అందివచ్చిన వూహాలోకం
మనిషికి కోరికలు అనేకం. వూహలు అనంతం. కోరికలే గుర్రాలైతే మనిషితో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయిస్తాయి. ''మనసు గుర్రమురోరి మనిసీ, మనసు కళ్ళెము లాగు మనిసీ, కళ్ళెమును వదిలితే కంచెలో బడద్రోయు కళ్ళు తేలేసేవు జనుడా, ఆపైని కార్యమేమున్నదిర జనుడా...'' అని తత్వం బోధిస్తుంది. అయినా చాలామంది కోరికలను అదుపులో ఉంచుకోలేరు. వూహలకు కళ్ళాలు వేసుకోలేరు. ఇలలో తమకు దొరకని అందాలను, ఆనందాలను కలల్లో తీర్చుకొని సంతృప్తిపడుతుంటారు. ''కలగంటి... కలగంటి'' అంటూ కలవరించిన ఓ వయారిభామ- ''కలువ రేకులవంటి కన్నులు కలసామి కనిపించెనమ్మా...'' అని సంతోషపడిపోతుంది. తెల్లారేసరికల్లా కల కరిగిపోయి చింతాకుల వంటి కళ్ళతో మిర్రిమిర్రి చూసే మొగుడే ప్రత్యక్షమై ఉసూరుమంటుంది. కలలో జరిగింది ఇలలో జరగదని సామెత. ''మా ఆయన నిద్రలో ఏవేవో పేర్లు కలవరిస్తుంటాడు. రోజూ ఇదే తంతు...'' అంటూ డాక్టరు దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసింది తాయారమ్మ. ''ఆ అలవాటు మానేందుకు మందిమ్మంటారా?'' అని అడిగాడు డాక్టరు. ''వద్దు. ఆ పేర్లు స్పష్టంగా సరిగ్గా వినపడేలా కలవరించేట్లు మందియ్యండి చాలు. ఆ తరవాత సంగతి నేను చూసుకుంటాను'' అంది తాయారమ్మ పళ్ళు కొరుకుతూ. జీవితంలో తీరని, తీర్చుకోలేని కోరికలను కలల్లో తీర్చుకొని సంతృప్తిపడటం కొందరి నైజం. కలలు, వూహలు మనిషిని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి.
తన వూహల్లో మెదిలే సుందర రాజకుమారుణ్ని కలలో దర్శించి ఆ అందగాణ్నే తీసుకువచ్చి తనకు అప్పగించమని పట్టుబడుతుంది బాణాసురుని కుమార్తె ఉషాసుందరి. ''కలలో జూచినట్టి నీటుగాని తోడితెమ్మనియేవు మరి యాతని వూరుపేరు తెలియుటెలాగు, అందమైన కొలని నీటియందు గానుపించు చందమామ నొడిసి పట్టు చందమెలాగే? యొప్పులాడి యద్దమునను గుప్పున కనినట్టి సుందరుని చేయిసాచి పట్టుకొనుట ఎలాగే?'' అని చెలికత్తె చిత్రరేఖ గోలపెట్టినా ఉషాకన్య వినిపించుకోదు. అతణ్ని తప్ప వేరొకర్ని వరించనని ఖండితంగా చెబుతుంది. చివరకు ఉషాసుందరి చెప్పిన పోలికలకు తన వూహలను జోడించి అనిరుద్ధుని చిత్రం గీసి ఆ సుందరుణ్ని తన మంత్రబలంతో ఉషాసుందరి శయన మందిరంలోకి చేరుస్తుంది చిత్రరేఖ. తరవాత అనేక ఉత్కంఠభరిత సన్నివేశాల అనంతరం ఉషాపరిణయం వైభవోపేతంగా జరుగుతుంది. కలలో చూసిన సుందరాంగుణ్ణి ఇలలోకి రప్పించి పెళ్ళాడిన ఘనతను ద్వాపరయుగంలోనే ఉషాసుందరి దక్కించుకొంది. కొంతమంది ఘనులు తమ మాటల చాతుర్యంతో జరగటానికి వీలుకాని విషయాలనే జరుగుతున్నట్టు కనుకట్టు చేస్తారు. ఈ విషయంలో ఘనుడు గిరీశం. తనకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేకపోయినా, బాలవితంతువు బుచ్చమ్మను పెళ్ళాడే వీలు లేకపోయినా- ''మనం పెళ్ళాడతాం అనుకోండి... పెళ్ళాడింతర్వాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలికదా? ఉద్యోగం చేస్తేగాని డబ్బురాదే. నవాబుగారి దగ్గర నౌకరీ సంపాదిస్తాను. అలాగ ఉద్యోగం, ఇల్లూ వాకిలీ తోటా దొడ్డీ యార్పరుచుకునేటప్పటికి మనకు చిన్న పిల్లలు పుడతారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటినిండా సరుకులు పెట్టుకొని చక్కగా పసుపూ కుంకం పెట్టుకొని మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనం చేస్తూ వుంటే ఆ సొగసు చూశారూ?...'' అంటూ బుచ్చమ్మ కళ్ళముందు ఇంద్రజాల ప్రపంచం సృష్టిస్తాడు. ఆ ఇంద్రజాలమే కన్యాశుల్కం నాటకాన్ని వూహించని మలుపులు తిప్పుతుంది.
