విజయీభవ- దిగ్విజయీభవ
కాలచక్ర పరిభ్రమణంలో పండగలన్నీ సంవత్సరానికొకసారి తిరిగి వస్తూనే ఉంటాయి. తారీకు మారినా తళుకు తగ్గదు అన్నట్లుగా పండగల సందడి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొంగ్రొత్త ఆశలు రేపుతూ కొత్త సందళ్ళను తోడు తీసుకొని వస్తూనే ఉంటాయి పండగలు. అందుకే ఆరోజులను పర్వదినాలు అంటారు. పండగల కోసం అంతా ఎంతో ఆతృతతో ఆశగా, ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. పండగ రోజున ప్రతివారిలోను ఉత్సాహం, ఉల్లాసం పొంగులు వారుతూ ఉంటాయి. ముత్యాల ముగ్గుల, మామిడి తోరణాల అలంకరణలతో గృహాలు మెరిసిపోతుంటాయి. ఇల్లాళ్లు గృహాలంకరణలతోను, పిండివంటలు తయారుచేయటంలోను మునిగిపోతే పిల్లలు కొత్త బట్టలు కట్టుకొని మురిసిపోతుంటారు. దినకరుడు చల్లబడి పగటి పొద్దు తగ్గి చలిగాలి చురుకు హెచ్చటమే సంక్రాంతి పండగ వచ్చేస్తోందనే హెచ్చరికకు గుర్తు. 'పుష్యమాసంలో పూసలు గుచ్చే పొద్దుండదు' అని సామెత. సంక్రాంతి రోజుల్లో తెలుగింటి ఆడపడుచులకు క్షణం తీరిక ఉండదు. ఆ వైనాన్నే- ''ఆంధ్ర యువతులు సంక్రాంతి యవసరమున నింటముంగిట నుత్సాహ మిగురులొత్త-'' అని ప్రారంభించి -''పొంకముగ జేసినట్టి యలంకరణము గన్నులం జూడవలె చెప్పగా తరంబె'' అన్నారో కవి.
సంక్రాంతి, ఉగాది, దసరా సహా ఏ పండగ అయినా తెలుగువారి లోగిళ్ళు రకరకాల ముగ్గులతో, ఇతర అలంకారాలతో దీపాలతో వెలిగిపోతుంటాయి. పండగ రోజుల్లో ప్రకృతి సైతం వింత సొగసులను సంతరించుకొంటూ ఉంటుంది. మామిళ్ళు పూతకు రాగా, కొత్తపూవుల సింగారంతో తోటలన్నీ గుబాళిస్తుండగా, కోకిల పాటల నేపథ్యంలో వసంతునికి ప్రకృతి పలికే స్వాగతంలా వస్తుంది ఉగాది. దీపాల కాంతులు వెదజల్లే, టపాకాయల మోతలు వినిపించే శుభ్రజ్యోత్సావళి దీపావళి. భాద్రపద మాసంలో వినాయక చవితితో పండగల రాక ప్రారంభమవుతుంది. అంతకు ముందు- శ్రావణమాసంలో శనగల జోరన్నట్లు చిరుజల్లులతో వరలక్ష్మీ వ్రతాలతో శ్రావణ మాసం హడావుడి చేసి వెళ్ళిపోతుంది. శ్రావణమాసం నెలరోజులూ మహిళలకు పండగే. వినాయక చవితి సందళ్ళు ఇంకా మరుగున పడకుండానే దసరా కొలువులు ప్రారంభమవుతాయి. దసరా చాలా సరదా అయిన పండగ. ''ఇంత లేమబ్బు చిరుతున్కయేని లేదు విప్పిరేమో నిశారాజి వెల్లగొడుగు-'' అని ఓ కవీశ్వరుడు ఆశ్చర్యపోయిన విధంగా ఎండలు తగ్గి, వానలు వెనుకబడి, నిర్మలమైన ఆకాశంలో వెన్నెల వెలుగులు తళతళలాడుతుండగా శరన్నవరాత్రులు వచ్చేస్తాయి. దేవీ నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై నవమితో ముగుస్తాయి. దశమినాడు విజయదశమి పేరుతో దసరా పండగ జరుపుకుంటారు. నేడే ఆ శుభదినం.
దసరా పండగ రోజుల్లో దుర్గాదేవిని రోజుకో అవతారంతో పూజిస్తారు. మహామాయ, మహాకాళి, సరస్వతి, చండి, దుర్గ వగైరా రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. కస్తూరి కళ్ళాపులు, ముత్యాలతో ముగ్గులు గతించిన వైభవాలైపోయినా, ఈనాటికీ దసరా నవరాత్రులను యథాశక్తి ఆడంబరంగానే జరుపుకొంటున్నారు. పులివేషాలు, పిట్టలదొర వేషాలు వగైరా దసరా వేషాలు పల్లెటూళ్ళలో ప్రత్యేక ఆకర్షణగా సందడి చేస్తూ ఉంటాయి. దేవీ నవరాత్రుల్లో ఆయుధ పూజకొక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పాండవులు అజ్ఞాతవాసం చేయటానికి విరాట నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నగరపొలిమేరలోని శ్మశాన వాటికలో ఉన్న శమీవృక్షంపై తమ ఆయుధాలనన్నింటినీ మూటకట్టి భద్రపరిచారట. తరవాత దక్షిణ గోగ్రహణ సమయంలో, అప్పటికి అజ్ఞాతవాస కాలం ముగిసిపోవడంతో- విజయదశమిరోజున అర్జునుడు ఆయుధాలను దింపి, వాటికి పూజచేసి, గాండీవాన్ని చేతధరించి, కదనరంగంలోకి వెళ్ళినట్లు భారత కథనం. అప్పటి యుద్ధంలో విజయం విజయుణ్నే వరించిందని వేరే చెప్పక్కర్లేదు. ఈరోజుల్లోనే తెలంగాణాలో బతుకమ్మ పండగలను మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. గుమ్మడి, తంగేడు, రుద్రాక్ష, గన్నేరు, బీర వగైరా వివిధ రకాల పుష్పాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి గౌరమ్మను నిల్పి అర్చిస్తారు. దసరా పండగ రోజుల్లో బతుకమ్మ పాటలు తెలంగాణా అంతటా మార్మోగుతూనే ఉంటాయి. ''అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు'' అని పాడుతూ బడిపిల్లలు విల్లంబులు ధరించి ఇంటింటికీ తిరుగుతుండటం దసరా రోజుల్లో మాత్రమే కనిపించే అపూర్వదృశ్యం. కాలం మారిపోవటంవల్ల ఈ అలవాటు చాలావరకు కనుమరుగైనా, కొన్ని పల్లెటూళ్ళలో ఇంకా పిల్లలు తమ పంతుళ్ళతో సహా విల్లంబులు పట్టుకొని- ''శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు ఆరోగ్యమస్తు మీకైశ్వర్యమస్తు, బాలుర దీవనలు బ్రహ్మదీవెనలు-'' అని దీవిస్తూ గ్రామవిహారం చేస్తూనే ఉన్నారు. వారే అన్నట్లు ''బాలుర దీవనలు బ్రహ్మదీవెనలే'' కదా!
(Eenadu, 21:10:2007)
_________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home