ఒంటరి జీవులకు చేయూత
'పొట్ల పాదుకు పొరుగు గిట్టదు'- అని సామెత. అలాంటి మనుషులూ కొందరుంటారు. వారికి ఇతరులతో పొసగదు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కాలం గడపటానికే ఇష్టపడతారు. 'ఒంటికాయ శొంఠికొమ్ము' మనస్తత్వం గల ఈ బాపతు మనుషులు నలుగురిలో కలవక దూర దూరంగానే ఉంటారు. నీకు నాకు పడదు కాని రోలెక్కి తలంబ్రాలు పోయి- అందిట ఓ కొత్త పెళ్లికూతురు. పెళ్లిపీటలమీదే ఆవిధంగా ప్రవర్తించిన ఆ అమ్మాయి తరవాత కాపురం ఎంత లక్షణంగా సాగించి ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇటువంటి వారికి స్నేహంలోని మాధుర్యం, సహజీవనంలోని సౌఖ్యం వంటివి తెలియవు. 'సృష్టిలో తీయనిది స్నేహమేనోయి'- అన్నాడు కవి. ఇతరులతో కలసి మెలసి ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకొంటూ, సహాయపడుతూ, సహకారం పొందుతూ ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించటంలోనే అర్థం ఉంది, ఆనందం ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు ఒంటరిగానే ఉండాలనుకొంటారు. ''ఇతరులతో సంపర్కమువొదులు కొని ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవితరహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధానపరుచుకోవడం సంఘంతో నిమిత్తం వున్న మనిషికి సాధ్యం కాదు కాబోలు...'' అంటారు బుచ్చిబాబు తన 'చివరకు మిగిలేది' నవలలో. నిజానికి ఒంటరితనం వాంఛించదగ్గది కాదు.
''ఎవరినీ ప్రేమించకుండుట అదే ఒక నేరం, ప్రేమ తెలియని జీవితాలు భూమికే భారం-'' అన్నారు ఆరుద్ర. ఒంటరితనాన్ని కోరుకోవటం అభిలషణీయం కాదు. అనేక కారణాలవల్ల అయినవారి తోడు లేక ఒంటరిగా జీవితాలు గడపక తప్పని అభాగ్యులెందరో ఉన్నారు. తమను ఆదుకొనే ఆపన్నహస్తం కరవై నిరాశా నిస్పృహలతో వారు వేగిపోతుంటారు. ''నా కొరకు చెమ్మగిలు నయనమ్ములేదు...'' అనిపించటం కంటె జీవితంలో దుర్భరమైన దశ మరొకటి ఉండదు. కోరి ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకొనేవారు కొందరైతే పరిస్థితుల ప్రాబల్యంవల్ల పలకరించేవారు, ఆదరించేవారు లేక తప్పనిసరి ఒంటరితనాన్ని అనుభవించేవారు మరికొందరు. వృద్ధాప్యం పైబడినవారిని, రోగగ్రస్తులను ఒంటరితనం మరింత ఎక్కువగా బాధిస్తుంది. వారికి మరొకరి తోడు, ఓదార్పు తప్పనిసరి. అవి లోపించినప్పుడు జీవితమే దుర్భరంగా తోచి నిరాశానిస్పృహలు ఆవరిస్తాయి. ''రాతి బ్రతుకెంచుకొని యహోరాత్రములను రెప్పవాల్చని తిమిర యాత్రికుడ నేను-'' అన్న భావుకుడు ''కోతకై చూచు పంట బరువున వ్రాలిన పైరువోలె నీ చేయూతకై వేచి కాచి యుంటి-'' అంటాడు. అతడు కోరుకున్న స్నేహహస్తం అందినప్పుడే ఆనందం అంచులు దాటుతుంది. లేనిపక్షంలో నిర్బంధ ఒంటరితనంతో జీవితమంతా నిట్టూర్పుల పొగలూ సెగలూ విడుస్తూ భారంగానే కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. ఏకాంతవాసం, ఒంటరితనం ఎవరూ కోరదగినవి కావు.
