జీవితం ఏమిటి?
- ఎర్రాప్రగడ రామకృష్ణ
''కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది గాని, దాని ఫలితంపట్ల లేదు''- అని గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఫలితం సంగతి అలా ఉంచి, అధికారం ఉంది కదా- అని, కర్మలను విడిచిపెట్టేయడం మనిషికి సాధ్యమేనా? అదీ చాలా కష్టమైనదిగానే తోస్తుంది. కర్మలనుంచి దూరంగా ఉండటం అనేది మనిషికి దాదాపుగా అసాధ్యమని ఈ కథ మనకు తెలియజేస్తోంది.
ఒకాయన వయసులో ఉండగానే వైరాగ్యం పెంచుకుని, ఊరికి దూరంగా ఒక నిర్జనమైన అడవిలో నిరాడంబరంగా సాధువులా జీవించడం ప్రారంభించాడు. ఆకలివేసినప్పుడు అడవిలో దొరికే పళ్ళూ, దుంపలు తినడం, సెలయేరులోని నీళ్ళు తాగి రోజంతా మౌనంగా, నిశ్చింతగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం సాధన చేశాడు. ఆయనకి ఉన్నవల్లా చిన్నపాక, కట్టుకోవడానికి రెండు గోచీలు, ఒకటి రెండు మట్టిపిడతలూ... ఇంతే మొత్తం ఆయన ఆస్తిపాస్తులు.
ఒకరోజు చూరులో దాచిన గోచీ గుడ్డను ఎలుకలు కొరికి, ముక్కలు చేసేశాయి. దాంతో ఆ సాధువుకు ఇబ్బంది ఏర్పడింది. ఊళ్ళోకి వచ్చి ఎవరినో యాచించి మరో కౌపీనాన్ని సంపాదించాడు. మర్నాడు చూస్తే దాన్నీ ఎలకలు కొరికి నాశనం చేశాయి. ఇలా రెండు మూడుసార్లు జరిగేసరికి సాధువుకు చికాకు కలిగి, ఒక పిల్లిని తెచ్చి పెంచడం ఆరంభించాడు. వెంటనే సమస్య పరిష్కారమైంది. ఎలుకలు ఆ పాక దరిదాపుల్లోకి రావడం మానేశాయి. మరి పిల్లి సంగతి?
మళ్ళీ ఊళ్ళోకి పోయి, పాలు అడిగి తెచ్చి పిల్లిని సాకడం మొదలైంది. దానికి ఆకలైనప్పుడల్లా సాధువు ఒళ్ళో చేరి 'మ్యావ్ మ్యావ్' అంటూ గోల చేయడంతో ఆయన ధ్యానం భంగమయ్యేది. ఇది పనికాదనుకుని, ఆయన ఈసారి ఏకంగా ఒక గేదెనే సంపాదించి, పెరట్లో చెట్టుకు కట్టేశాడు. దాని పాలు పితికి పిల్లికి పోసేవాడు. ఆ రకంగా పిల్లి గొడవ పరిష్కారమైంది. కానీ, గేదె బాధ మొదలైంది. దాన్ని పెంచడం అనేది తపస్సు చెయ్యడం కన్నా కష్టమన్న సంగతి ఆయనకు చాలా త్వరగానే బోధపడింది. చివరికి విధిలేక ఆ సాధువు పెళ్ళి చేసుకుని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఆవిడ ఇంటి సంగతీ, గేదె సంగతీ సమర్థంగా, శ్రద్ధగా చూసుకోవడంతో సాధువు పూర్వంలాగే నిశ్చలంగా ధ్యానంలో మునిగిపోయాడు. కొన్నాళ్ళకు ఆయన భార్యకి విసుగుపుట్టింది. తనను పట్టించుకోని భర్త, మగదిక్కు ఉన్నా తనమీదే కుటుంబ బాధ్యతలు, ఇల్లూ, గేదె, భర్తకు సేవలూ... ఇలా ఎన్నాళ్ళని? దాంతో సాధింపులు, సతాయింపులు మొదలై సాధువు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దైవధ్యానం నుంచి దూరమైన ఆయన మనసులో భార్య గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. చివరికి ఆయనకో గొప్ప ఉపాయం తోచింది. పిల్లల్ని కనిపారేస్తే వాళ్ళ పెంపకంలో పడి భార్య తన జోలికి రాకుండా ఉంటుంది, తనదారిన తాను నిరాటంకంగా ధ్యానం కొనసాగించవచ్చు అనుకున్నాడు.
ఈ తెలివైన పథకాన్ని ఆయన వెంటనే అమలుచేశాడు. ఇద్దరు పిల్లలు కలిగాక ఆయన పూర్తిగా సంసారంలో కూరుకుపోయాడు. పూజాలేదు, పునస్కారమూ లేదు. ధ్యానమూ లేదు, మౌనమూ లేదు. నెత్తిమీద బాధ్యతలు, చేతినిండా చాకిరీ, మనసు నిండుగా విచారం మిగిలాయి. మనిషి నిస్సహాయుడయ్యాడు. అవసరాలు మనిషిని కర్మల్లోకి నెట్టాయి. ఇది చదవడం పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటే మనలో చాలామందికి ఆ సాధువు దర్శనమిస్తాడు. అదే విషాదం!
(Eenadu,07:09:2007)
-------------------------------------------------
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home