ఈరోజు... నవంబరు 25ని- ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ విమెన్
[ఈరోజు...
నవంబరు 25... స్త్రీల పట్ల హింసను రూపుమాపే దిశగా చైతన్యం తెచ్చేందుకు అంతర్జాతీయంగా ఈరోజు నుంచి పదహారు రోజులపాటు పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. నవంబరు 25 ఎందుకంటే 1961లో ఇదే రోజున డొమినికన్ రిపబ్లిక్‌లో రాజకీయ కార్యకర్తలైన ముగ్గురు సోదరీమణులు(మీరాబాల్ సిస్టర్స్) హత్యకు గురయ్యారు. వారి గౌరవార్థం 1991నుంచీ సెంటర్ ఫర్ విమెన్స్ గ్లోబల్ లీడర్‌షిప్ సంస్థ నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకూ పదహారు రోజుల పాటు కార్యక్రమాలు (సిక్స్‌టీన్ డేస్ ఆఫ్ యాక్టివిజం) నిర్వహిస్తోంది. 1999 నుంచి ఐక్యరాజ్యసమితి కూడా వీరితో చేరి నవంబరు 25ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ విమెన్‌గా పరిగణిస్తోంది.]
స్త్రీస్వామ్యం:
ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజం ఉద్భవించింది.సంఘ జీవితంలో ఒక్కొక్క మార్పు ఒక కొత్త పరిణామానికి దారి తీసింది.ఏఏ మార్పులన్ని రావటానికి కొన్ని వందలూ వేల సంత్సరాలు పట్టింది.ఇప్పుడు మన నరనరాల్లో జీర్ణించిన నమ్మకాలూ, ఆచారాలూ, అలవాట్లూ పరిశీలిస్తే వీటికి కొన్నివేల సంత్సరాల చరిత్ర ఉంది............
ఆదిమ అటవిక సమాజానికి ముందువున్న సాంఘిక వ్యవస్థ (తల్లీబిడ్డల సంబంధాలు తప్ప మరింకేవి లేవు గనుక) మాతృపరమైనది, తోటలు వేసి పెంచటం, పంటలు కొద్దిగా పండించటం.వ్యవసాయాన్ని కనిపెట్టింది స్త్రీ. స్త్రీ పురుషుల ఆధిక్యతను సాంఘికంగా నిర్ణయించే ఆర్థిక కారణాలు లేకపోయినప్పటికీ సంతానాన్ని పెంచిపెద్దచేయవల్సిన ప్రముఖ బాధ్యత తల్లిది కనుక మాతృమూర్తిగా స్త్రీ గౌరవాన్ని పొందింది. స్వజాత్యాభివృద్దికి ఆమెది కీలక స్థానం. వ్యవసాయం చేసే తెగలలో మాతృస్వామికం ఉండేది. తిరువాంకూరు-కొచ్చిన్ ప్రాంతంలో నాగలికి జోడెద్దులను కట్టి వ్యవసాయం చేయటం ఆలస్యంగా వచ్చింది గనుక ఇక్కడ (నాయర్ కుటుంబాలలో) ఇటీవల వరకు మాతృస్వామికాచారాలు వర్థిల్లాయి. అస్సాములోని ఖాసి తెగలవారు వ్యవసాయంచెస్తారు, వేటాడుతారు, చేపలను పెంచుతారు. వరి ఎక్కువగా పండిస్తారు.కాని వీరికి నాగలితో పొలం దున్నటం తెలవదు. ఈ ఖాసీలది మాతృస్వామిక వ్యవస్థ. మాతృస్వామిక వ్యవస్థలో తల్లి కుటుంబానికి పెద్ద యజమానురాలు, ఆస్తి అంతా ఆవిడదే.తండ్రికి తన పిల్లలపై ఎట్టి అధికారం ఉండదు.పురుషుడు తన తల్లి కుటుంబానికి చెందుతాడు.పురుషుడు సంపాదించేదంతా అతని తల్లివైపువారికే చెందుతుంది.తన భార్య ఇంట్లొ అతను నివసించడు, తినడు.చీకటి పడిన తర్వాత మాత్రం భార్య వద్దకు వెళ్ళి వస్తూ ఉంటాడు.తండ్రి కుటుంబయజమాని అనే పద్దతికి అలవాటు పడిన మనకు మాతృస్వామిక ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.
పశుపాలనచేసే దశలో ఉన్నవారిలో పితృస్వామికం ఉండేది.
పెద్ద ఎత్తున నాగలికి ఎడ్లను కట్టి దున్ని పంటలు పండించే దశకు సమాజంలోని తెగలు వచ్చినప్పుడు, లోహాలు వగైరా కనిపెట్టి పనిముట్లు వాడడం.చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ పితృస్వామికం వెలిసింది.
