ఆయుష్'పాన్'భవ!
'పాన్ తెచ్చుకొని పన్ను కట్టుకొని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు హాయిగ ఉండాలోయ్'
అంటూ ఆదాయపు పన్ను విభాగం వాళ్లు మెత్తగా చిలుకకు చెప్పినట్టు చెప్పినా, గట్టిగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పన్ను ఎగవేసేవాళ్లు ఎగవేయడం మానట్లేదు. (పన్ను కట్టే వాళ్లు మాత్రం కట్టకుండా ఊరుకోవట్లేదనుకోండి.) ఏడాదికోసారి ఐటీ వాళ్లు బ'కాయితాలు' బయటపెట్టి ఇంత మంది ఇన్‌కంట్యాక్స్ కట్టలేదొహో అని పత్రికల్లో టముకు వేస్తుంటారు. అయినా ప్రముఖులు వచ్చేసారికి కడతామని 'మూట వరుస'క్కూడా అనరేంటబ్బా! పైపెచ్చు అసలు ఈ పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్) కార్డును కనిపెట్టిన దెవరనుకుంటూ వారిని కసి తీరా తిట్టుకుంటూ కూడా ఉంటారేమో.
'ఏముంది ఈ జీవితం పంఖా కింది కాయితం' అని పాడి, జీవితంలో ఏదీ పర్మనెంట్ కాదని చెప్పే వేదాంతాలు సైతం పాన్ కార్డు మాత్రం పర్మనెంట్/'ఫర్మ్'నెంట్ అని ఒప్పుకోక తప్పదు. ఈమధ్యే మూణ్నెల్లు కూడా నిండని ముద్దబ్బాయి ఆయుష్ రంజన్ 'మేరా పాన్ మహాన్' అనుకుంటున్నట్టుగా 'సిరినవ్వులు' చిందిస్తుంటే పాన్ ముఖం చూడకుండా తప్పించుకున్నవాళ్లు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. పన్ను కట్టడాల్లో అక్రమాలు ఉన్నట్లే 'పాన్' అక్రమాలూ ఉన్నాయి. 'పాన్‌లందు అసలు పాన్‌లు వేరయా ఇన్‌కంట్యాక్స్ రామ వినుర వేమ' అన్న పద్యం చెవికి సోకడంలేదూ. కేటు ప్రకృతి డూప్లికేటు వికృతి అయిపోయింది. డూప్లికేటు పాన్ కార్డులున్నోళ్లు 'ముంచోళ్లు'. మొన్న మార్చి నాటికి ఇలాంటి వాళ్లు 13 లక్షల మందికి పైగానే 'తేలారు'! ఇందులో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది డ్యూప్లికేట్ పాన్‌లను అధికారులు కరకర నమిలి పారేశారు. అయినా పాన్‌ల బాగోతం 'ఆనుపాన్‌లు' అంతుపట్టడం లేదు. పది లక్షల నకిలీ పాన్ కార్డులను పట్టుకుని చెత్తబుట్టలో పడేశామని కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా నకిలీ పాన్ కార్డుల పరిశ్రమ వర్ధిల్లుతూనే ఉంది.
ఢక్కాముక్కీలు తింటూ రెక్కలు ముక్కలు చేసుకు, లెక్కలు కట్టుకునే వాళ్లకే పాన్ కార్డు అవసరం అని ఎడాపెడా సంపాయించి వెనకేసుకున్నవాళ్లు అనుకుంటుండవచ్చు. లోహ విహంగం రెక్కలు తొడుక్కుని విదేశాల్లో వాలాలన్నా, చివరికి సెల్‌ఫోన్ కొనాలన్నా 'పాన్ కార్డు ఉందా సార్? నంబరు ఎంత సార్' అని ప్రశ్నలు అడుగుతారు. పాన్ కార్డు లేకపోతే హ్యాపీ 'రిటర్న్స్' ఆఫ్ ద డే అనలేరు. శివుడాజ్ఞ లేకుండా చీమయినా కుట్టదంటారు. ఇప్పుడు శివుడి డ్యూటీని ఇన్‌కం ట్యాక్స్ శాఖ తీసేసుకున్నట్లుంది. అంతా ఇన్‌కంట్యాక్స్ ఇలాకాలోకి వస్తుండడంతో ఏ వ్యవహారంలో నయినా పాన్ కార్డు 'నిను వీడని నీడను నేనే' అంటోంది. మనిషికి అదే 'పాన్'చభౌతిక దేహమైపోయింది. అందువల్లనే పాన్'దేవో'భవ అన్న విన్నపాలు విపరీతంగా పెరిగిపోయాయి!
మనిషి ఆరోగ్యానికి 'ప్రాణాయామం' ఎంత అవసరమో, సౌభాగ్యానికి 'పానాయామం' అంత అవసరం అని ఆర్థిక యోగులు సెలవిస్తుంటే బదులు చెప్పేందుకు ఏముంది?
- ఫన్‌కర్
(Eenadu, 15:07:2007) -------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home