మన పాలెంత? అంతా.../ సాధన వట్టిపోదు
మన పాలెంత? అంతా...
-చక్కిలం విజయలక్ష్మి
పలాయనవాదులు కర్మ సిద్ధాంతాన్ని వక్రిస్తూ ఉంటారు. శివుని ఆజ్ఞ లేనిది చీమయినా కుట్టనప్పుడు మన కర్మలకు మనమెలా బాధ్యులమవుతామని వితండవాదం చేస్తూ ఉంటారు. '...యోగ క్షేమం వహామ్యహం' అన్న శ్రీకృష్ణుడి హామీని వాళ్లు అలుసుగా, వెసులుబాటుగా స్వీకరిస్తారు. నిత్యావసరాలకు సైతం భగవంతునిమీద భారం మోపి నిర్వ్యాపారంగా ఉన్నవాడు తప్పకుండా అన్నింటికీ ఆయనమీద ఆధారపడవచ్చు. కర్మ ఫలాలకూ నిర్బాధ్యుడుగా ఉండవచ్చు. అది మన ఆనుకూల్యాన్నిబట్టి ఉంటుంది. ధర్మం చాలా సూక్ష్మమైంది. మన అవసరాలకొద్దీ, మన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా మార్చుకో వీలైంది కాదు. భగవంతుడి న్యాయస్థానంలోని న్యాయ సూత్రాలు, ధర్మ సూక్ష్మాలు అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప ఆయన కూడా అధిగమించరానివి. ఆ నిర్ణయం కూడా ఆయనదే. మన అవగాహనకు రాకపోయినా, మనం అంగీకరించకపోయినా ఆయన చట్టం అమలయ్యే తీరుతుంది. శివుని ఆజ్ఞలేనిది చీమయినా కుట్టని సూత్రం సత్యమే అయినా మానవ జీవన పథంలో పురుష ప్రయత్నం అనేది అనివార్యం.
ఏ కర్మ ఆచరణకైనా సంకల్పం ముఖ్యం. ఒక కర్మను సంకల్పించి, దానికి అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించి, దాన్ని క్రియా రూపంలోకి తేవలసిన బాధ్యత కర్మిదే. జ్ఞానశక్తి, క్రియశక్తిగా దీనిని మనం పురుష ప్రయత్నంలోకి ఆవాహన చేసుకునే తీరాలి. ఫల వితరణ మాత్రం శివుని చేతిలో ఉంటుంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకోలేకే మనిషి కర్మ సిద్ధాంతానికి, శివుని ఆజ్ఞకు పొంతన కుదరక గందరగోళపడి పలాయన వాదాన్ని చిత్తగిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని విశ్వసించగలిగితే మనం కర్మను సుకర్మగా, కర్మయోగంగా ఆచరించగలుగుతాం. కర్మ సిద్ధాంతాన్ని శాస్త్రం ఇంత స్పష్టంగా చెప్పినా- నమ్మినా, నమ్మకపోయినా దుష్కర్మల్ని ఆచరిస్తూనే ఉంటారు. అదే మన కర్మ ఫలాలకు ఇతరులు వారసులవుతారని అనుకుంటే ఇక అప్పటి పరిస్థితేమిటి?
ఒక వ్యక్తి ఉపాహారం తీసుకునేందుకు ఫలహారశాలకెళ్లాడు. చెల్లించవలసిన మూల్యం గురించి భయపడ్తూ ధారాళంగా తినేందుకు జంకుతున్నాడు. అక్కడి పదార్థాలను పంపిణీ చేసే ఉద్యోగి ''మీ రంతగా భయపడవలసింది లేదు. బిల్లు మీరు చెల్లించనక్కరలేదు. భవిష్యత్తులో రాబోయే మీ మనవల నుంచి వసూలు చేస్తాం'' అన్నాడు. తాను తిన్నదానికి తానే చెల్లించవలసిన అవసరం లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి పరమానందభరితుడై అవసరమైన దానికంటే అధికంగానే తిని తృప్తిగా లేచిపోతుండగా ఆ ఉద్యోగి వేల రూపాయలతో కూడిన బిల్లు తెచ్చి ముందుపెట్టాడు. నిజానికతను తిన్నది వందలోపే. తెల్లబోయి ఇదేమిటని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ''మీరు తిన్నది మీ మనవలు చెల్లించబోతున్నప్పుడు మరి మీ తాతలు తిన్నది మీరు కట్టవలసిందే కదా?'' అన్నాడు నింపాదిగా.
ఎవరి కర్మఫలాలను వాళ్లే అనుభవించవలసి ఉంది అని తెలిసి కూడా ఇంత దుబారాగా దుష్కర్మలు చేసే లోకులు తమ కర్మఫలాలను ఇతరులు అనుభవిస్తారనే వెసులుబాటు ఉంటే ఇంకెంత విశృంఖలంగా ఉండేవారో కదా!? కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, మన బిల్లును మనమే కట్టవలసిన అనివార్యతను గుర్తుంచుకుంటే అప్రమత్తులమై కర్మలనాచరించి అమృత పుత్రులమనే మన స్వనామానికి సార్థకత చేకూర్చగలం.