నీలగిరి కొండలలో నివసించే తోడాలు అనే తెగలో ఇప్పటికీ పితృస్వామికం అచ్చు ఆదికాలంనాడు ఎలా ఉండేదొ అలానే ఉంది. తోడాలు వ్యవసాయం చేయక, పశుపోషణ మాత్రమే చేసే మొదటి దశలో ఉన్నారు. పశువులను అరణంగా ఇచ్చి స్త్రీలను కొనుక్కునేవారు.పశువులను ఇచ్చి పుచ్చుకొని అన్ని వ్యాపార వ్యవహారాలను పరిష్కరించుకొనేవారు.
వేదకాలంనాడు పశుపోషణకున్నంత ప్రాముఖ్యం వ్యవసాయానికి లేదు. సాంఘికంగా, ఆర్థికంగా పురుషుని ప్రాబల్యం వేదకాలంలో విస్తరించింది.
అంటే వెనుకబడిన దశలో వున్న తెగలజాతులలొ పితృస్వామికం ఉండేది. అభివృద్ది చెందిన జాతుల తెగల ప్రజలలో మాతౄస్వామికం ఉండేది. స్త్రీ,పురుష సంబంధాలు, వారి వారి ఆధిక్యతలు- ఆ కాలంలోని ఉత్పత్తి విధానాలలోని మార్పుల్ని పురస్కరించుకొని మారుతూ ఉండేవి.
స్త్రీస్వామ్యం అణచివేత:
ఆర్యులు పితృస్వామికాచారాలు కలవారైనప్పటికి వేదకాలం ప్రారంభదశలో స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉండేది. సతీ, బాల్యవివాహాలు లేవు. స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు.
(వేదకాలంలో స్త్రీలు చదువుల్లో ముందున్నారు.గార్గి, మైత్రేయి, సులభ, కాత్యాయని మొదలైనవారు,ధర్మశాస్త్రాలను పుక్కిటపట్టారు.భార్యా, భర్తలు- ఇద్దరూ సమానమే.'సామ్రాజ్ఞి శ్వశురేభవ ' - గౄహిణి గృహానికి సామ్రాజ్ఞి.తైత్తిరీయ సంహితలో పత్నికి గృహం, గృహోపకరణాలపైఅధికారం ఉండేదని చెప్పారు.తల్లి పుట్టింటివారి ధనం కుమార్తెకే చెందుతుంది.అవివాహితకు ఆస్తిలొ నాలుగోభాగం ఇవ్వాలని మనువు చెప్పాడు.స్త్రీ పునర్వివాహానికి వేదకాలంలో అనుమతి ఉంది.'యా పూర్వంపతిం విత్త్వా ద్యానం విందతే వరం '.- పతిని కోల్పోయిన స్త్రీ తనకిష్టమైతే వేరొక పతిని పొందవచ్చు.నారద, వశిష్ట, యాజ్ఞవల్క్య, కాత్యాయన, పరాశర, బోధాయన, శతాపత స్మృతులన్నీ స్త్రీ పునర్వివాహాన్ని సమర్ధించాయి.)
ఆర్యబ్రాహ్మణమతం పితృస్వామికాన్ని బలపర్చటంకోసం స్త్రీల పట్ల చాల కుటిలంగా ప్రవర్తించింది.ఆటవికజాతుల సాంఘిక వ్యవస్థను విచ్చిన్నం చేయటానికి, ఆర్య బ్రాహ్మణమతాన్ని వ్యాపింప చేయటానికి మాతృస్వామికాచారాలు అడ్డుగా నిలిచాయి.సాంఘిక ప్రాధాన్యంకొరకు ఏర్పడిన పోటీలో పురుషులు స్త్రీలను అథ:పాతాళానికి అణచివేశారు. వారి వ్యక్తిత్వాన్ని వేయి నిలువుల గోతిలోవేసి కప్పి ఆ సమాధిపై హిందూ సంస్కృతి పేరిట నగిషీలు చెక్కారు.
మన దేశంలో మాతృస్వామికాచారాలనుండి మళ్ళించడానికి జరిగిన ప్రయత్నాలు విశేషంగా దౌర్జన్యపూరితమైనదని, ప్రపంచచరిత్రలో ఇటువంటి దౌర్జన్యాలు మరెక్కడా జరగలేదని ఎహరన్ ఫిల్స్ అనే పండితుడు అభిప్రాయ పడ్డాడు. పవిత్రమైన భారతదేశంలోస్త్రీని అమానుషంగా హింసించి ఆమెను ఘోరంగా అవమానించడం పరమ సిస్టమాటిగ్గా జరిగింది:-
*పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయం అవతరించింది.
*సతీసహగమనం పేరిట నిండు ప్రాణాణ్ణి బలవంతంగా చచ్చిన మగవానితో కలిపి కాల్చి పారేసారు.
*పురుషాధిక్యతను చాటి చెప్పుకోడానికి పతి భక్తి సూత్రాన్ని పాతివ్రత్య ధర్మాలు కనిపెట్టారు.మాతృస్వామిక సామాజిక వ్యవస్థపై, ఆచారాలపై ఈ పతిభక్తి సూత్రంతో మొదటి దెబ్బ తీసారు.భర్తే దైవమని ఆమె వ్యక్తిత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేసి బానిసను చేసేసారు. పాతివ్రత్యంతోబాటు వ్యభిచారం కూడా పుట్టింది.
