మువ్వా'' అని రాశారు శ్రీశ్రీ తన సిరిసిరి మువ్వ శతకంలో. ''నువ్వు అందంగానే ఉంటావు కదా- పైగా మంచివాడివి కూడాను. నీలో ఏం నచ్చక మీ ఆవిడ విడాకుల కోర్టుకు పరిగెత్తిందోయ్‌'' అని అడిగాడు సోంబాబు రాంబాబును. ''నేను నచ్చక కాదు. నా వంట నచ్చక'' అని తాపీగా జవాబు చెప్పాడు రాంబాబు. స్వల్పకారణాలకు సైతం విడాకులకోసం వెంపర్లాడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. పాశ్చాత్యదేశాల్లో మరీ ఎక్కువ. పెళ్ళిళ్ళ పేరయ్యల్లాగానే తేలికగా విడాకులు ఇప్పించే విడాకుల వీరయ్యలూ ఆ బాపతు సంస్థలూ కొన్ని పాశ్చాత్య దేశాల్లో వెలసి రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. ''మీ ఆయనతో పోట్లాడి కోర్టెక్కి విడాకులు పుచ్చుకున్నావుగా... ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?'' అని అడిగింది విడాకులు తీసుకున్న విమలను స్నేహితురాలు కమల. ''నా సంతోషానికేంగాని- మా లాయరు చాలా సంతోషంగా ఉన్నాడు... తన బ్యాంక్‌ బ్యాలెన్సు పెరిగిందని-'' అని సమాధానం చెప్పింది కమల.

పాశ్చాత్యదేశాల్లో వివాహాల జోరుకంటే విడాకుల హడావుడే ఎక్కువగా ఉంది. భారత్‌వంటి సంప్రదాయ దేశాల్లోనూ విడాకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విడాకులు తీసుకున్న తరవాత భార్యలకంటె భర్తలే ఎక్కువ మానసిక అశాంతికి గురవుతారని కెనడాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఏవో కొన్ని సమస్యలు ఎదురవుతున్నా సహనంతో వాటిని ఎదుర్కొంటూ వివాహబంధం కొనసాగిస్తున్న వారికంటె విడాకులు తీసికొని విడిపోయిన మగవారే ఆరు రెట్లు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటున్నారు. విడాకులు తీసుకున్న స్త్రీలు మూడున్నర రెట్లు మాత్రమే మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్టాటిస్టిక్స్‌ కెనడా నిర్వహించిన ఓ సర్వేలో బయటపడింది. వారు 20 నుంచి 64 సంవత్సరాల వయస్సులోని 2500మంది స్త్రీ పురుషులను ప్రశ్నించి ఈ నిర్ణయానికి వచ్చారు. 1994 సంవత్సరంలో ప్రారంభించి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వారిని ఇంటర్వ్యూచేసి చివరకు ఇటీవలే తమ సర్వే ఫలితాలను విడుదల చేశారు. వివాహబంధం విచ్ఛిన్నమైన పురుషులు తమ పిల్లల సంరక్షణ విషయంలో బాధ్యతను కోల్పోతున్నారు. దాదాపు 34శాతం తండ్రులు తమ పిల్లలకు దూరమవుతున్నట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయి. స్త్రీల విషయంలో అలా కాదు. కేవలం మూడుశాతం మహిళలు మాత్రమే తమ పిల్లలకు దూరమవుతున్నారు. ఆ కారణంగా విడాకుల వలన కలిగే వేదన పురుషులనే ఎక్కువగా బాధిస్తుంటుంది. కెనడాలో విడాకుల జోరు ఎక్కువే. అక్కడ జరిగే ప్రతి పది పెళ్ళిళ్ళలో మూడు జంటలు ముచ్చటగా ముప్ఫై రోజులన్నా కాపురం చేయకుండానే విడిపోతున్నాయి. 2003 సంవత్సరంలో కెనడాలో దాదాపు 71వేలమంది జంటలు వివాహమంత్రాలు సద్దుమణగకుండానే విడాకుల మంత్రం పఠించాయి! ''విడాకులు దంపతుల మానసికస్థితిని ప్రభావితం చేస్తాయి. పిల్లల సంరక్షణ విషయంలో అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. విడాకుల వెనకే విచారమూ మానసిక ఒత్తిడీ ఉండనే ఉంటా''యన్నది నిపుణుల మాట. వివాహానికైనా విడాకులకైనా తొందరపడకుండా కాస్త ఆలోచించి అడుగువేయటమే మంచిది!
(Eenadu,o3:06:2007)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home