వ్యవసాయం
- బులుసు-జీ-ప్రకాష్
హనుమంతుడు జానకిని చూసి తన ఆనవాలు చెప్పిన తరవాత సీతామాత అంటుంది: ''పైరు సగం వరకూ పెరిగి ఉండగా, వర్షం పడగానే భూమి వికసించినట్లు, నీ ప్రియభాషణాలు విన్నాక నాకు మనోవికాసం కలిగింది వానరా'' అని.
సూర్యుని చూడని రాజకుమారి వ్యవసాయ విషయాన్ని ఎలా ప్రస్తావించింది? పోనీ తండ్రి ఏమైనా వ్యవసాయదారుడా అంటే అతడొక మహారాజు. తన తండ్రి అయిన జనక మహారాజు పుత్రేష్టి- అంటే, సంతానం కావాలనే కోరికతో ఇష్టి- అంటే, యాగం చేయదలచి భూమిని స్వయంగా దున్నుతున్నప్పుడు నాగేటి చాలుకు భూగర్భంలో ఒక పెట్టె తగిలింది. అందులోంచి ఆవిర్భవించింది పసికందు. ఇష్టి పూర్తి చేయకుండానే తన ఇష్టకామ్యం సిద్ధించింది! సీరం అంటే నాగలి. సీరం చాలుకు తగలడం వల్ల 'సీత' అని జనక మహారాజు నామకరణం చేశాడు ఆ అయోనిజకు. జనకుడు ఒక మహారాజై ఉండి తానే స్వయంగా భూమిని ఎందుకు దున్నవలసొచ్చింది? తన అధీనంలో అనేకులైన వ్యవసాయం చేసే రైతులుంటారు కదా అనిపించవచ్చు. పంట పండించే వ్యవసాయ భూమిని రైతులే దున్నుతారు. యజ్ఞం చేయదలచిన భూమిని మాత్రం మహారాజే స్వయంగా దున్నాలి.
ఇప్పటికీ జగన్నాథ క్షేత్రం అయిన 'పురి'లో ఏటా జరిపే రథోత్సవం ప్రారంభించేముందు బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు ఉన్న రథాలను జగన్నాథపురికి చెందిన ఆనువంశిక ధర్మకర్త అయిన గజపతి మహారాజు స్వయంగా తుడిచి, తాళ్లతో లాగిన తరవాతనే ఇతరులు లాగుతారు.
ఎనభై నాలుగు జీవరాశులకూ వాసుదేవుడే క్షేత్రం. బీజమూ ఆయనే! క్షేత్రజ్ఞుడు అంటే అధిపతి కూడా వాసుదేవుడే! ఆ క్షేత్రం దున్నేవాడూ, అందులోంచి వచ్చిన సకల జీవరాశులూ మనుగడ సాగించడానికి కారకుడూ ఆయనే! క్షేత్రం, భూమి, క్షేత్రజ్ఞుడు, జీవుడు-పరమాత్మ. జీవ బ్రహ్మైక్యం చెందడం అని అర్థం చేసుకోవాలి.
(Eenadu, 19:08:2007)
--------------------------------------------
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home