*బాల్యవివాహాల ద్వారా ముక్కుపచ్చలారని పసిపిల్లలకు వివావాహాలు చేసి వారికి ప్రాయం రాకముందే దురదృష్టవశాత్తు భర్త పోతే విధవలను చేసి బుర్రగొరిగించి అర్ధాకలితో మాడ్చి చంపేవారు.
*స్త్రీకి పునర్వివాహం పనికి రాదు.పురుషుడు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు.పతిభక్తితో పాటు వైధవ్యం కూడా వచ్చిచేరి స్త్రీల జీవితాలను దు:ఖ మయం చేసి పారేసాయి.
*పురుషుడు వ్యభిచరిస్తే అది అతని రసికత.స్త్రీ చేస్తే పొరబాటు.ఆమె పతిత, భ్రష్ట.
*సాంఘికన్యాయమనేది మంట కలిసి పోయింది.స్త్రీలు నిలుచుంటే తప్పు, కూచుంటే తప్పు.ఎవిరితోనైనా మాట్లాడితే తప్పు.నవ్వితే తప్పు. ఆవిడ బతకడమే తప్పు.
ఇంత హీన స్థితికిమతం పేరు చెప్పి,,ధర్మాలు వల్లించి, ,స్త్రీని దిగజార్చిన ఈ పితృస్వామిక వ్యవస్థ స్త్రీని గౌరవిస్తున్నట్లు నటిస్తుంది.అంతా భూటకం.
ఒక చెంపను స్త్రీని పాతివ్రత్య బంధాలతో కట్టిపడేసిన సమాజం వ్యాపారానికి ఆమె ప్రతి అవయవాన్ని వినియోగించుకొనటానికి సిద్ధమే! సిమెంటు బస్తాలు అమ్మటానికి, బీడీలు కొనమని చెప్పటానికి, ఫలాని వస్తువు వాడండి అని ప్రచారం చేయటానికి, వ్యాపారంలో ఆడదాని రికమండేషను కావాలి. ఆధునిక సమాజంలో స్త్రీ కేవలం ఒక భోగవస్తువుగా మారిపోయింది.
ఈ ప్రపంచం మగవారి ప్రపంచం:
స్త్రీ పురుషజాతులు ఒకరికొకరు విరోధులు కాకపోయినప్పటికీ, ఒకరు రెండవ వారికంటె అన్నివిధాలా తక్కువగా జీవించవలసి ఉన్నది. కొన్నివేల సంత్సరాలనుండీ ఈ ప్రపంచం పితృస్వామిక పద్ధతి జీవనానికి అలవాటు పడిపోయింది. దీనిని మార్చటమంటే ఒక పెద్ద విప్లవాన్ని ఆహ్వానించటమే! "స్త్రీకి సమానత్వం- స్వేచ్చ" అనే వాదనలను మనం తరుచుగా వింటూ ఉంటాము. పితృస్వామిక సమాజం స్త్రీకి ఎటువంటి స్థానం ఇవ్వదల్చుకొంటే అదేవారికి ప్రాప్తం! వారు కోరుతున్నది మరికాస్త దయగా చూడమని మాత్రమే! సాంఘిక న్యాయం స్త్రీపట్ల మొగ్గు చూపే విధంగా సంస్కరణలు జరగాలి.”
[ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి "గౌరి" (హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1983) నుండి ఎత్తి రాయబడింది]
ఇటువంటి పితృస్వామిక సమాజం ద్వితీయ శ్రేణి పౌరురాలైన స్త్రీకి ఎటువంటి స్థానం ఇవ్వదల్చుకొంటే అదేవారికి ప్రాప్తం! కాబట్టి రాజరామమోహనరాయ్, కందుకూరివేఏరేశలింగం పంతులు,వెంకటరత్నం నాయుడు లాంటి మహాపురుషులే ముందుకొచ్చి స్త్రీలసంక్షేమానికి, సంస్కరణల బాటను వేసారు. సతీసహగమనం నిషేధించడం, వితంతూద్ధరణం,కన్యాశుల్కానికి ఎదురుగా, స్త్రీవిద్యాభివృద్ధికి, కళావంతుల సంస్కరణలకు పాటుబడ్డారు .అదేకోవలో చలం, మన సాహిత్యాన్ని, సంఘాన్ని ఆధునీకరించే ఉద్యమంలొ ముందు నిలిచి, సనాతన విశ్వాసాలపై ద్వజమెత్తి స్త్రీలకు సమాన ప్రతిపత్తి సాధించడానికి తన కలాన్ని ఉపయోగించారు. ఏవరేమన్నా, చలం తన రచనలతొ సంఘాన్ని ఓ గిల్లు గిల్లి, ఓ కుదుపు కుదిపి స్త్రీస్వాతంత్ర్యావశ్యకతను ఎలుగెత్తి చాటారు!
___________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home