నిపుణ పురాణం
'బేర' గంధము తెచ్చినారము నిపుణులెవ్వరో తెలుపుడీ...
'జీతా'యిలాలు చూపిస్తున్నా, సరిగ్గా వెల కడతామన్నా నిపుణ వీధి వెలవెలబోతూనే ఉంది. 'డాలర్లు ఎగరేసే వాళ్లముందు కాలర్లు ఎందాకా ఎగరేయగలం' అనుకొంటూ నిట్టూర్పు విడవాల్సివస్తోంది.
'ఎక్స్‌పర్టులందరు ఎక్స్‌పోర్టు అయ్యారు ఇంపోర్టు కాకుంటే ఎక్స్‌పర్ట్స్ లేరా?'
అని యాజమాన్యాలు క్వొశ్చన్‌మార్కు ఫేస్ పెడుతున్నాయి. ఓరకంగా ఇది తెల్లవాడి దెబ్బే. ఆనాడు వాడు ఒక కంపెనీ పెట్టే మన దేశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడేమో మన నిపుణుల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు. అప్పుడూ ఇప్పుడూ 'కంపెనీ సేక్' అంటాడు. పనిమంతులు కరువైపోయి కంపెనీలు తలుపులను బార్లా తెరిచి ఉంచుతున్నాయి.
'ఏ రంగం అని వివరమడిగితే... ఏమని చెప్పుదు లోకులకు'.
అనేక రంగాల్లో ఈ కొదువ వీరంగం ఆడుతోంది. ఫార్మా, ఆతిథ్య, విమానయాన, జౌళి, చిల్లర విక్రయ రంగాలు విదేశీ నిపుణులకు వెల్‌కమ్ బోర్డులు పెట్టేశాయి. వీటన్నిటిలోకీ పైలెట్‌ల కొరత హైలైట్. అందరినీ విదేశాలకు తరలించే విమాన రంగం విదేశీ పైలెట్ల కోసం రెక్కలు చాస్తోంది.
'నడిచెడిది 'ఇండియన్' అట నడిపించెడు వాడు విదేశీ పైలెట్టట!'.
విదేశీ విమానచోదకులు లక్షలు ఇస్తాం అంటేనే మా వి'మానాన' మేం బతుకుతాం అంటున్నారు. నింగికి ఎగరడానికి విమానం బరువు సమస్య కాకపోయినా పైలెట్ల జీతభత్యాల భారం చుక్కలనంటుతూ విమాన సంస్థలకు దిక్కు తోచడంలేదు. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిందన్న మాట 'ప్రపంచమే ఒక కంపెనీ'గా స్థిరపడిపోతోంది. ఎక్కడ మంచి జీతం వస్తుందంటే అక్కడికి 'లెక్కలు కట్టుకు' మరీ వాలిపోతున్నారు. పని ప్రకృతి అయితే, మనీయే వికృతి! ఇండియా అంటే నిరుద్యోగం తాండవించేదనేవారు. 'ఉద్యోగాలు కావలెను' అన్న మాట ఏ మూలకు వెళ్లినా వినిపిస్తుందనుకుంటే ఇప్పుడు సీను మారింది. బడాబడా కంపెనీలే నిపుణుల కోసం వలలు కొంటున్నాయి. కలలు కంటున్నాయి. మితిమీరిన జీతాలు ఇచ్చి బతిమాలి బామాలి సదరు శాల్తీలని పట్టుకొచ్చినా, ఎంత కాలం ఉంటారో అంతుపట్టడం లేదు. బీపీఓ కంపెనీలు 'జాబ్'దారీగా'నేటి జూనియరే రేపటి సీనియర్' అంటూ నినదించడం ఇందుకో ఉదాహరణ. జూనియర్లకు శిక్షణ ఇచ్చి దుకాణం నడిపిస్తున్నాయి.
అమెరికా లాంటి దేశాల్లో 'కార్లు డ్రైవర్లు లేకుండా నడుస్తాయి' అని ఒక పెద్దాయన అన్నాడు. విన్నాయన విస్తుపోయాడు. 'డ్రైవర్లు దొరక్కపోతే ఓనర్లే తమ కార్లను నడుపుతూ ఉంటార'ని తాపీగా చెప్పాడు పెద్దాయన. నోరెళ్లబెట్టక చేసేదేముంది? మనదీ ఇదే పరిస్థితి అవుతుందేమో?
-ఫన్‌కర్
(Eenadu, 29:07:2007) ----------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home