'మన కర్మాచరణ, దాని ఫలాల బాధ్యతలో మన పాలెంత?' అని ప్రశ్నించుకుంటే, సమాధానం 'అంతా' అనే.
(Eenadu, 10:06:2007)
_______________________________________
...ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి...
చిత్తం శుద్ధి అయితేనే పరిపూర్ణత. మనలోని అంతఃకరణ చైతన్యమే చిత్తం. ఏ కర్మచేత మనం పవిత్రమవుతామో ఆ కర్మను 'పుణ్యం' అంటారు. దోషాచరణ పాపం.
దుఃఖాలు తటస్థించినప్పుడు వాటి పరిష్కారానికై పలు ప్రయత్నాలు చేస్తాం. కొన్ని భౌతికమైనవి- ఇంకొన్ని ధార్మికమైనవి. ధార్మిక ప్రయత్నాలు జపతపాలు పూజలు దానాలు మొదలైనవి. ఇవి చేయడంవల్ల నిజంగా ఫలితం ఉంటుందా అని కొందరికి సందేహం కలగడం సహజం. రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేసినప్పుడు- అవే చికిత్సలకు కొందరు బాగుపడుతున్నారు, కొందరికి వైఫల్యం ఎదురవుతోంది. అయినా మనం ఆ చికిత్సను 'మూఢ విశ్వాసం' అనలేం కదా! అలాగే ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి.
ఇక్కడ మరో ధర్మసూక్ష్మం ఉంది. దైవీయమైన జపతపాది ధార్మిక ప్రయత్నాలు ఎప్పటికీ వృథాకావు. అవి ఈ జీవితంలోనే కాలాంతరంలో ఏనాటికైనా ఫలించే అవకాశముంది.
ఈ విషయమై మన శాస్త్రాలు చక్కని వివరణలనిచ్చాయి. విత్తనం, వేరు (మూలం) కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే కారణమైన కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. ఈ 'కర్మ-ఫల' సంధానకర్మ ఈశ్వరుడు.
ఈ జన్మకు ఆధారమైన ప్రారబ్ధకర్మలలో ప్రతి కర్మకు- 1. బీజాంశ, 2. వృద్ధ్యంశ, 3. భోగాంశ... అని మూడు భాగాలుంటాయి. జపతపాది సాధనాల ద్వారా 'వృద్ధ్యంశ'ను నివారించవచ్చు. అంటే- దుఃఖాది అనుభవాల తీవ్రతను పెరగకుండా చేయవచ్చు.
తప్పించుకోలేనిది 'భోగాంశ'. ఇది అనుభవంతోనే క్షయమవుతుంది. కానీ దేవతారాధనచేత, తపోదానాదుల చేత సాధకుడికి ఈ అనుభవాన్ని తట్టుకోగలిగే శక్తి కలగడమేకాక, కాలపరిమాణంలో ఆ అనుభవం విజ్ఞాన హేతువవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది.
మిగిలినది 'బీజాంశ'. ధార్మిక సాధనవలన, ఆత్మవిచారణవలన చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలిగి- ఈ బీజాంశ నశిస్తుంది. అప్పుడతడు పూర్తిగా కర్మమాలిన్యం నుండి బయటపడతాడు. కనుక పాపనాశనకోసం ఈ ధార్మిక సాధనలను అవశ్యం అవలంబించాలి. పాపమనేది మనస్సుతో, మాటతో, శరీరంతో, ధనంతో (సంపాదించిన సామగ్రితో) చేస్తాం. జప, స్తోత్రాదుల చేత వాచిక (మాట) పాపం పోతుంది. అసలు గట్టి పాపం మానసికం. అది ధ్యానంవలన నశిస్తుంది. పూజ, క్షేత్ర తీర్థయాత్ర, శౌచం- శారీరక పాపాలను తొలగిస్తాయి. దానం ద్వారా- సంపాదనగత పాపాలు నశిస్తాయి. అందుకే త్రికరణాలతో, ధనాలతో సత్కర్మలను ఆచరించాలి.
ఇప్పటికే పేరుకున్న పాపాలను తొలగించుకొనేవి పావనకర్మలు. అంతేగానీ- ఈ పరిహారాలు ఎలాగూ సిద్ధంగా ఉన్నాయని కొత్త పాపాలను ఆచరించడం తగదు. మందు సిద్ధంగా ఉందని రోగాన్ని ఆహ్వానించలేం కదా! ఉన్న చెడును తొలగించుకొని చిత్తం శుద్ధమైతేనే ఆత్మజ్ఞానం, సత్యప్రాప్తి చేకూరుతాయి.
(Eenadu, 08:06:2007)
___________________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home