''అదిగో నవలోకం వెలసె మనకోసం'' అని సరదా జీవులు పొంగిపోతూ తమకు నచ్చిన రూపంలో సుందర వూహాలోకంలో విహరించగల వీలు ఇంటర్నెట్ పుణ్యమా అని ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరుజన్మలోనైనా దక్కితే బాగుండునని నెరవేరని వూహలతో కాలం గడిపే అవసరం ఇకలేదు. తమ కోరికలు తీర్చుకోవటానికి మరో జన్మ అక్కరలేదు. ఈ జన్మలోనే రెండో జీవితం అనుభవించే వీలును ఇంటర్నెట్ లోకంలో '3-డి డిజిటల్ ఆన్‌లైన్ కమ్యూనిటీ' అందిస్తోంది. నమ్మశక్యంకాని ఈ వూహాలోకం ఫిలిప్ రోసెండెల్ అనే మేధావి సృష్టి. రెండో జీవితంగా అభివర్ణించే ఈ వూహాలోకంలో తాము ఇష్టపడే విధంగా తమ మొహాన్ని, శరీరాన్ని ఒంటి రంగును మార్చుకోవచ్చు. నల్లగా కాకిలా ఉండే కాంతామణి ఈ పద్ధతి ద్వారా అందాల రామచిలకమ్మగా వయ్యారాలు ఒలికించవచ్చు. ప్రత్యేక కంప్యూటర్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం సమకూర్చుకుని 'రెండో జీవితం కామ్'లోకి వెళ్ళి మౌస్ క్లిక్ చేస్తే చాలు- ప్రస్తుత జీవితంలోనే రెండో జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ 3-డి వూహాలోకాన్ని నిర్మించేది, నిర్వహించేది అందులో చేరిన సభ్యులే. నిర్ణీత రుసుము చెల్లించిన వూహాలోక సభ్యుల ఎదుట అతిపెద్ద డిజిటల్ భూభాగం ప్రత్యక్షమవుతుంది. అందులో వూహాలోక ప్రజలుంటారు. అందమైన ఇళ్ళుంటాయి. అన్ని సౌకర్యాలు కళ్ళముందు కనిపిస్తాయి. ఒక చోట మౌస్‌ను క్లిక్ చేస్తే కొత్తగా సభ్యత్వం పుచ్చుకున్నవారు ఇల్లు కట్టుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి అనువైన స్థలం కనిపిస్తుంది. ఆ స్థలం చుట్టూ అప్పటికే నిర్మాణమై ఉన్న ఇళ్ళూ ఆ ఇళ్ళల్లోనివారూ కనిపిస్తారు. వారితో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవచ్చు. ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించవచ్చు. అవసరం అనుకుంటే తాము నిర్మించుకున్న ఇంటిని అమ్ముకోనూ వచ్చు. వూహా ప్రపంచంలో స్థలం దొరకదనే సమస్యలేదు. జనాభాకు అనుగుణంగా స్థల విస్తీర్ణం పెరుగుతుంటుంది. 2003 సంవత్సరంలో ఫిలిప్ రోసెండెల్ ఈ వూహాలోకాన్ని సృష్టించినప్పుడు 64 ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు 65 వేల ఎకరాలకు విస్తరించింది. శాస్త్రవిజ్ఞానమూ బహుముఖాలుగా పెరిగిపోతుంటే- వూహాలోకాలు కళ్ళముందు సాక్షాత్కరించటంలో వింతేముంది?
(Eenadu, 09:09:2007)
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home