చేతిరాత మతలబులు

''కానలేము కాలపు మర్మమేను నీవు... ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు'' అన్నారో కవి. బ్రహ్మరాతను ఎవరూ చదవలేరు. ఆయనను మించి అర్థం కాకుండా రాసే అపర బ్రహ్మలు లోకంలో ఎందరో ఉన్నారు. ''మా ఆయన రాత మహ గొప్పగా ఉంటుంది. ఆయనకుతప్ప మరొకరికి అర్థం కాదు, ఎవరూ చదవలేరు'' అంది తాయారమ్మ బడాయిగా. ''అదేం గొప్ప? మా ఆయన రాత ఆయనకే అర్థం కాదు'' అంది నాంచారమ్మ ఇంకా గొప్పగా! వెనకటి రోజుల్లో రాజులు జమీందార్లు ఉత్తరాలు అవీ రాసి పెట్టేందుకు తమ ఆస్థానాల్లో లేఖకుల్ని ప్రత్యేకంగా నియమించుకొనేవారు. ఈ లేఖకుల పని అస్తమానం రాస్తుండటమే. రాయటంలో కూడా అనేక రకాలున్నాయి. యూరోపియన్లు మరికొన్ని దేశాలవారు ఎడమ నుంచి కుడికి రాస్తారు. చదవటంలోను అదే పద్ధతి అనుసరిస్తారు. అరబ్ దేశాలవారు, ముస్లిములు కుడి నుంచి ఎడమకు రాస్తారు. చైనావారు పై నుంచి కిందికి రాస్తారు. కాస్కేజియన్లు కింది నుంచి పైకి రాస్తారు. ఎలా రాసినా చదివేవారికి అర్థమయ్యేలా ఉండాలి. అలా అర్థం కావాలంటే దస్తూరి బాగుండాలి. కోతి పిల్లకైనా రాత బాగుండాలి అని సామెత. ఇక్కడ రాత అంటే తలరాత కావచ్చు. ఏ రాతైనా బాగుండాలి అంటే ముందు చేతిరాత బాగుండాలి అంటున్నారు ఆధునిక శాస్త్రజ్ఞులు.
ముత్యాల కోవలా హంసల బారులా గుండ్రంగా చక్కగా రాస్తారు కొందరు. మరికొందరు కోడి కెలికినట్లుగా చిందరవందరగా గజిబిజిగా రాస్తుంటారు. చూడ చక్కని దస్తూరి కలిగివుండటం అభ్యసన ప్రక్రియలో ఎంతో కీలకమైందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని వాండర్‌బిల్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్టీవ్‌గ్రాహం నేతృత్వంలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈవిషయం వెల్లడైంది. చేతిరాత ద్వారానే ఒక వ్యక్తిలోని ప్రతిభ మెరుగులు దిద్దుకొనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పిల్లలు అక్షరాలు దిద్దుకునేటప్పుడే విషయ పరిజ్ఞానం, విషయం పట్ల అవగాహన ఏర్పడతాయి. అంతేకాక ఏదైనా విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏదైనా విషయం ఎలా తెలుసుకోవాలి, తమ భావాలను ఆలోచనలను ఎలా వ్యక్తీకరించాలి వంటి అంశాలు అవగతమవుతాయని అధ్యయనంలో వెల్లడైంది. మంచి దస్తూరి కలిగిన విద్యార్థులు రాసిన వ్యాసాలే బాగుంటాయని, వారికే మంచి మార్కులు వస్తాయని చాలామంది అధ్యాపకులు నమ్ముతున్నారు. దస్తూరి సరిగా లేని విద్యార్థులు చదువులోనే కాక అభ్యసన ప్రక్రియలోను వెనుకబడి ఉంటారని పరిశోధకులు అంటున్నారు. దస్తూరికున్న ఈ ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రత్యేక కోర్సునొకదాన్ని అమెరికాలోని విద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. ఆ కోర్సులో ఉపాధ్యాయులకూ శిక్షణనిస్తున్నారు. విద్యార్థులు దస్తూరిపై తగిన శ్రద్ధ కనబరచకపోవడం వల్ల అనేక తప్పులు దొర్లుతున్నాయి. ఒక అక్షరం బదులు దానిలానే ఉండే మరో అక్షరం రాస్తున్నారు. అక్షరాలు సరిగా గుర్తుండకపోవటంవల్ల వారి భావవ్యక్తీకరణ సామర్థ్యమూ దెబ్బతింటోంది'' అంటున్నారు స్టీవ్‌గ్రాహం. ఆ కారణంగా విద్యార్థులు తమ దస్తూరిపై తగినంత శ్రద్ధ వహించి చేతిరాతను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలంటున్నారు ఆయన సహచర పరిశోధకులు. విద్యాధికులైన ప్రొఫెసర్ల సలహాలు శిరోధార్యమే మరి!
(Eenadu, 18:11:2007)
__________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home