నలుగురితోపాటు నారాయణా అన్నట్లుగా నలుగురితో కలసిమెలిసి ఉండే సామూహిక జీవనాన్నే మనిషి కోరుకుంటాడు. మానవుడు సంఘజీవి. ఆ స్వభావం వల్లే నలుగురితో చావు పెళ్ళితో సమానం వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఒంటరితనం బాధాకరమైంది. ఒక శాపం వంటిది. మరొకరి తోడు లేకుండా ఒంటరిగా ఉండాల్సి రావటం మనిషిని కుంగదీస్తుంది. మారిపోయిన నేటి పరిస్థితుల్లో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన నేపథ్యంలో చాలామందికి ఒంటరితనం తప్పటంలేదు. రోగులను, వృద్ధులను కనిపెట్టుకొని ఉండే తీరిక ఇప్పడు ఎవరికీ ఉండటంలేదు. ఈ దశలో హాలెండ్‌లో 'డిజెనోబ్లోయెమ్' (పొద్దుతిరుగుడు పువ్వు) అనే స్వచ్ఛంద సంస్థ ఒంటరితనాన్నుండి వృద్ధులను, రోగులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఉద్భవించింది. 1945లో ప్రారంభమైన ఈ సంస్థ తన కార్యకర్తల ద్వారా వృద్ధులు, రోగులు వంటి ఆపన్నులకు తగిన సేవలందించి వారికి మనోధైర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంస్థకు 40,000 మంది కార్యకర్తలుండగా వారు ఆరు లక్షలమందికి పైగా వృద్ధులు, రోగులు తదితరులకు తమ సేవలందిస్తున్నారు. సంస్థకు చెందిన కార్యకర్తలు వృద్ధులతో, రోగులతో మాటామంతీ ఆడుతూ వారితో కబుర్లు చెబుతూ కాలక్షేపం కలిగిస్తారు. అప్పుడప్పుడూ వారిని సినిమా, నాటకాలవంటి వినోద కార్యక్రమాలకు తీసుకెళతారు. కబురుచేస్తే వృద్ధుల, రోగుల ఇళ్లకే వెళ్లి, వారితో చదరంగం వంటి ఆటలలో పాల్గొంటారు. వారితో కబుర్లాడుతూ కాఫీ తాగుతూ ఉల్లాసాన్ని కలిగిస్తారు. ఆమ్‌స్టర్‌డాం నగరంలో ప్రారంభమైన ఈ సంస్థ మొదట్లో తమ సేవలను వయసుమళ్లిన వారికి, రోగులకు మాత్రమే పరిమితం చేసినా ప్రస్తుతం అన్ని వయసులవారికీ విస్తరింపచేసి యువతకు సైతం తమ సేవలను అందిస్తోంది. ''అనేక కారణాలవల్ల, ముఖ్యంగా ఇతరులతో కలిసే స్వభావం కొరవడటంవల్ల యువజనంలో కూడా కొంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. అటువంటివారిని మార్చి నలుగురితో కలసిపోయేలా కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నాం. ఇందుకోసం శిక్షణ పొందిన యువ కార్యకర్తలు అనేకమంది మా సంస్థలో ఉన్నారు. మా కృషి సత్ఫలితాలను ఇవ్వటమేకాక విదేశాలవారి దృష్టినీ ఆకర్షిస్తోంది. మా సంస్థవారి సేవలను అందుకోవటానికి వారు సైతం ఆసక్తి చూపుతున్నారు-'' అని వివరించారు సన్‌ఫ్లవర్ సంస్థ నిర్వాహకురాలైన జెన్నీడిజోంగ్. ఉదాత్తమైన ఆశయాలతో నడుస్తున్న ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతుండటం ముదావహం!
(Eenadu, 14:10:2007)
___________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home