ఆదుకొనే వూయల

అనేక కారణాలవల్ల పుట్టగానే తమ బిడ్డలను పరిత్యజించే తల్లులు ఉన్నారు. ఆడపిల్ల పుడితే అక్కర్లేదనుకొనే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. ఆడపిల్లలను పెంచడం, వారికి పెళ్లి చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే భావనతో ఆడపిల్ల పుట్టగానే ఏ చెత్తకుండీలోనో రోడ్డుమీదో వదిలి వెళ్లిపోయే కఠిన హృదయులు కొందరున్నారు. ఏకంగా శిశు హత్యకు పూనుకొనే ప్రబుద్ధులూ ఉన్నారు. కారణాలేమయినా గంగాదేవి తనకు మొదటగా పుట్టిన ఏడుగురు పుత్రులను గంగపాలు చేస్తుంది. అష్టమ పుత్రుని కూడా జలార్పణం చేయబోతే తండ్రి శంతనుడు అడ్డుపడతాడు. ఆ పిల్లవాడే భీష్ముడిగా పెరిగి పెద్దవాడయి కురుపితామహుడుగా పేరు తెచ్చుకుంటాడు. తల్లులు పరిత్యజించే పిల్లలు పురాణ కాలం నుంచీ ఉన్నారు. విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి వచ్చిన మేనక ఆ రుషివల్ల ఓ ఆడపిల్లను కంటుంది. ఆ బాలికను పుట్టిన వెంటనే కణ్వాశ్రమ సమీపంలో ఓ చెట్టుకింద పడుకోబెట్టి తన మానాన తాను వెళ్లిపోతుంది. శకుంత పక్షులు ఆ బాలికను కాపాడటంవల్ల ఆమెకు శకుంతల అనే పేరు వస్తుంది. తల్లిదండ్రులు వదిలేసినా కణ్వమహాముని ఆశ్రమంలోనే ఆమె పెరిగి పెద్దదవుతుంది. తరవాత దుష్యంతుణ్ణి గాంధర్వ వివాహం చేసుకుని మన దేశానికి భరతదేశం అని పేరు రావటానికి కారణమయిన భరతుణ్ణి కంటుంది. అనామకులుగా పుట్టినా, తల్లిదండ్రులు పట్టించుకోకపోవటంతో అనాథలుగా పెరిగినా తమ స్వయం ప్రతిభతో రాణించి మంచి పేరు తెచ్చుకున్నవారు చరిత్రలో కొందరున్నారు. ఆ సంగతులెలా ఉన్నా- ఆడపిల్లలను భారంగా తలచి పుట్టిన వెంటనే వారిని ఏ చెత్తకుండీలోనో, రోడ్డుమీదో వదిలేసి వెళ్లిపోయే తల్లుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది.
'ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది' అన్న నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శించకుండా... తల్లులు వదిలేసే ఆడపిల్లలను ఆదుకోవాలని ఆ సంస్థవారు సంకల్పించారు. అనేక సామాజిక కారణాల వల్ల ముఖ్యంగా పేదరికంవల్ల కన్నతల్లులు దయాదాక్షిణ్యాలు మాని తమ పేగు తెంచుకొని వచ్చిన పిల్లల్నే వదిలేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో ఎక్కువగా జరుగుతుండటంతో ఉదయపూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థవారు అభాగ్యులైన అటువంటి పిల్లలను ఆదుకోవడానికి ముందుకొచ్చి ఓ హైటెక్ ఉయ్యాలను ప్రవేశపెట్టారు. బిడ్డను వద్దునుకొనేవారు తమ శిశువును అధునాతన యంత్రపరికరాలతోపాటు అన్ని సౌకర్యాలూగల ఆ ఉయ్యాలలో వదిలి వెళ్లిపోవచ్చు. అలా వదిలివెళ్లిన నిముషంలోపే సంస్థకు చెందిన ప్రతినిధులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. వెంటనే వారు వచ్చి బిడ్డ సంరక్షణకు తగు ఏర్పాట్లు చేస్తారు. అంతేకాక శిశువును వదిలివెళ్లిన తల్లుల వివరాలు ఇతరులకు తెలియకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రోజంతా నిర్విరామంగా పనిచేసే ఈ ఊయలకు అలారమ్ సదుపాయం కూడా ఉంది. ఊయలలో ఉంచిన శిశువును ఎవరైనా అపహరించటానికి ప్రయత్నించినా, లేదా అగ్నిప్రమాదం వంటివి సంభవించినా అలారం మోగి సంస్థ ప్రతినిధులకు తెలుస్తుంది. వెంటనే వారు శిశురక్షణకు అవసరమైన చర్యలు చేపడతారు. సాంకేతిక కారణాలవలన విద్యుత్ సరఫరా నిలిచిపోయినా 36 గంటలపాటు ఏ ఆటంకమూ లేకుండా హైటెక్ ఉయ్యాల పని చేస్తూనే ఉంటుంది. ''ఒక్క ఉదయపూర్‌లోనే కాదు ఇటీవల చాలా చోట్ల ఆడపిల్ల పుట్టగానే ఏ చెత్తకుండీలోనో వదిలేసే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అభం శుభం తెలియని అటువంటి పసివారిని సంరక్షించాలనే మా ప్రయత్నం. అందుకే ఈ హైటెక్ ఉయ్యాలను ప్రవేశపెట్టాం-'' అన్నారు ఆ స్వచ్ఛంద సంస్థకు ప్రతినిధి అయిన దేవేంద్ర అగర్వాల్. ఈ హైటెక్ ఉయ్యాలను మొదటగా ఉదయపూర్ రహదారిపై ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారుట. తరవాత ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తారు. సదుద్దేశంతో ప్రారంభించిన ఇటువంటి ప్రయత్నం ఎంతైనా శ్లాఘనీయం!
(Eenaadu:29-04-2007)
_________________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home